Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒకప్పుడు ఆమె అనాథలా పేరు మార్చుకుంది. దేశం కోసం జైలుకెళ్ళింది. పడరాని పాట్లు పడి మళ్ళీ చదువుకుని ఉపాధ్యాయురాలైంది. అంతటితో ఆగకుండా ఎమ్మెల్యే అయి, మంత్రి అయ్యింది. ఆ తర్వాత పార్లమెంటుకు ఎన్నికై ఆంధ్రప్రదేశ్ నుండి తొలి పార్లమెంటేరియన్‌గా పేరు పొందింది. ఆవిడే సంగెం లక్ష్మీబాయి.
జననం, విద్యాబ్యాసం
రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్లో 1911 సం. జూలై 27వ తేదిన జన్మించింది. తల్లిదండ్రులు సీతమ్మ, దొంతుల రామయ్య. వీరి చిన్నతనంలోనే తల్లిదండ్రులు కాలం చేయడంతో అనాథగా మారింది.
ఆ కాలంలో ఆడపిల్లకు, చదువుకు మధ్య వ్యత్యాసం బాగా ఉండేది. కారణం ఆడపిల్ల చదువుకుంటే వచ్చిన జ్ఞానంతో ఇల్లు విడిచి పారిపోతుందని, పెద్దల మాట వినదని, ఇతర వర్గాల వారితో తిరుగుతారని, ఇలా ఆనాడు ఛాందస భావాలతో ఉన్న పెద్దవారు ఈ విధంగా అనుకునేవారు. లక్ష్మీబాయి తండ్రి కూడా ఇటువంటి ఛాందస భావాలతో కూతురికి చదువుకు మధ్య దూరం పెంచాడు. దాంతో ఈమె తండ్రి మాటను కాదనకుండా ఆమెకున్న చదువుకోవాలనే కోరిక కాదనలేక సంశయస్థితిలో కొన్నాళ్ళు ఉండిపోయింది. అలా 15 ఏళ్ల వయసులో ఉన్నవ లక్ష్మీనారాయణ దంపతులు గుంటూరులో స్థాపించిన శారదా నికేతన్‌లో చేరింది.
ఈమె అసలు పేరు సత్యవతి. మాడపాటి హనుమంత రావు సలహాతో గుంటూరులోని శారదా నికేతన్‌లో అనాథలకే అడ్మిషన్ దొరుకుతుందని తెలుసుకొని అక్కడ లక్ష్మీబాయి పేరుతో చేరింది. అప్పటి నుండి లక్ష్మీబాయిగా మారింది. చిన్నప్పటి నుంచి పుస్తక వ్యాపకం అధికంగా ఉండడం వల్ల సామాజిక పరిస్థితులను అర్థం చేసుకోగలిగింది.
స్వాతంత్య్రోద్యమం
శారదా నికేతన్‌లో చదువుకుంటున్నప్పుడే ఆమె మొదటిసారి జాతీయోద్యమం గురించి తెలుసుకుంది. సామాజిక సేవా దక్పథం అపారంగా ఉన్న ఈమె అప్పటి నుంచే దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొనాలని భావించింది. అలా ఆనాటి నుంచి గాంధీని అభిమానించి ఆయననే దైవంగా పూజించింది. జాతీయోద్యమంలో ప్రత్యక్షంగా దిగి అరెస్టయి రాయవేలూరు జైలులో ఒక ఏడాది పాటు శిక్షను అనుభవించింది. స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా మహాత్మాగాంధీ ఉప్పు పన్నులను, చట్టాలను ఉల్లంఘిస్తూ ఉప్పు సత్యాగ్రహం ప్రారంభించాడు. ఈ ఉప్పు సత్యాగ్రహంలో సంగెం లక్ష్మీబాయి పాల్గొని జైలుకు వెళ్ళింది. ఈ సంఘటనతో, ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు వెళ్ళిన మొదటి తెలంగాణ మహిళగా ఈమె ప్రసిద్ధి పొందింది. తన తోటి మిత్రులతో కలిసి విదేశీ వస్త్రాలను సేకరించి నడిరోడ్డులో కుప్పగా వేసి తగులబెట్టి బ్రిటిషు ప్రభుత్వంపై ఉన్న నిరసనను తెలిపింది. స్వదేశీ ఉద్యమాన్ని పటిష్టం చేయడానికి ఎవరు కూడా విదేశీ వస్త్రాలు కొనవద్దని ప్రచారం చేసింది. బ్రిటిషు ప్రభుత్వానికి పన్నులు కట్టవద్దని చెప్తూ పన్నులను నిరాకరించింది.
