Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఓ దుర్మార్గపు పని చేసే వ్యక్తి ఎలా ఉంటాడు? పెద్ద మీసాలతో, భయం గొలిపే ఆకారంతో ఉంటాడా? చిన్న పిల్లల పుస్తకాలలో ఉండే రాక్షసుడిలా ఉంటాడా? కాదేమో, మనలో ఒకడిగా మనతో ఒకడిగా మసులుతూ, సభ్య సమాజంలో అన్ని పరిధులను గౌరవిస్తూ, ఓ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉంటూ, భర్తగా, తండ్రిగా, అన్నగా కొడుకుగా అతి సాధారణంగా కనిపిస్తూ, కొందరి నుండి ప్రేమను, గౌరవాన్ని స్వీకరిస్తూ, కొందరికి ప్రేమను పంచి పెడుతూ, అతి మాములుగా కనిపిస్తూ ఉంటాడు. ఇది నమ్మాలనిపించదేమో కాని ముమ్మాటికీ నిజం. ముఖ్యంగా స్త్రీలపై జరిగే అత్యాచారాలు, మరీ చిన్న పిల్లలపై జరుగుతున్న అత్యాచారాలలో ఆ హేయమైన చర్యకు పాల్పడుతున్న వ్యక్తులందరూ మర్యాదస్తులుగా, అమాయకులుగా, అసహాయులుగా సమాజంలో జీవిస్తున్న వాళ్లే. ప్రతి మనిషిలో ఓ రాక్షసుడు దాక్కుని ఉంటాడు. అవకాశం, అవసరం ఆ రాక్షసుడిని బైటకు తీసుకువస్తూ ఉంటాయి. అందుకే మనిషిని కొన్ని కట్టుబాట్లలో జీవించాలని నిర్దేశిస్తుంది సమాజం. ఆ కట్టుబాట్లే లేకపోతే ప్రతి మనిషిలోని రాక్షసుడు నిరభ్యంతరంగా సంచరిస్తూ ఉంటాడు.
తన బిడ్డలను ప్రేమించే వ్యక్తి, మరో బిడ్డ దగ్గర క్రూరంగా ప్రవర్తించడానికి అవకాశాలు చాలా ఉంటాయి. ప్రతి హంతకుడికీ ఓ కుటుంబం ఉంటుంది. ఇంట్లో ప్రేమించే ఆలు బిడ్డలుంటారు. అతనిలోనూ ప్రేమించే హృదయం ఉంటుంది. కాని అది అతని కుటుంబం వరకే పని చేస్తుంది. అవకాశం వస్తే, అవసరం అనిపిస్తే ఆ హృదయం మరో బిడ్డ పట్ల క్రూరంగా ప్రవర్తించడానికి వెనుకాడదు. ఇది మనిషి స్వభావం. సమాజంలో క్రూరంగా ప్రవర్తించే ప్రతి మనిషిలో కనిపించే సహజమైన నైజం. అందుకే మనిషి ఎంత స్వేచ్చా జీవి అయినా అతనిపై నియంత్రణ తప్పని సరి.
ఈ చిన్న బిడ్డ, తన టీచర్ తనను లైంగికంగా వేధించడాన్ని అర్ధం చేసుకోలేక, ఎవరికీ చెప్పుకోలేక, విపరీతమైన వేదనను, ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉంటుంది. అందరూ గౌరవించే ఆ టీచర్ తనను ముట్టుకున్నా, స్పృశించినా ఏదో తెలియని కంపరం ఆ చిన్నారికి కలుగుతూ ఉంటుంది. అతని వద్ద ఒంటరిగా ఉండడానికే భయపడుతుంది. తనకేం జరుగుతుందో, అర్ధం కాదు, ఎవరికి ఏమని చెప్పాలో తెలీదు. అలాంటి సమయంలో ఆమె ఇబ్బందిని గమనించి, అర్ధం చేసుకుంది ఆమె తండ్రి ఒక్కడే. వెంటనే ఆ టీచర్ కి బుద్ది చెప్పి, కూతురిని గుండెకు హత్తుకుని ఎవరికీ, ఎప్పుడూ భయపడవద్దని, ఇబ్బంది అనిపిస్తే ఏదీ సహించవద్దని నేర్పిస్తాడు. ఆ పాపకు తండ్రే దేవుడు. అతని చేయి అందించే ఓదార్పు, ఇచ్చే భరోసాతో తన జీవితాన్ని నిర్మించుకుంటుంది. ధైర్యం తన అస్థిగా జీవిస్తుంది. ఓ స్కూల్ లో టీచర్ గా పని చేస్తుంది. ఆమె పేరే గార్గి. మన సినిమా కథానాయకి.
