Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తొంభయ్యవ దశకంలో దాదాపు అన్ని పత్రికలు బాల సాహిత్యం కోసం కొంత భాగాన్ని కేటాయించాయి. నావంటి అనేక మంది ఆ సమయంలోనే పత్రికల్లో రాయడం ప్రారంభించాం. అనేక మంది కొత్త వాళ్లకు, అప్పటికే రాస్తున్న వాళ్లకు 'మొగ్గ' ద్వారా పెద్ద పీట వేసి ప్రోత్సహించిన ఉస్తాద తిరుగనరి వేదాంతసూరి. తెలంగాణ బాల సాహిత్య వికాసంలో ఆయనది ఎన్నదగిన పాత్ర.
తిరునగరి వేదాంత సూరి నవంబర్ 18, 1955న కరీంనగర్ జిల్లా నుస్తులాపూర్‌లో పుట్టాడు. విశ్వనాథ సత్యనారాయణ గారి నవలకు పేరుపెట్టిన 'మ్రోయు తుమ్మెద' వాగు వీళ్ళ ఊరు నుండే పారుతది. అమ్మా నాన్నలు శ్రీమతి ప్రసన్న, రామస్వామి దంపతులు. 'బాలలోకం' మాసపత్రికలో కొంతకాలం, వార్త దిన పత్రికలో ఎక్కువ కాలం ఉద్యోగం చేశారు. తెలుగు బాలలకు అందిన కానుక 'మొగ్గ' ఈయన సృష్టే. ఇప్పటికి నలభై పుస్తకాలు రాసిన వేదాంతసూరి పిల్లల కోసం 'మొలక' పేరుతో మాస పత్రికను తెస్తున్నారు. ఆన్లైన్లో సాగుతున్న ఈ పత్రిక గొప్పతనం ప్రతిరోజు వార్తలను ఎప్పటికప్పుడు తెలపడం.
బాలలకు సాహిత్యం ద్వారా వ్యక్తిత్వ్తవికాసానికి బాటలు వేయాలన్నది సూరి సంకల్పం. అందుకోసం ఆయన వందలాది వ్యాసాలు రాశారు. ప్రతిరోజూ ఒక శీర్షికను నిర్వహించారు. పిల్లలకే కాదు పెద్దలకూ ఉపయోగపడే అనేక విషయాలు తన రచనల్లో తెలిపారు. ఇటువంటి శీర్షికే 'చిన్ని గుండె చప్పుళ్ళు'. మనకు తెలియకుండా పిల్లలతో మనకు నచ్చినట్టు మనం ప్రవర్తిస్తూ ఉంటాం. అది సరైందా కాదా? పిల్లలకు అది నచ్చుతుందా, లేదా? వంటి అనేకానేక విషయాలను ఆయన మనకు అర్థమయ్యేట్టు ఇందులో రాశారు. ఇటువంటిదే సూరి నిర్వహించిన మరో శీర్షిక 'ఒక మంచిమాట'. ఇది ప్రతి శుక్రవారం వచ్చేది. ఇందులో వేలాది మంచి మాటల గురించి, పలకరిపుల గురించి, ఒక చక్కని పలకరింపు ఎటువంటి వ్యక్తిపైనైనా చూపే ప్రవర్తన గురించి వేదాంతసూరి ఇందులో అద్భుతంగా, హత్తుకునేలా వివరించేవారు. ఏఏ మాటలు ఏఏ సందర్భాల్లో వాడాలో, ఆయా మాటలు వాడడం వల్ల కలిగేదేంటో పిల్లలకు అర్థమయ్యేట్లు చెబుతారు వేదాంతసూరి ఇందులో.
'చిన్నారులకు చిట్టి కథలు' పేరుతో బాలల కథలను ప్రచురించారు వేదాంతసూరి. ఇవి పిల్లలకు నీతులతోబాటు లోక రీతులను తెలిపే చిన్నచిన్న కథల సంపుటి. వేదాంత సూరికి బాల సాహితీవేత్తగా ఎక్కువగా పేరుతెచ్చిన ప్తుకం 'అమ్మలోకం'. ఇది అమ్మ గొప్పతనాన్నేకాదు, అమ్మతనాన్ని పిల్లలేకాదు పెద్దలు తెలుసుకునేందుకు ఉపయోగ పడిన పుస్తకం. తిరుగనరి వేదాంత సూరి చేసిన నలభై రచనల్లో 'జయహో!', 'పిల్లలూ మీరెలా ఉండాలి', 'మీ పిల్లల మనసుల్లో ఏముందో తెలుసా' వంటివి బాలలను, వారి మనస్తత్వ్తాన్ని చక్కగా పట్టించే రచనలు. పిల్లల కోసం కథలు, ఉత్తరాలు, వ్యాసాలు, వ్యక్తిత్వవికాస ముచ్చట్లు, నవలలు మొదలుకుని అనేక రూపాల్లో ఆయన తన బాల సాహిత్యాన్ని అందించారు. 'పిల్లల బొమ్మల సంక్షిప్త రామాయణం' కూడా ఈయన రచనలో ఉంది. 'బాల్యంలో మహనీయులు', 'వెలుగుబాట', 'ముందుచూపు' మొదలగునవి వీరి ఇతర బాల సాహిత్య రచనల్లో కొన్ని.
వేదాంతసూరి రచయితగానే కాక అనువాదకులుగా ప్రసిద్ధులు. పిల్ల కోసం అనేక అనువాదాలు చేశారు. సత్యజిత్ రే పిల్లల నవల 'ఫేలూదా సాహసాలు' అనువదించి పత్రికల్లో ప్రచురించారు. నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా కోసం ప్రసిద్ధ హిందీ బాలల కథ 'అనోకే రిష్తా'ను తెలుగులో 'ప్రేమబంధం' పేరుతో అనువదించారు. ఇది తాతా మనవళ్ళ అనుబంధం, ప్రకృతితో మనకుండాల్సిన సంబంధబాంధవ్యాలను వ్యాఖ్యానించే చక్కని కథ. ఇదేకాక మరికొన్ని వీరగాథలను కూడా ఆయన తెలుగులోకి అనువాదం చేశారు.
కొత్త బాల సాహిత్యకారులనే అనేక మందిని తయారే చేసిన తిరుగనరి వేదాంత సూరి అరవై అయిదేళ్ళ వయ్యస్సులో పిల్లల ఉత్సా హంతో, పిల్లల కోసం యింకా రచనలు చేస్తున్నారు. ఇటీవల తరచూ జరుతున్న తన విదేశీయాత్ర అనుభవాలు, చిన్నారి మనవరాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ఆటపాట స్ఫూర్తితో రాసిన బాలల నవల 'ఆ ఇద్దరు'. ఇది కరోనా సమయంలో న్యూజలాండ్లోని ఆక్లాండ్‌లో ఉన్నప్పుడు తన మనవరాళ్ళకు కానుకగా రాసిన రచన. దీని వేదాంతసూరి తన మనవరాళ్ళకే కానుకగా ఇస్తూ వాళ్ళు తెలుగు నేర్చుకుని తమ తాతయ్య తమకోసం రాసింది చదవాలని మనసారా కోరుకుంటాడు. నిజం కదూ! మన పిల్లలు, వాళ్ళ పిల్లలు తెలుగుకు దూరమై ఆంగ్లమాధ్యమాల్లో చదువతుతున్న తరుణంలో మనందరం కూడా మన పిల్లల విషయంలో యిదే ఆశాభావంతో ఉందాం....
జయహో! తిరుగనరి వేదాంతసూరి.
- డా|| పత్తిపాక మోహన్, 9966229548