Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''నిజమైన స్వాతంత్య్రాన్ని పొందాలంటే మూడు పర్వతాలను మానవ సమాజం దాటాలి. భూస్వామ్యవాదం, సామ్రాజ్యవాదం, పురుష దురహంకారం.'' మొదటి రెండు పర్వతాలను దాటడం, ఆ శంఖలాలను తెంచుకుని ముందుకు సాగటం జరుగుతుందేమో కాని మూడవ పర్వతాన్ని మగ అహంకారం దాటనివ్వదు. ఈ స్వేచ్ఛా ప్రపంచం గురించి కలలు కనమని ప్రోత్సహించి, చర్చించి పోరాడే మగవాళ్ళలో కూడా సమయం వచ్చినప్పుడు ఈ పురుష దురహంకారం పైకి లేస్తూనే ఉంటుంది. భూస్వామ్యవాదం, సామ్రాజ్యవాదం కన్నా ఘోరంగా మానవ మనసులలో పాతుకుపోయిన ఈ పితస్వామ్య భావజాలాన్ని వదిలించుకోవడం ఇప్పట్లో జరగదు. ఉద్యమాలలో పని చేస్తూ నిజమైన స్వాతంత్య్రం కోసం కలలు కనే యువకులకే ఇది అసాధ్యమయిన విషయం అయితే ఇక సామాన్య బలహీన పురుషులకు ఇది సాధ్యపడే విషయం కాదు. ఈ సత్యాన్ని పరిచయం చేస్తుంది 1999లో వచ్చిన ''అను'' అనే బెంగాలీ సినిమా. సతరూపా సన్యాల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా స్త్రీల పట్ల పురుష భావజాలం ఎన్ని తరాలయినా నిజంగా మారుతుందా అనే ప్రశ్నను రేపుతుంది.
అనన్య ఒక సామాన్య మధ్యతరగతికి చెందిన అమ్మాయి. ఈమె అన్నయ్య ఉద్యమకారుడు. తోటి ఉద్యమకారులతో కలిసి రహస్యంగా పని చేస్తూ ఉంటాడు. ఈ సినిమా కథౄ నేపథ్యం ఎనభైల ప్రారంభం లేదా డెబ్బైల చివరలో నక్సలైట్ ఉద్యమం బెంగాల్లో ప్రాచుర్యంలో ఉన్నప్పటి సమయానిది. ఈ స్నేహితులలో సుగోతో గొప్ప ఆదర్శవాది. ఆ మిత్రబందం అతన్ని నాయకుడిగా నమ్మి అనుసరిస్తూ ఉంటారు. అనన్య వీరి మధ్య జరిగే సంభషణలో పాలు పంచుకుంటూ ఉంటుంది. సుగోతో స్త్రీ వ్యక్తిత్వం గురించి, స్త్రీ స్వేచ్ఛ గురించి ఆమెలో ఎన్నో ఆలోచనలను రేకెత్తిస్తాడు. స్త్రీల ఆలోచనలలో మార్పు రావాలంటే అపరిమితమైన ఆత్మవిశ్వాసం వారి సొంతం అవ్వాలని, ఆ దిశగా స్త్రీలు తమను తాము సన్నిద్ధం చేసుకోవాలని, వంట ఇంటికే పరిమితం చేసే ప్రపంచాన్ని వారు ఎదిరించాలని, తమ హక్కుల కోసం వారు పోరాడాలని చెబుతాడు. సుగోతో చెప్పిన విషయాలలో అనన్యను విశేషంగా ఆకర్షించే విషయం తమను సరుకుగా చూసే సమాజాన్ని నిరంతరం ఎదిరిస్తూ వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులుగా స్త్రీలు ఎదగాలనే ప్రతిపాదన. ఈ చర్చలతో ఆమెలో చాలా మార్పు వస్తుంది. ఆమె వ్యక్తిత్వం ఇతర స్త్రీలతో పోలిస్తే చాలా మార్పు చెందుతుంది. సమాజంలో తన స్థానం, తన కర్త్యవ్యం అనే విషయాల గురించి ఆమె నిరంతరం ఆలోచిస్తూ ఉంటుంది. తన ఆలోచనలకు ఓ స్పష్టత ఇచ్చిన సుగోతోను తనను ఓ సాంప్రదాయ స్త్రీగా కాకుండా విలువల కోసం పని చేసే వ్యక్తిగా, తనను సరుకుగా కాకుండా మనిషిగా మలచిన మార్గదర్శకుడిగా ఆమె భావిస్తుంది. సుగోతో అదర్శాలను, కలలను, వ్యక్తిత్వాన్ని ఆమె ప్రేమిస్తుంది. సుగోతో కూడా ఆమెను ఇష్టపడతాడు.
