Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారతదేశంలో భ్రూణ హత్యలు చాలా రాష్ట్రాలలో సర్వ సాధారణం. మగ పిల్లవాడికి ఉన్న స్థానం సమాజంలో, కుటుంబం లోనూ ఆడపిల్లలకు లేదు. ముఖ్యంగా ఉత్తర భారత ప్రాంతాలలో ఈ తేడా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రపంచం మొత్తం మీద 117 మిలియన్ ఆడపిల్లలు సెక్స్ సెలెక్టివ్ అబార్షన్లకు ఇప్పటి దాకా బలి అయ్యారంటే ఇది ఎంత తీవ్రమైన సమస్య అన్నది అర్ధం చేసుకో వచ్చు. మన దేశంలో చట్టపరంగా లింగ నిర్ధారణలను బహిష్క రించారు. అలాగే అల్ట్రాసౌండ్ మషీన్ల అమ్మకంపై కూడా నిషేదాలు ఉన్నాయి. అయినా తల్లి గర్భంలోనే హత్యకు గురవుతున్న ఆడపిల్లల సంఖ్య ఇంకా ఉంది. చైనాలో మొదటి నుండి ఈ వివక్ష ఎక్కువే. అయితే గవర్నమెంట్ అక్కడ జనాభా నియంత్రణ కోసం ఒక్క బిడ్డనే దంపతులు కనాలనే నియమాన్ని పెట్టినప్పుడు ఈ భ్రూణ హత్యలు ఆ దేశంలో పెద్ద సంఖ్యలో జరిగాయి. ఇప్పటికీ వియత్నాం, నేపాల్, ఆఫ్రికా దేశాలలో ఈ వివక్ష స్పష్టంగా కనపడుతుంది. ఒక్క సౌత్ కొరియా మాత్రం భ్రూణ హత్యలను చాలా ఎక్కువగా నివారించ గలిగింది. ప్రపంచంలో ఎక్కువగా భ్రూణ హత్యలు లైచ్తెన్స్తీన్ అనే దేశంలో నమోదయ్యాయి. ఇది ఆల్ప్స పర్వతాల నడుమ ఆస్ట్రియా, స్విట్జర్లాండ్ దేశాల మధ్య ఉన్న ఓ చిన్న దేశం. ఆర్ధికంగా బాగా అభివద్ధి చెందిన దేశం కూడా. భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో ఈ భ్రూణ హత్యలు జరుగుతూనే ఉన్నాయి. అసాంలో కూడా ఈ పద్ధతి ఎక్కువగానే ఉంది. ఇది గమనించిన తరువాత ఈ సమస్యపై కొత్త కోణంలో అసాం భాషలో ఓ సినిమా వచ్చింది. అదే ''మీ అండ్ మై సిస్టర్''
2013లో వచ్చిన ఈ సినిమాకి దర్శకత్వం వహించినది రాజేశ్ భుయాన్, నిర్మాతగా వ్యవహరించినది నిపొమ్ ధోలువా. భ్రూణ హత్యల కారణంగా సమాజంలో పెరుగుతున్న ఓ భయాన్ని ఇతి వత్తంగా తీసుకుని ఈ సినిమా తీసారు. దీన్ని ఏడు భాషలలో రిలీజ్ చేయాలన్నది వారి ప్రణాళిక. భ్రూణ హత్యలపై ఎన్నో చర్చలు జరిగినా ఈ సినిమాలో దర్సకులు చెప్పే పాయింట్ ఆలోచ నాత్మకంగా ఉంది. ఓ సందర్భంలో రాజేశ్ భుయాన్ తాను చేసిన రీసర్చ్ గురించి ఇలా చెప్పారు. ''డబ్బు లేని పేద వాళ్ళూ లింగ నిర్ధారణ పరీక్షలకు వెళ్ళలేరు. కాని ధనవంతులు తల్లి గర్భంలో బిడ్డ లింగాన్ని తెలుసుకోవడానికి పది వేలు, పదిహేను వేల నుండి మూడూ లక్షల దాకా ఖర్చు చేయడానికి సిద్ధపడతారు. ఇది చట్ట వ్యతిరేక చర్య అయినా వారు ఎప్పుడు పట్టుపడరు''. ఈ సినిమా కథను ఆయన ఆధునిక ధనవంతుల సమాజాన్ని ఇతివత్తంగా తీసుకుని రాసుకున్నారు. కాబట్టి కొంత మందికి ఈ సినిమా ముగింపు కొంత అసంపూర్ణంగా అనిపించే అవకాశం కూడా ఉంది. కాని దర్శకుని ఆలోచనలను అనుభవాలను పరిగణం లోకి తీసుకుంటే ఈ సినిమా వెనుక ఉద్దేశ్యం స్పష్టం అవుతుంది.
