Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉమ్మడి కరీంనగర్ జిల్లా గ్రామాలు, 1970-80 దశకంలో నీళ్ళు, కరెంట్, విద్య, రవాణా వంటి కనీస సౌకర్యాలు లేక అంధకారంలో కొట్టుమిట్టాడుతుండేవి. అప్పట్లో వర్షాలులేక తీవ్ర నీటి కొరత. మహిళలు కిలోమీటర్ల కొద్ది వెళ్ళి నీళ్ళు తెచ్చుకునేవారు. పట్టణాలలో మూడు నాలుగు రోజులకొకసారి నల్లా నీరు వచ్చినా ఎటూ సరిపోయేవి కావు. ఎన్నికలప్పుడే వచ్చే నాయకులకు ఇవేమీ పట్టేవి కావు. తొమ్మిది గంటల కరెంటు ఇస్తామనీ వాగ్దానాలతో అధికారంలోకి వచ్చి కేవలం మూడు గంటలు మాత్రమే కరెంట్ ఇచ్చేవారు. గ్రామాలల్లో ఈ పరిస్థితి మరీ దయనీయం. రైతులకు రాత్రంతా పొలాల్లో కరెంట్ కోసం పడిగాపులు జీవితంలో భాగమయ్యాయి. ఇక విద్యా సంస్థల విషయం చాలా దారుణమైన పరిస్థితి. ప్రభుత్వ పాఠశాలల దుస్థితి దయనీయంగా ఉండేది. ముఖ్యంగా చెట్ల కిందే తరగతులు, ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉండేది.
రవాణా సౌకర్యం మరీ అధ్వానం. బస్సు సౌకర్యం సరిగా లేక వచ్చినా స్కూల్ పిల్లలు, ఉద్యోగులు, తమ ఊర్లల్లో పండే కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు గంపల్లో పెట్టుకుని టౌన్ కు వెళ్లి అమ్ముకునేవాళ్ళతో కిక్కిరిసి ఉండేది. సామాన్యులకు ఇవి అందని ద్రాక్షగానే ఉండేది. సహజంగా వాటిపై నిరసన వెల్లువెత్తేది. ప్రజలకు అండగా పోరాటం చేయడంలో కమ్యూనిస్టు పార్టీలు ముందుండేవి.
కరెంటు కోతలతో, ఇక్కట్లు పడుతూ, తొమ్మిది గంటల కరెంటు ఇస్తామన్న ప్రభుత్వం, తమ వాగ్దానాన్ని నిలబెట్టుకో లేదనీ, రైతులు, రాస్తారోకోలు, నిర్వహించడం, విద్యుత్ శాఖ అధికారులను, వాళ్ళ కార్యాలయాల్లో నిర్బంధించడం, దీన్ని అడ్డుకొని, పోలీసులు, అందుకు కారణమైన వాళ్ళను, అరెస్టు చేసి, వాళ్ళపై కేసులు నమోదు చేయడం, జరుగుతుండేది. అలాగే నీళ్ళు రావడం లేదని, ఎన్ని విజ్ఞప్తులు చేసినా పట్టించుకోని, ప్రభుత్వంపై, ఖాళీ కుండలతో, శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేస్తున్న మహిళలు, యువకులు, కార్మికులపై విచక్షణా రహితంగా లాఠీచార్జి చేసి, వారిపై కేసులు పెట్టడం.... బస్సు బస్టాండ్‌లో ఆపని డ్రైవర్‌పై స్థానిక యువకులు దాడి చేయడం, వారిపై కేసులు నమోదు చేశారు. ఆ పదేళ్ల కాలంలో ప్రజాపోరాటాలను, ప్రభుత్వం తన ఉక్కు పాదంతో అణగదొక్కింది. సమస్యలు పరిష్కరించే వాళ్ళు లేక పోలీసు నిర్బంధాలు అధికమయ్యాయి.
