Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యోధులు ఆత్మకథలు రచిస్తే యువకులు వీరులుగా తయారవుతారు. కవులు ఆత్మకథలు రచిస్తే పాఠకులు రచయితలవుతారు. నాయకులు ఆత్మకథలు రచిస్తే అభిమానులు కార్యకర్తలుగా మారుతారు. ఇలా ఒక యోధుడు తన ఆత్మకథతో తన జీవితాన్ని కాబోయే వీరుల ముందు ఉంచాడు. అతనే ఎం.ఎస్. రాజలింగం. గాంధేయవాదిగా స్వాతంత్య్ర సమరంలోకి ప్రవేశించిన ఇతను ఫిబ్రవరి 9, 1919 సం.లో వరంగల్ పట్టణంలో జన్మించాడు. వరంగల్లులోని హైస్కూలులో మెట్రిక్ చదువుకున్నాడు. 1935లో నిజాం కాలేజిలో బి.ఎస్.సి., ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎల్.ఎల్.బి. చేశాడు.
స్వాతంత్య్రోద్యమం
నిజాం కాలేజిలో చదువుకున్నపుడు విద్యార్థి ఉద్యమాలకు నాయకత్వం వహించాడు. విద్యార్థిగా ఉన్న రోజులలోనే రాజకీయాలలో చురుకుగా పాల్గొనేవాడు. ఈ రాజకీయాలు సాహిత్యం రూపంలో ఉండేవి. సాహిత్య కార్యక్రమాలలో పాల్గొని ప్రజలను మేల్కొల్పేవాడు. ఈ క్రమంలో ఆయనపై ప్రభుత్వపు నిఘా పెరిగింది. ఎప్పుడు అరెస్టు చేద్దామా అన్నట్టుగా కాచుకొని ఉన్నారు. కాని రాజలింగం ఎవరి కంట పడకుండా పిట్టల దొరలు ధరించే వేషంలో హైదరాబాదు వదిలి వార్థా చేరుకున్నాడు. 1940లో అక్కడ వార్థాలోని గ్రామీణ పరిశ్రమకు సంబంధించి శిక్షణ తీసుకున్నాడు. ఈ శిక్షణ జె.సి. కుమారప్ప ఆధ్వర్యంలో సాగేది. 1942లో మహాత్మాగాంధీ ప్రారంభించిన క్విట్ ఇండియా ఉద్యమం హైదరాబాదులోనూ జరిగింది. ఇందులో పాల్గొన్న ఎం.ఎస్. రాజలింగం అరెస్టయ్యాడు. భారత్ స్వాతంత్య్రానికి ఒక ఏడాది ముందు ఓరుగల్లు పట్టణంలో జాతీయ జెండాను కాంగ్రెసు నాయకులు ఆవిష్కరించారు. ఈ సంఘటను చూసి జీర్ణించుకోలేని జాతీయ భావాల ప్రతికూల శక్తులు బత్తిని మొగులయ్య అనే అతన్ని హత్య చేశాయి. ఈ జెండా ఆవిష్కరణ, మొగులయ్య హత్య విషయాన్ని పత్రికల వారు ప్రచురించేలా రాజలింగం కషి చేశాడు. ఈ విషయాన్ని గ్రహించిన ప్రభుత్వం ఆయనను వరంగల్ నుండి బహిష్కరించింది. అనంతరం అరెస్టు చేసి వరంగల్ జైలు నుండి చంచల్గూడా జైలుకు తరలించారు. మహాత్మాగాంధీ 1946లో వార్థాకు వెళ్ళేముందు నిజాం రాష్ట్రంలో ఆగాడు. అలా గాంధీ వస్తున్న రైలు మధిరకు రాగానే గాంధీ వెంట ఆంధ్ర జాతీయపక్ష వరంగల్ కార్యదర్శి రాజలింగం కూడా ఉన్నాడు. ఈ రాజలింగం గాంధీకి అత్యంత సన్నిహితుడు కావడంతో ఆయన చెప్పగానే గాంధీ కాదనకుండా ఖమ్మం, వరంగల్‌లో ఆగాడు. అలా గాంధీ రైలు దిగగానే ఎం.ఎస్. రాజలింగం, శ్రీ హయగ్రీవాచారి, భండారు చంద్రమౌలీశ్వరరావు మొదలగు వారు స్వాగతం పలికి హరిజన నిధికి తమ వంతుగా 15,000 రూపాయలను విరాళంగా ఇచ్చారు. ఈ సమయంలో వరంగల్ లో కార్యక్రమాలు ముగించుకొని వెళ్లే ముందు కొండపల్లి ఆంజనేయశాస్త్రి, కనూ గాంధీ, రాజలింగంలు గాంధీకి అంగ రక్షకులుగా ఉండి రైలు ఎక్కించారు.