చందన ఓ ధనవంతుల కుటుంబంలో పుట్టిన అమ్మాయి. ఈమె వివాహం గీతార్ధ అనే ఓ పెద్ద గవర్నమెంట్ ఆఫీసర్‌తో అవుతుంది. వీరి జీవితం ఆనందంగా సాగుతూ ఉంటుంది. వీళ్ళకు ఆకాష్ అనే ఓ బాబు. పది సంవత్సరాల తరువాత చందన మళ్ళీ తల్లి కాబోతుందని తెలుస్తుంది. దంపతులు ఇద్దరూ సంతోషిస్తారు. గీతార్ధ సీ.ఎం ఆఫీసులో పని చేస్తూ ఉంటాడు. వుమెన్ ఆఫ్ ది ఈయర్ అవార్డుకు డాలీ అనే ఓ స్త్రీని ఆఫీసులోని వారు ఎంపిక చేస్తారు. గీతార్ధ ఆమెకు ఫోన్ చేసి ఈ విషయాన్ని చెప్పినప్పుడు డాలీ ఈ అవార్డుని తిరస్కరిస్తూ తాను కష్టాలలో ఉన్నప్పుడు సహాయానికి రాని సమాజం ఇప్పుడు ఈ అవార్డు తనకు ఇవ్వడం వల్ల తాను బావుకునేదేమీ లేదని ఎమోషనల్‌గా వాదిస్తుంది. ఆమె మాటలను విన్న గీతార్ధకు ఆమె విషాదం మనసును కలిచి వేస్తుంది. ఈ విషయాన్ని ఇంటికి వచ్చి భార్య చందనకు చెబుతాడు. డాలీ గురించి విన్న చందన ఆమెను తనతో పాటు చదువుకున్న సహాధ్యాయురాలిగా గుర్తిస్తుంది. ఆమెను కలవడానికి వెళ్తుంది.
డాలి చదువులో చురుకుగా ఉండేది. తల్లిదండ్రుల మరణంతో బంధువులు ఆమెను వదిలించుకోవాలని ఓ మెకానిక్‌కి ఇచ్చి వివాహం చేస్తారు. ఇతను ఆమెను చాలా హింసలకు గురి చేస్తాడు. ఆమె ఏడు నెలల గర్భవతిగా ఉన్నప్పుడు శారీరిక సుఖం కోసం ఆమెను రేప్ చేస్తాడు. ప్రతిరోజు ఆమెపై కుటుంబంలో జరుగుతున్న హింస, భర్త ద్వారా జరిగే ఈ శారీరిక హింస తోడయి డాలి కళ్ళు లేని అమ్మాయికి జన్మనిస్తుంది. శిఖ పుట్టినప్పుడు ఆమెకు చూపు ఉన్నా క్రమంగా ఎదుగుతున్న కొద్దీ చూపు పోతుంది. గర్భంలో శిశువుగా ఉన్నప్పుడు డాలీ అనుభవించన హింస కారణంగానే డాలీ కూతురు శిఖ క్రమంగా చూపు కోల్పోయిందని డాక్టర్లు ద్రువీకరిస్తారు. డాలి ఓ అనాధ ఆశ్రమంలో పని చేస్తూ ఉంటుంది. ఆమె చేసే సేవ వల్ల ఆమె విమెన్ ఆప్ ది ఇయర్ అవార్డుకు ఎంపికయింది. కాని తన బిడ్డ భవిష్యత్తు కోసం ఈ అనాధ పిల్లల మధ్యన గడుపుతున్నానని, రేపు తనకేదన్నా అయితే శిఖకో ఆధారం ఉండాలనే ఈ సంస్థలో కలిసి పని చేస్తున్నానని డాలి అంటుంది. అందువలన ఈ అవార్డుని స్వీకరించాలనుకోదు.