ఇలా కేసుల సంఖ్య గణనీయంగా పెరిగి, కరీంనగర్ జిల్లా కోర్టు చేరుకునేవి. 1977 నాటికి కరీంనగర్ జిల్లా కోర్టులో, యాభై మంది అడ్వకేట్స్ మాత్రమే ఉండేవారు. అప్పటి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో, అక్రమ కేసులు మోపబడిన దళితులు, గిరిజనులు, బహుజనులు, నిరక్షరాస్యులు, అనేక మంది, తమ మీద బనాయించిన కేసులను కొట్లాడేందుకు, డబ్బులిచ్చి వకీళ్ళను పెట్టుకునే ఆర్థిక స్థోమత కూడా లేని వాళ్ళున్నారు.
అలాంటి పరిస్థితుల్లో గులాబీల మల్లారెడ్డి ఎల్.ఎల్.ఎమ్.మధ్యలోనే ఆపేసి, గ్రామాలను అభివృద్ధి చేయాలనీ,యువతను చైతన్యం చేయాలనీ, పీడిత వర్గాలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో, కరీంనగర్ జిల్లా కోర్టులో అడ్వకేట్‌గా ప్రాక్టీసు ప్రారంభించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా లోని హుస్నాబాద్ మండలం,తురకవాని కుంట గ్రామంలో భూదేవి, లింగారెడ్డి అనే దంపతులకు ఆయన ఏకైక సంతానం. పాఠశాల విద్య రామవరం, నంగునూర్, హుస్నాబాద్‌లలో, డిగ్రీ సిద్దిపేటలో, ఓయూలో ఎల్.ఎల్.బి. పూర్తి చేసారు. చిన్నప్పటి నుంచి ఆయనకు కవితలు, కథలు, రాయడం, ఉపన్యాసాలు ఇవ్వడాన్ని ఇష్టపడే వ్యక్తి. 1969లో జరిగిన జై తెలంగాణ ఉద్యమంలో, పాల్గొని, కరీంనగర్ జైలుకు వెళ్లిన ఆయన అక్కడే తన మొదటి కవితను రాసారు. 1984లో పల్లె పొలిమేరల్లోకి.. కవితా సంపుటి, 86లో జర్నలిస్టు కథాసంపుటి, 2014లో జనమేవ జయతే-కవితాసంపుటి, ఆ తరువాత నా లక్ష్యం నా గమ్యం, ఎద్దు ఎవుసం... సురుకుల వైద్యం, ప్రకృతి ప్రియురాలు మానవత, వంటి కవితా సంకలనాలను వెలువరించారు. మల్ దాద- చారిత్రక నవల, కూడా రాసారు. ''కోర్టు రణ భూమిలో, వెయ్యి యుద్ధాలు వెయ్యి విజయాలు...'' ఈ పుస్తకంలో తన నలబై సంవత్సరాల వకీల్ వత్తిని, తాను సాధించిన విజయాలను, కళ్ళకు కట్టినట్లు పొందుపరిచారు.
1970-80 సమయంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా గ్రామాలు, అక్కడి ప్రజల సమస్యల్ని మీకు వివరించాను. ''గెలవాన్న తపన ఉన్నచోట ఓటమి అడుగైనా పెట్టదు'' అని అంటూనే బద్దకించే పొలం లేదు కానీ మనుష్యులు ఉన్నారన్న చైనా సామెతను గుర్తుకుచేసారు మల్లారెడ్డి. అప్పట్లో, కరీంనగర్ జిల్లాలో వివిధ పార్టీల నాయకులపై, వారి వెంట తిరిగే యువకులపై, అక్రమ కేసులు బనాయించి, రిమాండ్ చేసేవారు. కోర్టులో మల్లారెడ్డి రోజుకు పదిమందినైనా బేయిల్‌పై, విడిపించే పరిస్థితి ఉండేది. ఒక్కొక్కరు యాభై రూపాయలు ఇచ్చినా అయిదు వందల రూపాయలు జమ అయ్యేవి. వచ్చిన