Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాళోజీని - శ్రీశ్రీని అవాహన చేసుకొన్న ప్రదీప్ చక్కటి వస్తువు - భావ సాంద్రత, శబ్ద వైచిత్రితో ఈ కవితలు రాసారు. మతోన్మాదం, ప్రపంచీకరణతో చిద్రమైన గ్రామీణ జీవనం... మృగ్యమైపోతున్న మానవ సంబంధాల్ని కొట్లాడి సాధించిన తెలంగాణలో ప్రజల బాధలే గాధలు తగ్గని వైనాన్ని కరోనా మహమ్మారి గురించి, 50కిపైగా కవితలున్నాయి. వ్యంగ్యంగా కూడా రాష్ట్ర పాలనపై రాశారు. ముఖ్యమంత్రి దేవుళ్ళకు కానుకలు సమర్పించటంపై ''కానుకల పరాభవం'' అనే కవిత (పేజీ 75) ఆలోచింపజేస్తుంది.
సిడ్నీలో వుంటూ అచ్చు తెలుగు కవిత్వాన్ని కాళోజీ స్ఫూర్తితో రాస్తున్నాను. ప్రశ్నించడం, మానవీయత, ప్రేమ, కుటుంబ సంబంధాలు... పాఠకుల్ని వారి వైఫల్యాలను అక్షరీకరించడం తన కవితల్లోని వస్తువు అంటారు ఈ యువకవి. యెదలోంచి పారిన గీతాల ఝరి గులాబి కవిత్వం అంటూ తెలంగాణ సాహితీ సంస్థ ప్రధాన కార్యదర్శి కె.ఆనందాచారి చక్కటి విలువైన ముందుమాట రాసారు.
''ఎంకన్నకు వజ్ర వైఢూర్య కనక హారాలు సమర్పించినావు / తెలంగాణ శాంతి చేయమని ఐదు కోట్లు ముట్ట చెప్పినావు / ఆయుత చండీ యాగం చేసి అడ్డగోలుగ ఖర్చుపెడితివి / యాదాద్రి సిటీ పేరు చెప్పి నరసింహంతో వ్యాపారం చేస్తుంటివి / మాకేం తక్కువాయనని మొగం తిప్పినారే మిగతా దేవుళ్ళు / ఎంత పని చేసినవయ్యా చంద్రశేఖరా?'' అంటూ అవేదన ప్రకటించారు కవి. ఇది సెక్యూలర్ స్టేట్ కదా! 1985లో పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం చేశాడు రాజీవ్ గాంధీ. ఆ చట్టం చట్టుబండలు చేస్తున్నారు పాలకులు... ''సంపినోళ్ళంతా గులాబీ కండువాలు కప్పే / ఉద్యమ ద్రోహులంతా సర్కారీలయ్యే! / ఉద్యమ కారులంతా దుశ్మన్లాయే ! / దుశ్మన్లంతా దోస్తులాయే / విరోధులంతా త్యాగులయ్యే.. అంటూ కవి తన ధర్మాగహ్రాన్ని తెలుపుతాడు. కాళోజీ కవితా ధార గుర్తుకు తెచ్చారు.
కరోనాపై రాసిన కవితల్లో మంచి కవిత (పేజీ 95)లో ఒక చోట యిలా రాశారు. ''అసలు వలసలే లేకుంటే రాజ్యాలే లేవాయే! చెమ్మగిల్లే చెమటకు శిశిరంలో తోడులేదే! వలస వరదలను ఆపే గ్రీష్మమే లేదే! ఎండిపోతున్న బతుకులో వర్షం రాదే!'' అంటారు కవి. అర్యులు కూడా మధ్య ఆసియా నుండి భారత్కు వలస వచ్చినవారే! వారి సిద్ధాంతాలు నమ్మిన వారే ఏలికలైరి నేడు. మతం మత్తులో జాతిని చీల్చే కుట్రలు తిప్పి కొట్టాలి. అమ్మపై, చావుపై, సీతక్క సేవా కార్యక్రమాలపై... కరోనా దేవుళ్ళు డాక్టర్లు, పారిశుధ్య కార్మికులు, గస్తీ తిరిగిన వారిపై ఎంతో మానతతా దృక్పథంతో ఈ యువ కవి చక్కటి ప్రతీకలతో - బలమైన వస్తు శిల్ప సౌందర్యంతో కవిత్వం రాసారు. తొలి ప్రయత్నంలోనే పట్టు సాధించారు. వీరి లేఖిని నుండి యింకా బలమైన అభివ్యక్తితో మానవీయ కోణాన్ని ఆవిష్కరించే మరిన్ని మంచి కవితలు రా(యా)వాలి. శుభాకాంక్షలతో...
(గులాబీల కవిత్వం, కవి : ప్రదీప్ మడూరి, పేజీలు : 108, వెల : రూ.100/-, ప్రతులకు : ప్రదీప్ మడూరి, ఇ.నెం. 51 - 4- 261, వంగపహాడ్, వరంగల్ - 506006, ఫోన్ : 61414320042)
- తంగిరాల చక్రవర్తి , 9393804472