Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మణిపురీ సినిమాలలో ఓ బలమైన స్త్రీ పాత్ర
తల్లిదండ్రుల అండ లేని పిల్లల జీవితాలు అతి విషాదంగా ఉండే సందర్భాలు ఎన్నో. మగపిల్లవానికన్నా ఈ పరిస్థితిలో ఆడపిల్ల ఎదుర్కునే అనుభవాలు చాలా దారుణంగా ఉంటాయి. అటువంటి ఓ అమ్మాయి కథను 2010లో మణిపురి భాషలో ''మమాదో లైసాబిదో అంగావ్బిదో'' అనే పేరుతో సినిమాగా తీశారు. ఖైదం ప్రమోదిని రాసిన నాటకం ఆధారంగా రూపొందిన సినిమా ఇది. మణిపూరి భాషలో ఖైదం ప్రమోదినీ పేరు పొందిన రచయిత్రి. స్త్రీల పక్షాన నిలబడి ఎంతో విలువైన సాహిత్యాన్ని ఈమె మణిపూరి భాషకు అందించారు. కవిత్వం, కథలు నాటకాలు ఇలా అన్ని ప్రక్రియలలో సాహితీ సృజన చేస్తూ దాదాపు 32 పుస్తకాలను రచించిన రచయిత్రి ఈమె. వీరి నాటకం ''మమాదో లైసాబిదో అంగావ్బిదో'' కి మణీపూరి సాహిత్యంలో గొప్ప స్థానం ఉంది. ''మమాదో లైసాబిదో అంగావ్బిదో'' అంటే ''ఓ అమ్మ, ఓ కన్య, ఓ పిచ్చిది'' అని అర్ధం.
ఈ కథలో నాయిక పేరు సుశీల. ఈమె తండ్రి ఓ చిన్న జీతగాడు. పెళ్ళి చేసుకుని అత్తగారింట ఉంటుంటాడు. అయితే సుశీల హైస్కూల్లో చదువుతున్నప్పుడే ఆమె తల్లి లలిత ఓ ఉద్యోగస్తుడి ప్రేమలో పడి వెళ్ళిపోతుంది. ఆమె చేసిన ఈ పనికి ఆమె భర్త, కూతురు సుశీలతో పాటు, ఆమె తల్లి కూడా కృంగిపోతుంది. సుశీల తండ్రి నందో ఆ సంఘటన తరువాత, ఆ ఊర్లో ఉండలేక తన తల్లిదండ్రుల వద్దకు వెళ్ళిపోతాడు. అయితే వెళుతూ సుశీలను ఆమె అమ్మమ్మ దగ్గరే వదిలేస్తాడు. సుశీలకు తన దగ్గరకు రావాలని ఉన్నప్పుడు తాను వచ్చి తీసుకుని వెళతానని కూడా చెబుతాడు. అతను తన వారి వద్దకు వెళ్ళిన తరువాత మరో వివాహం చేసుకుంటాడు. అయినా కూతురిని మరచిపోడు. అప్పుడప్పుడు వచ్చి ఆమె బాగోగులు కనుక్కుని వెళుతూ ఉంటాడు.
సుశీల అమ్మమ్మ మనరాలికి మంచి జీవితం ఇవ్వాలని కోరుకుంటుంది. కాని ఆమె ఒంటరిగా తన భూమి వ్యవహారాలు చూసుకోలేకపోతుంది. అందుకని తన భూమి అమ్మి ఆ డబ్బు తీసుకుని తన చిన్న తమ్ముడి ఇంటికి వస్తుంది. అక్కడే మనవరాలితో ఉండిపోతుంది. కాని ఆమె తమ్ముడు ఏ పని చేయని సోమరిపోతు. అతని కొడుకు కూడా అటువంటి వాడే. వీటికి తోడు ఆ తమ్ముడి భార్య మహా కోపిష్టి, గయ్యాళి కూడా. వీరి మధ్య జీవించడం ఈ అమ్మమ్మ, మనవరాళ్లకు ప్రతి రోజు ఓ గండంలా ఉంటుంది. అటువంటి పరిస్థితులలో పిల్లలకు ట్యూషన్ చెబుతూ సుశీల చదువుకుంటూ ఉంటుంది. చదువు పట్ల ఆమెకు ఎంతో ఆసక్తి. క్లాసులో ఎప్పుడూ ఫస్ట్ వచ్చే ఆమెకు ఎటువంటి ప్రశంస ఇంట లభించదు. పైగా ఆమె సంపాదనను ఏదో ఓ కారణంతో లాక్కుంటూ ఉంటారు ఆ బంధువులు.
