Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'అందరు పాడే పాటొకటున్నది/ అదియే బాలానందం / అందరి నీడై తోడొకటున్నది / అదియే భారత దేశం' అని రాసిన బాలల కవి డా. జె బాపురెడ్డి. 'బాపురే బాపురెడ్డి, బంగరు భావాల కడ్డీ' అని సమకాలీనులచే ప్రశంసింపబడ్డ కవి, రచయిత, పరిపాలనా దక్షులు, ఐ.ఎ.ఎస్ అధికారి డా. జె. బాపురెడ్డి.
జంకె బాపురెడ్డి నేటి రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం సిరికొండ గ్రామంలో 1936లో పుట్టారు. సిరిసిల్ల, హైదరాబాద్‌లలో విద్యాభ్యాసం చేశారు. మహాకవి సినారె స్పూర్తితో 8వ తరగతిలలోనే కవిత్వం రాసి సాహిత్య రంగంలోకి అడుగుపెట్టిన బాపురెడ్డి పద్యం, గేయం, వచనం, విమర్శ, అను వాదం మొదలు అన్ని సాహిత్య ప్రక్రియల్లో రచనలు చేశారు.
వృత్తిరీత్యా జిల్లా కలెక్టర్‌గానే కాక సంగీత నాటక అకాడమి ప్రత్యేక అధికారిగా, అఖిల భారత సాంస్కృతికోత్సవాలకు కార్యర్శిగా, మొదటి ప్రపంచ తెలుగు మహాసభలకు కార్యదర్శిగా సేవలందించారు. దేశ విదేశాల్లో జరిగిన వందలాది సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాల్లో తెలుగు కవిగా, భారతదేశ ప్రతినిధిగా పాల్గొని విశ్వవేదికపైన తెలుగు కవితలు వినిపించారు. నలభైకి పైగా రచనలు చేసిన బాపురెడ్డి బాలల కోసం గేయ సంపుటాలు తెచ్చారు. నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియాతో పాటు ఇతర సంస్థలకు బాల సాహిత్యాన్ని అనువాదం చేశారు.
1960లో వచ్చిన 'చైతన్య రేఖలు' బాపురెడ్డి తొలి కవితా సంపుటి. తరువాత 'రాకెట్టు రాయబారం', 'హృదయ పద్యం', 'బాపురెడ్డి గేయాలు', 'బాపురెడ్డి గేయ నాటికలు', 'శ్రీకార శిఖరం', 'నా దేశం నవ్వుతోంది', 'మనసులో మాట' వ్యాస సంపుటి, 'మన సౌదామిని', 'ఆత్మీయ రాగాలు', 'జీవన శృతులు' పద్య కవితా సంపుటి, 'అనంత సత్యాలు', 'పంచబాణా సంచా', 'పద్యాల పల్లకి', 'నవగీత నాట్యం', 'కవితా ప్రస్థానం'తో పాటు వివిధ దేశాల పర్యటనల సందర్భంగా యత్రా కథనాలను పుస్తకాలుగా ప్రచురించారు. 'నాదేశం నవ్వుతోంది నందన వనంలా' వంటి వీరి లలిత గీతాలు ఇప్పటికీ రేడియో శ్రోతల చెవుల్లో తిరుగుతూనే ఉంటాయి. కవిగా ఆయన రాసిన 'ఎకనామిక్స్ సుందరి' మిక్కిలి ఖ్యాతి పొందింది. 1971లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి అవార్డు, 1987లో మైకేల్ మధుసూధన దత్తు అవార్డు, 1989లో 'మన చేతుల్లోనే వుంది' గ్రంథానికి తెలుగు విశ్వవిద్యాలయం వారి ఉత్తమ వచన రచన పురస్కారం, గౌరవ డాక్టరేటులు అందుకున్నారు.
