Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'అచ్చచ్చర పిల్లవాడు - చిచ్చర పిడుగే / అచ్చమైన ఊరిలోన - బుచ్చిబాలుడే' అనే పాట పది పన్నెండేండ్ల నుంచి అయిదో తరగతి చదుకునే పిల్లలందరికి నోటికి వస్తది. కారణం ఆ పాటలోని భాష, భావం, సోకు, సోగసు అన్నీ అటువంటివి. ఈ పాటను రాసింది 'భూపాల్' పేరుతో పరిచయమైన కవి, కథా రచయిత, ఉద్యమకారుడు, ప్రజా కళాకారుడు, కార్యకర్త, సినీ హీరో, బుల్లితెర, రంగస్థల నటులు, బాలల కోసం నిరంతరం తపించే బాల సాహితీవేత్త డా. ముకుందం గారి భూపాల్ రెడ్డి.
తెలుగు నేల మీద తలెత్తిన ప్రతి ఉద్యమానికి ముందూ వెనుక నిలిచి, ఆంధ్రప్రదేశ్ జన నాట్య మండలి కళాకారుడు. డా.భూపాల్ అనగానే పిల్లలకు పై పాట ఎట్ల గుర్తుకొస్తదో పెద్దలకు 'జగిత్యాల దిక్కు సూడురో-అన్నయో/ సిరిసిల్ల దిక్కు సూడురో-అన్నయో', 'ఎల్తున నే నెల్తున/ పోరుసేయ నెల్తున' వంటి పాటలు స్మృతి పథంలో మెదుల్తాయి. డా. భూపాల్ హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో జులై 4, 1953న పుట్టిండు. ముకుందంగారి అంబమ్మ-రాంరెడ్డి తల్లితండ్రులు.
కథా రచయితగా డా.భూపాల్‌కు పేరుతెచ్చిన పుస్తకం 'అంబల్ల బండ'. ఇవి పెద్దల కథలైనా ఇందులోని దాదాపు అన్ని కథల్లో పిల్లలే కనిపిస్తారు. వివిధ ఉద్యమాలకు ఊపిరిగా రాసిన పాటలు 'ఎన్నేలలో...' పేరుతో అచ్చయ్యింది. నాట్ల పాటల పుస్తకం 'కన్నీటికథ'ను జన నాట్య మండలి ప్రచురించింది. ఇవేకాక మరికొన్ని వివిధ పాటల పుస్తకాలు అచ్చయ్యాయి. డా.భూపాల్ తెలంగాణ నుండి జాతీయ స్థాయి లో గుర్తింపు పొందిన సీనీహీరో. యాభై యేండ్ల కింద వచ్చి 'మా భూమి' నుండి నిన్నటి 'దాసి' వరకు నటిం చాడు. గోండు వీరుడు 'కొమురం భీం' సినిమాకు హీరోగా అనేక ప్రశంసల నందుకున్నాడు. ఇంకా టి.వి కోసం అనేక సీరియల్లలో నటించిండు.
డా.భూపాల్ అనేక ఉద్యమాలతో మమైకమై ఉన్నప్పటికీ నిరంతరం పిల్లలతో ఆడిపాడిండు. అనేక నాటికలు రాసి పిల్లలతో వేషం కట్టించి వేయించిండు. నిరంతరం పిల్లల కోసంమే ఆలోచించిండు. తన రచనల్లో ప్రధాన భాగం పిల్లల కోసం రాశిండు. గిరిజన వీరుడు 'కొమురం భీం' కథను బాలల నవలగా రాసిండు. 'వస్తావా పోతావా చిలకల్ల కొలికి', 'గుడుగుడు గుంచం', 'భూంపాప పాటలు' పిల్లలకోసం రాసిన చిట్టిపొట్టి పాటల సంపుటాలు. భూంపాప పాటలు ఆంధ్రజ్యోతి ఆదివారంలో దాదాపు నూటా యాభై వారాలు వచ్చినయి. యిటీవల వచ్చిన 'గోరంత దీపం' మరో మంచి పిల్లల పాటల పుస్తకం.
