Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'మనిషి తన బాధల్ని లెక్కిస్తాడు. తన ఆనందాన్ని లెక్కించడు' అంటాడు దోస్తావిస్క్. విషాదం ఒక గాఢమైన ఉద్వేగం గనుక అది కవిత్వంలో సాంద్రంగా పలకడం సర్వసాధారణమే. స్నేహం, ప్రేమ, వియోగం, ఘర్షణ, దు:ఖం, కరుణ, ఆవేదన, ఆగ్రహం, సానుభూతి వంటి మానవానుభూతులు కవిత్వంలో వస్తువులుగా వస్తాయి.
''మన సుమధుర గీతాలన్నీ అత్యంత విషాద ఆలోచనలను చెప్పేవే'' - అనిషెల్లీ అంటాడు. తెలుగునాట సహచరి వియోగం మీద కవిత్వం రాసిన వారెందరో వున్నారు. విశ్వనాధ సత్యనారాయణ కూడా భార్య వియోగంపై ''వరలక్ష్మీ త్రిశతి'' రాసారు. ఈ కవి ప్రమోద్ కూడా చాలా కవితల్లో వియోగం, విషాదం పలికించారు. ఈ కవిత్వ పుస్తకానికి మన్నెం శారద, యండమూరి వీరేంద్రనాథ్, ఎన్ వేణుగోపాల్, వేదాంతసూరి, కెరె జగదీష్, మంజు యనమదల లాంటి సాహితీవేత్తలు చక్కటి ముందుమాటలు రాసారు. మచ్చుకు కొన్ని కవితలు చూద్దాం! కవి తన తండ్రిపై 'నాన్న యాదిలో' (పేజీ : 29) కవితలో ఒక చోట ఇలా అంటారు.
''అన్నం కూడా తినకుండా నువ్వు కొన్న ప్రతి పుస్తకంలోను నువ్వే / నా కష్టంలో నన్ను కడుపులో దాచుకున్న అమ్మలో నువ్వే''.
అలాగే 'ఆమె' కవితలో (పేజీ : 34) - ''ఒక బాధ్యత / బిడ్డల కోసం మరణం అంచుల దాకా వెళుతుంది / ఒక అమ్మ, ఒక అక్క, ఒక చెల్లి, ఒక భార్య, ఒక స్నేహితురాలు'' అంటాడు.
తెగిన గాలిపటం కవితలో (పేజీ : 148)
''నీవు లేని జీవితాన తెగిన గాలి పటంలా / ఆకాశంలో దిక్కు తెలియక పయనిస్తున్న నన్ను చుట్టుకున్న చీకటిని చూసి... ధైర్యంగా నడిచే నీ మాటలు చీకటిని నిలదీస్తాయి వెలుగు ప్రస్థానంలో నాకు తోడుగా వుంటాయి'' అంటారు కవి.
అలాగే 'ఆటుపోటులు' కవితలో చివరి వాక్యాలు ఎంతో ఆర్ధ్రంగా వున్నాయి (పేజీ : 150)
''నువ్వు లేని ఈ చీకటి పగిలిన / అద్దమై నా హృదయానికి / కుచ్చుకుంటుంది చీకటి ముక్కలైన నా మనసులో వెలుగు జాడే లేదు'' అంటారు.
నేను ఒంటరిని - ఇక్కడైనా, ఇంకెక్కడైనా, నిశ్శబ్ధం మౌనమై / పొద్దంతా నా తోనే / నన్ను విడిచి వెళ్ళాయి... నడి సముద్రంలో నన్ను సూర్యుడికి గ్రహణం / శ్వాస - నిశ్వాస లాంటి కవితల్లో విషాదం, వియోగం, ఆర్తి, ఆర్ధ్రత బలంగా నిండిన కవితలున్నాయి.
జీవన సహచరి ఎడబాటుతో రాసిన అక్షర జ్ఞాపకాలు ఆలోచింపచేస్తాయి.
గుండె చప్పుళ్లు
కవి : ప్రమోద ఆవంచ
పేజీలు : 168, వెల : 100/-
ప్రతులకు : ఆవంచ ప్రమోద్‌కుమార్,
ఇ.నెం. 80/81, గాయత్రీనగర్,
జిల్లెలగూడ, హైదరాబాద్ - 500097
ఫోన్ : 7013272452
- తంగిరాల చక్రవర్తి , 9393804472