Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాహిత్యం సామాజిక హితం కోసమే అని నమ్మి పిల్లల కోసం నాలుగు దశాబ్దాలుగా రాస్తున్న కవి, బాల సాహితీమూర్తి సామలేటి లింగమూర్తి. తానే తన స్వీయ పరిచయంలో చెప్పుకున్నట్టు 'శ్రీకరమైయున్న సిద్దిపేట నగర/మదిరెయు గ్రామంబు మరియు వినుడి/ లింగరెడ్డి నిలయ లింగమూర్తి' కవి సామలేటి లింగమూర్తి. పుట్టింది సిద్దిపేట జిల్లా లింగారెడ్డి పల్లెలో. ఈ ఎనభై అయిదేండ్ల చైతన్యశీలి శతాధిక గ్రంథకర్త.
హైస్కూలు విద్యనభ్యసించి ఎస్.జి.బి.టి టీచర్‌గా రిటైర్డ్ అయిన వీరు పిల్లల కోసం తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లో గేయాలు (రైమ్స్) రాశారు. పద్యం, వచనం, గేయం, యక్షగానం, బుర్రకథ, శతకాలు, పాటలు, గేయాలు, నాటకాలు, హరికథలు వంటి సాహిత్య రూపాలు, ప్రక్రియల్లో నూరుకు పైగా గ్రంథాలు రాశారు. వీరి ముద్రిత, అముద్రితాల్లో 41 పద్య కావ్యాలు, 12 శతకాలు, 5 హరి కథలు, 6 నాటకాలు, 29 వివిధ పాటలు, భజనలు, జానపదాలు, మంగళ హారతులు, కోలాటం వంటి పాటల పుస్తకాలు, 7 వచన కవితా సంపుటాలతో పాటు 4 ఇంగ్లీష్ రైమ్స్, 6 హిందీ పాటల పుస్తకాలు ఉన్నాయి. పద్యకావ్యాల్లో కొన్ని హరికథలు, హిందీ పాటల్లో రెండు మూడు తప్ప అన్నీ ముద్రిత రచనలే.
సిద్ధిపేటలోని విద్వత్కవి డా. వేముగంటి వారిలాగే పెద్దల కోసం ప్రౌఢ పద్యాన్ని, పిల్లల కోసం సరళ గేయాన్ని అత్యంత ప్రతిభా వంతగా రాస్తున్న కవి లింగమూర్తి. అటు సంప్రదాయ పద్యాన్ని, అధునిక వచనాన్ని, బాల సాహిత్యాన్ని సమపాళ్ళలో రాస్తున్న ఈ సవ్యసాచి 'పాటల పల్లకి', 'గేయ తరంగిణి', 'గేయ మంజరి', 'గేయ రంజని', 'గేయ లహరి' వీరి ముద్రిత తెలుగు బాల గేయాలు. 'కలర్ ఫ్లవర్స్', 'బేబి సాంగ్స్' అచ్చయిన ఆంగ్ల రైమ్స్. ఇవేకాక అచ్చులోకి రావాల్సిన బాల సాహిత్యంలో ఆంగ్లంలో 'స్వీట్ సాంగ్స్', 'గుడ్ సాంగ్స్' వంటివి ఉన్నాయి.
మూడున్నర దశాబ్ధాలు ఉపాధ్యాయునిగా పనిచేసిన సుదీర్ఘ అనుభవం లింగమూర్తిది. 'ముద్దు ముద్దు ముద్దు/ ఇంట్లో పాపలు ముద్దు/ ఊర్లో చెరువులు ముద్దు/ ఊరుకు చెట్లు ముద్దు' అంటూ గ్రామీణ జీవనంలోని అద్భుతమైన రహస్యాన్ని సులభంగా పిల్లలకు అర్థమయ్యేట్టు విడమరచి చెబుతారు. ఇంకా 'అమ్మకు పాప ముద్దు' అంటూ ముద్దుగా చెప్పిన ఆయన తన బాధ్యతగా 'బాలలకు బడి ముద్దు/ ఆటకు పట్టు ముద్దు/పాటకు రాగం ముద్దు/విద్యకు శ్రద్ద ముద్దు' అంటూ బోధిస్తాడు. 'దేశానికి మంచి పౌరులనందించాలంటే బాలలను తీర్చిదిద్దాలి. చిన్నతనములో వారికి గేయాలు, కథలు వినిపించాలి... అందుకే నేడు బాల గేయాలకు ఎక్కువ ప్రాముఖ్యత యున్నది' అని నమ్మిన కవి ఆ ప్రాముఖ్యాన్నెరిగి గేయాలు కూర్చారు.
