Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆచార్య పాకాల యశోధారెడ్డి కవయిత్రి, పండితురాలు, వక్త,
పరిశోధకురాలు, పరిపాలనాదక్షురాలు, అనువాదకులు, తెలంగాణ భాషకు రచనల్లో పట్టం కట్టిన స్వాతంత్య్రానంతర తెలంగాణ తొలి తరం రచయిత్రి. అపార పాండిత్యం కలిగి, బాలల కోసం తపించి రాసిన బాల సాహితీమూర్తి యశోదారెడ్డి. 1929 ఆగస్టు 8వ తేదీన మహబూబ్ నగర్ జిల్లా మిదినేపల్లిలో పుట్టింది. స్వగ్రామంలో ప్రాథమిక విద్యాబ్యాసం చేసిన యశోదారెడ్డి బాల్యం నుండే ప్రతిభావంతురాలు. అసాధారణ జ్ఞాపకశక్తి ఆమె సొంతం. అంతేకాదు, ఆమె ఏకసంథాగ్రాహి. బడిలో ఉండగా ఒకరోజు పుస్తకాలు తెచ్చుకోకపోవడంతో ఉపాధ్యాయుడు తరగతి బయట నిలబెట్టగా అక్కడి నుండే ఆ పాఠాన్ని విని అక్షరం పొల్లుపోకుండా వినిపించారు యశోదారెడ్డి.
కరీంనగర్‌కు చెందిన ప్రసిద్ధ చిత్రకారుడు పాకాల తిరుపతి రెడ్డితో వివాహం జరిగింది. వివాహానంతరం చదువుకుని విశ్వవిద్యాలయ ఆచార్యురాలుగా సేవలందించారు. 'తెలుగులో హరివంశాలు' అంశంపై పిహెచ్.డి చేసి తెలుగు, సంస్కృత హరి వంశాల తులనాత్మక అధ్యయనం చేసి అనేక అంశాలను ప్రస్తావించారు. విద్యుక్త ధర్మంలో, విధి నిర్వహణలో ముక్కుసూటిగా ఉండే యశోదారెడ్డి అనేక ఇబ్బందులను సైతం ఎదర్కొన్నారు. పరిశోధనా గ్రంథాలు, రేడియో ప్రసంగాలు చేశారు. 'పారిజాతాపహరణ పర్యాలోచనం', 'భారతదేశంలో భారతంలో స్త్రీ', 'ద్విపద వాజ్ఞయం' వంటి అనేక పరిశోధనా గ్రంథాలు యశోదమ్మ పరిశోధనకు, పాండిత్యానికి నిదర్శనా లుగా నిలుస్తాయి. స్త్రీల గురించి, తెలంగాణ భాషా సాహిత్యాల గురించి ఎచ్చమ్మ రాసిన వందలాది వ్యాసాలు ఆమె గొప్పతనాన్ని తెలపడమే కాక ఆమెకు తన భాష మీదున్న మమకారాన్ని చూపుతాయి.
కథా రచయిత్రిగా మంచిని పెంచే కథలు, మానవత్వాన్ని తట్టిలేపే కథలు, ఆర్ధ్రత నిండిన కథలు రాసిన యశో దమ్మ కథలు స్వాతంత్య్రానంతర తెలంగాణ గ్రామీణ, సామాజిక పరిణామాలకు, జీవితాలకు ప్రతిబింబం గా నిలుస్తాయి. 'ధర్మశాల', 'మా ఊరి ముచ్చట్లు', 'ఎచ్చమ్మ కథలు' కథా సంపుటాలు, 'భావిక', 'ఉగాదికి ఉయ్యాల' కవితా సంపుటాల యశోదమ్మ రచనల్లో కొన్ని. ఇటీవల నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా బి.ఎస్.రాములు సంపాదకత్వంలో 'పి. యశోదారెడ్డి ఉత్తమ కథలు' పేర ఎంపిక చేసిన కథల సంపుటిని ప్రచురించింది. అనువాదకురాలుగా కూడా యశోదమ్మ ప్రసిద్ధులు, 'హిందీ కవయిత్రులు' గ్రంథాన్ని అనువాదం చేశారు. అనేక పదవులను నిర్వహించిన యశోదమ్మ 1990-93 మధ్య ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షురాలుగా పనిచేశారు.
