Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తన నడవడిక ద్వారా నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి కార్యాచరణకు పూనుకోవడం వలన కమ్యూనిస్టు గాంధీగా పేరు పొందిన పుచ్చలపల్లి సుందరయ్య మే 1, 1913లో నెల్లూరు జిల్లాలోని అలగానిపాడు గ్రామంలో పుట్టాడు. తల్లి శేషమ్మ, తండ్రి వెంకట రామిరెడ్డి. సుందరయ్య అసలు పేరు సుందరరామిరెడ్డి. ప్రాథమిక విద్యను ఊరి వీధి బడిలో చదివాడు. మిగిలిన చదువును బంధువుల వద్ద ఉంటూ తిరువళ్ళూరు, ఏలూరు, రాజమండ్రి, మద్రాసులలో చదివాడు. 1929లో లయోలా కాలేజీలో చేరాడు. తన జీవితమంతా అతి నిరాడంబరంగా సాగిపోయింది. ఆస్తిని, ఐశ్వర్యాన్ని అనుభవించే అవకాశం మెండుగా ఉన్నా వేటిని పట్టించుకోకుండా సాధారణ జీవితానికి అలవాటు పడ్డాడు.
స్వాతంత్య్రోద్యమం
1926లో మద్రాసులోని ట్రిప్లికేన్ హిందూ హైస్కూలులో చేరాడు. సుందరయ్య విప్లవం అనే మాటను రాజమండ్రిలో ఉన్న ప్పుడే బాగా విన్నాడు. ఆయన విప్లవ భావజాలానికి రాజమండ్రియే మూల స్థానమైంది. ఇతను మద్రాసులో ఉన్నప్పుడే తన మిత్రుడైన పార్వతీశం ద్వారా సత్యాగ్రహోద్యమం, సహాయ నిరాకరణ ఉద్యమం, గాంధీ సత్యశోధన గురించి తెల్సుకున్నాడు. ఇలా చదువు నిమిత్తం మద్రాసు వెళ్ళిన సుందరయ్యపై గాంధీ ప్రభావం తీవ్రంగా పడింది. ఇక్కడ ఉన్నప్పుడే సైమన్ కమిషన్ బహిష్కరణకు గురైంది. 1927 లో జరిగిన కాంగ్రెసు సభల గురించి పత్రికలలో చదివి తెలుసుకునే వాడు. సుందరయ్య మద్రాసులో గాంధీ సభకు వెళ్ళినప్పటి నుంచి ఆయన చేసిన పోరాటాల గురించి ఆయన ఆత్మకథలో చదివి ప్రభావితమయ్యాడు. దేశానికి సంపూర్ణ స్వాతంత్య్రం రావాలని భావించాడు. ఇది సుందరయ్య జీవితంలో ఒక ఎత్తు. ఇది కమ్యునిస్టు దక్పథం అలవడక ముందున్న కాలం.
అదే మద్రాసులోనే హెచ్.డి. రాజా అనే అతను సుందరయ్యకు కమ్యూనిస్టు విధానం పరిచయం చేసాడు. ఆ తర్వాత తోటి మిత్రులతో కలిసి సంపూర్ణ స్వాతంత్య్రం ప్రసాదించాలని ర్యాలీ తీశారు. 1930 జనవరి 26న జరిపిన ఊరేగింపులో విద్యార్థులంతా పాల్గొని బ్రిటిషు వ్యతిరేక సాహిత్యాన్ని, పుస్తకాలను పంచారు. ఇతర భావాలను ప్రచారం చేశారు. 1930 లో దిరుసుమర్రు గ్రామంలో ఏప్రిల్ 30న ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నాడు. అనంతరం 1930 జూన్లో అరెస్టయ్యాడు. ఇలా మద్రాసు వెళ్ళినప్పటి నుండి సుందరయ్య జీవితంలో ఉద్యమ దశ మొదలైంది. ఒక రకంగా గాంధీకి భక్తుడిగా మారాడు.
