Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఫిరాక్ గోరఖ్ పూరీ అసలు పేరు రఘు పతి సహారు. ఇతను 1896 ఆగస్టు 1న, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోరఖ్‌పూర్‌లో జన్మించాడు. ఇంటి వద్దనే ఉర్దూ, ఫారసీ నేర్చుకున్న ఫిరాక్, గవర్నమెంట్ జూబ్లీ కాలేజ్ నుండి మెట్రిక్యులేషన్ పాసయ్యాక, 1930లో ఆగ్రా విశ్వవిద్యాలయం నుండి ఎం.ఏ ఇంగ్లిష్ పూర్తి చేశాడు. దేశ స్వాతంత్రోద్యమంలో పాల్గొనడమే తన ధ్యేయం అవ్వడం వల్ల, డిప్యూటీ కలెక్టర్‌గా ఇండియన్ సివిల్ సర్వీస్‌లో సెలెక్ట్ అయినా సరే రిజెక్ట్ చేసాడు. స్వాతంత్య్రానంతరం అలహాబాద్ విశ్వవిద్యాలయంలో ఇంగ్లీష్ ప్రొఫెసర్‌గా చేరిన ఫిరాక్, తన పాఠాలతో ఎందరో విద్యార్థులను ఆకర్షించాడు. గొప్ప సమయస్ఫూర్తి, మేధస్సు, జ్ఞానం, గంభీరమైన వాగ్ధాటి ఫిరాక్ సొంతం. తన మేధస్సు గూర్చి ఆసక్తికరమైన గాథలెన్నో వినిపిస్తాయి. ఫిరాక్ ప్రకతి అణువణువునా సమస్త విశ్వాన్ని, విశ్వసౌందర్యాన్ని దర్శించగల మహనీయ దక్పథం కలవాడని విమర్శకులు అంటారు. గుల్-ఎ-నఘ్మా, రూప్ మొదలుకొని డజను కంటే ఎక్కువ ఉర్దూ కవితా సంకలనాలతో పాటుగా హిందీ, ఉర్దూ, ఇంగ్లీషు భాషల్లో సాహిత్య సాంస్కతిక విషయాల మీద కొన్ని విలువైన విమర్శనాత్మక గ్రంథాలు వెలువరించాడు. 1969లో ఉర్దూలో మొట్టమొదటి జ్ఞానపీఠ పురస్కారం కైవసం చేసుకున్న ఫిరాక్, సాహిత్య అకాడమీ (1961), సోవియెట్ నెహ్రూ (1968) గాలిబ్ అకాడమీ (1981) మొ|| పురస్కారాలను అందుకున్నాడు. భారత ప్రభుత్వం 1968లో పద్మభూషణ్ పురస్కారంతో ఫిరాక్ని సన్మానించింది. 1982 మార్చి 1న చనిపోయిన ఫిరాక్ అంతిమ సంస్కారాలను అధికారిక లాంఛనాలతో నిర్వహించారు.
మూలం :
యే తో నహీ కి ఘమ్ నహీ
హా! మిరీ ఆంఖ్ నమ్ నహీ
నశా సంభాలే హై ముఝే
బహ్కే హుఏ కదమ్ నహీ
తుమ్ భీ తో తుమ్ నహీ హౌ ఆజ్
హమ్ భీ తో ఆజ్ హమ్ నహీ
క్యా మిరీ జిందగీ తిరీ
భూలీ హుఈ ఖసమ్ నహీ
'గాలిబ్'-ఒ-'మీర్-ఒ-'ముషాఫీ'
హమ్ భీ 'ఫిరాక్' కమ్ నహీ
అనువాదం:
బాధ ఏదీ లేదని కాదు
హా! నా కన్నుల్లో తడి లేదు
మత్తు నన్ను సంభాళించింది
అందుకే మరి అడుగులు తడబడలేదు
ఈ రోజు నువ్వు నువ్వులా లేవు
నేను కూడా ఈరోజు నేనులా లేను
నా జీవితం, నువు నెరవేర్చడం
మరిచిన వాగ్దానం కాదా?
గాలిబ్, మీర్, ముస్హాఫీ
'ఫిరాక్' నేనూ తక్కువేం కాదు
ఫిరాక్ కవిత్వంలో వేదనా తన్మయత్వాలు గాఢంగా ఉంటాయి. అదేంటీ, ఫిరాక్కి అంతగా వేదన చెందాల్సిన అవసరమేమిటి? అసలు ఫిరాక్ వేదనకి కారణం ఏమిటి? మొదలైన విషయాలను ఇప్పుడు ఇక్కడ చర్చించడం సమంజసం కాదేమో. కానీ, వాటి పర్యవసానాలను గురించి మాట్లాడుకోవడం మాత్రం ఆసక్తికరంగా, అలాగే ఉపయోగ కరంగా ఉంటుంది. ఫిరాక్ని ఆవహించిన విషాదం తనని ఒక శాశ్వత ఒంటరితనంలోకి నెట్టివేసింది. ఆ ఒంటరితనంలో ఫిరాక్ అనుభవించిన, అనుభూతి చెందిన వేదననంతా తన కవిత్వంలో పలికించాడు. నిరాశ వల్ల ఫిరాక్కి కోపం కాస్త ఎక్కువగానే ఉండేది. కానీ తన దక్పథమెప్పుడు మానవీయ మైనదే అన్న విషయం తన కవిత్వం చదివితే తెలుస్తుంది. ఈ ఎపిసోడ్లో తీసుకున్న గజల్లో, ఫిరాక్ తన వేదనను చిన్న చిన్న పదాలతో చక్కగా ఎలా పలికించాడన్న విషయం గమనించ వచ్చు. మొదటి షేర్లో కవి తన విచారాన్ని వ్యక్తం చేసిన తీరు కొత్తగా అనిపిస్తుంది. తన వేదనలోని ఆర్ద్రత అర్థమవుతుంది. మద్యం తాగితే వచ్చే మత్తు మనిషిని ఊగేలా చేస్తుంది. కానీ ఆ మత్తే తనని సొలగకుండా ఉంచింది అని రెండవ షేర్లో ఫిరాక్ చెప్పిన తీరు, వేదన మద్యపు మత్తు కంటే ఎక్కువ మత్తునిస్తుందని అర్థం చేపిస్తుంది. ఫిరాక్ వేదన శాశ్వతమైనది ఎలాగో తెలియాలంటే నాల్గవ షేర్ చదవాలి. కవిత్వంలో మీర్, గాలిబ్, ముషాఫీలకి తానేం తీసిపోను అని అనడం ఫిరాక్లోని చెక్కు చెదరని ఆత్మస్థైర్యానికి ఒక చక్కని ఉదాహరణ అని చెప్పవచ్చు.
- ఇనుగుర్తి లక్ష్మణాచారి, 94410 02256