ఇంతలో ఉద్యమం తీవ్రమయి పోలీసులు ఉద్యమకారుల కోసం గాలిస్తూ ఉంటారు. ఆ సమయంలో అనన్య తల్లి దండ్రులను పోలీసులు పట్టుకుని వారి నుండి ఈ యువకుల సమాచారాన్ని సేకరిస్తారు. ఈ సంగతి తెలిసి అనన్య సుగోతో నివాసానికి వెళ్ళి అతన్ని పారిపొమ్మని పోలీసులు వచ్చే లోపలే ఆ ప్రాంతం నుండి పంపిస్తుంది. అక్కడి నుండి తన ఇంటికి వస్తుంది. అంతలోనే ఆమె అన్న పోలీసు కాల్పులలో మరణించాడన్న సంగతి వారికి తెలుస్తుంది. ఆ దుఖంలో ఉండగానే సుగోతో ఎక్కడున్నాడో చెప్పమని ఆ వీధి రౌడీలు అనన్యపై దాడి చేస్తారు. ఆమె తల్లిదండ్రుల ఎదురుగానే ఆమెపై అత్యాచారం చేస్తారు. అతి పాశవికంగా గ్యాంగ్‌రేప్‌కు గురయిన ఆమె శరీరం అంతా గాట్లతో, గాయాలతో నిండి పోతుంది. అంత హింసను భరిస్తూ కూడా ఆమె సుగోతో విషయం ఎవరికీ చెప్పదు. స్పహలేని స్థితిలో హాస్పిటల్లో చేరిన ఆమె శరీరం అంతా కుట్లతో సరిచేస్తారు డాక్టరు. భయంకరమైన ఈ గుర్తులు ఆమె శరీరంపై శాశ్వతంగా మిగిలిపోతాయి.
ఈ సంఘటన తరువాత అనన్య కోలుకుంటుంది. సుగోతో అంతకు ముందు ఆమెలో చొప్పించిన ఆలోచనల కారణంగా ఈ 'మానభంగం' అన్న విషయాన్ని పెద్దగా పట్టించుకోదు. తాను శరీరం మాత్రమే కానని, ఒక వ్యక్తినని ఒక ఆలోచనను అని ఆమె బలంగా నమ్ముతుంది. సుగోతో క్షేమంగా ఉంటే చాలని ఆమె అనుకుంటుంది. తిరిగి పార్టీ కార్యకలాపాలలో పాలు పంచుకుంటూ ఉంటుంది. దళ సభ్యులందరూ తలో దిక్కుగా వెళ్ళిపోతారు. ఆమె తల్లిదండ్రులు కూడా ఆమె మార్గాన్ని మళ్లించాలనుకుంటారు. కాని అనన్య వారందరినీ కాదని ఇంటిని వదిలేసి ఒంటరిగా ఓ చిన్న స్కూల్లో టీచరుగా పని చేస్తూ ఉంటుంది. పోలీసుల క్రూరత్వానికి బలయి ఓ కన్ను పోగొట్టుకున్న మరో దళ సభ్యుడు తప్ప ఆమెకు స్నేహితులెవ్వరూ ఉండరు. సుగోతోను ప్రభుత్వం ఈ లోపుల అరెస్టూ చేస్తుంది. అతని విడుదల కోసం అనన్య కష్టపడుతుంది. అతనితో జీవితాన్ని పునఃప్రారంభించాలని కలలు కంటూ ఉంటుంది.
చివరకు సుగోతో జైలు నుండి బైటకు వస్తాడు. జైలు నుండి సుగోతోను తన ఇంటికి తీసుకొని వస్తుంది అనన్య. వచ్చే దారిలోనే అతనితో పాపిడీలో సింధూరం పెట్టించుకుని అతన్ని భర్తగా స్వీకరిస్తుంది. ఇక తాను నమ్మిన ఆదర్శాలకు అను గుణంగా తామిద్దరూ జీవించవచ్చని ఆమె అనుకుంటుంది.