సుశీల క్లాస్మేట్ సురేష్ ఆమెను ఇష్టపడతాడు. సుశీల ఎప్పుడు అతని కన్నా ఎక్కువ మార్కులతో పాస్ అవుతూ ఉంటుంది. కాని పరిస్థితుల కారణంగా ఆమె చదువు కుంటి నడక నడుస్తూ ఉంటుంది. ఈ లోపు సురేష్ డాక్టర్ చదవడానికి పట్నం వెళతాడు. తిరిగి వచ్చి సుశీలను వివాహం చేసుకుంటానని చెబుతాడు. అతనే తనను ఆ నరకం నుండి రక్షిస్తాడని చాలా నమ్ముతుంది సుశీల. ఇంట్లో ఆమెకు సమస్యలు ఇంకా పెరుగుతాయి. ఆమె స్థితిని చూసి అమ్మమ్మ ప్రతి క్షణం బాధపడుతూ ఉంటుంది. ప్రతి రోజు మనవరాలి పక్కన పడుకుని నిస్సహాయంగా కన్నీరు కార్చే ఆమె స్థితి చూసి సుశీల రోజూ బాధపడుతుంది. ఓ సారి సుశీల తండ్రి ఆమెను చూడడానికి వస్తాడు. బిడ్డను తీసుకు వెళ్లమని అత్తగారు అతనితో చెప్పలేక చెబుతుంది. తండ్రి మరుసటి రోజున వచ్చి సుశీలను తనతో తీసుకువెళతాడు. సుశీల తండ్రితో వెళ్లిపోయే రోజున సుశీల తన దుఃఖాన్ని చూసి ఎక్కడ వెళ్ళకుండా ఆగిపోతుందో అని భయపడి అమ్మమ్మ ఇంటి బైట దాక్కుని మనవరాలు వెళ్ళిపోవడాన్ని మౌనంగా కన్నీరు కారుస్తూ చూస్తూ ఉంటుంది.
తండ్రితో కలిసి బంధువుల ఇల్లు వదిలి పోతున్న సుశీలకు తనకో అండ దొరికిందన్న భరోసా కలుగుతుంది. తండ్రి తనను చిన్నప్పుడు ప్రేమగా చూడడం ఆమెకు గుర్తుకు వస్తూ ఉంటుంది. ఆ పాత రోజులు తిరిగి వచ్చాయని సంతోషిస్తుంది. కాని తండ్రి ఇంటికి వచ్చాక అక్కడి పరిస్థితి అందుకు పూర్తి విరుద్ధంగా ఉంటుంది. సవతి తల్లి మూర్ఖురాలు, ఆమె ఇద్దరు కొడుకులు దారి తప్పి ఉంటారు. తండ్రి ఆ పరిస్థితిలో సహనం కోల్పొయి నిత్యం సవతి తల్లి పై చేయి చేసుకుంటూ ఉంటాడు. ఆ కోపాన్ని ఆమె సుశీలపై చూపిస్తూ ఇల్లు నరకం చేస్తూ ఉంటుంది. ఆ పరిస్థితులలో కూడా చదువుకుని ఆమె యూనివర్సిటీలో మూడవ ర్యాంకు సాధిస్తుంది. కాని ఆ సంతోషాన్ని పంచుకునే వాతావరణం ఆ ఇంట ఉండదు. ఓ చిన్న ఉద్యోగం చేస్తూ ఆ జీతం కూడా ఇంటివారికే ఇస్తూ, వారి నుండి కాస్త ప్రేమను మాత్రమే ఆశించే సుశీలకు తండ్రి నిస్సహాయత, కోపం, తల్లి క్రూరత్వం తమ్ముళ్ల దబాయింపులు తప్ప మరేం దొరకవు. ఓ రోజు స్కూల్ ఎక్స్కర్షణ్కు సుశీల వెళ్లినప్పుడు ఆమె తండ్రి జ్వరంతో చనిపోతాడు. దీనికి కొంత వరకు ఆమె తల్లి నిర్లక్ష్య వైఖరి కూడా కారణం అని తెలుసుకున్నాక ఆమె విపరీతమైన అభద్రతా భావానికి గురి అవుతుంది.
