Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అక్షరాలకు రంగు, రుచి, వాసన ఉంటాయని, వాటిని పొదుపుగా కవిత్వంలో నిక్షిప్తం చేయగల భావుకతా ప్రతిభ వుంటేనే ఉత్తమ కవిత్వం రాయగలమని విశ్వసించే కవి ఒద్దిరాజు ప్రవీణ్‌కుమార్. 52 కవితలతో 'పరావలయం' కవితా సంపుటి వెలువరించారు. జీవితంలో ఎదురవుతున్న సంఘటనలు, సంతోష విషాదాలకు కవితా రూపకంగా, ప్రవీణ్‌కుమార్ ఈ సంపుటిలో ప్రతిబింబింపజేశారు. 'కన్నీటి సంతకం'లో ఆసుపత్రి వాతావరణాన్ని ప్రాణం నివలడమో, నిలవలేకపోవడమో ఆశనిరాశల భారమితి కొలుస్తుందంటారు. 'పరావలయం' కవితలో మొగ్గలు దోసిట్లో పువ్వులౌతున్న సమయంలో నా కలల కన్నులను ఎవరో ఎత్తుకెళ్ళారు అంటారు.''ఇక నా నెత్తుటి పాదముద్రలు ఎగిరే ఎర్రజెండాలైతే మేం వలస కార్మికులం కాదు. గురి తప్పని గుడిసెలరాళ్ళవుతు'' అంటారు అన్యాపదేశంగా. ''ఇంతకూ మన ఊపిరితిత్తుల మీద మృత్యు సంతకం చేస్తున్నది ఎవరు?!!'' అని ప్రశ్నిస్తూ ''అది ప్రపంచానికి అధిపతి అయి వేల కిరీటాలతో తిరుగుతుంది'' అంటూ కరోనా ఎక్కడుందో ఎవరికి తెలుసు!? అంటూ హెచ్చరిస్తారు. ఒద్దిరాజు ప్రవీణ్‌కుమార్ ప్రయాణాన్ని, ప్రకృతిని ప్రేమించే హృదయం వున్న కవిగా స్పందించిన కవితలు ఈ సంపుటిలో చోటుచేసుకున్నాయి. పర్యావరణాన్ని పరిరక్షించుకోలేని నిస్సహాయత, నిర్లక్ష్యాన్ని నిందిస్తాడు. చావు చిత్తడి కవితలో ''అడవి మన చూపుకు వణికి మైదానమై మోకరిల్లింది'' అంటూ పర్యావరణం మనకు పగటి వేషం అంటారు. స్వాప్నికుడు కవితలో ''రైతంటే మట్టితో మాట్లాడి నీటి తల నిమిరి, విత్తనానికి పురుడు పోసే ప్రాణదాత'' అంటారు. తడి ఆరని స్పర్శలో ''సాయంకాలం సన్నని ముసురు కింద విరిసిన సన్నజాజివి నువ్వు'' ఎడబాటులో ''హృదయపు తోట ముందు వెన్నెల నిరీక్షిస్తుంది'' అంటూ స్వప్నంలో ''ఆమె ముంగురుల చివరి చెమట చుక్కను మోసుకొచ్చి నా పెదాలపై చిలకరించింది'' సౌందర్యానుభవ స్పర్శలేకుండా తల్లి పొత్తిళ్ళ అమ్మ భావనలు, ఊరుమ్మడి బతుకుల ఊపిరి మింగిన ఉమ్మడి రాష్ట్రం నుంచి పీడకలను పాతరేస్తూ ఉద్యమాల తెలంగాణను 'జాగ్రత్త' అంటూ ''తెలంగాణ ఇంక తెలివితోనే ఉన్నది. నీ తొండి ఆటల తొడలు విరిచేందుకు సాహసమై నిలబడ్డది'' అంటూ హెచ్చరిస్తారు.
''మన ఆకలికి
భూమి బెదురుతున్నది
స్మశానం విస్తరిస్తోంది
కాలం కసిగా కాటేస్తున్నది
పువ్వులు జాలిగా రాలుతున్నవి''
ఓ నాలుగు వాక్యాలు రాసి చదువరులను దబాయించ కుండా అక్షరాన్ని ప్రేమిస్తూ, భావాలను ఆరాధిస్తూ కవితా పరంగా హృదయాలను స్పృశించే 'పరావలయం' ఒద్దిరాజు ప్రవీణ్‌కుమార్ కవితా ప్రియులకు అందించిన ఆత్మీయ ఆలింగనం.
(పరావలయం (కవిత్వం), రచయిత : ఒద్దిరాజు ప్రవీణ్‌కుమార్, పేజీలు : 98, వెల : రూ. 100/-, ప్రతులకు : ఒద్దిరాజు ప్రవీణ్‌కుమార్, ప్లాట్ నెం. 67, ఫ్లాట్ నెం.202, స్వప్నా రామకృష్ణా హైట్స్, సారథి హౌసింగ్ సొసైటీ, మోతీనగర్, హైదరాబాద్ - 500018; సెల్ : 9849082693)
- జయసూర్య, 9014948336