Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఐతా చంద్రయ్య పేరు తెలియని తెలుగు కథా ప్రియులు ఉండరు. తెలుగు కథను సుసంపన్నం చేస్తున్న కథకుల్లో ఈ 'కథాశిల్పి' ఒకరు. నేటి సిద్ధిపేట జిల్లా చింతమడక గ్రామంలో జనవరి 3, 1946న పుట్టారు, తల్లితండ్రులు ఐతా లక్ష్మి-లింగయ్యలు. బి.ఎ లిటరేచర్ చదివి, తపాలాశాఖలో పోస్ట్ మాస్టర్‌గా పనిచేశారు. ఏడున్నర పదుల జీవన కథ, కవిత్వం, నవల వంటి ప్రక్రియల్లో ఎన్నో మేలిమి రచనలు చేశారో, బాలల కోసం కూడా అంతే తపనతో రాశారు. అంతేకాక అనువాదకులుగా కూడా ప్రసిద్ధులైన వీరు కథలు, నవలలే కాక బాల సాహిత్యాన్ని కూడా తెలుగులోకి అనువాదం చేశారు.
రచయితగా, కవిగా, నాటకకర్తగా, అనువాదకులుగా, వ్యాసకర్తగా జాతీయ భావనా స్రవంతితో రచనలు చేస్తున్న ఐతా చంద్రయ్య ఖాతాలో నమోదయిన రచనలు తొంబైరెండు. వీటిలో 18 కథా సంపుటాలు, 19 పద్య, గేయ, వచన కవితా సంపుటాలు, 11 నవలలు, 6 ఏకపాత్రా సంపుటాలు, 21 అనువాదాలు, వ్యాసాలతో పాటు ఇతర రచనలు 8 ఎనిమది ఉన్నాయి. ఇవేకాక రేడియో కోసం, రంగస్థల ప్రదర్శన కోసం రాసిన నాటికల 20 వరకు ఉన్నాయి. ఐతా చంద్రయ్య బాలల కోసం రాసినవి 28 పుస్తకాలు. వర విక్రయం, చిలకపచ్చచీర, సిద్ధిపురి కథలు, పల్లె నాతల్లి, ప్రజ్ఞాపూర్ చౌరస్తా వంటివి ప్రసిద్ధ కథా సంపుటాల్లో కొన్ని. శ్రీగిరీశ శతకం, భద్రగిరి నివాస శతకం, గంగోత్రి, తారా హారము, ప్రణవ నాదము, త్రిశూలము, పేరడీల గారడి, తెలంగాణ పదాలు, పాలముంత కవితా కావ్యాలు, పాటుఇసుక గోడలు, ఆడపిల్ల, తల్లీభారతి, పత్తి కొండ, శ్రీవాసవాంబ, త్రిభుజ, సంద్యా వందనం, పడమటి సూర్యోదయం వీరికి పేరుతెచ్చిన నవలలు. రంగ స్థలం కోసం, రేడియో కోసం రాసిన రోజులు మారాయి, బుద్దొచ్చింది, తిక్క కుదిరింది, పెద్దమ్మ పేచీ, చతుర్ముఖి నాటికలు వీరికి పేరు తెచ్చాయి.