గార్గి వివాహం కూడా నిశ్చయమవుతుంది. ఆమెను కోరి పెళ్ళి చేసుకుంటున్న వ్యక్తి కట్నం ఆశించడు. ఆమె పేదరికాన్ని అర్ధం చేసుకుని ఆమె వ్యక్తిత్వాన్ని ప్రేమించి ఆమెతో జీవించాలనుకుంటాడు. గార్గి తండ్రి ఓ అపార్ట్మెంట్ లో వాచ్మెన్ గా పని చేస్తూ ఉంటాడు. ఆమె తల్లి దోసల పిండి రుబ్బుతూ, ఆ పిండి అడిగిన వారికి అమ్ముతూ కొంత సంపాదిస్తుంది. గార్గి చెల్లెలు మిడిల్ స్కూల్ లో ఉంటుంది.
ఓ రోజు రాత్రి గార్గి తండ్రి ఇంటికి రాడు. అతని కోసం అతను పని చేసే అపార్ట్మెంట్ కు వెళుతుంది గార్గి. తన తండ్రిని పోలీసుకు అరెస్టు చేసి తీసుకెళ్లారని తెలుసుకుంటుంది. తండ్రి కోసం పోలీస్ స్టేషన్ కు వెళ్ళిన ఆమెకు ఆ అపార్ట్మెంట్ లో ఓ చిన్న పాప పై అత్యాచారం జరిగిందని. ఆ పాప బాధితులను గుర్తుపట్టినందు వల్ల ఐదుగురిని అరెస్ట్ చేసామని పోలీసులు చెబుతారు. అందులో ఆమె తండ్రి ఒకరు. ఈ సమాజంలో ఓ ఆడపిల్లగా ధైర్యంగా తాను జీవించడానికి తండ్రి అందజేసిన తోడ్పాటు తెలిసిన గార్గి తన తండ్రి విషయంలో ఏదో పొరపాటు జరిగిందని వాదిస్తుంది. కాని ఆ పాపే నేరస్తులను గుర్తు పట్టిందని పోలీసు ఇన్స్పెక్టర్ చెప్పినప్పుడు ఆమె ఆశ్చర్యపోతుంది. కాని తన తండ్రిని ఓ చిన్న పాపపై అత్యాచారం చేసే వ్యక్తిగా ఆమె ఒప్పుకోదు. తన తండ్రిని రక్షించుకోవాలని ఆమె నిర్ణయించుకుంటుంది.
మరుసటి రోజు నేరస్తుల పోటోలు పేపర్ లో వచ్చేస్తాయి. మిగతా నలుగురు ఆ రాష్ట్రం వాళ్లు కారు. కాని గార్గి తండ్రి బ్రహ్మానందాన్ని మాత్రం అందరూ గుర్తుపడతారు. గార్గి కుటుంబాన్ని వెలివేస్తారు. ఆమె ఉద్యోగం పోతుంది. ఆమె తండ్రి కోసం లాయర్ ని నియమించాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. వారి కుటుంబానికి ఆత్మీయుడిగా ఉండే వ్యక్తి పెద్ద పేరున్న లాయర్. కాని ఆయన కూడా ఈ కేసులో తానేమీ చేయలేననే చెబుతాడు. అతని పై తోటి లాయర్ల ఒత్తిడి ఉంటుంది. అతని వద్ద పని చేస్తున్న జూనియర్ లాయర్, గార్గి ఒంటరి పోరాటాన్ని గమనించి ఆమెకు సహయపడడానికి ముందుకు వస్తాడు. ఈ లాయర్ పెద్ద అనుభవం ఉన్న వ్యక్తి కాదు. పైగా కొంచెం నత్తి కూడా ఉంటుంది. కాని గార్గికి అతని సహాయం తీసుకోక తప్పని పరిస్థితి.
