Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యాత్ర చరితలు అనగానే ఏనుగుల వీరస్వామి 'కాశీయాత్ర', ఆదినాయారణ భ్రమణకాంక్ష, సాంకృత్యాయన్ 'లోకసంచారి', బివి రమణ 'ట్రెక్కింగ్ అనుభవాలు...', నాయని కృష్ణకుమారి 'కాశ్మీరీచరిత్ర', రెహనా 'సరిహద్దుల్లో...' రచనలు గుర్తుకొస్తాయి.
అలాగే దీర్ఘకవితలు అనగానే విద్వాన్ విశ్వం 'పెన్నీటి పాట', కుందుర్తి 'తెలంగాణ', జూలూరు 'చెకుముకిరాయి', నా తెలంగాణ, కాంచనపల్లి 'తండ్లాట', బెల్లి యాదయ్య 'విభాజకం' సినారె 'విశ్వంభర', డా|| గోపి 'జలగీతం' మెదులుతాయి. అలాగే స్వీయ చరిత్రలు అనగానే చిలకమర్తి వారి స్వీయచరిత్ర, శ్రీపాద 'అనుభవాలు-జ్ఞాపకాలు', దాశరథి 'జీవనయానం', సామలవారి 'యాది' లాంటివి ఠక్కున గుర్తుకొస్తున్నాయి.
ఇక ఈ పుస్తకంలో జీవిత చరిత్ర, యాత్ర చరిత్ర, దీర్ఘ కవిత రూపంలో ముప్పేటగా అక్షర కృషి చేసారు చలపాక ప్రకాష్. రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి చక్కటి ముందుమాట రాసారు. 'ఎప్పటికైనా మానవ పథికుడు చేరుకొనే గొప్ప విశ్రాంతి మందిరం కవిత' అంటారు ఆరుద్ర. వైయక్తికమైనవే అయినా ప్రాసంగికత గల సందర్భాలను అనుభూతులను, సంస్పందనలను అందరితోనూ పంచుకోవాలనుకున్న విశాల సంకల్పం ఒక సాహిత్యకారుణ్ని 'కవి'గా మలుస్తుంది. పత్రికా సంపాదకునిగా, కార్టూనిస్టుగా, రచయితగా, విమర్శకుడిగా, కవిగా, సాహిత్య రంగ - సాంస్కృతిక రంగ కార్యకర్తగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సుపరిచితులైన చలపాక ప్రకాష్ దీర్ఘకవితలో కొన్ని వెంటాడే వాక్యాలు చూద్దాం.
బాల్యంలో సంఘటనల్ని కవిత్వీకరించడంతో మొదలైన ఈ దీర్ఘకవిత... అమెరికా సభల దాకా సాగి తన వృత్తి - ప్రవృత్తి సాగించే 'జీవనయాత్ర' తెలపడంతో ముగుస్తుంది. కవి పాల్గొన్న అనేకానేక సాహిత్య సభల చాయా చిత్రాలు... కవులకు, రచయితలకు, స్ఫూర్తినిస్తాయి. కవి అక్షర కృషికి అద్దం పడతాయి.
'ఆ రెండు రూపాయలుంటే రెండు రోజులు తిండికి పనికొస్తాయని / మా తల్లిదండ్రులన్నప్పుడు / మనస్సులోనే ఆ సరదాలను చంపుకున్న సందర్భం - నాకిప్పుడూ గుర్తే' అంటారు (పేజీ - 9).
పేదరికంలో పెరిగిన (బాల్యం) విద్యార్థులకే పై స్థితి అర్థం అవుతుంది.
'రాత్రిళ్ళు నిద్రపోయే ముందు / నానమ్మ చెప్పిన కథలతో - నా ఊహల యాత్రలో నా పాత్ర ఎప్పుడూ విహరిస్తూనే వుండేది!' అంటారు (పేజీ -13)
''యాత్రంటే - అనేక పాత్రలని కలగలుపుకొని- కొంగ్రొత్త పాఠాలను నేర్చుకుంటూ సాగిపోవడం'' అంటారు ఒక చోట (పేజీ -19). నోస్టాలజీ... పాఠకుల్ని కదిలించేలా చెప్పడం ఓ గొప్ప టెక్నిక్... ''గుడులకు బదులు అనేక సాహిత్య వేదికలెక్కి - అక్షర పద్యాలను మంత్రాలుగా చదివాను!'' (పేజీ -21).
''కుల మత ప్రాంతీయ భేదాలు లేని సహపంక్తి భోజనాలలో సాహితీకారుడిగా, అనేక సువాసనలను రచి చూపాను - అనేక సాహిత్య జీవన గాథలను, కథలుగా సృశించాను'' అనే వాక్యాల్లో కవి లౌకిక దృక్పథం కనిపిస్తుంది. ''నా వృత్తి జీవనమే కాదు, నా ప్రవృత్తి జీవితం కూడా బంగారంతో సరిసమానంగా మలుచుకున్న పాత్ర'' అని తన పంథా ప్రయాణం ప్రకటించిన ప్రకాష్ అక్షర దీర్ఘ కవితా కృషి అభినందనీయం.
నా జీవనయాత్ర (దీర్ఘ కవిత),
రచన : చలపాక ప్రకాష్,
పేజీలు : 40, వెల : రూ. 30/-,
ప్రతులకు : చలపాక ప్రకాష్,
1-4/3-36, సంజరు గాంధీ కాలనీ,
విద్యాధర పురం,
విజయవాడ - 520012
ఫోన్ : 9247475975
- తంగిరాల చక్రవర్తి , 9393804472