Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ప్రపంచంలో మహాకవులు ఎందరో ఉన్నారు, వారందరిలో గాలిబ్ భావవ్యక్తీకరణ శైలి ప్రత్యేకమైనదని అంటారు'' అని, స్వయంగా తన కవితా శక్తిని తానే ప్రకటించుకున్న మహాకవి మీర్జా గాలిబ్ అసలు పేరు, మీర్జా అసదుల్లా బైగ్ ఖాన్.
ఇతను 27 డిసెంబర్ 1797లో ఆగ్రాలో జన్మించాడు. చిన్నప్పుడే గాలిబ్ తండ్రి, పినతండ్రి ఇద్దరూ మరణించారు. అడుగడుగునా తనకు విషాదమే మిగిలింది. పెళ్లయ్యాక కూడా గాలిబ్ పరిస్థితులు ఏం మారలేదు. పుట్టిన ఏడుగురు పిల్లలు, నడక నేర్వకమునుపే మరణించారు. బ్రిటిష్ ప్రభుత్వం నుండి రావాల్సిన పెన్షన్ కోసం నానా తంటాలు పడాల్సి వచ్చింది. ఇలా ఎన్నో బాధలను అనుభవించిన గాలిబ్, వాటినే తన కవితా వస్తువుగా మలచుకొని సమర్థవంతమైన కవిత్వం అల్లాడు. గాలిబ్ గజళ్ళలో ప్రేమ, విరహం, విషాదం, తత్త్వం మొదలైన భావాలు ఎక్కువగా కనపడతాయి. దీవాన్-ఎ-గాలిబ్, తైఫ్ు-ఎ-తైజ్, ఖతా-ఎ-బుర్హాన్ మొదలైనవి ఇతని రచనలు. గాలిబ్ గొప్ప కవియే కాదు. మంచి రచయిత, విమర్శకుడు కూడా. నజ్ముద్దౌలా, దబీర్-ఉల్-ముల్క్, నిజామ్ జంగ్, మీర్జా నౌషా మొదలైన బిరుదులను అందుకున్న ఈ ప్రపంచ ప్రఖ్యాత మహాకవి, తీవ్ర అనారోగ్యం వల్ల 15 ఫిబ్రవరి 1869న దిల్లీ ప్రజల నాల్కలలో శాశ్వత నివాసాన్ని ఏర్పరుచుకున్నాడు.
మూలం :
దిల్-ఎ-నాదా తుఝే హుఆ క్యా హై
ఆఖిర్ ఇస్ దర్ద్ కీ దవా క్యా హై
మై భీ ముహ్ మే జబాన్ రఖ్తా హూ
కాశ్ పూఛో కి ముద్ద్ఆ క్యా హై
జబ్ కి తుర్a బిన్ నహీ కోఈ మౌజూద్
ఫిర్ యే హంగామా ఐ ఖుదా క్యా హై
శికన్-ఎ-జుల్ఫ్-ఎ-అంబరీ క్యూ హై
నిగాహ్-ఎ-చశ్మ్-ఎ-సుర్మా సా క్యా హై
సబ్జా ఒ గుల్ కహా సే ఆఏ హై
అబ్ర్ క్యా చీజ్ హై హవా క్యా హై
హమ్ కో ఉన్ సే వఫా కీ హై ఉమ్మీద్
జో నహీ జాన్తే వఫా క్యా హై
జాన్ తుమ్ పర్ నిసార్ కర్తా హూ
మై నహీ జాన్తా దుఆ క్యా హై
మై నే మానా కి కుఛ్ నహీ 'గాలిబ్'
ముఫ్త్ హాథ్ ఆఏ తో బురా క్యా హై
అనువాదం :
నా చిన్ని హృదయమా! నీకేమయింది?
అసలు ఈ వ్యాధికి మందు ఏమయుంటుంది?
నేను కూడా మాట్లాడాలనుకుంటున్నాను
విషయమేమిటో అడగండి కదా మరి
ఒకప్పుడు నువ్ తప్పా ఇంకెవరూ లేరు కదా
మరిప్పుడు ఈ హంగామా అంతా ఏంటి ప్రభూ!
పరిమళించే ఆ కురులు రింగురింగులుగా ఎందుకున్నాయి
ఆ కాటుక కనుచూపులలోని పరమార్థం ఏమయుంటుంది?
పచ్చదనం, ప్రసూనాలు ఎక్కడి నుండి వచ్చాయి
ఈ మేఘాలు ఏమిటి? ఈ సమీరాలు ఏమిటి?
తాను మాటమీద నిలబడుతుందని నా నమ్మకం
తనకేమో అసలు నమ్మకమంటేనే ఎంటో తెలియదు
నా ప్రాణాన్ని సైతం నీకు నే అర్పిస్తాను
నాకింతరకు ప్రార్థన అంటే ఏంటో తెలియదు
నేనూ ఒప్పుకుంటాను , 'గాలిబ్' తో ఏమీ అవ్వదని
అయినా, తను ఖాళీ చేతులతో వస్తే తప్పేముంది చెప్పండి?
గాలిబ్ రాసిన గజళ్ళలో ఈ గజల్ ఎంతో ప్రసిద్ధి చెందింది. 1954లో సాదత్ హసన్ మంటో కథా రచయితగా, సొహ్రబ్ మోడీ దర్శకత్వంలో వచ్చిన మీర్జా గాలిబ్ చిత్రంలో, ఈ గజల్ ని స్వీకరించారు. గాలిబ్ ఈ గజల్ ని ప్రశ్నార్థకంలో రాసినా కూడా, తన ఉద్దేశం ప్రశ్నించాలని కాదు. ఇందులో తన మనసు అనుభూతి చెందిన ఆశ్చర్యాలను, సందేహాలను వ్యక్తపరచడమే గాలిబ్ ముఖ్య ఉద్దేశం. మొదటి షేర్లో వేదనకు గురవుతున్న తన హృదయాన్ని కవి, ప్రేమతో ప్రశ్నిస్తాడు. ఆ వేదనకున్న తీవ్రతను మార్మికంగా వ్యక్తపరుస్తూ, దానికున్న వ్యాధికి మందు ఉందా లేదా అని దిగులు చెందుతాడు. మూడో షేర్లో పరమాత్మ పైనున్న తన ప్రేమను గురించి కవి వ్యక్తపరుస్తాడు. నాల్గవ షేర్లో పరిమళాన్ని వెదజల్లే ప్రియురాలి కురులను, అలాగే తన కాటుక కన్నులు చేసే చూపుల మాయాజాలాన్ని ఊహించుకుంటూ తన్మయుడౌతాడు. ఐదవ షేర్లో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తాడు. ఈ విధంగా కొన్ని తాత్త్విక ఆలోచనలను గాలిబ్ తనదైన శైలిలో ఈ గజల్ లో వ్యక్తపరిచాడు.
- ఇనుగుర్తి లక్ష్మణాచారి,
94410 02256