'రాయి దేవుడు', 'ఎవరిపని వాళ్ళది', 'ఎలా దాటాలి?', 'గాలికి ఎంతబలం' వంటి విజయవాణి వారి ఊహాపుస్తకాలకు డా.భూపాల్ అందించిన కాన్సెప్ట్ విలక్షణమైంది. మాటలులేని ఈ బొమ్మల పుస్తకాల బాలల ఊహాలోకానికి గొప్ప ఆకరాలుగా నిలిచాయి. 'కొత్త బ్యాగ్', 'ఉగ్గుపాలు' వీరి కథా సంపుటాలు. ఈ ఉగ్గుపాలు కథల పుస్తకానికే 2011లో కేంద్ర సాహిత్య అకాడమి బాల సాహిత్య పురస్కారం వచ్చింది. ఇవేకాక 'మనబడి', 'క్రమశిక్షణ', 'ముద్దుముచ్చట', 'తాతా మనవడు', 'బొమ్మలు బల్లచెక్క' వంటి మరికొన్ని పుస్తకాలు ప్రచురించారు. ఇటీవల తానా వారి బహు మతి పొందిన ప్రచురించ బడిన నవల 'గుడ్డేలుగు గుమ్మి మారెమ్మ'. పొట్లపల్లి రామారావు రచనలపైన పిహెచ్.డి చేశారు.
తన పాటల్లో తెలంగాణ పిల్లల భాషకు పెద్దపీట వేసిన డా.భూపాల్ ప్రతి రచన పిల్లల స్థాయికి ఎదిగి రాసాడు. అందుకు అనేక పాటలు ఉదాహరణలుగా నిలుస్తాయి. 'రోడ్డు దాటే బుజ్జి మేక / ఏమి చేసెను?/ కుడి ఎడమ కుడికి / మూడుసార్లు జూసెను/ వచ్చిపోయె వాహనాల/ అడ్డు పడకనూ!/ ముచ్చటగా రోడ్డు దాటి/ వెళ్ళిపోయెను' అన్నపాట చదవగానే పిల్లలకు కంఠతా వచ్చుడే కాక ఎన్నో విషయాలును నేర్పుతుంది. డా.భూపాల్ పాటలన్నీ, మాటలన్నీ లయాత్మకాలై నిలుస్తాయి గనుకనే అవి అందరికీ నచ్చుతాయి. చిన్న విషయాలను, పెద్ద ముచ్చట్లను ఎంత సులభంగా, సరళంగా చెప్పాల్నో ఈయనకు తెలిసినంతగా యితరులకు తెలవదనిపిస్తుంది. 'పల్లానికి / పారె నీరు / మల్ల లేదు/ కనుకనె!/ సమయం / పాటించనోడు/ ఎప్పటికీ/ వెనుకనె' అని చెప్పినా, 'కొమ్ములున్న జింక అంటే దుప్పీ దుప్పీ / చెరుకుగడ నములుతుంటె పిప్పీ పిప్పీ/ చిట్టి కుక్క పిల్లనంట పప్పీ పప్పీ/ పొట్ట పగుల తిండి తింటె నొప్పీ నొప్పీ', 'ఒకటీ రెండు మూడు / మురికి గుంటలూ పాడు / దోమలకు అవి గూడు / మలేరియాకు తోడు', 'గొడుగు వేస్తె-కొట్టలేవు / ఎండో ఎండో/ గొడుగు పడితె తడపలేవు-వానో వానా!/ గొడుగు విప్పితె- విరిచినావు/ గాలో గాలి!' వంటివి డా.భూపాల్ బాల లయలకు మచ్చుతునకలు. బాలల కోసం నిరంతరం తపించే బాలల ఆటపాటల 'జనకవి' డా.భూపాల్.
- డా|| పత్తిపాక మోహన్, 9966229548