ఇక సవతి తల్లి ఇంట ఉండలేక ఆమె తన సొంత తల్లి లలిత ఇల్లు వెతుక్కుంటూ వెళుతుంది. తల్లి ముందు ఆమెను తన ఇంటిలోకి తెచ్చుకోవడానికి ఇష్టపడదు. కాని సుశీలకు ఉండడానికి మరో చోటు లేదని తెలుసుకుని ఆమెను ఇంటిలోకి తీసుకొస్తుంది. లలిత ఇప్పుడు కలిసి ఉంటున్న వ్యక్తి తాగుబోతు. లలిత భర్తను వదిలేసి తనతో వచ్చిందని ఆమె అంటే అతనికి చులకన. ప్రతిరోజు ఆమెను మానసికంగా, శారీరికంగా, లైంగికంగా వేధిస్తూ ఉంటాడు. అక్కడ ప్రతి రాత్రి తల్లి పడే హింస, మారుటి తండ్రి రచ్చ చూసి సుశీల విపరీతమైన ఒత్తిడికి గురి అవుతుంది.
ఈ లోపు సురేష్ మెడిసన్ పూర్తి చేసుకుని నగరంలో డాక్టర్‌గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. అతన్ని ఓ రోజు చూసి అతను పని చేస్తున్న హాస్పిటల్ గురించి తెలుసుకుని సుశీల అతన్ని కలవాలని వెళుతుంది. కాని అప్పటికే సురేష్ ఆమెను మర్చిపోతాడు. తనతో చదివిన మరో డాక్టర్ని తాను ప్రేమించానని ఆమెతో తనకు వివాహం నిశ్చయమయిందని తనను మరచిపొమ్మని సుశీలతో చెబుతాడు. అప్పటిదాకా అతని కోసం ఎదురు చూస్తూ రోజులు లెక్కపెడుతున్న సుశీల ఈ మాటను తట్టుకోలేకపోతుంది. ఇక తన జీవితంలో తనకు సుఃఖం లేదని తన పరిస్థితులలో మార్పు రాదని తెలుసుకుని ఆమె విపరీతమైన వేదనను అనుభవిస్తుంది. ఆమె ప్రవర్తనలో భయం, ఆలోచనలలో తడబాటు అందరికీ కనిపిస్తూ ఉంటాయి. ఈ సమయంలో తల్లి కూడా సుశీలకు సానుభూతి చూపించే పరిస్థితిలో ఉండదు. పైగా భర్త దగ్గర తాను అనుభవిస్తున్న క్రూరత్వాన్ని కూతురిపై కోపంగా, కసిగా మార్చుకుని సుశీలను పిచ్చిదని అంటూ ఆమె మానసిక స్థితి ఇంకా దిగజారడానికి కారణం అవుతుంది.
