Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ''జేతుకా పాతోర్ దోరే'' అసామీ చిత్ర నాయిక
''భూమి కోసం'' అనే తెలుగు సినిమాలో శ్రీశ్రీ రాసిన ఒక పాట ఉంది ''ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోస పోకుమా, నిజము మరచి నిదుర పోకుమా''. ఇది ఏ తరానికైనా సరిపోయే పాట. మన సమస్యలను మనమే పరిష్కరించుకోవాలి కాని మన కోసం ఎవరో వచ్చి ఏదో చేస్తానన్న ఆలోచనతో ఉండడమే ఒరరకంగా మన చేతకాని తనం. ఈ విషయాన్నే ''జేతుకా పాతోర్ దోరే'' అనే ఈ అసామీ సినిమా స్పష్టపరుస్తుంది. 2011లో వచ్చిన ఈ సినిమా పేరుకు అర్ధం ''గోరింటాకు ఆకు మాదిరిగా''. భావుకతతో పాటు సామాజిక స్పహ కలగలిపి పెట్టిన సినిమా పేరు ఇది. గోరింటాకు రాయి మధ్య నలిగి, పిప్పి అయిపోయిన తరువాతనే అది అందమైన రంగుని ఇస్తుంది. జీవితంలో కూడా ఎవరో కవి అన్నట్లు పదే పదే చెక్కకుండా ఏ రాయీ శిల్పం కాదు, పదే పదే చీల్చకుండా ఏ గుండే కావ్యం కాదు. మన జీవితాన్ని ఎంతగా రాతి దెబ్బలకు గురి చేస్తే అది గోరింటాకు ఆకు పండినట్లు పండుతుంది. పది మందికి ఉపయోగపడే జీవితం ఎన్నో ఆటు పోట్లకు సిద్ధపడుతుంది. ఈ సినిమా సారాంశం ఇదే.
సయ్యద్ అబ్దుల్ మలిక్ రాసిన అసామీ నవల ఆధారంగా తీసిన సినిమా ఇది. సినిమా కధా నేపద్యం అసాంలోని ఓ మారుమూల పల్లెటూరులో 1970ల ప్రాంతంలోనిది. ఆ చిన్న పల్లెటూరి జనం ఏ సౌకర్యాలనూ నోచుకోలేదు. ఎక్కువగా దళితులు చేపలు పట్టుకుంటూ ఆ ఊరిలో జీవిస్తుంటారు. అక్కడ ఎక్కువ సాతం పేద కుటుంబాలే. వారందరిపై దోపిడి చేస్తూ జీవిస్తుంటాడు కాంట్రాక్టర్‌గా పని చేసే జమునా హజారికా. రాధ అనే ఓ దళిత అమ్మాయికి తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోతారు. మేనమామ నకుల్‌కు పిల్లలు లేనందున ఆయన రాధను ప్రేమగా పెంచుకుంటాడు.