డాలి జీవితాన్ని దగ్గర నుండి చూసే దాకా చందనకు ఇలాంటి జీవి తాల గురించి అవగాహన లేదు. ఆమె విపరీతమైన భయానికి లోనవుతుంది. తనకూ ఆడపిల్ల పుడితే ఆ బిడ్డ భవిష్య త్తేమిటి అని ఆందోళనకు ఆమెను చుట్టుముడుతుంది. ఆమె గర్భంలో కవలలు ఉన్నారని తెలుస్తుంది. అయితే వారు ఆడపిల్లలయితే అనే ఆందోళన చందనను నిరంతరం భయానికి గురి చేస్తూ ఉంటుంది. దీని ప్రభావం బిడ్డల ఎదుగుదల పై కూడా పడుతుంది.
ఇక్కడ దర్శకుడు కొంత కల్పనను జోడించి చందన గర్భంలో ఉన్న పిల్లలలో ఓ బిడ్డ మగ, మరో బిడ్డ ఆడ అని, వారు తల్లి పడుతున్న ఈ వేదనను అర్ధం చేసుకుని అదే బాధను వారూ అనుభవిస్తున్నట్లు చూపిస్తారు. మగ పిండం ఎదుగుదల బావుంటుంది. కాని ఆడ పిండంగా గర్భంలో ఎదుగుతున్న కూతురు ఈ విషయాలను తట్టుకోలేకపోతుంది. ఆమె ఎదుగుదల బావుం డదు. తాను భూమి మీదకు రాకపోవడమే మంచిదనే భావన ఆ ఆడ పిండానికి కలుగుతుంది. చందన డాలీకి అండగా ఉండాలని తాపత్రయపడుతుంది. ఆకాష్ కూడా శిఖతో కలిసి ఆడుకుంటూ ఉంటాడు. ఎదుగుతున్న పిల్లవాడిగా శిఖ పరిస్థితి అతనిపై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఓ సందర్భంలో తనకు పుట్టబోయే చెల్లెలికి వివాహమే అవసరం లేదని కూడా అనేస్తాడు. వారి ఇంట్లో ఆడపిల్లపై ఉన్న ఇష్టం కారణంగా తనకు చెల్లే పుట్టాలని రాకేష్ కోరుతూ ఉంటాడు. కాని ఇప్పుడు ఆ పుట్టబోయే చెల్లి గురించి భయం ఆ చిన్న బిడ్డలో కూడా మొదలవుతుంది.
శిఖకు తల్లి వేదన పూర్తిగా అర్ధం కాదు. అందువలన అప్పుడ ప్పుడూ కనిపించే తండ్రిపై ప్రేమను పెంచుకుంటుంది. డాలీపై కోపంతో ఓ సారి ఆమె భర్త శిఖను తనతో తీసుకుని వెళ్ళిపోతాడు. చందన గీతార్ధల సహాయంతో బిడ్డను వెతికి ఇంటికి తెచ్చుకుంటుంది డాలీ. కాని తాను ఇష్టపడే తండ్రితో వెళ్ళానని శిఖ చెప్పడం వలన ఆమె తండ్రిని పోలీసులు వదిలివేయవలసి వస్తుంది. నిరంతరం బిడ్డ క్షేమం కోసం తపిస్తూ ఆందోళన పడే డాలీ జీవితాన్ని చూసాక చందనకు స్త్రీల జీవితంలో మరో కోణం అర్ధం అవుతుంది. అప్పటి దాకా తనకు ఆడపిల్ల కావాలనుకునే ఆమె తనకు కూతురు పుడితే తాను ఆమెను ఈ పరిస్థితులలో సమాజం నుండి ఎంతవరకు కాపాడుకోగలనని భయపడుతుంది. ఆమెలో నిత్యం పెరిగే ఆందోళన ఆమె గర్భంలోని బిడ్డల పెరుగుదలపై ప్రభావం చూపుతుంది. మగ బిడ్డ ఆరోగ్యంగా పెరుగుతూ ఉంటే అతనితో కలిసిన ఆడబిడ్డ మాత్రం కశించి పోతూ ఉంటుంది. చివరకు చందనను అత్యవసరంగా హాస్పిటల్లో జాయిన్ చేసిన తరువాత ఓ బిడ్డను దక్కించలేం అని డాక్టర్ గీతార్ధకు స్పష్టంగా చెబుతుంది. అది ఆడపిల్ల అన్నది ప్రేక్షకులకు అర్ధం అవుతుంది.