సుగోతో అనన్య చూపే ప్రేమకు కరిగి పోతాడు. ఆమెతో కలిసి జీవితం మొదలు పెట్టాలని అనుకుం టాడు. ఆమెకు సమీ పంగా జరిగిన ప్పుడు, నిండైన బట్టల మాటున ఆమె దాచిపెట్టుకున్న ఆ గ్యాంగ్‌రేప్ సంఘటన గుర్తులుగా ఆమె శరీరం నిండా గాట్లు చూసి షాక్ అవుతాడు. ఇవి ఏమిటీ అని అడిగిన సుగోతోకు తనపై జరిగిన అత్యాచారం గురించి చెబుతుంది అనన్య. ఒక విక్టింలా కాకుండా అది తాననుభవించిన ఓ పీడకలగా ఆమె సుగోతోకి గతం విప్పి చెబుతున్నప్పుడు సుగోతో ఆశ్చర్యపోతాడు. తనను రక్షించే ప్రయత్నంలో ఆమె ఈ అత్యాచారానికి గురయిందన్న విషయం అతను ఆ క్షణం మరచిపోతాడు. శరీరం అంతా రోతగా గాట్లతో నిండి ఉండగా ఆమెతో కలయిక అతనికి ఇబ్బంది కలుగజేస్తూ ఉంటుంది. అతను ఆమెకు దగ్గర కాలేకపోతాడు.
తనకు దూరంగా జరుగుతున్న సుగోతోని చూస్తూ జైల్లో ఉద్యమకారులపై పోలీసుల జులుం చాలా రకాలుగా ఉంటుందని, అది సుగోతో మనసుపై తీవ్ర ప్రభావం చూపించిందని అనుకుంటుంది అనన్య. సుగోతో జైలులో పోలీసుల చేతిలో చిత్ర హింసను అనుభవించాడని ఆమెకు తెలుసు. అందువలన అతన్ని మానసికంగా మామూలు వ్యక్తిని చేయాలని ఆమె ప్రయత్నిస్తూ ఉంటుంది. అతనికి దగ్గరగా ఉంటూ కూడా తాను శారీరికంగా కలవలేకపోతున్నా, ఆమె ఎటువంటి అసంతప్తికి లోనవదు పైగా సుగోతోని మామూలు మనిషిగా మార్చాలని ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తూ ఉంటుంది. చివరకు ఓ సైకియాట్రిస్టుని సంప్రదించి అతని వద్దకు ట్రీట్మెంటుకు సుగోతోను తీసుకువెళడానికి ఒప్పిస్తుంది. ఆ సమయంలోనే ఆమె సుగోతో డైరీ చదువుతుంది.
''అనన్యను ముట్టుకున్న ప్రతిసారి ఆమె ఇతరుల చేతిలో నలిగి ఓడిన శరీరం అన్న విషయం స్పురణకు వచ్చి తానామెతో కలవలేక పోతున్నానని'' సుగోతో డైరీలో రాసుకుంటాడు. మొదటిసారి సుగోతోలోని ఈ పార్శ్వాన్ని అనన్య అనుభవిస్తుంది. చివరకు తాను సుగోతోకి కూడా ఓ శరీరం మాత్రమే అని. ఆ శరీరాన్ని దాటుకుని తనలోని మనసును, తన ప్రేమను, తన వ్యక్తిత్వాన్ని అంతటి ఉద్యమకారుడు కూడా చూడలేక పోతున్నాడని తెలుసుకుని నిర్ఘాంతపోతుంది. నిజమైన స్వాతంత్రం అంటే భూస్వామ్యవాదం, సామ్రాజ్య వాదం, పితస్వామ్యంపై పోరాటంలో గెలవడం అని ఎప్పుడూ చెప్పే సుగోతో ఆ పోరాటాల కోసం ఉద్యమకారుడిగా మారి జైలుకి వెళ్ళి తన జీవితంలో కొన్ని సంవత్సరాలను పోగొట్టుకున్న ఈ ఉద్యమకారుడు స్త్రీ దగ్గరకు వచ్చేసరికి ఆమె శరీరాన్ని దాటుకుని ఆమెను చూడలేకపోవడం, ఆమెపై జరిగిన అత్యాచారంతో ఆమె అతనికి ఓ ఎంగిలి వస్తువుగా మారిందని బాధపడడం చూస్తుంటే అతనిలో పేరుకుపోయిన ఈ పురుషాహంకారం ఆమెను ఆశ్చర్యపరుస్తుంది. సుగోతోని తనను వదిలి వెళ్ళిపొమ్మని చెబుతుంది అనన్య. వెళ్ళిపోతున్న అతన్ని ఆపమని తోటి మిత్రుడు చెబుతున్నప్పుడు, తామిద్దరూ కలిసి కన్న కలల దిశగా తమ జీవన ప్రయాణం జరగట్లేదని, తనలోని ఆ అహంకారాన్ని అతను త్యజించే వరకు కొన్ని వేల సంవత్సరాలయినా తాను ఎదురు చూస్తూనే ఉంటానని, కాని అతనిలోని ఆలోచనలు తెలుసుకున్న తరువాత మరోసారి మానభంగానికి తాను సిద్ధంగా లేనని ఆమె ప్రకటించడంతో సినిమా ముగుస్తుంది.