మరో కులానికి చెందిన ఓ చిన్న అబ్బాయి రజత్ ఓ పండితుడితో ఆ ఊరికి వస్తాడు. ఇతను కూడా అనాధే. ఆ అబ్బాయిని ఆ ఊరిలో వదిలేసి వెళ్ళిపోతాడు ఆ పండితుడు. పండితుడితో వచ్చాడు కాబట్టి రజత్ అగ్రకులానికి చెందిన అనాధ అనుకోవచ్చు. నకుల్ చాలా ఉదార స్వభావం కలవాడు. చిన్నతనాన ఎవరూ లేక రెక్కల కష్టంతో బతకడానికి ప్రయత్నిస్తున్న రజత్‌ను చూసి జాలి పడతాడు నకుల్. ముందు చిన్న చిన్న పనులు ఇప్పించి తరువాత ఆ అబ్బాయిని కూడా తన ఇంట్లోనే ఉండమని చెబుతాడు. రజత్ రాధలాగే నకుల్ దంపతులను మామా, అత్తా అంటూ పిలుస్తూ ఆ ఇంట్లో కలిసిపోతాడు. రాధ కూడా నకుల్‌తో చాలా స్నేహంగా ఉంటుంది. ఇద్దరు అదే ఇంట్లో పెరిగి పెద్దవారవుతారు. రాధను నకుల్ కష్టపడి చదివిస్తూ ఉంటాడు. ఆ ఊరి స్కూలు మాస్టారు హేంధర్ చాలా సంవత్సరాల క్రితం అక్కడదు వచ్చి వారి మధ్యనే ఉండిపోతాడు. స్వచ్ఛందంగా అక్కడి పిల్లలకు చదువు చెబుతూ ఉంటాడు. రాధ చాలా బాగా చదువుతుందని ఆమెని ప్రోత్సహిస్తాడు. మెట్రిక్ పరిక్షలో స్కూలు ఫస్ట్ వచ్చిన రాధకు స్కాలర్షిప్ కూడా వస్తుంది. ఊరికి ఆరు కిలోమీటర్ల దూరంలో కాలేజి ఉంటుంది. రాధను అంత దూరాన హాస్టల్లో ఉంచి చదివించే స్తోమత నకుల్‌కి ఉండదు. అందువలన రాధ ప్రతి రోజు పక్క ఊరికి నడిచి వెళూతూ కాలేజి చదువు మొదలెడుతుంది.
వయసుకు వచ్చిన రాధ రజత్‌ల మధ్య చనువు పెరగడం నకుల్ గమనిస్తాడు. ఇద్దరి కులాలు వేరు అయినందు వలన ఈ చనువు ఇద్దరికీ మంచిది కాదని నకుల్‌ని హేంధర్ సంరక్షణలో దూరంగా పెడతాడు. కాని వీరిద్దరి మధ్య స్నేహం మాత్రం ఎప్పటిలానే ఉంటుంది. రాధ రజత్ని అతని ఇంటికి వెళ్ళి కలుస్తూనే ఉంటుంది.
కాలేజీలో రాధ తన తెలివితో, చొరవతో అందరి మన్నన పొందుతుంది. ప్రొఫెసర్లందరూ ఆమెను ఇష్టపడతారు. మహంతా అనే ప్రొఫెసర్ రాధను ప్రత్యేక దష్టితో చూస్తూ ఉంటాడు. ఇతనికి పెద్దగా కుల పట్టింపులు ఉండవు కాబట్టి రాధ ఊరికి వచ్చినప్పుడు ఆమె ఇంటికి కూడా వస్తాడు. రాధ మొదటి నుండి సమయం ఉన్నప్పుడల్లా మేనమామకు సహాయం చేస్తూ ఉంటుంది. ఊరి అమ్మాయిలతో చేపలు పట్టడానికి వెళుతుంది. అత్తకు ఆరోగ్యం బాలేకపోతే అవి అమ్మడానికి సంతకు కూడా వెళుతుంది. అక్కడ కనిపించిన తన కాలెజీ ప్రొఫెసర్లను పలకరిస్తుంది కూడా. తన కులాన్ని, కుటుంబ వత్తిని దాచాలని ఆమె ఎప్పుడూ ప్రయత్నించదు. తనను తాను ఎక్కడా తక్కువ చేసుకోదు. ఈ ఆత్మగౌరవం మహంతను ఆకర్షిస్తుంది. అదే కాలేజీలో ప్రొహెసర్ నరేన్ దత్తా కూడా పని చేస్తూ ఉంటాడు. ఎవరితో ఎక్కువ మాట్లాడని ఇతను విపరీతంగా చదువుతాడు. ప్రతి విషయాన్ని సామాజిక దష్టితో చెప్పి విశ్లేషించగల ఇతనంటే రాధకు చాలా గౌరవం. ఆమెపై నరేన్ దత్తా ప్రభావం ఎక్కువ ఉంటుంది. రాధ తక్కువ కులాన్ని గేలిచేసే వారు, ఆమెను తమ వైపు ఆకర్షించేలా చేయాలని ప్రయత్నించి విఫలం అయిన జమునా హజారికా కొడుకు, ఆమె ఆ ఇద్దరు ప్రొఫెసర్లతోనూ సంబంధం పెట్టుకుందని ఊరంతా ప్రచారం చేస్తారు.