ఆకష్కు కూడా తనకో చెల్లెలు ఉంటే బావుండు అనే కోరిక ఉంటుంది. కాని శిఖ, డాలీలను చూసిన అతనికి కూడా అర్ధం కాని ఆందోళన కలుగుతుంది. చివరకు చెల్లెలుపై కోరికతో ఒంటరిగా మిగిలిన ఆకష్, హాస్పిటల్లో సిజెరియన్కు సిద్ధమైన చందన కడుపులో ఓ బిడ్డ బతకదని డాక్టర్ చెప్పడం దగ్గర ఈ కుటుంబం కథను ముగించి, ఆఖరి సీన్లో డాలీ వుమెన్ ఆఫ్ ది ఇయర్ పురస్కారాన్ని తీసుకుంటూ తనకోసం వేదనపడి హాస్పిటల్ పాలయిన స్నేహితురాలు చందన, ఇలాంటి భయాలకే లోనయి జీవిస్తున్న ఎందరో తల్లుల ప్రస్తావనను తన స్పీచ్‌లో తీసుకొస్తూ భూమిపైకి ఆడపిల్లను తీసుకురావడానికే భయపడే తల్లుల మనసులో ఆ భయాన్ని నిర్మూలించగల సమాజ నిర్మాణం ఎప్పుడు అనే ఆలోచనతో సినిమాను ముగిస్తారు దర్శకులు.
ఆలోచన రేకెత్తించే ఈ చిత్రంలో రెండు విషయాలను దర్శకులు ప్రస్తావిస్తారు. ఒకటి సమాజంలో స్త్రీలపై వివక్ష కారణంగా ఆడ పిల్లకు జన్మ నివ్వాలంటే భయపడే తల్లుల సంఖ్య పెరుగుతున్న విషయం. ఇది చందన పాత్ర ద్వారా చూపించారు. రెండవది స్త్రీ ప్రేమను చెల్లి, స్నేహితురాలు, భార్య రూపంలో అందుకోలేని పురుష సమాజంలోని ఒంటరితనం. ఆకాష్ అటువంటి సమాజానికి ప్రతినిధి. ఈ చిన్న పిల్లవాడికి చెల్లెలు కావాలనే కోరిక కాని స్త్రీ వివక్షను చూసిన ఆ బిడ్డ చిన్న మనసుపై పడే ప్రభావాలు. సోదరి ప్రేమను అందుకోవాలనే కోరిక ఉన్నా ఆ పరిస్థితిని ఆనందించలేని మగ బిడ్డగా ఒంటరితనం ఆకాష్ ది. ఇది ఇప్పటి దాకా ఎవరూ స్పశించని పాయింట్. పురుషుని ఎదుగుదలలో, అతని జీవతంలో, ఏదో ఒక సమయంలో స్త్రీ స్పర్శ, లాలిత్యం అవసరం. కాని దాన్ని అనుభవించలేని పురుష సమాజం ఈ వివక్ష కారణంగా తయారు అవుతుంది. దీని వలన మగవారిలోని సహజమైన లాలిత్యం, సున్నితత్వాలు కూడా అంతరించిపోయే ప్రమాదం ఉంది. ఈ విషయాన్ని హెచ్చరించిన చిత్రం ''మీ అండ్ మై సిస్టర్'' భ్రూణ హత్యల సమాజం స్త్రీ సాంగత్యంలోని సహజీవనాన్ని సున్నితత్వాన్ని, లాలిత్యాన్ని మగపిల్లలకు వారి బాల్యంలో దూరం చేయడం వారి ఎదుగుదల పై ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుందో, వారిని ఎన్నో అనుభవాలు, అనుభూతుల నుండి ఎలా దూరం చూస్తుందో చెప్పిన సినిమా ఇది. ఇది ఇప్పటికీ ఎవరూ చర్చించని విషయం. ఈ విషయాన్ని ఈ సినిమా ద్వారా ప్రస్తావించిన ఈ చిత్ర బందాన్ని అభినందించవలసిందే. ఈ చిత్రంలో నటులందరూ వారి పాత్రలకు న్యాయం చేశారు.
- పి.జ్యోతి,
9885384740