గార్గి తండ్రి ఆ పాప మెట్ల గదిలో రక్తం ఓడుతూ పడి ఉన్నప్పుడు ముందుగా చూసి ఆమెను ఎత్తుకుని తీసుకువచ్చి పాప తండ్రికి అప్పజెబుతాడు. ఆ పాపపై అత్యాచారం జరిగిన సమయంలో అక్కడ ఎవరూ ఉండరు. తాను ఆ సమయంలో చాటుగా మధ్యం సేవిస్తున్నానని అంటాడు గార్గి తండ్రి. గార్గికి తండ్రి బలహీనత తెలుసు. అందువలన తండ్రి తాగుడు కోసం పక్కకు వెళ్లినప్పుడు ఆ నలుగురు అక్కడ అత్యాచారానికి పాల్పడి ఉండవచ్చని నమ్ముతుంది. ఆ పాప నేరస్తులను గుర్తు పట్టేటప్పుడు నెప్పి తగ్గడానికి కొన్ని మందులు తీసుకుని ఉందని, ఆ మందుల ప్రభావంలో ఉన్నప్పుడు మనుష్యులను పూర్తిగా పోల్చుకోవడం కష్టమని అందువలన ఆమె ఇచ్చే సాక్ష్యం చెల్లదని గార్గి నియమించిన లాయర్ వాదిస్తాడు. దీనితో బ్రహ్మానందానికి బెయిల్ వస్తుంది.
కాని ఈ కేసు చేపట్టిన ఇన్స్పెక్టర్ పాప సాక్ష్యాన్ని నమ్ముతాడు. అన్ని ఒత్తిడులను ఎదుర్కుని అతను మరో సారి పాపకి దోషులను గుర్తుపట్టడానికి అవకాశం ఇవ్వాలని అడుగుతాడు. ఈ లోపల లాయర్, గార్గి తండ్రిని కలిసి తండ్రి సహాయంతోనే పాప బ్రహ్మానందాన్ని దోషిగా గుర్తించిందని, ఆమె పై తండ్రి ప్రభావం ఉందని, బిడ్డకు జరిగిన అన్యాయానికి కోపంతో రగిలిపోతున్న తండ్రి బ్రహ్మానందాన్ని కూడా దోషిగా చూపాలనుకున్నాడని వాదిస్తాడు.
గార్గి తండ్రి స్నేహితుడు ఆ అపార్ట్మెంట్లో పని చేసే మరో వాచ్మెన్. ఆ రోజంతా తాను తన బిడ్డ పెళ్లికి సంబంధించిన పనుల కోసం తన ఇంట్లో ఉన్నానని కోర్టులో అతను సాక్ష్యం ఇస్తాడు. కాని అతను గార్గితో తాను తాగిన మైకంలో ఉండగా పాపను రక్తం ఓడుతూ పడి ఉన్నప్పుడు మొదటగా చూసానని, ఆ సంగతి బ్రహ్మానందానికి చెప్పి ఇంటికి వెళ్లిపోయానని చెబుతాడు. ఇక్కడ గార్గికి తన తండ్రి ఇచ్చిన సాక్ష్యం పట్ల మొదటి సారి అనుమానం వస్తుంది. బ్రహ్మానందం పాపను చూసాసని కోర్టులో చెప్పిన సమయం కన్నా ముందే పాపను స్నేహితుడు చెప్పగా వెళ్లి చూసాడని ఆమెకు అర్ధం అవుతుంది. పాపను ఆమె తండ్రి వద్దకు చేర్చానని బ్రహ్మానందం చెప్పిన సమయం దాకా అతను ఆ పాపతో ఒంటరిగా ఉన్నాడని కూడా ఆమెకు అర్ధం చేసుకుంటుంది. తండ్రి తప్పు చేయనప్పుడు ఆ పాపను ఆ స్థితిలో చూసిన వెంటనే ఆమె ఇంటికి చేర్చాలి కదా. మరి ఆ ఆలస్యం ఎందుకు అయ్యింది అన్న విషయం ఆమెను వేధిస్తుంది.