రాధను ప్రేమించే రజత్ ఇది విని తట్టుకోలేకపోతాడు. రాధ మొదటి నుండి స్వతంత్ర భావాలున్న యువతి. ఆమె రజత్ని కలిసి అతనికి ఇవన్నీ కట్టుకథలు అని స్పష్టంగా చెబుతుంది. ఆమె వెంటపడుతున్న హజారికా కొడుకుపై రజత్ తరువాత చేయి కూడా చేసుకుంటాడు. కాని రజత్‌లో అతి మంచితనం ఎంత ఉన్నా, చాలా త్వరగా ఇతరుల మాటలను నమ్మేస్తాడు. పైగా రాధ స్వతంత్ర వ్యక్తిత్వం అతనికి కొత్త. ఇలాంటి స్త్రీలు ఆ ఊరిలో ఎవరూ లేనందున రాధ పట్ల అతనికి కొన్ని అనుమానాలుంటాయి. కాని రాధ చాలా ఓపికతో అతనికి దగ్గరయే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఆ ఆందోళన అంతా కూడా తన పట్ల ఉన్న ప్రేమ అని రాధే రజత్‌కు వివరిస్తుంది. అతనిలో ఆలోచన పెంచే ప్రయత్నం చేస్తుంది. ఇంతలో ఊరిలో కలరా మొదలయి మరణాలు సంభవిస్తాయి. తన దగ్గరి వారి మరణం రాధ జీర్ణించుకోలేకపోతుంది. కాలేజి ప్రొఫెసర్ల సహాయంతో ఆ ఊరిలో హెల్త్ కాంప్ పెట్టి అందరికీ ఇంజెక్షన్లు ఇప్పిస్తుంది. ఆ ఊరిలో ఇంకెవరూ మరణించకుండా జాగ్రత్త పడుతుంది. ఊరి పట్ల రాధ చూపే శ్రద్ధ అందరినీ ముగ్దులను చేస్తుంది.
ఈ లోపల ఊరి గొడవలకు మద్యమే కారణమని ప్రతిపాదన తీసుకొస్తూ జమునా హజారికా, అతని కొడుకు మద్య నిషేధం పేరుతో యువతను ఒకటిగా కలుపుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. రాధకు ఊరివారి మధ్య పెరుగుతున్న ప్రాపకం దెబ్బతీయాలన్నది వీరి ముఖ్య ఉద్దేశం. దీనితో పాటు వారికున్న మద్యం ఫాక్టరీ విక్రయాలు పెంచుకోవాలనే స్వార్ధం కూడా ఈ ఆలోచన వెనుక ఉంటుంది. రజత్ ఈ ఉద్యమం పట్ల ఆకర్షితుడవుతాడు. జమునా హజారికా మంచి పని చేస్తున్నాడని దీని వలన ఊరికి మంచి జరుగుతుందని అతను నమ్ముతాడు. అప్పటికి జమునా హజారికాకు స్వంతంగా ఓ మద్యం షాపు ఉన్నదని ఎవరికీ తెలియదు. ఊరిలో యువకులు ఒకటయి ఊరిలోని మద్యం దుకాణాలను ధ్వంసం చేస్తారు. రాధ ఈ పనికి ముందే రజత్ ను హజారికాతో కలవ వద్దని, దీని వెనుక ఏదో కుట్ర ఉండి ఉంటుదని, కాస్త ఆలోచించమని జమునా హజారికా ఏ పని చేసినా తన స్వార్ధం కోసమే చేస్తాడని చెప్పే ప్రయత్నం చేస్తుంది. కానీ ఆవేశంలో ఉన్న రజత్, అతని మిత్ర బందం రాధను నమ్మరు. ఊరి వాళ్ళవి, ముఖ్యంగా పేదవారి మద్యం దుకాణాలను ధ్వంసం చేసిన తరువాత రజత్‌కు జమున హజారికా దుకాణం గురించి తెలుస్తుంది. ఆ ఒక్క దుకాణం ధ్వంసం చేయకుండా ఉద్యమం పేరుతో వ్యాపారాన్ని పెంచుకున్న హజారికా పన్నాగం బైటపడిన తరువాత రజత్ వారి నుండి విడిపోతాడు. రజత్ రాధలను విడదీయాలని అనుకున్న హజారికా దీనితో నిరుత్సాహపడతాడు. రాధ తల్లి మంచిది కాదని ఆమె ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తాడు.