ఈ పరిస్థితిని తప్పించుకోవడానికి తనను అభిమానించే స్నేహితురాలి ఇంట ఆశ్రయం పొంది కొన్నాళ్లు ప్రశాంతంగా ఉండాలని సుశీల కోరుకుంటుంది. ఆమె స్నేహితురాలు కూడా ఎంతో ప్రేమతో సుశీలకు ఆశ్రయం ఇస్తుంది. కాని ఆమె అమ్మమ్మ తమ్ముడు తమ చుట్టరికాన్ని అడ్డు పెట్టుకుని, ఏ బంధుత్వం లేని ఆ స్నేహితురాలి మాటను పట్టించుకోకుండా, సుశీలపై అధికారం చూపుతూ ఆమె పిచ్చిదని జైలు అధికారులకు అప్పజెబుతాడు. సుశీల మనుషులపై నమ్మకాన్ని వదులుకుని పిచ్చివాళ్లలో ఒకరిగా అక్కడ మిగిలిపోతుంది.
పిచ్చిదైన వ్యక్తి చేరవలసింది పిచ్చి అసుపత్రి అయితే ఆమెను జైలుకి పంపడం కొంత నాకు అర్థం కాలేదు. బహుశా మణిపుర్లో పిచ్చివారి పట్ల చట్టాలు వేరేలా ఉన్నాయేమో మరి తెలియదు. కాని ఇక్కడ కాపలా కాసే పోలీసుకు, సెంట్రీల మధ్య జైలులో సుశీల ఉంటూ ఉంటుంది.
ఆ జైలులో ఈ మతి స్థిమితం లేని ఖైదీలను చూసే డాక్టర్ యువకుడు, ఆదర్శభావాలు కలవాడు. అతను సుశీల మానసికంగా దెబ్బ తినింది కాని ఆమె పిచ్చిది కాదని గ్రహిస్తాడు. ఆమె గతం అతన్ని కదిలిస్తుంది. సుశీల అతను డాక్టర్ అని, సురేష్ తన మనసుకు చేసిన గాయాన్ని మర్చిపోలేక అతనితో మొదట చాలా కోపంగా, కసిగా ప్రవర్తిస్తుంది. సురేష్‌పై ఉన్న కోపాన్ని ఈ డాక్టర్‌పై అకారణంగా వెళ్ళగక్కుతుంది. కాని ఆమె గతం తెలిసిన డాక్టర్ ఆమెతో చాలా ఒపిగ్గా ప్రవర్తిస్తాడు. ఆమెకు చదువు పట్ల ఉన్న కోరిక తెలుసుకుని ఆమెను రక్షించాలని నిర్ణయించుకుంటాడు. ఆమెను ఆ జైలు నుండి విడుదల చేయించాలంటే ఆమె పిచ్చిది కాదనే సర్టిఫికేట్‌తో పాటు ఆమె కుటుంబ సభ్యుల సంతకాలు కూడా అవసరం అని ఓ లాయర్ ద్వారా తెలుసుకుని ఆమె అమ్మమ్మ తమ్ముడికి అడిగినంత డబ్బు ఇచ్చి ఆమె విడుదల కాగితాలపై సంతకాలు పెట్టించుకుంటాడు డాక్టర్. తనకు తెలిసిన ఓ మహిళా సదనులో ఆమె ఉండడానికి చోటు సంపాదిస్తాడు.
డాక్టర్ మనసులో సుశీల పట్ల ప్రేమ ఉంటుంది. అది సుశీలకు కూడా అర్ధం అవుతుంది. కాని అప్పటికే ఎన్నో గాయాలయిన మనసు ఏ మంచినీ స్వీకరించే స్థితిలో లేదని ఆమెకు, ఆ డాక్టర్‌కు కూడా తెలుసు. అందుకని సుశీల విడుదల అయి ఆమె మహిళా సదనులో చేరి, ఆమె జీవితానికో స్థిరత్వం ఏర్పడగలదని ఆమెలో నమ్మకం చేరాక తన మనసు ఆమెకు చెప్పాలనుకుంటాడు డాక్టర్. దానికి ఆమెను సిద్ధం చేస్తాడు కూడా. తన ప్రేమ ఆమెకు చెప్పడానికి వస్తున్న డాక్టర్‌ను అతని ఆస్థిపై కన్నేసిన ప్రత్యర్ధులు హత్య చేస్తారు. అతను సుశీల చేతిలోనే మరణిస్తాడు.