లక్ష్మీబాయమ్మ మనసు నిండా జాతీయోద్యమ భావనయే నిండి ఉండేది. అరెస్టు కాక ముందు మహనీయుల నాయకత్వాన ఎలాగైతే ఉద్యమం చేసిందో, అలాగే అరెస్టయ్యాక కూడా తన ఉద్యమాన్ని కొనసాగించింది. స్వదేశీ ఉద్యమ ప్రతీకలైన రాట్నం, ఖద్దరు నేయడం వంటి వాటిని ఉద్యమ సాధనాలుగా స్వీకరించి ఖద్దరు నేసింది. రాట్నం వడికింది. సత్యాగ్రహం చేసి జైలుకు వచ్చిన వారికి, నిజాం రజాకార్లను ఎదురించిన వారికి సేవలు చేసింది. మహిళల సమస్యలని ఆనాడే గుర్తించి స్త్రీల కోసం జైలులో ప్రత్యేక గదులు కట్టించాలని పోరాడింది. విడుదలయ్యాక 1933లో మద్రాసు వెళ్లి చిత్రకళలో డిప్లొమా పొందింది. 1938లో గుల్బర్గాలోని బాలికల స్కూలులో డ్రాయింగ్ టీచర్‌గా పని చేసింది.
ఆనాడు జాతీయోద్యమంలో స్త్రీలు పాల్గొనడం అతి పెద్ద సాహసం. అయినా జాతి స్వాతంత్య్రం ముందు తమకున్న ఆంక్షలను కాదని ఏనాడో స్త్రీలు ముందడుగు వేశారు. వారిలో దువ్వురి సుబ్బమ్మ, తల్లావఝుల విశ్వ సుందరమ్మ, సుభద్ర, రుక్మిణమ్మ వంటి మహిళలతో లక్ష్మీబాయికి అనుబంధం ఉండేది.
లక్ష్మీబాయి ఒక్కోసారి తనకు ఎవరు లేరని, ఏదైనా కష్టం వస్తే ఆదుకోవడానికి తన వాళ్ళు అంటూ లేరని లోలో ఎంతగానో కుములిపోయింది. సహాయనిరాకరణ ఉద్యమం జరిగిన నాటికి ఆమెకు పదేళ్ళు. కాని అనంతర కాలంలో ఈ ఉద్యమం అన్ని ఉద్యమాలలో కెల్లా పటిష్టమైందని ఆమె భావించింది.
దేశం కోసం, దేశ స్వాతంత్య్రం కోసం ఎన్నెన్నో త్యాగాలు చేసిన ఎందరో స్వాతంత్య్ర సమరయోధులు దేశానికి స్వాతంత్య్రాన్ని తీసుకొచ్చారు. దీంతో దేశం ఇంతకింత అభివద్ధి చెందుతుందని, ఇక్కడ నిజాయితీ గల ప్రభుత్వాలు ఏర్పడతాయని స్వాతంత్య్ర వీరులు ఎన్నెన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ మారిన రాజకీయ పరిస్థితిని చూసి, పెరిగిన పేదరికాన్ని దర్శించి వారు తీవ్ర వేదనకు గురయ్యారు. అలంటి వారిలో లక్ష్మీబాయి ఒకరు.
భూదానోద్యమం
భూమి లేని నిరుపేదల కోసం, ముఖ్యంగా హరిజనుల కోసం జీవనోపాధిని కల్పించేందుకు ఆచార్య వినోభబావే నాయకత్వాన భూదాన కార్యక్రమం మొదలైంది. వినోభాజి ప్రారంభించిన మొదటి పాదయాత్ర వార్ధాలో మొదలైంది. ఈ పాదయాత్రలో వినోభాతో పాటు పదకొండు మంది పాల్గొన్నారు. వారిలో ఒకరే సంగం లక్ష్మీబాయి. ఈ కార్యక్రమంలో సేకరించిన భూమిని పంపిణీ చేసేందుకు కొన్ని కమిటీలు ఏర్పడ్డాయి. అలా ఏర్పడ్డ మొదటి కమిటీ అయిన శూన్య కమిటీలో సంగం లక్ష్మీబాయి సభ్యురాలిగా ఉన్నది. అలాగే హైదరాబాద్ భూదాన్ యజ్ఞ సమితిలో కూడా సభ్యురాలిగా ఉన్నది.
రాజకీయ జీవితం
మొదటి సాధారణ ఎన్నికల్లో బాన్సువాడ నుంచి హైదరాబాదు అసెంబ్లీకి ఎన్నికై బూర్గుల మంత్రి వర్గంలో డిప్యూటీ విద్యా శాఖ మంత్రిగా రెండేళ్ళు ఉంది. 1957లో మెదక్ నుండి లోక్‌సభకు మొదటిసారి ఎన్నికై 1962, 1967 లో మళ్ళీ పార్లమెంటుకు గెలిచి 14 ఏళ్ళు పార్లమెంటు సభ్యురాలిగా ఉంది.
లక్ష్మీబాయమ్మ తన జీవితంలోని జ్ఞాపకాలను, ముఖ్యమైన సంఘటనలను ''జైలు జ్ఞాపకాలు-అనుభవాలు'' పేరుతో ఒకరకమైన ఆత్మకథగా రాసుకుంది.
ఇలా చదువుకు కోసం ఇబ్బంది పడి, ఉద్యమంలో పాల్గొని అనేక సేవా కార్యక్రమాలు చేసి చట్ట సభలకు ఎన్నికై గొప్ప పేరును పొందిన సంగెం లక్ష్మీబాయి 1979లో అస్తమించింది.
- ఘనపురం సుదర్శన్,
9000470542