Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీశ్రీ కవిత్వాన్ని తూచే రాళ్ళు తన వద్ద లేవంటాడు చలం - కాని కవుల కవిత్వాన్ని విశ్లేషించడం ఓ సాహసమే. దాదాపు మూడు దశాబ్ధాల తెలంగాణ కవిత్వంలోని మేలి మలుపుల్ని గుర్తించి చర్చకుపెట్టడం ఈ వ్యాసాల్లో చూడగలం. తెలంగాణ కవిత్వంలోని విభిన్న పార్శ్వాల్ని విశ్లేషిస్తూ... డా|| కాంచనపల్లి గోవర్థన్రాజు తనదైన దృష్టి కోణంలో విశ్లేషించారు. ''సమ్మక్క సారక్క, రాంజీగోండు, కొమురంభీం, పౌరుషంతో పోరాడిన కాడనే ఫలదీకరణం చెంది విత్తనమై మొలకెత్తుదాం'' అన్న పొన్నాల బాలయ్య కవిత్వాన్ని ''తెలంగాణ దళిత కవిత్వపు కొత్త నిట్టాడి'' అంటూ చక్కటి విశ్లేషణ చేశారు డా|| కాంచనపల్లి. (పేజీ : 127)
తెలంగాణ ఉద్యమాన్ని చందోబద్ధపద్యంలో ప్రాచీన సంస్కృత సమాసాలు వదలుకొని అద్భుతంగా 'తెలంగాణ మహోదయం' పద్య కావ్యం అందించారు ఆచార్య ఫణీంద్ర అంటారు (పేజీ : 122).
వనపట్ల సుబ్బయ్య దీర్ఘ వాక్యం 'మశాల్'లో బిగించిన పిడికిలిలో దాచిన ఉద్యమావేశం కనబడుతుంది అంటారు (పేజీ : 166).
అజ్ఞాత కవులు (వీరులు) రాసిన కవిత్వాలు రికార్డ్ చేసిన వరవరరావు విశ్లేషణపై వివరణగా ''అజ్ఞాత కవితా వికాసం''లో చూడగలం ((పేజీ : 169)
దేవనపల్లి వీణావాణి కవిత్వాన్ని (పేజీ : 151) విశ్లేషిస్తూ పదజాలంలోనూ, పదబంధాలలోను, తెలుగు అస్తిత్వం అప్రయత్నంగా చోటుచేసుకొంది అంటారు.
దాదాపు 34 మంది కవుల కవిత్వాలపై కాంచపల్లి వారి విశ్లేషణ పాఠకులకు చక్కటి అవగాహన ఆలోచన కల్పిస్తుంది.
వేణుశ్రీ కవిత్వాన్ని విశ్లేషిస్తూ (పేజీ : 183) ఆధునిక ముక్తకం లాంటి ఆటవెలదులతో మన హృదయాలతో ఆడుకొంటున్నారు అంటూ ప్రజల మాటలే పద్యాలుగా మాట్లాడాయి అంటారు. నా జ్ఞాపకాల్లో సి.నా.రె. వ్యాసం - రచయిత హృదయ స్పందన - సినారెతో రచయిత అనుబంధం తెలియజేస్తుంది (పేజీ : 93)
సమాంతర స్వాప్నికుడు కవి ఎస్.వి. (పేజీ : 80) తెలంగాణ రాష్ట్రావతరణాంతర కవిత్వం - ఒక పరిశీలన (పేజీ : 58), దాశరథి కవిత్వం - సౌందర్య దృక్పథం (పేజీ : 64) ఆత్మ గల కవి అన్నవరం (పేజీ : 86) వ్యాసాలు ఈ పుస్తకం విశిష్టతతను ప్రామాణికతను తెలియజేస్తాయి. ప్రతికవి సాహిత్య వేత్త, విమర్శకుల వద్ద తప్పనిసరిగా ఉండాల్సిన విలక్షణ కరదీపిక. డా|| కాంచనపల్లి వారి కృషి అభినందనీయం.
తరాజు
రచయిత : డా|| కాంచనపల్లి
పేజీలు : 200,
వెల : రూ. 150 /-
ప్రతులకు : ఎ.అంజనాదేవి,
ఫ్లాట్ నెం. 201, ఇం.నెం. 626, ప్రమీలా రెసిడెన్సీ, నాగార్జున నగర్, 14వ వీధి, తార్నాక, హైదరాబాద్ - 500017
సెల్ : 9676096614
- తంగిరాల చక్రవర్తి ,
9393804472