Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇవ్వాళ్ళ తెలంగాణలోనే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో 'కొత్త విప్లవం' లాగా సాగుతున్న మహోద్యమం బాలల రచనోద్యమం. మన బడి పిల్లలలు తామే స్వయంగా కవులుగా, రచయితలుగా అచ్చుకావడం, పుస్తకాలుగా ముద్రించబడడం మనం చూస్తున్నాం. తెలంగాణలో ఈ మహా విప్లవం వెనుక అనేకమంది బాల వికాసకారులు ప్రత్యక్షంగా, పరోక్షంగా ముందూ, వెనకా నిలిచి బాల బాలికలకు స్ఫూర్తినందించారు. వారిలో మాడభూషి లలితాదేవి మొదలుకుని నిన్నటి సాహిత్య అకాడమి కథా యజ్ఞం వరకు వందలాది మంది మనకు కనిపిస్తారు. వారిలో మొదటగా లెక్కించే ఒకటి రెండు పేర్లలో మొదటి వరుసలో కనిపించే పేరు, బాల వికాస యజ్ఞానికి కేరాఫ్ అడ్రస్ గరిపెల్లి అశోక్.
గరిపెల్లి అశోక్ నేటి రాజన్న సిరిసిల్ల జిల్లా భీముని మల్లారెడ్డి పేటలో ఆగస్ట్ 15, 1958న పుట్టారు. వృత్తిరీత్యా ప్రథమ శ్రేణి తెలుగు పండితునిగా పనిచేసి పదవీ విరమణ పొందారు. ఉద్యోగరీత్యా తాను ఎక్కడ పనిచేస్తారో అక్కడే నివాసం ఉండేవారు అశోక్. అలా సిరిసిల్ల టౌన్ నుండి చుట్టుపక్కల పల్లెటూర్లలో చాలా కాలం నివాసముండి అక్కడి విద్యార్థులను రచనా రంగంవైపు ప్రోత్సహించేవారు. ఏడవ తరగతిలోనే అశోక్ కుమారుడు నవీన్ కవితలు 'మొలక' పేరుతో అచ్చయ్యాయి. తన కుమారుని కవితలే కాక తాను పనిచేస్తున్న ముస్తాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతిలోపు విద్యార్థులందరి రచనలు 'జాంపండ్లు' పేరుతో తీసుకువచ్చారు అశోక్.
కామారెడ్డి కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థిగా 1977లో అశోక్ తొలి కవితా సంపుటి 'నాంది' అచ్చయ్యింది. తరువాత 'మధురకవి దూడం నాంపల్లి రచనలు-పరిశీలన' అంశంపై ఎం.ఫిల్ పరిశోధన చేసి పుస్తకంగా అచ్చువేసాడు. పిల్లల కోసం జరిగిని వందకు పైగా వివిధ కార్యశాలల్లో సమన్వయకర్తగా, కన్వీనర్‌గా, విషయనిపుణుడుగా, కార్యకర్తగా పొల్గొన్న అశోక్ బాలల రచనలను అనేక సంపుటాలుగా తెచ్చారు. వాటిలో ప్రథానంగా పేర్కొనదగింది 'జాంపండ్లు' బాలల కథా సంపుటి. అదే కోవలో తెలంగాణ బడిపిల్లల అక్షర సంతకాలు పేరుతో తెచ్చిన తెలంగాణ బడి పిల్లల హరిత కవితా సంకలనం 'ఆకుపచ్చని ఆశలతో...'. ఇవే కాక రంగినేని ట్రస్టు ప్రచురించిన 'కతలవాగు', 'కవితల సింగిడి' మొదలు నిన్న మొన్న వచ్చిన 'కతల మానేరు' వరకు అశోక్ సంపాదకులుగా ఉన్నారు. బాలచెలిమి సంస్థ తెలంగాణ బడిపిల్లల కథలు పది సంపుటాలుగా మణికొండ వేద కుమార్ సంపాదకత్వంలో ప్రచురిచంన విషయం తెలిసిందే. ఈ పూర్తి ప్రాజెక్టుకు గరిపెల్లి కన్వీనర్‌గా ఉండి దాదాపు రెండేండ్లు నడిచిన బాల చెలిమి ముచ్చట్లు, ఇతర కార్యక్రమాలకు వేదకుమార్తో కలిసి సారథ్యం వహించారు. రంగినేని పిల్లల పండుగ, మానేరు బాలోత్సవం మొదలు రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన అనేక కార్యశాలలకు, బాల వికాస కార్యక్రమాలకు సైనికునిగా ముందు నిలిచిన పెబ్బ గరిపెల్లి అశోక్. ప్రస్తుతం మానేరు రచయితల సంఘం కార్యనిర్వాహక అధ్యక్షులుగా ఉన్నారు.