రాధ మేనమామ ఆమె తల్లి గురించి చెబుతాడు. ఆమె చాలా మంచిదని, అనుమానపు భర్తతో నరకం అనుభవించేదని, ఆ బాధతోనే మరణించిందని హేంధర్ కూడా చెబుతూ ఆ ఊరి స్త్రీల బానిస జీవితాలను వివరిస్తాడు. తాను ఓ అమ్మాయిని ప్రేమించానని, ఆమెను వివాహం చేసుకోవాలని ఈ ఊరికి వచ్చానని, కానీ తమ కులాలు వేరయిన కారణంగా ఆమె వివాహం మరొకరితో జరిగిందని, ఆమెను మర్చిపోలేక తాను ఆ ఊరిలోని ఉండిపోయానని చెబుతాడు. రాధకు ఈ కుల వివక్షలోని మరో కోణం అర్థం అవుతుంది. హేంధర్ ప్రేమించిన స్త్రీని జమునా హజారికా తరువాత వివాహం చేసుకున్నాడని, ఆమె అర్ధం చేసుకుంటుంది. మరో పక్క రాధను తమతో కలుపుకుంటే ఊరందరితో బంధుత్వం ఏర్పడుతుందని జమున హజారికా తన కొడుక్కి ఆమెతో వివాహం జరిపించాలాని అనుకుంటాడు. జమునా హజారికా భార్య కూడా ఇలాంటి పన్నాగం తప్పని చెబుతుంది. రాధ ఈ ప్రతిపాదనను తిరస్కరిస్తుంది.
ఈలోపు భయంకరమైన వరదల మధ్య ఊరికి అపారమైన నష్టం కలుగుతుంది. అది ఆ పేదలకు కోలుకోలేని దెబ్బ. అన్ని సంవత్సరాలు ఊరికి డామ్ కడుతున్నానని పనులు చేస్తున్న హజారికా మోసం మళ్ళీ బైటపడుతుంది. డామ్ పేరుతో లక్షలు నొక్కిసిన తరువాత ఆ డామ్ కాస్త వానకే కూలిపోతుంది. దీని వలన నష్టం ఇంకా ఎక్కువవుతుంది ఊరి వారికి. హజారికా కొడుకు మహిధర్ ఆ డామ్‌ని కూల్చివేసి మళ్ళీ ఆ ఊరిలో డామ్ కట్టవలసిన అవసరాన్ని కల్పిస్తాడు. దీని వలన ఆ ఊరిలో మరి కొన్ని సంవత్సరాలు డామ్ కడుతూ, డబ్బు దండుకునే అవకాశాన్ని వారు తిరిగి సష్టించుకుంటారు. ఇక ఆ ఊరి వరద భాధితుల సహాయానికి ప్రొఫెసర్ మహంతా ఫ్లడ్ రిలీఫ్ కార్యక్రమాల పేరుతో స్టూడెంట్లతో కలిసి వస్తాడు. వారికి మునిగిపోయిన ఆ ఊరు, అక్కడి బీదల పాట్లు కన్నా కూడా ఊరి పచ్చదనం ఆకట్టుకుంటుంది. పిక్నిక్కి వచ్చినట్లు తెచ్చుకున్న తిండ్లు తింటూ ప్రకతిని ఆస్వాదిస్తూ ఆనందిస్తున్న వారిని చూసిన రాధకు తన కర్తవ్యం అర్ధం అవుతుంది. ఇతరుల వ్యధ మరొకరికి కథ అని తమ బాధను ఎవరికీ పట్టవని, ఈ వరదల పేరుతో ఆ ఉరి ధనికులు తమ వ్యాపారాలను ఓ పక్క విస్తీర్ణం