చివరకు ధైర్యం చేసి గార్గి ఒక్కతే ఆ పాప ఇంటికి వెళుతుంది. ఆమెకు తన తండ్రి ఫోటో చూపిస్తుంది. పాప అతన్ని తనపై అత్యాచారం చేసిన వ్యక్తిగా మరో సారి గుర్తిస్తుంది. ఆ ఫోటో చూసి విపరీతంగా చలించిపోయిన ఆ చిన్ని ప్రాణాన్ని చూసినప్పుడు గార్గి ముఖంలో కనిపించే ఆ గిల్ట్, సాయి పల్లవి అద్భుతంగా చూపింగలిగింది.
లాయర్ సహాయంతో బెయిల్ పై ఇల్లు చేరిన బ్రహ్మానందం నిర్దోషిగా బైటకు రాగలిగే స్థితిలోకి కేసు మారిపోతుంది.. పాప సాక్ష్యం చెల్లదని కోర్టులో నిరూపిస్తాడు లాయర్. కాని నిజం తెలిసిన గార్గి ఊరుకోలేకపోతుంది. తన తండ్రితో కలిసి పోలీస్ స్టేషన్ కు వద్దకు వెళుతుంది. అందరి ముందు తండ్రిని ఓ స్త్రీగా ఆమె ప్రశ్నిస్తుంది. ఆయన చేసిన తప్పును బైటపెట్టి తండ్రిని పోలీసులకు అప్పజెప్పి వెనుదిరుగుతుంది. చివర్లో అత్యాచారం జరిగిన పాపకు అండగా నిలుస్తూ తన చెల్లెలితో పాటు ఆమెకు తోడుగా నిలిచిన గార్గి జీవితాన్ని చూపిస్తూ సినిమా ముగుస్తుంది.
''గార్గి'' మన పురాణాలలో వినిపించే పేరు. వాచక్ను అనే ఓ రుషి కూతురు. గార్గా మహర్షి వంశీయులు వీరు. అందువలన ఈమెను గార్గి వాచక్నవిగా నామకరణం చేస్తాడు ఆమె తండ్రి. స్త్రీలు వేదాలు చదవని రోజుల్లో ఈమె వేదాలను పురాణాలను చదివి గొప్ప విదూషీమనిగా పేరు తెచ్చుకుంది. గొప్ప దార్శినికురాలని భరత ఖండంలో పేరు తెచ్చుకున్న స్త్రీ ఆమె. బ్రిహదరణ్యక ఉపనిషత్తులో ఆమె పేరు వినిపిస్తుంది. జనక మహారాజు ఏర్పాటు చేసిన చర్చావేదికలో రుషి యజ్ఞవల్క్యను ఎదిరించి, వాదించి గెలిచిన విదూషీమణీ ఈమె. రిగ్వేదం లో కొన్ని ఘట్టాలను ఈమే రాసారని చెబుతారు. జీవితాంతం అవివాహితగా ఉండి జ్ఞానోపార్జనే ధ్యేయంగా జీవించిన గొప్ప స్త్రీ ఈమె. ఆమె పేరుని ఈ సినిమాలో ప్రధాన పాత్రకు పెట్టడం వెనుక దర్శకుడు చూపిన లోతు అద్భుతంగా అనిపిస్తుంది. జీవిత సారాన్ని అర్ధం చేసుకుని తనను తాని నిరంతరం మధించుకుంటూ నిజం వైపుకు ప్రయాణం చేస్తూ, అందరితో కలిసి ఉంటూ, అందరినీ కలిపి ఉంచుతూ తాను అన్నిటికీ దూరంగా ఉంటూ, ఓడీపోతూ నిజాన్ని గెలిపిస్తూ జీవించే ఈ 'గార్గి' భారతీయ సినిమాలోని ఓ అధ్బుతమైన స్త్రీ పాత్ర.
2022లో తమిళ భాషలో వచ్చిన సినిమా ''గార్గి''. ఇందులో ప్రధాన పాత్రను సాయి పల్లవి పోషించింది. అద్భుతమైన అభినయాన్ని ప్రదర్శించి ఆ పాత్రకు న్యాయం చేసారామె. హరిహరన్ రాజు, గౌతం రామచంద్రన్ ఈ సినిమాకు కథను అందించారు. గౌతం రామచంద్రన్ ఈ సినిమాకు దర్శకులు. ఐశ్వర్య లక్ష్మి, ఈ సినిమా నిర్మాతలలో ఒకరిగా వ్యవహరిస్తూ ఓ చిన్న పాత్ర పోషించారు. ఒక రేప్ జరిగినప్పుడు మీడియా ఎలా వార్తలను ప్రసారం చేస్తుందో, విషయాన్ని తప్పుపట్టిస్తూ, నిజాన్ని నిరూపించలేని పరిస్థితులను కలిపిస్తూ మీడియా ప్రదర్శించే అత్యుత్సాహాన్ని గమనించే ఓ జర్నలిస్ట్ పాత్రలో ఐశ్వర్య కనిపిస్తారు.