చందా కాంతయ్య అనే అతని ఆర్ధిక సహాయంతో ఏర్పడ్డ ఆంధ్ర విద్యాభివర్ధిని సంఘానికి రాజలింగం కార్యదర్శిగా పని చేశాడు. తెలుగు వారు ఎక్కడ ఉన్నా వారందరినీ ఓకే చోట చేర్చేలా విశాలాంధ్ర ఏర్పడాలని అనేక మంది కోరారు. అందుకు సఫల ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో 1949-50 లో ఓరుగల్లులో అయ్యదేవర కాళేశ్వరరావు అధ్యక్షతన విశాలాంధ్ర మహాసభ జరిగింది. దీనికి ఇతను కార్యదర్శిగా ఉన్నాడు.
వార్థా నుండి తెలంగాణకు వచ్చి కరీంనగర్ జిల్లా ముస్తాబాద్‌లో వార్థాలో తీసుకున్న శిక్షణా తరగతుల అనుభవంతో గ్రామీణ కార్యక్రమాలను ప్రారంభించాడు. ఇందులో కుటీర పరిశ్రమలు, సేవకు సంబంధించిన పలు కార్యక్రమాలు జరిగేవి. ఇలా నిజాం రాష్ట్రంలో మొట్టమొదటి చరఖా సంఘాన్ని ఏర్పాటు చేశాడు.
1952 ఎన్నికల్లో వరంగల్ నుండి గెలుపొందిన ఏకైక కాంగ్రెసు నాయకుడు రాజలింగం. ఈ ఎన్నికల్లో గెలిచాక బూర్గుల మంత్రి వర్గంలో ఉప మంత్రి అయ్యారు. ఆంధ్రప్రదేశ్ స్వాతంత్య్ర సమరయోధుల సంస్థకు అధ్యక్షుడిగా ఉన్నాడు.
తెలంగాణ స్వాతంత్య్రోద్యమ కాలంలో గాంధీజీకి అత్యంత ఆప్తుడిగా ఉండి వరంగల్‌కి గాంధీ వచ్చినప్పుడు ఆయన పట్ల సకల విధాలుగా గౌరవాన్ని చూపించడంలో రాజలింగం విజయవంతమయ్యాడు. ఇలా ఎం.ఎస్. రాజలింగం తన యావత్ జీవిత కాలపు విషయాలను భావితరాల వారికి అందించడానికి ఆత్మకథ రాసాడు. ఆ స్వీయ చరిత్రను అనుభవ సంపుటి అని కూడా అంటారు. ఈ విధంగా జాతీయోద్యమంలో మితవాదిగా కొనసాగి భారత స్వాతంత్య్రోద్యమ నాయకుడైన గాంధీ చేత స్వయంగా మెచ్చుకోబడ్డ నాయకుడే మన వరంగల్ ముద్దు బిడ్డ ఎం.ఎస్. రాజలింగం.
- డా. ఘనపురం సుదర్శన్, 9000470542