Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలుగు కథా ప్రేమికులైన ప్రతి ఒక్కరికి డి. రామలింగం పేరు తెలుసు.
తెలుగు కథా వికాసానికి, ప్రచారానికి ఎంతగా పనిచేశారో అంతే
చిత్తశుద్ధితో బాల సాహిత్యం రాసి, బాలల కోసం తపించిన కథకుడు డి.
రామలింగం. మహాకవి డా.సి. నారాయణరెడ్డి చోట రాసినట్టు తెలుగు
సాహిత్యంలో లబ్దప్రతిష్టులైన కవులందరూ తొలినాళ్ళలో బాలల కోసం
తమ బాధ్యతగా రచనలు చేసినవారే.
డి. రామలింగం జూన్ 8, 1924న ఖమ్మం జిల్లా ఎర్రుపాలె మండలం బనిగండ్లపాడు గ్రామంలో పుట్టారు. ఉస్మానియా విశ్వ విద్యాలయం నుండి పట్టబద్రులయ్యారు. విద్యార్థి దశలోనే జాతీయోద్యమం పట్ల ఆకర్షితుడై క్విట్ ఇండియా ఉద్యమంలో, నిజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొన్నారు. ఈ సమయంలోనే స్టేట్ కాంగ్రెస్ పత్రిక 'సారథి'కి సహ సంపాదకులుగా పని చేశారు. కొంతకాలం అజ్ఞాతంలో ఉన్నారు. తరువాత 'గొల్కొండ పత్రిక'లో పనిచేశారు. హైదరాబాద్ ఇండియన్ యూనియన్లో విలీనమైన తర్వాత తెలంగాణ రచయితల సంఘం కార్యదర్శిగా ఉన్నారు. రచయితగా, అనువాదకులుగా ప్రసిద్ధులైన వీరు డిప్యుటి సెన్సార్ ఆఫీసర్గా పనిచేశారు. కొంత కాలం ఢిల్లీలోని వ్యవసాయ పరిశోధనా మండిలో ఉద్యోగం చేశారు. తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ, బెంగాలీ భాషలు రావడం వల్ల చక్కని అనువాదాలు కూడా చేశారు. 'కాగితపు పడవలు', 'అడ్డు గోడలు' వీరి కథా సంపుటాలు. కేంద్ర సాహిత్య అకాడమి కోసం 'తెలుగు కథ', 'ఒక తరం తెలుగు కథ' సంకలనాలు రూపొందించారు. ప్రొఫెసర్ ఆర్వాల్డ్ టాయనబీ, కె.సి.డె ల రచనలు అనువాదం చేశారు. నేషనల్ బుక్ ట్రస్ట్ కోసం 'మీర్జా గాలిబ్'ను తెలుగు చేశారు. కథలు, కవితలు, సాహిత్య విమర్శ, జీవిత చరిత్రలు, రేడియో నాటికలు రాశారు. 'ఆంధ్ర పితామహ మాడపాటి హన్మంతరావు', 'బహుముఖ ప్రజ్ఞాశాలి బూర్గుల రామ కృష్ణారావు', 'శొంఠి వెంకటరామమూర్తి' వీరు రాసిన జీవిత చరిత్రలు. 'తెలంగాణ సాహిత్యం తెలుగు సాహితీమూర్తులు' మరో మంచి రచన.
డి. రామలింగం పిల్లల కోసం నాలుగు రచనలు చేశారు. వాటిలో మూడు మాత్రమే ఇప్పుడు లభ్యమవుతున్నాయి. వీటిని ఆంధ్ర ప్రదేశ్ బాలల అకాడమి ప్రచురించింది. లభిస్తున్న ఈ మూడు కూడా వచన రచనలే కావడం విశేషం. 'నేతాజీ', 'విశ్వకవి', 'స్వరాజ్యం నా జన్మహక్కు' ఆ రచనలు. డి. రామలింగంకు బెంగాలీ భాష బాగా వచ్చు. అందులోంచి నేరుగా అనువాదాలు కూడా చేశారు. ఆ పరిచయంతోనే పిల్లలకు రవీంద్రనాథ్ ఠాగూర్ జీవితాన్ని పరిచయం చేయాలని 'విశ్వకవి' పుస్తకాన్ని రచించారు. ఇది రవీంద్రనాథ్ ఠాగూర్ జీవిత చరిత్ర. ఈ పుస్తకం 1960-1970ల మధ్య ఒక దశాబ్ద కాలం పాటు ఆంధ్రప్రదేశ్లో ఏడోతరగతి విద్యార్థులకు ఉపవాచకంగా ఉండేది.
పిల్లల కోసం రామలింగం రాసిన మరో జీవిత చరిత్ర 'నేతాజీ'. ఇండియన్ నేషనల్ ఆర్మీ వ్యవస్థాపకులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవితాన్ని పిల్లలకు సులభంగా పరిచయం చక్కని చేసే పుస్తకమిది. దీనిని కూడా ఆంధ్రప్రదేశ్ బాలల అకాడమి ప్రచురించింది.
ఇటీవల మళ్ళీ పునర్ముద్రణ పొందిన వీరి మరో ప్రసిద్ధ బాలల రచన 'స్వరాజ్యం నా జన్మ హక్కు'. తొలుత దీనిని అంధ్ర ప్రదేశ్ బాలల అకాడమీ వారు ప్రచురించారు. ఇది పిల్లలకోసం భారత స్వాతంత్య్రోద్యమాన్ని పరిచయం చేసేందుకు రాశారు. మనం ప్రతి సంవత్సరం 15 ఆగస్టున స్వాతంత్య్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నాం. అశోకుడు, అక్బర్ వంటి మహోన్నత చక్రవర్తులు పరిపాలించిన భారతదేశం బ్రిటిష్ వారికి ఎలా వశం అయ్యింది. ప్రపంచంలోని అతి సంపన్న దేశాలలో ఒకటైన భారత దేశం చారిత్రక కాలాల్లోనే మిరియాలు, ఏలకులు ఇతర సుగంధ ద్రవ్యాలను ఎగుమతి చేసింది. మస్లిన్తో పాటు ఇతర ఉత్తమ రకానికి చెందిన బట్టలు భారత దేశం విదేశాలకు ఎగుమతి చేసింది. అనేక చేతివృత్తులు, పరిశ్రమల్లో తయారైన భారతీయ వస్తువులకు విదేశాలల్లో అత్యంత విలువ ఉండేది. అటువంటి దేశం ఎలా పరాధీన మైంది, ఎలా పోరాడింది, ఎలా స్వాతంత్య్రం సంపాదించింది వంటి అనేక అంశాలను పిల్లలకు అరటి పండు ఒలియి పెట్టినట్లు రాశారు డి. రామలింగం.
తెలుగు కథకు విశేషమైన సేవచేసి, అలాగే తెలుగు బాల సాహిత్యాన్ని తన రచనలతో సుసంపన్నం చేసిన డి. రామలింగం అనారోగ్య కారణంగా జనవరి 3, 1993 న అర్దాంతరంగా తనువు చాలించాడు.
- డా|| పత్తిపాక మోహన్, 9966229548