చేసుకుంటుంటే, శరణార్ధుల సహాయం కోసం వచ్చిన వారికి ఇది పిక్నిక్లా ఉండడం ఆమెలో తీరని వేదనను కలిగిస్తుంది. ఆ ఊరి ముందు పారుతున్న నది ముందు నిలుచుని ఆలోచనలలో పడిపోయిన రాధకు ప్రొఫెసర్ నరేన్ దత్త చెప్పిన విషయం గుర్తుకువస్తుంది. ''నువ్వు బాధపడ్డావు, నేను బాధపడ్డాను, మనమే మన ఆత్మగౌరవం కాపాడుకోవాలి, దాని కోసం కలిసి పోరాడాలి''.
బాధి తుల నుండే సమాజాన్ని బాగు చేసే సంస్కర్తలు బైలు దేరాలి. మన బాధలతో సంబంధం లేని వారికి, మన బాధల వెనుక విషాదం అర్థం కాదు. అందుకే ఎవరో మనకొచ్చి ఏదో చేస్తారన్న ఆశను వదులుకోవాలి. పీడనను అనుభవించిన వారికే దానిలోని విషాదం అర్థం అవుతుంది. వారే తమను తాము సంఘటిత పరుచుకుని ఉద్యమించాలి. అన్నీ అనుకూలంగా ఉన్న వారు మనతో కలుస్తారని, మనకోసం వస్తారన్న భ్రమ నుండే బైటపడాలి. మన సమస్య మనకు మాత్రమే ముఖ్యం, అది మన వ్యక్తిగతం, మన అస్థిత్వం. దీని కోసం మనమే పోరాడాలి. ఆ దిశగా రాధ రజత్‌లు కలిసి పని చేయాలన్న అవగాహనను తమ జీవిన పరిస్థితులను, ఈ పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకునే వర్గాలను చూసిన తరువాత ఏర్పరుచుకుంటారు.
అస్థిత్వ పోరాటాల వెనుక ఉన్న అవసరాన్ని, ఆ పోరాటాలకు సంబంధించిన ఎన్నో ఇతర ప్రశ్నలకు జవాబులు ఇవ్వగలిగే కధాంశం ఇది. పీడిత వర్గంలో రావలసిన మార్పును సూటిగా సూచించిన చిత్రం ఇది. 'జాదూమోని దత్తా' దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రాధ పాత్రను పోషించిన నటి పేరు 'ఐమీ బారువా'. ఈ సినిమాకు అసామీ ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డు లభించింది. అతి గొప్ప కథాంశంతో ఎన్నో విషయాలను చర్చకు పెట్టిన ఈ సినిమాలో రాధ వ్యక్తిత్వం అందరినీ ఆకట్టుకుంటుంది. అందువలనే ఈ సినిమాలోని రాధ పాత్రను భారతీయ సినిమాలో మరో అసాధారణ స్త్రీ పాత్రగా ఎంచవచ్చు. అవినీతి, దోపిడిలకు ఎదురు తిరిగే శక్తి ఉన్న యువత ప్రయాణం ఏ దిశగా ఎటువంటి నిబద్దతతో నియంత్రణతో, ఆలోచనతో జరగాలో చెప్పిన అద్భుత చిత్రం ఇది.
- పి.జ్యోతి, 9885384740