Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''మతం మీద నేరుగా పోరాడితే దానికి శాశ్విత అమరత్వం కల్పించడమే!'' -కారల్ మార్క్స్
ఎవరికైనా ఒక మతం ఎందుకు జీవితంలో భాగమై పోతుంది? ఈ భూమ్మీద జన్మించిన ప్రతీ మానవ ప్రాణికీ (జీవకోటికి అని ఎందుకు వాడలేదంటే వాటికి పుట్టుకతో ఏ మతం వుండదు. ఒక క్రైస్తవ లేదా హిందూ లేదా ముస్లిమ్ కుటుంబాల్లో పెరిగే ఆవు తన ముందు ఏ దేవుడి పటాన్నైనా పెడితే నిరభ్యంతరంగా నమిలి తినేస్తుంది. ఎందుకంటే దానికి మతంతో పన్లేదు, అయ్యో, ఇది మా ఇంటి యజమాని మతం తాలూకూ దేవుడు కదా అని అది అనుకోలేదు!) ఇక్కడ స్పష్టంగా తెలిసే, అందరూ ఒప్పుకునే సత్యం ఏమిటంటే, సకల జీవరాశుల్ని సృష్టించాడని బడాయిగా చెప్పుకోవడమే తప్ప, అనంతకోటి జీవరాశుల్లో ఒక శాతం కూడా లేని మనిషి తప్ప, మరే ప్రాణీ దేవుడ్ని గానీ, మతాన్ని గానీ ఖాతరు చెయ్యవు!
అంటే మతం అనేది స్పష్టంగా మనిషి తాలూకూ బిజినెస్! నేననేది మతాన్ని బిజినెస్ చేస్తూ తెలివిగా వాడుకునే వారి విషయం కాదు! మనిషి సోయిలో వుండే, చాలా స్పష్టంగానే, తానే కనుక్కున్నాడనే సందర్భం మాత్రమే! ఎందుకు? వంటరిగా వున్నప్పుడు ప్రకృతి శక్తులు అర్థంకాక భయంతో, అభద్రతతో కొన్ని భ్రమలు పెట్టుకున్నాడు. రక్త సంబంధీకుల కుటుంబం ఏర్పడ్డాక కొన్ని, తర్వాత కుటుంబాలు కలిసి గుంపుగా బతికేటప్పుడు అందర్నీ కలిపి వుంచే కొన్ని, కొన్ని గుంపులు అన్నీ కలిసి ఒక తెగలా సామూహికంగా బతికేటప్పుడు మరికొన్ని అదనంగా కలుస్తూ పోతాయి. వీరిని పట్టి ఉంచే సూత్రాలు బాహ్య ప్రభావాలు లేనంతకాలం చెక్కు చెదరకుండా వుంటాయి. ఒకోసారి రెండు గుంపులు, రెండు తెగలు ఒక దానిమీద ఒకటి దాడులు చేసుకున్నప్పుడు రెండు తెగల్లోని సూత్రాలు కలగాపులగం అవ్వడమో, విజేత తెగ పాటించే ఆ సూత్రాలు, పరాజితులకు అలవాటు చేయడమో సాధారణంగా జరుగుతుంది.
ఆ సూత్రాలు చెప్పిన వ్యక్తి ఆ తెగకు విలువైన వ్యక్తి, రక్షకుడో, ప్రవక్తో, దేవుడు పంపించిన దూతో అవుతాడు. పుట్టుక, ఆహార అన్వేషణ, గెలుపు, మరణంతో ముడిబడి వుండే సూత్రాలు ఆ తెగపెద్ద ఎలా చెబితే అలా నడవడమే, ఆ తెగ పెద్ద ఏది చెబితే దాన్ని ఆచరణలో పెట్టడం ఆ తెగ వాళ్ళు చేయాల్సిన పని. ఇంకో పెద్ద తెగ ఏదన్నా దాడి చేస్తే బలహీనమైన తెగ ఆ సూత్రాల్ని పాటించాలి. జంతువుల్లో కుటుంబాలు లేవా, గుంపులు లేవా, తెగలు లేవా? వున్నాయి, ఉదాహరణకి సింహాలు, ఏనుగులు, కాంగ్రూలూ, జిరాఫ్ లూ (కంగారూలూ, జిరాఫీ లు అనకూడదు). అయితేనేం, వాటికి దేవుడి తోనో, మతం తోనో పనిబడలేదు!