బాలల కోసం గేయం, కథ, కవిత, నవలలతో పాటు దేశనాయకులు, ప్రముఖుల జీవిత చరిత్రలు, నాటికలు రచించిన ఐతా చంద్రయ్య అనువాదాలు కాకుండా 28 పుస్తకాలను వారికి కానకగా అందించారు. 'తేనె చుక్కలు', 'వెన్నెల వెన్నెల కెరటాలు', వీరి బాల గేయ సంపుటాలు. 'కుందేలు తెలివి', 'వందేమాతరం' బాలల కోసం రాసిన కథా సంపుటాలు. పిల్లల కోసం 'విజయ విలాసము' నవల కూడా రాసిన వీరు ఇరవైకి పైగా జీవిత కథలు, చరిత్రలను అందించారు. అవి, పొట్టి శ్రీరాములు, వీరేశలింగం, ప్రకాశం పంతులు, బ్రహ్మనాయుడు, అన్నమయ్య, రాణీ రుద్రమదేవి, నటశేఖర పైడి జయరాజు, సంస్కర్త సాలార్ జంగ్, ఇబ్రహీం కులీ కుతుబ్‌షా, రాజా బహద్దూర్ కొత్వాల్ వెంకటరామిరెడ్డి, స్వామి రామానంద తీర్థ, సటాన్ తుర్రెబాజ్‌ఖాన్, పవార్ నారాయణరావు, షోయబుల్లాఖాన్, వందేమాతరం రామచంద్ర రావు, బద్దం ఎల్లారెడ్డి, జమలాపురం కేశవరావు, సురవరం ప్రతాపరెడ్డి, కాళోజీ నారాయణరావు, రావి నారాయణ రెడ్డి, ఆచార్య కొత్తపల్లి జయశంకర్, కల్వకుంట్ల చంద్రశేఖరరావు వంటి జాతీయ వీరులు, నాయకులతో పాటు తెలంగాణ తేజోమూర్తులు, నేటి తరం ప్రముఖుల జీవిత కథలు వీరి రచనల్లో ఉన్నాయి. ఇవేకాక పిల్లల కోసం వివిధ భారతీయ భాషల్లోంచి హిందీలోకి వచ్చిన 'అల్లూరి సీతారామరాజు, లాచిత్ బడ్ పుకాన్, రాజేంద్రప్రసాద్, బంకిం చంద్ర చటర్జి, బసవేశ్వరుడు, మహాత్మా గాంధీ, నందలాల్ బోసు, సతీ సక్కుబాయి, గురు నానక్, హోమీ బాబా, యుధిష్ఠురుడు, దిలీపుడు, యాజ్ఞవల్కుడు జీవిత కథలతో పాటు నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా కోసం 'గోలు డప్పు కథ', 'డోబూ-రాజకుమారుడు' తో పాటు గిజుబాయి రాసిన మరో మూడు పుస్తకాలు అనువాదం చేశారు.
కథల్లో కుటుంబ జీవనం, భారతీయ జీవన మూల్యాలు, దేశం, ధర్మం, సంస్కృతీ వంటి అంశాలను ప్రధాన వస్తువులుగా రాసే చంద్రయ్య పిల్లల కోసం విజ్ఞానం, వినోదంతో పాటు వీటన్నింటిని తన రచనల్లో అందించారు. జాతీయ సాహిత్య పరిషత్తు రాష్ట్ర బాధ్యునిగా ఉన్న వీరిని 'కథాశిల్పి', 'కథా కళానిధి', 'సాహిత్య రత్న'గా సమకాలికులు సత్కరించారు. అయిదు దశాబ్దాలుగాలు కథా, కవిత్వం, వ్యాసం, నవలల వంటివాటికి లభించాయి. అనువాద రంగంలోనూ విశేష కృషి చేసిన వీరు తెలుగు విశ్వవిద్యాలయం వారి అనువాద పురస్కారం అందుకున్నారు. యాభైకి పైగా వివిధ సంస్థల సత్కారాలు, పురస్కారాలు అందుకున్న వీరిని ఇటీవల తెలంగాణ సారస్వత పరిషత్తు వరిష్ట సాహితీవేత్తగా సత్కరించింది.
'భరతవీరా మేలుకో, మన భారతాంబను తలుచుకో/ ధర్మరక్షణ ధ్యేయమంటూ ప్రగతి పథమున నడిచిపో' అంటూ బాలలను ఉద్భోదించిన చంద్రయ్య రచనలన్నీ దేశభక్తిని పెంచేవిగా ఉండడం విశేషం. 'నాల్గువేదముల పుణ్యభూమివి/ పురాణాలకు పుట్టినిల్లువు/ దేవతలను ఒడిలో తాడించి/ ధన్యజీవులుగ జేసిన తల్లివి' అంటూ కీర్తిస్తారు. ఏడున్నర పదుల జీనవ ప్రస్థానంలో దాదాపు ఐదున్నర దశాబ్దాలుగా రాస్తున్న ఐతా చంద్రయ్య బాలల కోసం నిరంతరం తపించి రాసే 'బాలల బంధువు'. జయహో!
- డా|| పత్తిపాక మోహన్, 9966229548