'చితికిపోతున్న జీవితంలో బతికిపోయిన బాల్యం కోసం వెతుకుతున్నాను' అంటారు బాపురెడ్డి. ఆ తత్త్వమే ఆయనతో బాల గేయాలను రాయించింది. ఆయన రాసిన గేయాల్లో కూడా బాలలు, బాలల కోసం ఉండడం మనం చూడోచ్చు. 'బాలలారా! ఏలండీ / భారతదేశం!/ అణువణువున వెలగాలి/ మీ దరహాసం/ ద్వేషవిషం పొంగించే పెద్దలకన్న/ ప్రేమరసం కురిపించే పిన్నలె మిన్న'. మరో గేయంలో 'బాలలం బాలలం / బాలకృష్ణ లీలలం/బాలలం బాలలం/బాలగళ మాలలం' అంటారు. బాపురెడ్డి బాల సాహిత్యంలో మొదటగా పేర్కో దగింది 'ఆటపాటలు'. ఇది భారత ప్రధాని పి.వి.నరసింహారావు చేతులమీదుగా అమెరికాలో ఆవిష్కరించబడింది. ఆయనే పేర్కొన్నట్టు ఇది ముఖ్యంగా ప్రవాసులైన తెలుగు పిల్లల కోసం రాశారు. ఇందులోని పాటలన్నీ రాగయుక్తంగా పాడుకునేందుకు వీలుగా ఉన్న మాత్రాఛ:దో గేయాలు. బాలలకు విజ్ఞానాన్ని, వినోదాన్ని పంచే గేయాలు ఇందులో ఉన్నాయి. ఇందులో ఆటపాటలతో పాటు మంచి చెడ్డలు, సత్యసాయి, ఏసుక్రీస్తు, బాపూజీ, రవీంద్రుడు, గురజాడ. మథర్ థెరిసా, నెహ్రూవంటి మహనీయులను పిల్లలకు పరిచయం చేశారు కవి. మథర్ థెరెసా గురించి రాస్తూ, '... కులమత జాతి వర్గాతీత, మనవతా కళ్యాణ దీపమై / వర్ధిల్లిన జయవర్ధిని ఆమె / శోభిల్లిన గుణ సుందరి ఆమె' అంటారు. బాపురెడ్ది అనేక గేయాలతోపాటు గేయనాటికలను రాశారు. వాటిలో 'చాచా నెహ్రూ' బాలల నృత్యనాటిక మిక్కిలి ప్రసిద్ధి పొందింది. బాపురెడ్డి పిల్లల కోసం చక్కని సాహిత్యాని అనువాదం కూడా చేశారు. వాటిలో ప్రసిద్ధ జపాన్ తత్వ్తవేత్త, విద్యావేత్త, భౌద్ధధర్మ మేధావి డా.దైసాకు ఇకడా రాసిన 'ప్రిన్స్ అండ్ ద కోరల్ సీ'ని నేషనల్ బుక్ ట్రస్ట్ కోసం తెలుగులో 'రాకుమారుడు-పగడాల కడలి' పేరుతో అనువదించారు.
'బాలహేల' బాపురెడ్డి రెండవ బాలల గేయ సంపుటి. ఇది 2012లో వచ్చింది. బాలహేలలో బాలల గురించి రాసినవి, బాలలకోసం రాసినవి అనేక అందమైన గేయాలు మనకు కనిపిస్తాయి. 'బాల్యమంటే / బ్రతుకులోన తొలి మజిలీరా/ బాల్యమంటె అమ్మ కనుల వెలుగురా', 'గట్టుగట్టు మీద కలప / చెట్లు నాటుదాం / సిరిసంపదలిచ్చు / చెట్లు నాటుదాం' వంటి గేయాలు కవి రచనను తెలుపుతాయి. 'ఉన్నాడు ఉన్నాడు బాపు' అనే గేయంలో గాంధీజీని గురించి రాస్తూ, 'ఉన్నాడు ఉన్నాడు బాపు / న్ని, నేడు, రేపు ఉంటాడు' అంటారు. బాపురెడ్డి రచనలు వివిధ పాఠ్యపుస్తకాలలో, బాలానందం సంచికల్లోనూ వచ్చాయి. ఈ విశ్రాంత భారతీయ ప్రశాసనాధికారి కలం నుండి మరిన్ని బాలల రచనలు రావాలని మనమూ కోరుకుందాం.
- డా|| పత్తిపాక మోహన్,
9966229548