Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రచయితగా, కవిగా, కాలమిస్టుగా, ఆకాశవాణి ప్రయోక్తగా చిత్రకారునిగా పజిల్స్ నిర్మాతగా, సాహిత్యవేత్తగా సుధామ ప్రసిద్ధులు. వీరి పూర్తి పేరు అల్లంరాజు వెంకటరావు. 1990లో అగ్ని సుధ కవితా సంపుటితో సాహిత్య రంగంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. యువభారతికి సంపాదకులుగా ఉన్న వీరు వృద్ధులకు ఓదార్పు - భరోసా, సాంత్వన కలిగేలా ''వాయిస్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్'' మాస పత్రికలో ''సీ'' నియర్ కబుర్లు పేరిట రాసిన వ్యాసాల్లో ముఖ్యమైన 41 వ్యాసాల్ని ఈ సంపుటిలో అందించారు.
పెద్ది సత్యనారాయణ, యస్.భూమారెడ్డి గారలు చక్కటి ముందుమాటలు రాసారు. వ్యాసాలు వైజ్ఞానిక, విద్య, వైద్య అంశాలతో కూడి ఉన్నాయి. ప్రయోజనకరంగా ఉన్నాయి. ''వైరస్‌పై గెలుపుకు వయసు అవరోధం కాదు'' అన్న వ్యాసంలో సుధామ వయో వృద్ధులకు వైద్య సలహాలూ ఇచ్చారు. కరోనా బారిన పడకుండా మంచి హౌమియో మందు జెల్సిమియమ్ 200 పిల్స్‌ను మూడు రోజులు వాడాలంటారు. 'శరీరం సహకరించిన మేరకు నడక, యోగా, తోటపని వంటి వ్యాయామాలు చేయాలి' అని సూచిస్తారు.
''నిదురలో ఎంతో హాయి''! అంటూ (పేజీ 110) రాసిన వ్యాసం బాగుంది. కవులూ, రచయితలూ మరణించినా వారి రచనల ద్వారా నిలుస్తారు అంటారు. ''అక్షరసేవ'' (పేజీ 127) వ్యాసం బాగుంది.
1వ తేది అక్టోబర్‌ను అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవంగా పాటింపబడుతోంది. ఇది 1991 నుంచి అమలు జరుగుతోంది. (ఐరాస తీర్మానం) ఆ తేది ''అభివృద్ధుల దినోత్సవం కావాలి'' అంటూ (పేజీ 46) రాసిన వ్యాసంలో దేశంలోని 11 కోట్ల మంది వృద్ధుల ఆదరణ గురించి ఎంతో విపులంగా రాసారు. ఈ వ్యాసం పాఠకుల్ని, పాలకుల్ని ఆలోచింపజేస్తుంది. జ్ఞాపకాలు నాటండి - వెచ్చవెచ్చగా జీవనకాలం, రోజువారీ అలవాట్లు, డబ్బు, జబ్బుపాలు కావద్దు, తలపోతల వ్యాయామం లాంటి వ్యాసాలు ఎంతో ప్రామాణికమైనవి. వృద్ధులకు మనోధైర్యం కల్గించే వ్యాస సంపుటి కర్త సుధామ అభినందనీయులు.
జీవన సంధ్య
రచన : సుధామ
పీజీలు : 144, వెల : రూ.120/-
ప్రతులకు : ఏ.ఉషారాణి,
ఇ.నెం. 107 , రాజపుష్ప ఆట్రియ,
కోకాపేట, హైదరాబాద్ - 075,
సెల్ : 9849297958
- తంగిరాల చక్రవర్తి , 9393804472