Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కథా రచయిత, స్వాతంత్య్ర సమరయోధుడైన వి.ఆర్. అవధాని కరీంనగర్ జిల్లాలోని మంథనిలో 1909 లో జన్మించాడు. అవధానికి హిందీ, ఉర్దూ, సంస్కృతం భాషలపై పట్టు ఉంది. 1950 లో ఏర్పడిన వైతాళిక సమితిలో అవధాని ఒకరు. ఇతను మంథని నుంచి 'ప్రభోధ చంద్రిక' అనే లిఖిత పత్రికను ప్రకటించాడు.
నిజాం వ్యతిరేకోద్యమం
తమ సమకాలంలో ఉన్న భీకర పరిస్థితుల గురించి, వాటి పరిష్కారాలకై ఎవరో ఒకరు ప్రశ్నించడానికి వస్తూనే ఉంటారు. అలాంటి వారికున్న సామాజిక స్పహ, సామాజిక బాధ్యత మిగతా వారి కన్నా గొప్పది. అలాంటి వారే అందరి కంటే ముందు వరుసలో ఉండి తన చుట్టూరా ఉన్న సమస్యలకై పోరాడతారు. అలాంటి వారిలో ఒకరైన వి.ఆ.ర్ అవధాని నిజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొన్నాడు. భారతదేశానికి స్వాతంత్య్రం లభిస్తుందన్న సంకేత వార్తలు నిజాం సంస్థాన రాజుకు తెలియగానే ఆయన సంస్థానంలోని పోరాటయోధులపై ఉక్కు పాదం మోపాడు. స్వాతంత్య్ర భావాలు ఎక్కడ కనిపించినా, ఏ నోట వినిపించినా అక్కడ ఏదో ప్రభుత్వ అలజడి జరిగేది. ఈ అలజడి సష్టికి కారణం, నిజాం రాజు అయితే అలజడిని అణిచివేసే వారు ఆయన బంటులైన రజాకార్లు, పోలీసులు. ఈ సమయంలో వి.ఆర్. అవధాని స్వాతంత్య్రం కోసం తన నరసను తెలపగానే ప్రభుత్వం అరెస్టు చేయడంతో 1947 సం. లో జైలు శిక్షకు గురయ్యాడు.
హైదరాబాదులో 1892 లో ఆర్య సమాజం ఏర్పడిన నాటి నుండి అది సంస్థాన హిందూ ప్రజలను దినదినం తమ మత రక్షణకు, జాతి పునరుద్ధరణకు చైతన్యం చేస్తూ వచ్చింది. దీంతో ఆర్యసమాజం తన కార్యక్రమాలతో క్రమంగా అందరిని ఆకర్షించడం మొదలుపెట్టింది. ఇందులో రచయితలు ఉన్నారు. సాంఘిక నాయకులూ ఉన్నారు. ఇలా వివిధ వర్గాల హిందూ ప్రజలంతా ఆర్య సమాజ కార్యక్రమాల ఆకర్షణకు గురై తుదకు ఆర్య సమాజంలో చేరారు. అలా అవధాని కూడా ఆర్య సమాజంలో చేరి పోరాటపటిమను, అభ్యుదయ అభిప్రాయాలను సొంతం చేసుకున్నాడు.
తెలుగు పాఠశాలలు, పుస్తకాలు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వివక్షకు గురయ్యాయి. ఈ సందర్భంలో మాతభాషకు విద్యాపరంగా దూరమైన తెలుగు భాషా ప్రజలను సాంస్కతికంగా మేల్కొల్పడానికి తెలంగాణలో ఉద్భవించిన ఉద్యమమే తెలంగాణ గ్రంథాలయోద్యమం. వి. ఆర్. అవధాని ఈ ఉద్యమ భావాన్ని మనస్సీకరించుకొని ఉద్యమంలో పాల్గొని నాయకుడై నడిపించాడు. హైదరాబాదులో నిజామాంధ్ర సంఘ సంస్కార మహాసభ పేరిట జరిగిన సభలో తెలుగు భాషకు జరిగిన అవమానం అనంతర కాలంలో తెలంగాణ ప్రజల ఉద్యమ రేఖలను మార్చి వేసింది. ఈ అవమానకర సంఘటనకు ఫలితంగా 1921 అక్టోబర్ లో ఆంధ్రజనసంఘం ఏర్పడింది. ఇది కాస్త నిజామాంధ్ర జనకేంద్ర సంఘంగా, ఆంధ్ర మహాసభగా రూపం దాల్చింది. దీంతో హైదరాబాదు ప్రజలకు చక్కటి వేదిక దొరికింది. భారత జాతీయోద్యమ కాలంలో ప్రజలను ఉద్యమంలో భాగస్వాముల్ని చేయడానికి జాతీయ కాంగ్రెస్ ఎంతటి ప్రాధాన్యత వహించిందో ఆంధ్రమహాసభ కూడా తెలంగాణలో అంతటి ప్రాధాన్యత వహించింది. ఈ ఆంధ్ర మహాసభల్లో అవధాని సైతం పాల్గొన్నాడు. ఇలా దేశ స్వాతంత్య్రోద్యమంలో భాగంగా లేవదీసిన లేదా స్వాతంత్య్ర సాధనకు ప్రారంభించిన కార్యాచరణలో అవధాని తన వంతుగా పాల్గొని ఇతర ప్రజలకు స్ఫూర్తిగా నిలిచాడు. హరిజనుల దేవాలయ ప్రవేశం కొరకు, వారి జీవన ఉద్ధరణకు పాటు పడ్డాడు.
బాల్య వివాహాలను నిర్మూలించాలని భావించి, స్త్రీ విద్య ప్రాముఖ్యాన్ని గుర్తించాడు. ఇతను న్యాయశాస్త్రంలో పట్టభద్రుడు కాకపోయినా ప్రాక్టీసు చేసుకోవచ్చని ప్రభుత్వం అనుమతిని జారీ చేసింది.
సాహిత్యం
అవధాని గేయాలు, కవిత్వం రాశాడు. ఈయన రాసిన కథలు గోల్కొండ, ఆంధ్రకేసరి, భారతి వంటి పత్రికలలో ప్రచురించబడ్డాయని కథకుల అభిప్రాయం. అలా రాయబడ్డ 'తిరుగుబాటు' అనే కథ ఆంధ్రకేసరి పత్రికలో లభ్యమైంది. ఆ కాలంలో తెలుగు సాహిత్యంలో గొలుసుకట్టు సాహిత్యం వచ్చేది. అందులో నవలలు, కథలు వంటివి ఉండేవి. ఈ గొలుసు కట్టు విధానంలోనే వెల్దుర్తి మాణిక్యరావు, కాళోజి నారాయణ, అవధాని ఈ ముగ్గురు కలిసి 'భూతదయ' అనే కథ రాశారు. ఇది 1937 నాటి ఆగస్టు మాసంలో గోల్కొండ పత్రికలో వెలువడింది. 1930లో పతిపత్ని అనే నవల, జైలు గీతాలు రాశాడు. ఇవి అలభ్యం. అయినా వీటిని వెతకవలసిన బాధ్యత పరిశోధకులకు ఎంతగానో ఉంది.
సామాజిక ప్రగతి కోణంలో రచనలు చేసి, స్వరాజ్యం కోసం ఉద్యమించి, అనుకున్న స్వతంత్రతా కాంక్షను సాధించిన అవధాని 1995 సం.లో కన్నుమూశాడు.
- డా. ఘనపురం సుదర్శన్,
9000470542