Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మితవాద కాంగ్రెసు నాయకుడిగా, నిజాం వ్యతిరేకోద్యమంలో స్వాతంత్య్ర సమరయోధుడిగా, వకీలుగా, ప్రజా నాయకుడిగా ఉన్న కొండా వెంకటరంగారెడ్డి 1890 డిసెంబరు 12 న పెద్దమంగళవారం గ్రామంలో జన్మించాడు. ఇది చేవెళ్ళ తాలుకాలో ఉంది. తల్లి బుచ్చమ్మ, తండ్రి చెన్నారెడ్డి. ఇతను వీరి ఊరులోని వీధి బడిలో సొంత ఖర్చుపైన ఉపాధ్యాయున్ని నియమించుకొని బాల్య విద్యను చదివాడు. పై చదువు నిమిత్తం 1906లో హైదరాబాదు వెళ్ళాడు. ఆనాడు హైదరాబాదు పట్టణంలో ఐదవ తరగతిలో రంగారెడ్డి నూటికి నూరు మార్కులు సాధించి ఉపాధ్యాయుడి చేత అభినందించ బడ్డాడు. హైస్కూలు కూడా హైదరాబాదులోనే చదివి మంచి విద్యార్థిగా పేరు పొందాడు. ఆ తర్వాత మౌల్వీ ఇబ్రహీం ఆలీ సాహెబ్ దగ్గర వకీలు చదువు నేర్చుకున్నాడు.
1909లో వకీలుగా వత్తి ప్రారంభించాడు. అప్పటి నుండి 1920 వరకు జిల్లా కోర్టులో, 1920-32 వరకు సెషన్సు కోర్టులో, 1932-40 వరకు రాష్ట్ర హైకోర్టులో ప్రాక్టీసు చేశాడు.
స్వాతంత్య్రోద్యమం
రంగారెడ్డి ప్రజా జీవితం గ్రంథాలయోద్యమంతో మొద లైంది. తెలంగాణ ప్రజా సమూహాన్ని చైతన్యం దిశగా తీసుకు రావడానికి ఈ ఉద్యమం దోహదపడింది. తెలంగాణలో ఆంధ్రమహాసభలు 1930 నుండి జరుగుతూ వచ్చాయి. అలా 1936లో జరిగే ఐదవ ఆంధ్రమహాసభకు షాద్నగర్ వేదిక అయ్యింది. ఈ సభకు, 1943లో హైదరాబాదులో జరిగిన పదవ ఆంధ్ర మహాసభకు అధ్యక్షుడిగా వ్యవహరించాడు. 1918లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తరపున కాంగ్రెసు సమావేశాలలో పాల్గొనే అవకాశం వచ్చింది. తెలంగాణ కాంగ్రెసువాదులంతా సత్యాగ్రహం చేయవలసిందిగా కమిటీ తరపున ప్రచారం చేశాడు. ఇలా ప్రచారంలో భాగంగా నల్గొండ నుండి హైదరాబాదు వచ్చాక రెడ్డి సత్యాగ్రహ ప్రకటనను చూసి ప్రభుత్వం అరెస్టు చేసి జైలుకి పంపించింది. ఇలా రంగారెడ్డి జైలులో 2 నెలల 10 రోజులు జైలులో ఉన్నాడు. ఆనాడు కాంగ్రెసుకు, స్వాతంత్య్ర కాంక్షతో ఉన్న ప్రజల ఆదరణ అధికంగా ఉన్నదని గ్రహించి వారి దష్టిని మరల్చడానికి ప్రభుత్వం రాజకీయ సంస్కరణలను ప్రవేశపెట్ట చూసింది. ఈ సమయంలో రెడ్డి, మాడపాటి హనుమంతరావులు ఈ సంస్కరణలను బహిష్కరించారు. ఈ బహిష్కరణ సభలో ముస్లిం పౌరులు వీరిపై రాళ్ళు రువ్వారు.
