Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఒక్క అక్షరం లక్ష మెదళ్ళను ప్రభావితం చేస్తుంది' అన్న సత్యాన్ని త్రికరణశుద్ధిగా నమ్మి అక్షర యజ్ఞం సాగిస్తోన్న షేక్.సలీమ సమాజంలో శక్తివంతమైన మార్పు తేవటానికి, కొత్త ఉత్సాహం నింపటానికి తన కథ, కవిత్వంలను ఆయుధాలుగా చేసుకున్నారు. తనలో దాగి వున్న ఆసక్తి, భర్తతోడ్పాటు, నవతెలంగాణ పత్రికలో ఉద్యోగం ముప్పేట. అమిప్రోద్భలం కల్పిస్తూంటే, అంది వచ్చిన అవకాశాలను సాహిత్య సోపానాలుగా మార్చుకుని ముందుకు సాగుతున్నారు. 'జవాబు కావాలి' అన్న కవితా సంపుటితో వేసిన మొదటి అడుగుకు లభించిన ప్రోత్సాహంతో రెండవ అడుగుగా ప్రస్తుత కథా సంపుటి ''పథగమనం'' మన ముందుకు తెచ్చారు.
సత్తా ఉంటే ప్రోత్సాహానికి కొదవ ఉండదు. సుశీల నారాయణరెడ్డి ట్రస్ట్ వారి ఆర్థిక సాయం అందుకుని వెలుగు చూసిన ఈ కథా సంపుటిలో పది కథలున్నాయి. ఇవన్నీ లోగడ పలు సంస్థలు నిర్వహించిన పోటీల్లో నిగ్గు తేలి అవార్డులు రివార్డులు అందుకున్నాయి. నాణ్యత అన్న గీటురాయి మీద పరీక్షించబడి నెగ్గిన కథలనే మనకందిస్తున్నారు సలీమ.
సాహిత్యం సమకాలీన జీవన సంస్కృతికి దర్పణం వంటివి. అందుకే ఈ కథలన్నింటా, నేటి సమాజం, కొత్త ఆలోచనలు, ఆశలు, ఆశయాలు కనబడతాయి. తాను స్వప్నించే సమాజాన్ని, ఆదర్శాలను కథా వస్తువులుగా మలుచుకున్నారు సలీమ.
జీవించి ఉన్నన్నాళ్లూ, ప్రతిరోజూ ఓ కొత్త అడుగే! చిన్న నాట తలిదండ్రులు, యుక్త వయసులో జీవన సహచరీ సహచరుడు, ఆ తర్వాత సంతానంతో కలిసి అడుగులు వేయాలి. కాని తండ్రే కాలయముడై కట్టుకున్న భర్తను దూరం చేస్తే, దాంపత్య ఫలంగా 'స్వేచ్ఛ' (కూతురు), ఆమె జీవితాలు అంధకారమవ్వాల్సిందేనా? 'కాదు' అంటారు రచయిత్రి. 'మరో అడుగు' కథలో కులం, మతం పేరుతో మనుషుల పట్ల వివక్షను చిన్నతనం నుంచే చూస్తూ పెరిగిన వర్షిణి వీటికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని నిర్ణయించుకుంది. తన పట్ల కూతురు 'స్వేచ్ఛ' పట్ల గౌరవం చూపుతున్న రాజేష్ చేయి పట్టుకుని ముందడుగు వేసింది 'మరో అడుగు' కథలో.
తల్లి కూతురు పెండ్లి చేయడం మామూలే! కానీ ఆ తల్లి సరోజకు కూతురు సురేఖ ప్రొఫెసర్ మనోహర్‌తో పెళ్ళి నిశ్చయించింది. మొదట తల్లి కాస్త తడబడినా, ఆ తల్లి జీవితానికి తోడు దొరికి 'మేలిమలుపు' తిరిగింది. మారుతోన్న పరిస్థితులకు మనుషులూ మారాలన్న రచయిత్రి ఆశయం అభినందనీయం.
ముస్లిం మైనారిటీ వర్గంపై కథలు ఓ దశాబ్దం నుండి సాహిత్యంలో చోటు చేసుకుంటున్నాయి. వారి సాంఘికాచారాలు, కట్టుబాట్లు, వీటి వల్ల వీరు ఎదుర్కొనే కష్టాలు, అధిగమించాల్సిన అవసరం ఈ రచయితలు ఎరిక పరుస్తున్నారు. 'అమ్మ తీర్చిన బిడ్డ' 'హద్దులు చెరిగిన వేళ' 'ముఖామ్' మరో రెండు కథలు.
మధ్య తరగతి, మరో మెట్టు అంతకంటే కింద ఉన్న ముస్లింలలో కనబడే కట్టుబాట్లలోని కష్టనష్టాలను తులనాత్మకంగా పరిశీలిస్తూ, మారుతోన్న నేటి కాలానికి మార్పు అనివార్యం అంటారు సలీమ. తమ వర్గానికి మారాల్సిన అవసరం సూచిస్తూ ఆడపిల్ల చదువు, బుర్ఖా అనే సాంఘిక నియమం, పెండ్లి, ఉద్యోగం లాంటి అత్యవసరాల్లో కట్టుబాట్ల సడలింపు అవసరాన్ని కొన్ని కథల్లో చర్చించారు రచయిత్రి. ఏ మతమయినా మానవత్వం తర్వాతేనంటారు. మారుతోన్న కాలానికి ఈ వర్గం వారూ మారటం అనివార్యం అన్న సందేశం ఇచ్చిన ఈ కథలు ఎంత సహజంగా చిత్రీకరించ బడ్డాయంటే, వివరించిన సంఘటనలు పాఠకుల కండ్లెదుటే చోటు చేసుకుంటున్నంతగా పాఠకులు కథలో లీనమౌతారు. 'మేలిమలుపు' 'హద్దులు చెరిగిన వేళ' 'చేయూత' లాంటి కథల్లో ఎత్తుగడ కథా క్రమం, ముగింపు అన్నీ అతి సహజంగా నడిపించి ఆకట్టుకునేందుకు రచయిత్రి చూపిన ప్రతిభ ప్రశంసనీయం. రచయిత్రి మాత్రమే రాయగలిగిన, ఈ వర్గపు కథలు తెలుగు సాహిత్యంలో మరింతగా రావాల్సిన ఆవశ్యకత నేటి 'గమనానికి' అత్యవసరం.
సంపుటిలో చివరి కథ 'తిత్లీ' మరో వెనుకబడిన ఆదివాసీల జీవితాలపై పాఠకులకు మంచి అవగాహన కల్పిస్తుంది. దేశంలోని అభివృద్ధి ఫలాలను వారికి కూడా పంచాల్సిన అవసరం గుర్తు చేస్తారు రచయిత్రి. ఒక రచయిత్రిగా సాంఘిక బాధ్యతల్ని చక్కగా నిర్వర్తించారు అనిపిస్తుంది ఈ కథలు చదుతోంటే...
పథగమనం (కథలు),
రచన : సలీమ,
పేజీలు : 150, వెల : రూ. 125/-,
ప్రతులకు : 21/1,
ఎం.హెచ్.భవన్, అజామాబాద్,
హైదరాబాద్ - 500020
- కూర చిదంబరం, 8639338675