ఒక తెగకు బాధ్యత వహించే వ్యక్తి సూచనలు, కట్టుబాట్లు ఆ తెగకు సంబంధించిన వారు తప్పక పాటించాలి, తెగ ''రక్షకుడు'' అతనే కాబట్టి. మరో తెగ ''రక్షకుడు'' చెప్పిన సూత్రాలు ఇంకొకరికి నచ్చు తాయా? ''నా కవే నచ్చాయి, నేను పాటిస్తాను'' అని ఇంకొక తెగ వ్యక్తి అంటే ఏం జరుగుతుంది? ప్రాణం విలువలేని రోజుల్లో ప్రాణాలు తీయడం అతి సాధారణమైన విషయం. కాబట్టి తెగ పెద్దగా కొన్ని సూత్రాల్ని పాటించేలా చేయడమే ఒక గొప్ప కసరత్తు. తెగ పెద్ద ఉద్దేశం మాత్రం ఒకటే, తాను ''చెప్పినట్టు'' నడిచే వారికి ఒక హామీ, రక్షణ వుంటుంది.
యూదులు, క్రైస్తవుల గ్రంథాలలో అనేక సందర్భాల్లో మానవ నాగరితలోని లేబ్రాయపు ఆలోచనలు ఒకోసారి ఆశ్చర్యచకితం చేస్తాయి. కొంచెం ఆలస్యంగా వచ్చిన కురాన్ గ్రంథంలో, తెగల పట్ల పొసగని అనేక విషయాల పట్ల, ఒక సాధారణ జీవనాన్ని గడుపుతూ వున్న మహమ్మద్ అనే వ్యక్తి ప్రవక్తగా ఎలా ఎదిగాడు, ఆనాటి అనాగరిక సంచార అరబ్బు ప్రాంతాల తెగల మధ్య తరచుగా జరిగే భయానక యుద్ధాల నేపథ్యంలో బహు దేవతారాధకులుగా వుంటున్న విభిన్నమైన తెగల్ని ఒక గొడుగు క్రిందికి తెచ్చే ప్రయత్నం ఎలా చేశాడు, తనకు అల్లాV్‌ా నుంచి ' దివ్యవాణి ' గా వినిపించే సూత్రాలను ' సూరా ' ల్లో సందర్భానుసారంగా వినిపిస్తూ వచ్చిన ఆ 'దివ్య సందేశాలు' యావత్తూ మానవాళికోసమా, లేదంటే అరబ్బు తెగల నుద్దేశించి వినిపించాడా లాంటి అనేక విషయాలు ఈ పుస్తకంలో చర్చిస్తుంది రచయిత్రి.
కురాన్ లోని విషయాలు తెలియాలంటే అరబ్ తెగల సంచార జీవనం తెలిసి ఉండాలి, ఆరేడు శతాబ్దాల సమయంలో అరబ్ ప్రపంచం ఎలా వుండేదో తెలియాలి. వారి వేషభాషలు, వారి ఆహారపుటలవాట్లు, ప్రవక్త రాకముందు వారి జీవన శైలి ఎలా ఉండేదీ, తర్వాత ఎంతగా మారింది అనేది తెలుసుకోకపోతే నిజాలు తెలియవు. ఉదాహరణకు అరబ్బు తెగలలో కొన్ని ఒంటెను బతికి వుండగానే ముక్కలుగా కోసి తినేవారట, అలానే స్త్రీలను ఎంతమంది నైనా వివాహం చేసుకోవచ్చు. మహమ్మద్ ప్రవక్త దీన్ని గర్హించడం చూస్తాం. అలానే తెగ యుద్ధాలలో పురుషుల మరణాలు ఎక్కువై వితంతువులు విపరీతంగా వుండేవారు, వితంతు వివాహం తను చేసుకోవడమే కాదు, వివాహానికి నలుగురిని పరిమితం చేయడం చూస్తాం, (అప్పటికది ముందడుగు!) అలానే ఇటువంటి చాలా అనాచారాలను మహమ్మద్ మెరుగు పరచడం గమనిస్తాం.