పండితురాలిగా, పరిశోధకురాలిగా విశేషమైన సాహిత్య సృజన చేసిన యశోదమమ్మ పిల్లల కోసం రచనలు చేసిన బాల సాహితీవేత్త. 1953లో తెలంగాణ రచయితల సంఘం సిరిసిల్ల శాఖ పక్షాన వెలువరిం చిన బాలల నాటికల సంపుటి 'చిరు గజ్జెలు' కోసం 'బుచ్చయ్య పెబ్బ' అనే చక్కని బాలల నాటిక ను పిల్లలకు కానుకగా అందించింది. ఈ సంపుటిలో యశోదా రెడ్డితో పాటు 'మహాకవి డాక్టర్ దాశరథి, డాక్టర్ సినారె, వట్టి కోట ఆళ్వారుస్వామిల నాటికలు ఉన్నాయి. తరువాత మళ్ళీ దీనిని ఆంధ్రప్రదేశ్ బాలల అకాడమి పునర్ముద్రించింది. బడికి వస్తున్న కొత్త పంతులుకు తలా పావుశేరు బియ్యం, పావెడు నూనె, తనకో పైస తేవాలని, లేకుంటే కొడతానని బెదిరిస్తాడు. తరగతి పెబ్బ అందరిలోకి, తెలివిగలవాడు, చదువుకున్నవాడే అని కొత్త పంతులు బుచ్చయ్య ఆశలు కట్టిస్తాడు. ఇది ఇందులోని కథ. ఈ నాటికలోని పూర్తి తెలంగాణ భాష పిల్లలను ఆకట్టుకోవడమే కాక చక్కగా రక్తికట్టించింది.
1970 నుండి ఆంధ్రప్రదేశ్ లోని వివిధ తరగతుల పాఠ్య పుస్తకాలలో యశోదమ్మ రాసిన వివిధ పాఠ్యాంశాలు చేర్చారు. వాటిలో 'నక్కబావ' కథ ప్రసిద్ధం. ఇవేకాక వివిధ కథా సంపుటాల్లో బాలల కోసం రాసిన అనేక కథలు యశోదమ్మ ప్రతిభను తెలుపుతాయి. ఇటువంటిదే 'మా వూరి ముచ్చట్లు' లోని 'మొమ్మైయి కత'. ఇది చిన్న పిల్లల మనస్తత్వాలను, వారి మనసులోని భయాలను, ఊహాపోహలను అద్భుతంగా అక్షర బద్దం చేసిన కథ ఇది. ఇది పూర్తిగా తెలంగాణ బాషలో సాగిన కథ. ఇందులో అమర్ సింగ్ గురించి, ఆట వస్తువుల గురించి వర్ణించిన తీరు అత్యంత అద్భుతంగా ఉంటుంది. ఇందులోని తెలంగాణ భాష ఎంతో సుందరంగా, అందంగా ఉంటుంది. పెద్ద బడి, నాదిర్సాబ్. సోపతిగాళ్ళ పేరు, సోపతుల గురించి, తెలుగు బడి గురించి చెప్పిన అనేక అంశాలు ఆసక్తి కరంగా ఉంటాయి. యశోదమ్మ పాఠ్య పుస్తకాల కోసం రాసిన అనేక రచనలు ఇప్పుడు అలభ్యంగా ఉన్నాయి. అవన్నీ దొరికితే ఎచ్చమ్మ పాయిరంగా పిల్లల కోసం రాసిన అపారమైన సంపద మనకు వారసత్వ సంపదగా అందుతాయి. ఈ విదుషీమణి అక్టోబర్ 8, 2007న మరణిచారు.
- డా|| పత్తిపాక మోహన్,
9966229548