Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''కాలము ఒక తీరుగా వుండక
జీవన విధానాన్ని మారుస్తుంది
'నేనిలాగే ఉంటాను' అంటే
దుష్ఫలితాన్నిస్తుంది..''!!
ప్రకాశం జిల్లా, ఉలవపాడు గ్రామానికి చెందిన చెందిన కవి ''పిల్లి హజరతయ్య'' వత్తి జిల్లాపరిషత్ పాఠశాల 'పాకల'లో వ్యాయామ ఉపాధ్యాయుడు, తెలుగు, ఇంగ్లీషులో పీజీ చేశారు. బిపిఇడి తర్వాత పిహెచ్ డి చేస్తున్నారు. ఇప్పుడు ''వెలుగుదివ్వెలు'' పేరుతో తొలి కవితా సంపుటిని వెలువరించారు. అందులో మొత్తం మొత్తం 100 కవితలున్నాయి. సామాజిక అవగాహన, లోకరీతి, లోకనీతి ఆయన కవిత్వంలో కూడా ప్రతిబింబిస్తాయి.
''ఎవరికి వారే యమునా తీరే
అన్నట్లు వుండే బంధువులు
చేరువైనా ఫలితం గుండు సున్నేగా''!!
''బలవంతుడిని నేనేనని
జబ్బులు తెరుచుకున్న
ఎందరో మహానుభావులు
కాలగర్భంలో కలిసిపోయారు''!
''కులమతాల కుమ్ములాటలు
నాగరికత పై తీరని మోజులు
కొండను తలపిస్తున్న పాపాలు
సుస్తీ చేసిన ఆరోగ్యాలు
కోల్పోతున్న మానవ సంబంధాలు''!
''మన ప్రతీకారం
పది కాలాలు గుర్తుండాలంటే
సహజమే సమ్మోహనాస్త్రం''!
''పండు బీజమైనా
బీజం నుండైనా
జననం మరణమైనా
మరణం జననమైనా
సష్టి మూలమే''!!
ఈ సంపుటిలో అన్ని కవితలు దాదాపు ఇలాగే వుంటాయి. ఆహా! అనిపించే మెరుపులేం కనబడవు. అంతా వాచ్యంగా, వచనంలా సాగుతుంది.
''వికసించే పుష్పం నేర్పుతుంది
తనలా అందంగా జీవించమని
రాలిపోయే ఆకు చెబుతుంది
జీవితం శాశ్వతం కాదని
ప్రవహించే నది తెలుపుతుంది
అవరోధాల్ని దాటి ముందుకు వెళ్ళమని''!
(ప్రేమతత్వం..)
నిజానికి కవితా పాదాల్ని విడగొట్టి చూస్తే.. సూక్తి ముక్తావళి'' ని తలపిస్తాయి. అయితే ఈ కవి మానవతావాది..'' మానవత్వం పరిఢవిల్లితే చూడాలని వుందనే తత్వం ఈయనది.
''మనిషి వింత పోకడలపై
మానవాళి వికత క్రీడలపై
మానవత్వపు పరిమళాలను కుమ్మరింంచు''!!
కొన్ని చోట్ల ఏమిటిలా రాశాడు అనిపిస్తుంది..
''స్త్రీ యనే దేవతామూర్తిని సమాజమనే
ఈ నరకపు కంపునుండి మంచి నీరుతో
శుద్ధిచేసి కడిగిన ముత్యంలా బయటకు తీసి
ఆమెను దుర్గమ్మతల్లిగా పూజించి
స్త్రీ సాధికారతకు బాటలు వేద్దాం..''!
(నవభారతం.!!)
స్త్రీని దేవత చేసి పూజించడం సరే.. సమాజంలో నుంచి ఆమెను బయటకు తీయడమేమిటి? స్త్రీ కూడా సామాజిక జీవే.. సమాజంలో ఆమెస్థానం ఆమెకి వ్వాలి గాని, సమాజం నుంచి బయటకు తీసి దేవతలా పూజిస్తే సాధికారత వస్తుందా? ఏమో?
ఆధార్ కార్డు గురించి రాసిన మాటలు మాత్రం నచ్చుతాయి..
''తల్లి గర్భం నుండి భువి పైకి
తెచ్చిన తల్లి ధవీకరణ కంటే
నీవుంటేనే నాకు గుర్తింపట
నీవు లేకపోతే నా పుట్టుక ప్రశ్నార్థకమే''!!
ఈ కవి ఆస్తిక వాది..మానవ ప్రయత్నం కంటే దైవానుగ్రహం ముఖ్యమని నమ్మే విశ్వాసి...
''ఎంత ప్రయత్నించినా
కడతేరని బాధలు
దేవుని తీర్పునకు వదిలితే
కష్టాలన్నీ తీరుస్తాడు!
ఆకలితో వున్నవారికి
ఆకలి తీరుస్తూ
నమ్ముకున్న వారికి
దారి చూపిస్తాడు...''!
సంపుటిలోని నూరు కవితలు కూడా ఇంచుమించుగా ఇదే తీరులో వుంటాయి. చాలా వాక్యాలు కొటేషన్లులాగా అనిపిస్తాయి.
వెలుగుదివ్వెలు, పేజీలు :128, వెల : రూ.150/-, ప్రతులకు : పిల్లి హజరతయ్య, 7-128ఎ, సింగరాయకొండ, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్ - 523101; ఫోన్ : 9848606573.
- ఎ.రజాహుస్సేన్