'ఒక్కటి నొక్కటి / యందర మొక్కటి / అందరు దేవుని / బిడ్డలమే... / మత వ్రతములు / విధములు వేరు / మానవులందరు / సోదరులే...చల్లనివాడు / దేవుడే ప్రభువు / అందరిని యిల / సృష్టించాడు....' ఇది కవి సామలేటి సులభసుందరంగా చెప్పి సౌబాృతృత్వ గీత. ఇంతకంటే దీనిని సులభంగా బహుశః ఎవ్వరమ చెప్పలేమేమో! 'చుక్క చుక్క నీరైనా / ఇంకునట్లు /గుంత దీయు/ నీరులేక / నిలువ లేము / నీరుతోనె బ్రతుకు దెరువు/ పారే నీరు / మోరి నీరు/ నేల యింకి శుద్దిగౌను' అంటూ నీటి విలువను గురించి, భావితరాలకు అందిం చాల్సిన నీటి నిలువ గురించి చెబుతారాయన. లింగమూర్తికి ప్రతిష్టాత్మక తెలుగు విశ్వ విద్యాలయం బాల సాహిత్య పురస్కారాన్ని సాధించి పెట్టిన గేయ సంపుటి 'పాటల పల్లకి'. ఇందులోని ప్రతి గేయం పిల్లలకు సులభగ్రాహ్యంగా ఉండడమే కాకా అపారమైన పద సంపదను పరిచయం చేస్తుంది. భాషపై మమకారం, ప్రేమ పెరిగేలా తోడ్పడుతుంది. 'తెల్లని కొంగ మెల్లగ రావే/పిల్ల చేపను తీసుక రావే/ రామచిలుక రావె/పచ్చాకు తేవే/పచ్చాకు తెచ్చి మా పాపాయి కీయవే' వంటి గేయాలు ఇందులో ఉన్నాయి. జీవలక్షణాన్ని ఎంత అందంగా సులభంగా చెప్పాడో కవి. కొంగ చేపను పడుతుంది, చిలుక పచ్చనాకు తింటుంది. ఈ రెండు జీవుల లక్షణాన్ని పిల్లల పేపథ్యంగా చెప్పడం కవి చూపించిన నవీన ప్రతిభ.
'పుట్ట పక్కన ఆడకు/పుట్టలోన చేయి వేయకు/ పుట్టలోన చేయి పెడితె /కుట్టును - చెడు పురుగులు' నాకైతే ఈ గేయ పంక్తుల చివర విశ్వదాభిరామ వినురవేమ! అన్న మకుటమొక్కటి లేని వేమన పద్యంలాగే అనిపిస్తోంది. పిల్లలు మంచి పనులు చేయాలని, అమ్మానాన్నలకు పనుల్లో 'ఆసర'వ్వాలని చెబుతూనే పిల్లలు తప్పక ఆటలాడుకో వాలంటాడు కవి.
ఒక వ్యక్తి ఒక రంగంలోనో, విషయంలోనో, అంశంలోనో ప్రతిభావంతుడుగా వెలగొచ్చు. కానీ తాను చేపట్టిన ప్రతి ప్రక్రియ, సాహితీ రూపంలో తనదైన మార్గంతో ముందుకు వెళ్ళడం అందరికీ సాధ్యంకాదు. అది సవ్యసాచిలాగా నిలిచిన కొందరికే సులభం. అలా పద్యం, వచనం, గేయం, హరికథ, యక్షగానం, హిందీ, ఆంగ్లాల్లో గేయర, భజనలు, కీర్తనలు ఇలా అన్ని రూపాల్లో అభినివేశంతో పాటు అంచుల్ని ముట్టిన 'సిద్ధిపేట పోతన' సామలేటి లింగమూర్తి.
- డా|| పత్తిపాక మోహన్, 9966229548