అతనిచ్చిన మానసికబలంతో మనుషులపై నమ్మకంతో సుశీల చదువును ఆశ్రయించి చివరకు మణిపూర్ యునివర్సిటీలో ఫ్రొఫెసర్ హోదా సంపాదిస్తుంది. చివరి సీన్లో సుశీల ఇంటి ముందు గేటు సందులోనించి ఆమెను గమనిస్తూ అపరాధభావంతో నిలబడి ఉంటుంది సుశీల తల్లి లలిత. బిడ్డను పలకరించలేని స్థితిలో దిగాలుగా ఆమెను చూస్తూ అక్కడి నుండి నడుచుకుంటూ వెళ్లిపోతుంది. జీవితం ఇచ్చిన అనుభవంతో పుస్తకాలలో లీనమయిపోయిన సుశీల చేరుకున్న గమ్యం, ప్రేక్షకులకు ఆనందం కలిగిస్తుంది.
సినిమాలో డాక్టర్ మరణం అవసరం లేదేమో అనిపిస్తుంది. కాని బహుశా ట్రాజెడీ దిశగానే కథను నడిపించాలని రచయిత్రి ఉద్దేశం కావచ్చు. కాని అతనిచ్చిన స్ఫూర్తితో తన జీవితాన్ని మలచుకుని నలుగురికి ఆదర్శంగా నిలిచే విధంగా జీవిస్తున్న సుశీల జీవిత కథను ముగిస్తూ రచయిత్రి కొన్ని ముఖ్యమైన విషయాలను ఈ కథ ద్వారా చర్చకు పెడతారు. అవి గమనించవలసిన విషయాలు.
ఆర్థికపరమైన అసంతృప్తులతో భవిష్యత్తు గురించి ఏవో కలలతో, బాధ్యతలను మరచి, లలిత కుటుంబాన్ని వదిలి వెళ్ళిపోతుంది. చివరకు ఆమె మరో పురుషుని అహానికి లొంగి జీవించవలసి వస్తుంది. లలిత వెళ్ళిపోయిన తరువాత ఆమె తండ్రి వివాహం చేసుకున్న స్త్రీ కూడా పేకాట ఆడుతూ ఏవో సుఖాలను అనుభవించాలని తపన పడుతూ జీవితాన్ని నరకం చేసుకుంటుంది. అటు భర్తకూ న్యాయం చేయదు, పుట్టిన బిడ్డలకూ న్యాయం చేయకుండా సున్నితత్వాన్ని కోల్పోయి గయ్యాళిగా మారుతుంది. ఇక అమ్మమ్మ తమ్ముడి కుటుంబంలో ఆ తమ్ముని భార్య కూడా పని చేయని భర్తని, మాట వినని కొడుకుని భరించలేక ఆ కోపం ఇతరులపై చూపిస్తూ ఉంటుంది. చదువు రాని అమ్మమ్మ తన విషయాలను చూసుకోలేక మనవరాలిపై ఎంత ప్రేమ ఉన్నా మరొకరిపై ఆధారపడుతూ నిత్యం నరకం అనుభవిస్తూ ఉంటుంది. ఈ స్త్రీలందరూ కూడ సమాజంలోని కఠిన పరిస్థితుల మధ్య తమ చేతకాని తనం కారణంగా ఎవరికీ ఉపయోగపడకుండా మిగిలి పోయిన అతి సామాన్యులు. వీరి మధ్య జీవితం నరకప్రాయం అయి నలిగిపోతుంది సుశీల. ఆమెలోని ఎన్నో మంచి గుణాలున్నా కాని పరిస్థితుల మధ్య అవి ఆమెకు కూడా ఉపయోగం లేకుండా పోతాయి. మనం మన చుట్టూ సృష్టించుకునే వాతావరణం మన జీవితాలను ఇతరుల జీవితాలను ఎంతగా ప్రభావితం చేస్తుందో చాలా మంది స్త్రీలకు అర్థం కాని విషయం.
