Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఫైజ్ అహ్మద్ ఫైజ్, 1911లో పాకిస్తాన్‌లోని సియాల్కోట్లో జన్మించాడు. లాహోర్ గవర్నమెంట్ కాలేజ్ నుండి ఆంగ్లం, అరబిక్‌లో మాస్టర్స్ చేసిన ఇతను, తన కాలేజీ రోజుల నుండే షేరో షాయరీ పైన మక్కువ పెంచుకున్నాడు. దేశ స్వాతంత్య్రాని కంటే ముందే సోషలిజాన్ని, కమ్యూనిజాన్ని స్వీకరించిన ఫైజ్, 1936 సం. బ్రిటీషిండియాలో జరిగిన అభ్యుదయ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన ప్రముఖుల్లో ఒకడు. ఫైజ్ అదబ్-ఎ-లతీఫ్, పాకిస్తాన్ టైమ్స్ పత్రికలకు సంపాదకుడిగా వ్యవహరించాడు. నఖ్శ్-ఎ-ఫర్యాదీ, దస్త్-ఎ-సబా, జిందాన్-నామా మొదలైనవి ఇతని రచనలు. ప్రత్యేక పాకిస్తాన్‌ని కోరుకున్నా కూడా, ఫైజ్ 1947లో జరిగిన కాశ్మీర్ యుద్ధం తరువాత సైన్యం నుండి రాజీనామా చేసాడు. ఆ తరువాత ప్రభుత్వ నిరంకుశ పాలనను వ్యతిరేకించిన ఫైజ్, పలుమార్లు తన విప్లవ భావాల వల్ల ఖైదు చేయబడ్డాడు. తనని, తన కవితల్ని పాకిస్తాన్లో ఎంత అదరిస్తారో, భారత్ లో కూడా అంతే ఆదరిస్తారు. ఫైజ్కి మఖ్దూం మొదలుకొని ఎందరో విప్లవకారులతో సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఫైజ్ కవిత్వం అంతర్జాతీయ భాషలలో అనువదింపబడింది. రష్యన్ ప్రభుత్వం ఫైజ్ ''మా కవి'' అని చెప్పి గౌరవించింది. ఫైజ్ కవిత్వం దౌర్జన్యాన్ని నిరసిస్తూ, ప్రేమను, మానవతా వాదాన్ని పరిమళింపజేస్తుంది. 1994లో మరణించిన ఫైజ్ అహ్మద్ ఫైజ్, లెనిన్ శాంతి పురస్కారం (1962), పాకిస్తాన్ దేశ అత్యున్నత పురస్కారమైన నిశాన్-ఎ-ఇమ్తియాజ్ (1990) మొదలైన పురస్కారాల నెన్నింటినో అందుకోవడమే కాకుండా ప్రపంచంలోనే అత్యున్నతమైన నోబెల్ (సాహిత్య) పురస్కారానికి కూడా నామినేట్ అయ్యాడు.
మూలం :
నసీబ్ ఆజ్మానే కే దిన్ ఆ రహే హై
కరీబ్ ఉన్ కే ఆనే కే దిన్ ఆ రహే హై
జో దిల్ సే కహా హై, జో దిల్ సే సునా హై
సబ్ ఉన్ కో సునానే కే దిన్ ఆ రహే హై
అభీ సే దిల్ ఒ జాన్ సర్-ఎ-రాV్‌ా రఖ్ దో
కి లుట్నే లుటానే కే దిన్ ఆ రహే హై
టపక్నే లగీ ఉన్ నిగాహౌం సే మస్తీ
నిగాహే చురానే కే దిన్ ఆ రహే హై
సబా ఫిర్ హమే పూఛీ ఫిర్ రహీ హై
చమన్ కో సజానే కే దిన్ ఆ రహే హై
చలో 'ఫైజ్' ఫిర్ సే కహీ దిల్ లగాఏ
సునా హై ఠికానే కే దిన్ ఆ రహే హై
అనువాదం :
విధిరాతను పరీక్షించుకునేందుకు రోజులొస్తున్నాయి
ఆమె నా చెంతకు చేరే రోజులు దగ్గరకొస్తున్నాయి
హదయానికి చెప్పినవి, చెప్పగా విన్నవి
అన్నీ ఆమెకు విన్నవించే రోజులొస్తున్నాయి
ఇప్పుడే గుండెనీ, ప్రాణాన్ని రోడ్డుపైన పెట్టుకో
దోచేందుకు, దోపిడీ అయ్యేందుకు రోజులొస్తున్నాయి
తన చూపులో నుండి కైపు రాలుతోంది
చూపులను దోచుకునే రోజులు రోజులొస్తున్నాయి
చల్లగాలి మళ్లీ నన్ను అడుగుతూ వెళ్ళింది
పూదోటను అలంకరించాల్సిన రోజులొస్తున్నాయి
పదా! 'ఫైజ్' మళ్ళీ ఎక్కడైనా ఎదను అర్పిద్దాం
విన్నాను, నివాసం ఏర్పరుచుకునే రోజులొస్తున్నాయి
ఫైజ్ గజళ్ళు అర్థం చేసుకోవడానికి సులువుగా ఉంటాయి. వాటిలో ప్రయోగించిన పదాలు, ఉర్దూలో మనం తరచూ వినేవే. ఫైజ్ వాటిని పేర్చే తీరు కూడా ఎంతో అమోఘంగా ఉంటుంది. ఈ ఎపిసోడ్లో తీసుకున్న గజల్, కవిలోని విశ్వాసాన్ని, ఉత్సాహాన్ని తెలియజేస్తుంది. మొదటి షేర్లో, ప్రేయసి ప్రేమను సాధించడానికి అవకాశాలు కొరవగా ఉన్నాయని కవి అంటాడు. 'విధిరాతను పరీక్షించుకునేందుకు' అనే ప్రయోగం చేసి తన ప్రేయసి ప్రేమకు, ఉన్నత స్థానాన్ని కల్పిస్తాడు. ప్రేయసిని కలవడానికి కవి హదయం ఎంతో ఉత్సుకతతో ఉందన్న విషయం రెండవ షేర్ ద్వారా అర్థం అవుతుంది. కవి తన సర్వస్వాన్ని ప్రేయసికి అర్పించుకున్నానని చెప్పడానికి, ప్రేయసి ముందు తాను నిలువు దోపిడీ అవుతానని మూడవ షేర్లో చమత్కారంగా చెప్తాడు. నాల్గవ షేర్లో ప్రేయసి చూపులు మత్తెక్కించేవిగా ఉన్నాయని చెప్పడానికి తన చూపు నుండి కైపు అంటే మత్తు రాలుతుందని అంటాడు. ఐదవ షేర్లో, కొత్త ప్రేమాయణాన్ని ప్రారంభించాలని చెబుతూ, ఉండటానికి నివాసమేర్పరుచుకునే (ప్రియురాలి హదయంలో) రోజులొస్తున్నాయని ముగిస్తాడు.
- ఇనుగుర్తి లక్ష్మణాచారి, 94410 02256