Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారత జాతీయోద్యమం ఒక ఉద్గ్రంథమైతే, తెలంగాణ స్వాతంత్య్రోద్యమం అందులో ప్రధాన అధ్యాయం. ఈ అధ్యాయం మిగతా రాజాస్థానాల అధ్యాయం కన్నా భిన్నాతిభిన్నమైంది. కారణం, ఒక నిరంకుశ ప్రభుత్వాధీనంలో మరో నిరంకుశ ప్రభుత్వం ఉండడం. ఒక నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన భారత స్వాతంత్య్రోద్యమమే అంత భీకర సాహసావంతమైనదైతే, ఇక రెండు నిరంకుశ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్య్రోద్యమం ఇంకెంత భీకరమై ఉంటుందో అతి సునాయాసంగా ఊహించవచ్చు.
ఈ రెండు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా సాగిన మహౌన్నత ఉద్యమమే తెలంగాణ స్వాతంత్య్రోద్యమం లేదా హైదరాబాదు సంస్థాన స్వాతంత్య్రోద్యమం. ఇందులో కడు బీదల నుండి గడీలలో బ్రతికే అదష్టవంతుల వరకు దాదాపు అందరు పాల్గొన్నారు. గ్రామసీమ అని, గిరిజన గూడెం అని భేదం లేకుండా అన్ని వర్గాల, అన్ని ప్రాంతాల ప్రజలు పాల్గొన్నారు. ఈ ఉద్యమాన్ని కొందరు సాయుధ పోరాటం అన్నారు. మరికొందరు నిజాం వ్యతిరేక పోరాటం అన్నారు. పోరాటా నికి పేర్లేవి పెట్టుకున్న ఆ పోరాటానికున్న అంతిమ లక్ష్యం మాత్రం స్వాతంత్య్రాన్ని సాధించడమే. ఈ స్వాతంత్య్రాన్ని సాధిం చేందుకు అనేక మంది పాల్గొన్నారు. వారిలో ఒకరే జువ్వాడి గౌతమ రావు.
జననం
జువ్వాడి గౌతమరావు ఫిబ్రవరి, 1 , 1929 లో కరీంనగర్ మండలంలోని ఇరుకుళ్ళ గ్రామంలో జన్మించాడు. కరీంనగర్ పట్టణంలో విద్యాభ్యాసం సాగించాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బి.ఏ. ఎల్.ఎల్.బి. పట్టా పొంది ఆ తర్వాత ఎం.కాం చేశాడు.
స్వాతంత్య్రోద్యమం
జువ్వాడి గౌతమరావు నిజాం ప్రభుత్వాన్ని నిరసించి స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నాడు. ఆనాడు నిజాంకు ప్రతికూలంగా పోరాడటానికి మైదాన ప్రాంతాలు అనుకూలం కావని గ్రహించిన తీవ్ర పోరాట స్వభావమున్న వారు సంస్థాన సరిహద్దులలోకి వెళ్లి క్యాంపు వేసేవారు. ఈ క్యాంపు ద్వారా నిజాం సైన్యాన్ని, పోలీసులను ఎదుర్కొని తమ ఉద్యమాన్ని కొనసాగించారు. అలా హైదరాబాదు సంస్థాన ఉత్తర వాయువ్యంలోని చాందాలో వేసిన క్యాంపులో గౌతమరావు పాల్గొన్నాడు. ఈ చాందా పోరాటంలో పాల్గొన్న కారణంగా పోలీసులకు చిక్కి రెండేళ్ళు ఖైదుగా జైలు శిక్షకు గురయ్యాడు. ఉద్యమ సమయంలో ఔరంగాబాద్ జైలు గోడలను పగులకొట్టి బయటపడ్డాడు.
గౌతమరావు మొదట జాతీయ భావాలను కలిగి స్వాతంత్య్రాన్ని ఆ భావజాలంలోంచే కోరాడు. అనంతర కాలంలో సోషలిస్టుగా మారాడు. కారణం బహుశా, నాడు జమీందారుల, దోపిడీదారుల ఆగడాలు అధికమైన చోట జాతీయ భావాలతో స్వాతంత్య్రాన్ని పొందలేమని భావించి ఉండవచ్చు. ఈ కారణంగానే సోషలిస్టుగా మారి సామాన్య ప్రజల సంక్షేమమే ప్రధానమని విశ్వసించాడనుకోవచ్చు.
సాహిత్యం
ఇతను భాషాభిమాని, కవి కూడా. పీవీ. నరసింహారావు, కోవెల.. కవులతో వీరికి సాన్నిహిత్యం ఏర్పడింది. తొలి జ్ఞానపీఠ గ్రహీత విశ్వనాథ సత్యనారాయణకు అత్యంత ఆప్తుడు. రామాయణ కల్పవక్షాన్ని చక్కని గొంతుతో వినిపిస్తూ ప్రేక్షకులు మైమరిచిపోయేలా చేశాడు. ఈ జువ్వాడి గౌతమరావు ఇచ్చిన ప్రోత్సాహంతోనే విశ్వనాథ సత్యనారాయణ కరీంనగర్ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ బాధ్యతలు చేపట్టాడు. ఈ ఇద్దరి మధ్య ఏర్పడినటువంటి సాన్నిహిత్యానికి సంతసించి విశ్వనాథ సత్యనారాయణ ''భక్తియోగ'' అనే పద్య కావ్యాన్ని రాసి గౌతమరావుకి అంకితమిచ్చాడు.
గౌతమరావుకు విశ్వనాథ రాసిన సాహిత్యమంటే ఎనలేని అభిమానం ఉండడంతో పలు పుస్తకాలపై కొన్ని వ్యాసాలు రాశాడు. వాటిలో ''వేయిపడగలలో విశ్వనాథ జీవితం'', ''కల్పవక్షంలో కైకేయి'' అన్న వ్యాసాలు, ''పత్రికా రచన- సాహిత్యం'' అనే సంపాదకత్వం వంటివి కొన్ని. విశ్వనాథ నడిపిన ''జయంతి'' అనే సాహిత్య పత్రికకు గౌతమరావు కొన్నాళ్ళు సారథిగా వ్యవహరించాడు. ఇతను పలు పత్రికలలో వివిధాంశాల మీద రాసిన వ్యాసాలను వెలిచాల కొండలరావు అనే ప్రముఖ విద్యావేత్త, సాహితీవేత్త ''సాహిత్య ధార'' పేరుతో సంకలనాన్ని ప్రచురించాడు.
సాహిత్యంలో ఆనాడు ఆదిలాబాద్ లో సామల సదాశివ, వరంగల్ లో కాళోజి ఎలాగో కరీంనగర్ లో జువ్వాడి గౌతమరావు అలా ఉండేవాడు.
ఈ విధంగా కవిగా, సత్వరమే స్వాతంత్య్ర కావాలని పోరాడిన స్వాతంత్య్ర సమరవీరుడిగా, పాత్రికేయుడిగా భిన్న కోణాలలో జీవితాన్ని గడిపిన జువ్వాడి గౌతమరావు ఎనభై మూడేళ్ళ వయసులో ఆగస్టు 25, 2012 సం.లో మరణించాడు.
- ఘనపురం సుదర్శన్, 9000470542