సురేష్ సుశీల ప్రేమను తిరస్కరించడానికి కారణం ఆమె తనకు సరిపోదని అతను భావించడం. ఆమెకు అతనిలో అంతకు ముందు కనిపించిన సుగుణాలన్నీ కూడా ఆమె బలహీనపడి, అతను ఆర్ధికంగా బలపడిన తరువాత కనిపించకుండా పోతాయి. సరైన వాతావరణంలోకి వచ్చి తనపై తాను నమ్మకాన్ని కుదుర్చుకున్నాక సుశీల తన పరిస్థితులపై విజయం సాధిస్తుంది. మరోసారి కాలం ప్రేమ పేరుతో చేసిన గాయాన్ని కూడా ఆమె అధిగమించి తన జీవితాన్ని మలచుకోవడమే కాకుండా కొందరికి స్ఫూర్తిదాయకమై, ఓ ఉన్నత ఉద్యోగినిగా బాధ్యతలను నిర్వహిస్తూ తన ప్రపంచాన్ని సృష్టించుకోగలుగుతుంది.
పరిస్థితులకు లొంగి, భంగపడి జీవించే ఆ ఇతర స్త్రీల ప్రతినిధిగా కనిపించే ఆమె తల్లి చివరి సీన్లో సుశీల ఇంటి గేటు దాటి లోపలికి వెళ్ళే సాహసం చేయలేని స్థితిలో మిగిలిపోవడం సుశీల సాధించిన విజయం. పరిస్థితులతో మనిషి చేయవలసిన యుద్ధం, ముఖ్యంగా స్త్రీలు తమ చుట్టూ ఉన్న పరిస్థితులను అర్థం చేసుకుని తమ జీవితాలను మార్చుకోవలసిన అవసరాన్ని వివరించిన సినిమా ఇది. సుశీల తప్ప ఇందులో చూపిన ప్రతి స్త్రీ కూడా తమ పరిస్థితుల పట్ల కోపంతో, అసహాయతతో, ఆలోచన లేకుండా ప్రవర్తించి జీవితాలని నాశనం చేసుకున్నారు కాని నిర్మించుకోలేక పోయారు. ఆ స్త్రీలు అందరూ కూడా, తమ పరిస్థితులు మారడానికి తమలో రావల్సిన మార్పు గురించి కాకుండా, ఇతరుల ద్వారా తమకు లభించే వాటి పట్ల ఆలోచనలతో, కోరికలతో జీవితం గడిపారు. తన చుట్టూ ఉన్న పరిస్థితులకు ఎదుర్కోవడానికి తనను తాను బలోపేతం చేసుకునే మార్గాన్ని ఎన్నుకున్న సుశీలలోని ఆలోచన, దాని వలన మారిన ఆమె స్థితిగతులను చర్చకు తీసుకువచ్చిన సినిమా ఇది.
ఇందులో సుశీల పాత్రలో నటించిన కమలా సైఖోమ్ గొప్ప నటనను ప్రదర్శించారు. ఎక్కడా అతి లేకుండా చాలా బాలెన్స్డ్గా ఆ పాత్రను పండించారు ఆమె. డాక్టర్ పాత్రలో గోకుల్ అతొక్పాం చాలా బావున్నారు. ముఖ్యంగా ఈ సినిమా సంగీతం, ఫొటోగ్రఫీ భాష, ఆ ప్రాంతపు సంస్కృతి తెలియని వారికి కూడా నచ్చుతాయి.
- పి.జ్యోతి, 9885384740