డబ్బుల్లో, మూడు, నాలుగు వందల రూపాయలు క్లయింట్లు అన్నం తినడానికి, వాళ్ళు ఊరికెళ్ళేందుకు బస్సు చార్జీలు తిరిగి ఇచ్చేవారు. ఆ రోజుల్లో ఆయనకు డబ్బు మీద ఆశ, ధ్యాస ఉండేది కాదు. ఆయనకు ఒకటే ఆలోచన, ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ ఒక్కరూ కూడా జైలుకు వెళ్ళవద్దనుకునే వారు. నడుస్తున్న కేసుల్లో ఎవ్వరికీ శిక్ష పడొద్దనీ, ప్రతి రోజూ తెల్లవారుజామున మూడు గంటలకు లేచి, ఉదయం ఏడు గంటల వరకు ఫైల్స్ అధ్యయనం చేసేవారు. వీరి డెడికేషన్, కేసు గెలవాలన్న తపన అప్పటి తరం, డబ్బులతో, సంబంధం లేకుండా, ఒక చాలెంజ్‌గా తీసుకుని కేసు కొట్లాడడం గొప్ప విషయం.ఎంత చదివినా ఇంకా తెలియని విషయాలు ఎన్నో ఉండేవి. కేసులు ఎక్కువగా రావాలంటే, తీసుకున్న ప్రతి కేసులో విజయం సాధించాలి. నన్ను నమ్ముకున్న వ్యక్తికి నా అసమర్థత వల్లనో, నా సోమరితనం వల్లనో, నష్టం జరగకూడదు.ఒక్కో కేసులో చార్జిషీటు, 161 స్టేట్మెంట్ను, మెడికల్ సర్టిఫికెట్‌ను, పంచనామాలను, ఎఫ్ఐఆర్తో సహా అన్ని పేపర్లను, ఒకటికి పదిసార్లు చదివేవారు మల్లారెడ్డి. చదవినప్పుడల్లా కొత్త కొత్త ఆలోచనలు స్ఫురించేవనీ, ఆ కొత్త ఐడియాలు కేసు గతిని మార్చేసేవనీ, బాగా చదవడం వల్ల, కోర్టు హాలులో, సాక్షిని క్రాస్ చేస్తున్నప్పుడు, మాట మంత్రదండమై, ఏదో కనికట్టు చేసినట్లుగా, కేసు వీగిపోయేదనీ, అలా వందల కాంటెస్టెడ్ కేసుల్లో విజయం సాధించాననీ ఆయన చెపుతారు. గ్రామ సర్పంచ్ గా,అన్ని వర్గాలకు దగ్గరై, వాళ్ళ సహకారంతో, గ్రామాన్ని అభివృద్ధి చేశారు.
ఆయన వకీల్ వృత్తి చేసుకుంటూనే, పత్రికా ఎడిటర్ గా,లీగల్ కరస్పాండెంట్‌గా, జర్నలిస్టుగా, ఎన్నో వార్తా కథనాలు రాసి, ఇటు అధికారుల్లో, అటు ప్రభుత్వంలో, చలనం తీసుకువచ్చారు. చివరికి కోర్టులకు సైతం చురకలు వేస్తూ, లీగల్ కరస్పాండెంట్‌గా, సమాజం పట్ల తన వంతు బాధ్యతను నిర్వహించారు. అప్పట్లో ఆయన రాసిన ''కల్లోల సీమలో న్యాయమూర్తుల కొరత'' ''సన్నగిల్లిన ఫోరం ప్రభావం'' కథనాలు అందరినీ ఆలోచించేలా చేసాయి.
కోర్టు రణ భూమిలో వెయ్యి యుద్దాలు వెయ్యి విజయాలు.... ఈ పుస్తకం గులాబీల మల్లారెడ్డి ఆత్మకథ. యువ న్యాయవాదులకు ఈ పుస్తకం ఒక కరదీపిక. వాళ్ళు తప్పకుండా చదవాల్సిన పుస్తకం. ఈ పుస్తకంలో,ఆయన దళితులు, పీడిత వర్గాల పక్షాన చేసిన వెయ్యి యుద్ధాలు, ఆయన సాధించిన వెయ్యి విజయాలు తెలుసుకోవాలంటే, ప్రతి ఒక్కరూ ఆ పుస్తకాన్ని కొని చదవాల్సిందే.
జనం...జనం...జనం...
నా మనోవనమంతా జనం....
జనమేవ జయతే.
- ప్రమోద్ ఆవంచ, 7013272452