బాల వికాస కార్యకర్తగానేకాక, బాల సాహితీవేత్తగా అశోక్ విలక్షణ సృజన చేశాడు. అందుకు ఆయన ప్రచురించిన బడి పిల్లల విజాయాల కతలు 'ఎంకటి కతలు', బడిపిల్లల స్వచ్ఛ సర్వేక్షణ కతలు 'మా బడి కతలు' ఉదాహరణ. అశోక్ ఆలోచనకు మరో ప్రతి రూపం 'సరికొత్త ఆవు-పులి కతలు' కథా సంపుటి. ఇవేకాక కరోనా కథలు అచ్చులో ఉంది. బడికి సంబంధించిన కతలతో 'బడి బువ్వ' పేరుతో పెద్దక్క కతలను కూడా అశోక్ తెస్తున్నారు. 'ఎంకటి కతలు', 'మా బడి కతలు' దాదాపు మూడు నెలలు ఆదిలాబాద్ ఆకాశవాణి ద్వారా ప్రసారం అయ్యి వేలాది మంది శ్రోతలను సంపాదించు కున్నాయి. పిల్లల కోసం రాసినా, పని చేసినా బడిని, పిల్లలను దాటి వెళ్ళక పోవడం అశోక్ రచనల్లో, కార్యక్రమాల్లో మనం చూస్తాం. ఎంకటి కతలు పాఠశాల ఉపాధ్యాయునిగా తాను గమనించిన వందలాది మంది గ్రామీణ విద్యార్థుల విజయ గాథలు, ఆలోచనలు, ఆశలు, కోరికలు ఎలా ఉంటాయో ఎంకటి పాత్రద్వారా మనకు తెలియజేస్తారు రచయిత. మా బడి కతలు కూడా ఆ కోవలోనివే. ఇందులోనూ గ్రామీణ పాఠశాలలు, లేదా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న మనకు ఇందులోని అనేక పాత్రల్లో మనకు మనం కనిపిస్తాం. అలా బాలల కథలనగానే కేవలం రంగాపురం, రామాపురం, రాజు పెద్ద కొడుకు మంచోడు, చిన్న కొడుకు తెలివైనవాడు వంటి ఇతివృత్తాలు కాకుండా బాలల జీవితంలోని అనేక అంశాలను కథలుగా మలచడం గరిపెల్లి అశోక్ రచనల్లో చూడొచ్చు. సరికొత్త ఆవుపులి కతలు మనకు తెలిసిన ఆవు-పులి కథనే మరో పది విధాలుగా రాసి పిల్లలకు కానుకగా అందించారు అశోక్. ఇది పిల్లల ఆలోచనలకు ప్రతిబింబంగా నిలవడమేకాక, ఒకే కథలను ఎన్ని రకాలుగా బాలలు ఆలోచిస్తారో అన్నది తెలుస్తుంది. ఆగస్టు 14న గరిపెల్లి అశోక్ పుట్టిన రోజు. ఆయనకు పుట్టినరోజు జేజేలు.
- డా|| పత్తిపాక మోహన్,
9966229548