Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కేంద్ర సాహిత్య అకాడమి బాల సాహిత్య పురస్కారాన్ని అందుకుని తెలంగాణ బాల సాహిత్యానికి గుర్తింపుతెచ్చిన పదహారణాల బాలల రచయిత వాసాల నర్సయ్య. వీరు నేటి జగిత్యాల జిల్లా చౌలమద్ది గ్రామంలో 26 జనవరి, 1942లో చేనేత కుటుంబంలో పుట్టారు. లక్ష్మమ్మ-వెంకటయ్య దంపతులు తల్లితండ్రులు. తిరునగరి వేదాంతసూరి ప్రేరణతో బాల సాహిత్య సృజన చేసిన వాసాల దాదాపు ఐదున్నర దశాబ్ధాలపాటు పిల్లల కోసం తపించి రాశారు. ఇతర రచనలు కాక కేవలం బాలల కోసం ముప్పై పుస్తకాలు ప్రచురించారు.
కవిగా, రచయితగా, విమర్శకునిగా, కావ్యకర్తగా, వివిధ సాహిత్య సాంస్కృతిక సంస్థల వ్యవస్థాపక కార్యకర్తగా వాసాల కరీంనగర్ ప్రాంతంలో పరిచితులు. బాల్యలోనే సోదరులతో కలిసి వీథి నాటకాల్లో నటించిన వాసాల, ఆయా నాటకాలకు స్క్రిప్టులను తానే స్వయంగా రాసుకునేవారట. 1955లో 'సౌగంధిక హరణం' నాటక రచనతో మొదలైన ఆయన ప్రస్థానం, బాల సాహిత్యంలో చేసిన విశేషకృషికి సాహిత్య అకాడమి పురస్కారం వరకు సాగింది. 'మేధా సంపత్తిగల దేశ పౌరులు తయారు కావడానికి బాల సాహిత్యమే పునాది' అని నమ్మిన ఆయన ఆ దిశగానే తన రచనలు చేసారు. పాటలు, కథలు, వ్యాసాలు, పొడుపు కథలు, గేయ కథలు వంటి ఎన్నో పిల్లల కోసం రాసారు. కవిగా, రచయితగానే కాక తనకు నచ్చిన, తాను మేచ్చిన మేలిమి గేయాలను సంపాదకులుగా సంకలనం చేసి అందించారు. ఇవేగాక తెలంగాణాలోని పలువురు బాల సాహితీవేత్తలను 'తెలంగాణా బాల సాహితీ వేత్తలు' పేరుతో పరిచయం చేసి ఒకచోట అందించారు. గత పన్నెండేేళ్ళుగా 'వాసాల నర్సయ్య బాల సాహిత్య పురస్కారం' ఇచ్చి బాల సాహితీవేత్తలను గౌరవించారు. వాసాల అనేక రచనలు చేసినప్పటికీ, నాకు మాత్రం ఆయన రాసిన 'స్ఫూర్తి కథలు', 'పొడుపు కథలు' ఎప్పటికీ గుర్తుంటాయి. కారణం వాటి స్ఫూర్తి అలాంటిది. దేశవిదేశాల్లోని ప్రముఖ వ్యక్తులు, మహనీయులు, శాస్త్రవేత్తలు, నేతల జీవితాలలోని స్ఫూర్తివంత మైన సంఘటనల కథలను ఇందులో అందించారాయన.
