Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీరంగపురమనే గ్రామంలో శీనయ్య అనే పశువుల కాపరి నివసిస్తుండేవాడు. రోజూ పశువులను గట్టుకు తోలడం తను ఇంట్లోనే వుండిపోవడం చేస్తుండేవాడు. అవి వేరే వాళ్ళ పొలం మీద పడి మేసేస్తుంటే ఆ పొలం యజమానులు శీనయ్య పైకి గొడవకు దిగేవారు. చదువు లేకపోవడం వలన తనకు సంస్కారం బొత్తిగా లేకపోయింది. అతనికి ఒక్కగానొక్క కుమారుడు సురేష్ అదే గ్రామంలోనే సర్కారు బడికి వెళ్ళేవాడు.
చక్కగా చదువుకుంటున్న కుమారున్ని అప్పుడప్పుడు బడికి శెలవు పెట్టించి పశువుల్లోకి వెళ్ళమని పురమాయించేవాడు శీనయ్య. తను మాత్రం రచ్చబండ దగ్గర కూర్చుని జూదం ఆడడం సాయంత్రానికి ఇంటికి చేరుకోవడం అలవాటుగా చేసుకున్నాడు. అస్తమానం బీడీలు తాగుతూ కాలం వెల్లబుచ్చే వాడు. రోజూ కొడుకుని పిలిచి ''రేరు అంగడికి వెళ్లి బీడీలు పట్టుకురాపో'' అంటూ కొడుకు చేత తెప్పించుకునేవాడు. శీనయ్య మాట తీరు గానీ ప్రవర్తన గానీ ఏమంత సంస్కారవంతంగా వుండేది కాదు. ''నాన్న నేను బడికి వెళతాను'' అని కొడుకు సురేష్ అడిగితే ''అబ్బో చదివి బాగానే ఉద్ధరిస్తావు గానీ ఈయాళ నాకు పని వుంది, నువ్వు పశువులు తోలుకెళ్ళు'' అంటూ కోపంగా కసురుకునేవాడు.
శీనయ్య బీడీలు తాగుతూ మంచంపై కూర్చుంటే సురేష్ బాగా గమనించేవాడు. అంగడికి వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒక అబద్ధమాడి అందులో నుండి ఒక బీడి తస్కరించి ఎవరు లేని చోట తాగడం అలవాటు చేసుకున్నాడు సురేష్. పిల్లలపైకి గొడవకు వెళ్ళడం బూతులు మాట్లాడటం అలవాటుగా మార్చుకున్నాడు. అప్పుడప్పుడు తల్లి శాంతమ్మ మందలించినా కూడా సురేష్ ప్రవర్తనలో మార్పు వచ్చేది కాదు ''నీ వలనే వాడు చెడిపోతున్నాడు చదువుకోవాల్సిన వయసులో వాడితో పనికి రాని పనులు చేపిస్తూ వాడి జీవితాన్ని నాశనం చేస్తున్నావు'' అంటూ శాంతమ్మ భర్త శీనయ్యను దండించేది ''చదువుకుం టున్న పిల్లల్ని చూడు ఎంత చక్కగా మాట్లాడుతున్నారో, నీ కొడుకును బడి మాన్పించి ఊరి మీదకు బలాదూర్ వదిలావు. వాడి నోట్లో ఒక్క మాటైనా సంస్కారవంతంగా వస్తుందా పిల్లల్ని కంటే కాదు పెంచడం నేర్చుకోవాలి'' అంటూ ఊర్లో వాళ్ళు గొడవకు దిగేవారు ''నిన్ను చూసే వాడు అన్నీ నేర్చుకుంటున్నాడు'' అంటూ ఇంట్లో భార్య కోప్పడేది శీనయ్యని. ఐనా శీనయ్యలో మార్పు రాలేదు. తండ్రి జూదం ఆడుతూ కూర్చుంటే సురేష్ కూడా గమనిస్తూ కూర్చునేవాడు ''శీనయ్య ! కొడుకుని బడికి పంపించకపోయావా ఈ కాలం చదువు లేకపోతే ఎందుకు పనికిరారు'' అంటూ స్నేహితులు హితవు పలికేవారు. శ్రద్ధగా బడికి వెళుతున్న సురేష్ బయట తిరుగుళ్ళకు అలవాటు పడి ''నేను బడికి వెళ్ళను'' అంటూ మారాం చేయడం మొదలు పెట్టాడు.
ఒకరోజు మిట్ట మధ్యాహ్నం ఊరి బయట గడ్డివాముకు ఎవరో నిప్పు పెట్టారని ఊర్లో వాళ్ళు పరిగెడుతున్నారు శీనయ్య కూడా వారితో పాటు అక్కడికి వెళ్లి చూస్తే గుండె ఆగిపోయినంత పనైంది. ఆ గడ్డివాము శీనయ్యదే. ఎంతో కష్టపడి కుప్ప పెడితే ఎవరో నిప్పంటించారని బోరుమన్నాడు శివయ్య. పశువులకు మేత లేకుండా పోయింది, అవే తన జీవనాధారమని ఏడ్చుకున్నాడు. అసలు సంగతి తెలిసి ఖంగుతిన్నాడు బీడీ తాగడానికి అలవాటు పడిన సురేష్ ఎవరికి కానకుండా గడ్డివాములో కూర్చుని తాగి అక్కడే పడేసి వచ్చేసాడు. అది కొంచెం కొంచెం రగులుకుని మొత్తం గడ్డివాము కాలిపోయింది.
''చూసావా శీనయ్య పెద్దల్ని చూసి పిల్లలు నేర్చుకుంటారు. చదువు మాన్పించి పశువుల్లోకి పంపించావు. వాడి చేత బీడీలు తెప్పించావు. నువ్వు ఆడే జూదం దగ్గర కూర్చుని గమనిస్తుంటే కనీసం దండించలేదు. మనం చేసే పనులు మన ప్రవర్తన మనం మాట్లాడే పద్ధతి అన్నీ పిల్లలపైన ప్రభావం చూపిస్తాయి. పెద్దలు గురువులు నేర్పిందే వారికి బాగా వంటబడుతుంది. నీ ప్రవర్తన సరిలేదు కాబట్టి వాడు కూడా అదే నేర్చుకున్నాడు. ఈ రోజు నీకు అపారమైన నష్టం కలిగించాడు. ఇప్పటికైనా నీలో మార్పు తెచ్చుకో నీ కొడుకును బడికి పంపించు'' అంటూ మిత్రుడు దండించాడు శీనయ్యని. ''నేను చాలా తప్పు చేసాను అలవాటులో చాలా పొరబాటు చేసుకున్నాను వాడిని ఏమార్చి నందుకు నాకు తగిన శిక్ష పడింది'' అంటూ పశ్చాత్తాపం పడ్డాడు శీనయ్య. ఇక ఆలస్యం చేయకుండా సురేష్‌ని బడికి పురమాయించాడు. తను చెడు అలవాట్లు మానుకుని బుద్దిగా జీవించసాగాడు.
- నరెద్దుల రాజారెడ్డి,
9666016636