రెడ్డి స్వాతంత్య్రానంతరం భూదానోద్యమంలో కూడా పాల్గొన్నాడు. వెదిరె రామచంద్రారెడ్డి దానంగా ఇచ్చిన భూమిని పంపిణీ చేసేందుకు ఏర్పడ్డ కమిటీలో రంగారెడ్డి కూడా ఉన్నాడు. సత్యాగ్రహ ఉద్యమం సమయంలో కాంగ్రెస్ పార్టీలో వచ్చిన వివాదాలను పరిష్కరించడానికి జవహర్లాల్ నెహ్రు హైదరాబాదు వచ్చినప్పుడు ఆయనకు సమస్యను విన్నవించి ఆయన దష్టిలో పడ్డాడు.
రాజకీయ సేవ
సైనిక ప్రభుత్వం, పౌర ప్రభుత్వం తర్వాత హైదరాబాదులో ప్రజా ప్రభుత్వం ఏర్పడింది. బూర్గుల రామకష్ణారావు ముఖ్య మంత్రిగా ఉన్న ఈ ప్రభుత్వంలో కొండా వెంకట రంగారెడ్డికి మంత్రిమండలిలో చోటు దక్కింది. ఆయన ఎక్సైజు, కస్టమ్స్, అటవీ శాఖల మంత్రిగా నియా మకం అయ్యాడు. వెల్లోడి ప్రభుత్వ రూపకల్పన తర్వాత రెడ్ది తెలంగాణ కాంగ్రెస్కు అధ్యక్షుడిగా ఉన్నాడు. తెలంగాణకు రాజకీయ ప్రయోజనాల విషయంలో ఒక ఒప్పందం జరిగింది. అదే పెద్ద మనుషుల ఒప్పందం. ఇది 1956 ఫిబ్రవరి 20న డిల్లీలో జరిగింది. ఇందులో తెలంగాణ నుండి ఉన్న నలుగురి సభ్యులలో రంగారెడ్డి ఒకరు. 1956 నవంబర్ 1 న ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక నీలం సంజీవరెడ్డి మంత్రి వర్గంలో కెవి. రంగారెడ్డి హోం, రెవెన్యూ, మద్యపాన నిషేధం శాఖల మంత్రిగా ఉన్నాడు. అనంతరం దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రంగారెడ్డి ఉప ముఖ్యమంత్రిగా ఉండి రెవెన్యూ, రిజిస్ట్రేషన్, కరోడ్గిరి, జాగీర్ల పాలన, భూ సంస్కరణల శాఖలకు ప్రాతినిథ్యం వహించాడు. రంగారెడ్డి జీవితమంతా ఉద్యమాలతోనే కొనసాగింది. 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొని చార్మినార్ వద్ద బహిరంగ సభలో ప్రసంగించి తెలంగాణ ఏర్పాటు ఆవశ్యకతను తెలిపాడు.
హైదరాబాదు నగరం చుట్టూ ఉన్న ప్రాంతాలను నిజాం కాలంలో అత్రాఫ్ బల్దా అని పిలిచేవారు. ఈ ప్రాంతం నుంచి కొండా వెంకట రంగారెడ్డి తెలంగాణ స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్న కీలక నాయకుడు కావడంతో ఈ ప్రాంతానికి అతని పేరు మీద 1978 ఆగస్టు 15 నాడు రంగారెడ్డి జిల్లాగా నామకరణం చేశారు. ఒక ప్రాంత నాయకుడి పేరును పెట్టుకున్న ఈ ప్రాంతం ఈనాడైనా ఆనాడైనా సిరి సంపదలలో పేరెన్నికగన్నది. స్వాతంత్య్రోద్యమ మితవాద కాంగ్రెసు నాయకుడిగా, ప్రజా రాజకీయ నాయకుడిగా తన జీవిత కాలంలోని జ్ఞాపకాలను ''స్వీయ చరిత్ర'' గా రచించుకొని పుట్టిన ప్రాంతానికి గొప్ప ఖ్యాతిని తెచ్చిన ఇతను జూలై 24, 1970 లో మరణించాడు.
- డా. ఘనపురం సుదర్శన్, 9000470542