Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేనికైనా సమయం రావాలి. నాలుగేళ్ళ క్రితం రావాల్సిన ఈ నానీల సంపుటి రెండు కోవిడ్ సంవత్సరాలు దాటి, అంతకు ముందు శాంతారావు రంగస్థల బిజీ షెడ్యూల్స్ గడిచి, ఇప్పటికి నాటక నానీలుగా మన ముందుకొస్తున్నాయి. వారితో నా పరిచయం సభల్లోనే, తిరిగి ఇంటికి వస్తూ కార్లో వారితో ముచ్చటించే మాటాలు వారిని నాకు సన్నిహితం చేసాయి.
శాంతారావు ప్రగతిశీల సంఘాల్లో చిరకాలంగా పనిచేస్తున్నారు. ముఖ్యంగా 1980 నుండి నాలుగు దశాబ్దాలుగా ప్రజానాట్యమండలి ద్వారా నిర్విరామంగా తన సేవలు అందిస్తున్నారు. మౌలికంగా ఆయన రంగస్థల నిపుణులు. థియేటర్ యాక్టివిస్ట్ అని కూడా అనొచ్చు. ప్రస్తుతం ఉపాధ్యాయులకు సమాచార నైపుణ్యాలను, జీవన నైపుణ్యాలను అందించే టీచర్స్ ట్రైనింగ్లో తలమునకలై ఉన్నారు.
శాంతారావుగారు ఇదివరకు 'ఎద్దు, మహాబాటసారి' అనే రెండు వచన కవితా సంపుటిలను ప్రచురించారు. ప్రస్తుత నాటక నానీలు మూడవది. పేరులోనే అర్థమయింది గదా! వారు నిమగమై ఉన్న నాటక సంబంధి విషయాలను తీసుకునే వారు చక్కటి నానీలు రాశారు.
అంటే ఉపన్యాస ధోరణిలో ఉంటాయని కాదన్న మాట!. వారికి కవితా హదయం అపారం. ఒక నానీ వినండి
జీవితం ఎంత
సంక్లిష్టం!
భయపడకు
కళచేస్తుంది స్పష్టం - తొలి నానీతోనే సిక్సర్ కొట్టాడు కవి. పైకి క్లిష్టంగా కన్పించే వాటిని కళలు విశదపరుస్తాయని వారి ఉద్దేశ్యం. దీనిలోని నానీలన్నింటికీ ఈ మొదటి నానీ ఓ భూమిక. వారి నాటకానుభవంలోని అనేక పొరలు వాటిలో దర్శనమిస్తాయి.
అవసరం వస్తువు
ఆకర్షణ శిల్పం
కావ్యానికి కావాలి
రెండు గుండెలు
అలంకార శాస్త్రమంతా ఈ నాలుగు చిట్టి లైన్లలో ఇమిడిపోయింది. శాంతారావు నానీల్లోని సామాజిక ప్రవత్తినీ, వాటి ప్రజాగుణాన్నీ గుర్తించి వాటిపట్ల ఆకర్షితులయ్యారు. అందుకే అప్పుడప్పుడు అప్రయత్నంగా వెలువడిన నానీలను నాకు చూపిస్తు ఉండేవారు. మనిషి పైకి కనపడేంత శాంతమూర్తి కాదు. ప్రజా సమస్యల పట్ల ఆయన అశాంతమూర్తెే. ఏ నానీని ముట్టుకున్నా ఆ సంగతిని గ్రహించవచ్చు.
శాంతారావు నానీ నిర్మాణ లక్షణాలు కరతలామలకం అయ్యాయి. అనుభవ పరణితి వల్ల లోకరీతిని సూటిగా ప్రతిఫలిస్తున్నాయి. శాంతారావుగారి వంటి ఉద్యమజీవి నానీలను స్వీకరించడం వల్ల వాటికి మరింత ప్రజా ప్రయోజనం సిద్ధించిందనుకుంటున్నాను. వారిని విశాలమైన నానీల కుటుంబంలోకి ఆహ్వానిస్తూ అభినందిస్తున్నాను.
- డా|| ఎన్.గోపి