చందమామ, బొమ్మరిల్లు, బాలమిత్ర వంటి తొలి నాటి బాలల పత్రికల నుండి ఇప్పటి పత్రికల వరకు వాసాల రచనలు ప్రచురించాయి. స్ఫూర్తి కథలు (మూడు బాగాలు), బాలల బొమ్మల కథలు, చిట్టిపొట్టి కథలు, కథల కదంబం, అంజయ్య అరటితొక్క, రామయ్య యుక్తి కథా సంపుటాలు. తపాలా ప్రపంచం, సమాజానికి సంకెళ్ళు, అనాచారాలు-అనర్థాలు, కార్డులు-కబుర్లు బాలల వ్యాస సంపుటాలు. చిరుతరంగాలు, గోగుపూలు, గులాబీలు, మల్లెమొగ్గలు వాసాల రచనా, సంపాదకత్వంలో వచ్చిన కొన్ని రచనలు. ఇవేకాక బాలల కోసం సరిహద్దు గాంధి ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, మహారాణ ప్రతాప్, తారపద ముఖర్జీ వంటి ప్రముఖుల జీవిత చరిత్రలను రాశారు. వాసాల వచన కవిత్వం, పద్యకవిత్వం కూడా రాసారు. కవితా సంపుటులతో పాటు నానీల సంపుటి తెచ్చారు. వృత్తిరీత్యా హెడ్ పోస్ట్ మాస్టర్‌గా పనిచేని 2002లో పదవీ విరమణ పొందారు.
'నిండుగా నూరేళ్ళు / ఉండాలిరా నీవు / నీతిని జాతినీ / నిలపాలిరా నీవు' అంటూ పిల్లలకు ఉద్బోధించిన వాసాల నర్సయ్య స్ఫూర్తి వంతమైన కథలనే కాక చక్కని గేయాలను రాశారు. పిల్లలను చైతన్య పథంవైపుకు నడపడమే కాగ వీరిగేయాలు పాడుకునేందుకు అత్యంత అనువుగా ఉండడం విశేషం. వాసాల పిల్లల కోసం పొడుపు కథలు కూడా రాశారు. ఇవి పిల్లలకు ఆసక్తితో పాటు అనేక అంశాలపైన అవగాహనను కలిగించేందుకు వాహికలుగా ఉన్నాయి. 'నడు ముందుకు నడు ముందుకు / నవ భారత బాలకా / నడవవోయి నడవవోయి / నడకలో తడబడకా' అంటూ పిల్లలను చేయి పట్టుకుని నడిపిస్తూనే, 'నీవు వర్ధమానుడివై / నీవు బుద్ద దేవుడివై/ .. అశోకుడవు నీవే అయి / అరవిందుడ నీవే అయి/ ..గాంధీ మహాత్ముడి వీవై / పండిత జవహరు నీవై' సత్యాహింసలు, ధర్మ శౌర్యాలు, మానవతా బీజాలు మహిలో చాటు అంటారు. ఇకా... 'తరతరాల మన సంస్కృతి / శిరమెత్తుక సాగాలి / సర్వ జనులు సైఖ్యాలతో / శాంతితో వర్దిల్లాలి' అన్న భావనను వెదజల్లుతారు.
'మంచి పుస్తకమొక్క / మంచి నేస్తము పాటి / మననూరడించుటలో / తనకు తానే సాటి' అంటూ పుస్తకం గొప్పతనాన్ని, 'పాప నవ్వుల నుండు / పాల సంద్రపు నురుగు / పాప నవ్వులోన పాషానములె కరుగు' అంటూ పాపాయి నవ్వుని 'మా పాప' గేయంలో చెబుతారు. ఇందులోనే 'సగము నవ్వినచాలు / జగములుప్పొంగు లే' అనడం ఆయనకు పిల్లల మీదున్న అపారమైన ప్రేమకు నిదర్శనం. 1955 నుండి రచనలు చేసిన ఆయన కథ, కవిత, గేయం, పొడుపు కథ, జీవిత కథ, వ్యాసం వంటి రూపాల్లో తుదిశ్వాస వరకు రచనలు చేసి, బాలల అభివృద్దే దేశాభివృద్ది అని నమ్మిన వాసాల నర్సయ్య ఫిబ్రవరి 13 2021న తుదిశ్వాస విడిచారు.
- డా|| పత్తిపాక మోహన్, 9966229548