ప్రజా జీవితంలో తిరిగినప్పటి నుండి సుందరయ్యకు బడుగు బలహీన వర్గాల వారి మీద ప్రేమ ఏర్పడింది. 'కమ్యూనిస్టు మ్యానిఫెస్టో' చదివినప్పటి నుంచి కార్మికుల జీవితాలను అర్థం చేసుకోనారంభించాడు. ఏకంగా వీరి ఊరి యువకుల కొరకు ఈ ఉద్గ్రంథాన్ని తెలుగులోకి అనువాదం చేశాడు. సుందరయ్య పుట్టి, పెరిగింది అంతా కోస్తా జిల్లాలోనే అయినా చదువు నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్ళడం అనివార్య కావడంతో దేశంలో ఉన్న పరిస్థితులను అర్థం చేసుకోవడం ఆరంభించాడు. క్రమంగా కాంగ్రెస్ పార్టీలో చేరి సోషలిస్టుగా మారిన తర్వాత కమ్యూనిస్టు అయ్యాడు. ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి, కర్నూలులో పార్టీ కార్యక్రమాలు విస్తరించాక వీరి దష్టి తెలంగాణపై పడింది. తెలంగాణలో బాధ్యతాయుత ప్రభుత్వం స్థాపితం కావాలని డిమాండ్ చేస్తూ, వెట్టి రద్దు కావాలని, దున్నే వానిదే భూమి కావాలని, అక్రమ బేదఖళ్ళను అపాలనే నినాదాలతో ఉద్యమానికి ఊపిరి పోశారు. తెలంగాణ స్వాతంత్య్రోద్యమంలో అతి ప్రధాన ఘట్టమైన సాయుధ పోరాటంలో నాయకుడిగా ఎదిగాడు. ఉద్యమ తీరుతెన్నులను గమనిస్తూనే, ప్రజలను సమీకరించుటకు వారికి, తెలంగాలోని ప్రకతి సంపదను, నిజాం సైన్యాల దోపిడీని తెలుపుతూ ఎప్పటికప్పుడు పుస్తకాలు రచించాడు. తెలంగాణ పోరాట తీవ్రదశకు చేరిన సమయం నుంచి హైదరాబాదు రాష్ట్రం ఏర్పడిన వరకు (1948 నుండి 1952) అజ్ఞాతంలో గడిపాడు.
రాజకీయం
మొదటి సార్వత్రిక ఎన్నికల్లో మద్రాసు నియోజక వర్గం పార్లమెంటుకు ఎన్నికయ్యాడు. అనంతరం పలు మార్లు రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యాడు. సుందరయ్య పార్లమెంటుకు ఎన్నికైనా, అసెంబ్లీకి ఎన్నికైనా నిరాడంబరమైన జీవితాన్ని గడపడమే ఆయన ఆనందం. చట్టసభలలో సభ్యుడిగా ఉంటూ ప్రభుత్వ సౌకర్యాలను పొందకుండా సైకిల్ పై చట్టసభలకు వెళ్ళేవారంటే వారి నిరాడంబరత ఎంత గొప్పదో తెలుసుకోవచ్చు.
రచనలు
తెలంగాణ ప్రజల పోరాటం-దాని పాఠాలు, తెలంగాణ, విశాలాంధ్రలో ప్రజారాజ్యం, గ్రామీణ పేదలు-భూ పంపకం, విప్లవ పథంలో నా పయనం అనే ఆత్మకథతో పాటు పలు రాజకీయ , సాంస్కతిక వ్యాసాలు రచించాడు.
సమాజ అవలక్షణాలపై దష్టి సారించి ఆ రుగ్మతలను రూపు మాపేందుకు కషి చేసి కూటికి లేనోళ్ళ నోటిలో అన్నం మెతుకైన పుచ్చలపల్లి సుందరయ్య మే 19, 1985న అస్తమించాడు. కార్మిక లోకానికి ఆయన ఆత్మబంధువు, బలహీన వర్గాల గుండెల్లో కొలువైన బలవంతుడు పుచ్చలపల్లి సుందరరామిరెడ్డి.
- డా. ఘనపురం సుదర్శన్,
9000470542