అరిస్టాటిల్ బానిసత్వాన్ని సమర్థించడం తప్పైనా అరిస్టాటిల్ గొప్ప తాత్వికుడని ఎందుకంటారు? ఒక వ్యక్తి జన్మించిన చారిత్రక నేపథ్యాన్ని నిష్పక్షపాతంగా చూడడం నేర్చుకున్నప్పుడు ఏయే చారిత్రక పరిస్థితుల్లో ఏ సంబంధాలలో వాటిని చెప్పాల్సివచ్చిందో తెలుసుకొని, తనకు ముందున్న తరంలో మానవ ప్రగతికి అడ్డుగా వుంటూ, ముందుకు కాకుండా వెనక్కి తీసుకెళ్లడానికి ప్రయత్నం చేసే దేనినైనా గర్హించాల్సిందే.
ఈ పరిచయంలో హిజాబ్ గురించీ, జిహాదీ గురించీ, బహు దేవతారాధన నుంచి దేవుడొక్కడే అనే భావనలు ఎందుకొచ్చాయో రచయిత్రి వివరించే ప్రయత్నం చేసింది. సెటానిక్ వర్సెస్ గురించి (రష్దీ లేవనెత్తిన విషయం) కూడా వివరణ వుంది. ఇది మహమ్మద్ ప్రవక్త జీవితాన్ని నిష్పక్షపాతంగా చూపే ప్రయత్నం చేసింది. ఆయన జీవన గమనంలో ఎదురైన అన్ని సంఘటనల్ని సూరాల ఆధారాలతో వుటంకిస్తూ, పెద్ద వయసు ఖతీజాని వివాహం చేసుకోవడం నుంచి, తొమ్మిదేళ్ల ఆయేషానీ, ఇంకా మరి కొందరితో వివాహాలు చేసుకోవడానికి దారి తీసిన పరిస్థితులు, దివ్యవాణి (కురాన్)ని వినిపించేటప్పుడు ఆయన ఎంత ఉద్వేగంతో చెమటలు పట్టి ఒక ట్రాన్స్ లాంటి స్థితిని పొందేవాడో, దాన ధర్మాల పట్ల, నిరుపేదలపట్ల ఎంత దయామయుడో చెబుతూనే అదే సమయంలో శత్రు తెగల పట్ల ఎంత నిర్ధాక్షిణ్యంగా వుండేవాడో కూడా వివరిస్తోంది.
మతాలను సమర్ధించడం, లేదంటే పరమత సహనాన్ని బోధించడమో కాదు కావలసింది. ఏ మతం ఏ చారిత్రక నేపథ్యంలో పుట్టుకొచ్చిందో తెలుసుకోవడం ద్వారా ఆయా మతాచారాల వెనక దాగున్న సాంఘిక, ఆర్ధిక పరిస్థితులు తెలుసుకోవడం. సానుభూతితో అర్థం చేసుకోవడం, సమకాలీన పరిస్థితుల్లో వాటి ప్రాసంగికత ఏ మేరకో తెలుసుకోవడం.
కారెన్ ఆమ్ స్ట్రాంగ్ రాసిన ఈ పుస్తకంలో ఒక మతాన్నో, ఆ మతాన్ని ఆచరించే వ్యక్తులపట్లో చిన్న చూపుతోనో లేదంటే మూఢ భక్తి తోనో కాకుండా ఆ మత ప్రవక్త జీవితాన్ని తనకు దొరికిన సమాచారం మేరకు ప్రతిభావంతంగా విశ్లేషించింది.
ఏ మతాన్ని ఆచరించే వారైనా ఈ పుస్తకాన్ని చదవచ్చు. హైదరాబాద్ బుక్ ట్రస్ట్ అందించిన ఈ పుస్తకాన్ని పి.సత్యవతి గారు చక్కని తెలుగులో తెలుగు పాఠకులకు అందించారు.
(ముహమ్మద్ ప్రవక్త జీవితం (క్యారెన్ ఆంస్ట్రాంగ్),
ఆంగ్ల మూలం : ముహమ్మద్,
తెలుగు అనువాదం : పి. సత్యవతి,
వెల : రూ.150/-,
ప్రతులకు : హైదరాబాద్ బుక్ ట్రస్ట్, ఫ్లాట్ నెం. 85, బాలాజీ నర్, గుడిమల్కాపూర్, హైదరాబాద్ - 06, ఫోన్ : 040 - 23521849)
- వి. విజయకుమార్, 8555802596