ఎన్నో ఆదర్శాలను వల్లించే పురుషుడు, స్త్రీని మార్చాలని, వ్యక్తిత్వం ఉన్న మనిషిగా తయారు చేయాలని తాపత్రయపడే నాయకుడు కూడా, తన వరకు వచ్చేసరికి తన జీవితంలోకి వచ్చిన స్త్రీని పితస్వామ్య భావజాలంతోనే స్వీకరిస్తాడు. ఆమె అతని జీవితంలో ఓ సరుకుగానే మారిపోతుంది. చాలా మంది నాయకుల జీవితలలో వారి భార్యల స్థానం అదే. తాను చెప్పే ఆదర్శాలు భార్య స్థానంలో ఉన్న స్త్రీ విషయంలో ఎందుకో పురుషులకు ఆచరించాలనిపించదు. ఈ విషయాన్ని గమనించినప్పుడు, భూస్వామ్యవాదం, సామ్రాజ్యవాదం కన్నా కూడా భయంకరంగా ఈ పితస్వామ్య భావజాలం పాతుకు పోయిందని అనిపిస్తుంది. దీని నుండి సమాజం బైటపడాలంటే ఎన్ని యుగాలు అవ్వాలో అనే విషాదపు ఆలోచనలోకి తీసుకెళ్ళే సినిమా ''అను'' అనన్యను అందరూ అనూ అని పిలవడంతో సినిమాకు ఆ పేరే పెట్టారు దర్శకులు. తనకు ఆ అందమైన స్వేచ్ఛాపూరితమైన ప్రపంచాన్ని పొందాలనే కలను కానుకగా ఇచ్చిన సుగోతో కోసం తాను ఎదురు చూస్తానంటూనే అది ఎన్ని వేల సంవత్సరాలయినా సరే అంటుంది అను. ఈ మాట అంటున్నప్పుడు ఆమె కేవలం అనన్య అనే ఓ స్త్రీ మాత్రమే కాదు. ఇక్కడ ఆమె సమస్త మహిళలకు ప్రతినిధిగా కనిపిస్తుంది. ఎన్ని వేల సంవత్సరాలకయినా అటువంటి స్వేచ్ఛా మార్గంలోకి స్త్రీతో పాటు నడవగలిగే పురుషుడి కోసమే స్త్రీ సమాజం ఇంకా వేచి చూస్తుంది. చూస్తూనే ఉంటుంది.
ఈ సినిమాకు దర్శకత్వం వహించిన సతరూప సన్యాల్ ఓ నటి, కవయిత్రి, సోషల్ ఆక్టివిస్ట్, పారెలెల్ సినిమా దర్శకురాలు, నిర్మాత కూడా. ''అను'' ఆమె మొదటి చిత్రం. అను పాత్రలో నటించిన ఇంద్రాణి హల్దర్ బెంగాలీ భాషలో చాలా గొప్ప నటిగా పేరు పొందారు. ''అను'' సినిమాలో వీరి నటన అకట్టుకుంటుంది.
- పి.జ్యోతి, 9885384740