సినిమాలో గమనించవలసిన ముఖ్య విషయాలు కొన్ని ఉన్నాయి. కోర్టులో జడ్జి పాత్రలో సుధ అనే ట్రాన్స్ విమెన్ కనిపిస్తారు. భారత దేశంలో మొదటి ట్రాన్స్ వుమెన్ లోక్ అదాలత్ జడ్జ్ గా 'జోయితా మోండల్' వెస్ట్ బెంగాల్ లో సేవలు అందిస్తున్నారు. ఈమెను స్పూర్తిగా తీసుకుని ఈ సినిమాలో జడ్జ్ పాత్రలో సుధను తీసుకున్నారు దర్శకులు. భారతీయ సినీ జగత్తులో మొదటిసారి ఓ ట్రాన్స్ విమెన్ ను అధికారక హౌదా ఉన్న పాత్రలో ఈ సినిమాలో చూపించడం జరిగింది. తోటి లాయర్ల వంకరి ప్రశ్నలకు ధీటుగా జవాబిచ్చే జడ్జిగా, బాధితురాలికి న్యాయం చేయాలని, చట్టాన్ని అతిక్రమించకుండా, మానవత్వాన్ని కాపాడాలని ప్రయత్నించే మానవతావాదిగా ఈమె కనిపిస్తారు.
2018లో చెన్నై నగరంలో అయనావారం అనే ప్రాంతంలో ఓ చిన్న అమ్మాయి పై జనవరీ నుండి జులై దాకా నిరంతం 17 మంది చేసిన అత్యాచారం ఎందరినో కలిచివేసింది. ఆ ఘటనను ఈ సినిమాకు మూల వస్తువుగా తీసుకున్నారు దర్శకులు.
2020లో ట్యూటీకోర్న్ జిల్లా లోని సాథన్కులం పోలీస్ స్టేషన్ లో పోలీస్ కస్టడిలో మరణించిన బెన్నిక్స్ ఇంక జయరాజ్ అనే తండ్రీ కొడుకులకు నివాళిగా ఈ సినిమాలో పోలీస్ ఇన్స్పెక్టర్ పాత్రకు బెన్నిక్స్ జయరాజ్ అనే పేరును దర్శకులు పెట్టారు. పీ. జయరాజ్ (59), జే. బిన్నిక్స్ (31) లను కోవిడ్ 19 నిబంధనలను ఉల్లంఘించాలనే కారణంతో అప్పట్లో పోలీసులు అరెస్ట్ చేసారు. తమ మొబైల్ ఆక్సిసెరిస్ షాప్ ను వారు జూన్ 19న లాక్డౌన్ పాటించకుండా తెరిచి ఉంచారన్నది వీరిపైనున్న అభియోగం. కస్టడీలో వీరిని లైంగికంగా వేధించి, చిత్రహించలకు గురి చేసారు పోలీసులు. జూన్ 22 న ఈ తండ్రీ కొడుకులు ఇద్దరూ మరణించారు. ఆ హేయమైన చర్యకు గుర్తుగా ఆ తండ్రి కొడుకులకు నివాళిగా ఈ చిత్ర దర్శకుడు ఈ పోలీస్ పాత్రకు ఆ పేరు పెట్టి అతన్ని నిజాయితీపరుడిగా చట్టాన్ని గౌరవించే వానిగా చూపించే ప్రయత్నం చేస్తూ చాటుకున్న సామాజిక స్పృహ, మానవ హక్కుల పట్ల గౌరవం, మెచ్చుకోదగ్గ అంశాలు. ఓ సినీ దర్శకుడు సమాజంలోని ఘటనలను ఆధారం చేసుకుని ప్రేక్షకులలో ఎలాంటి ఆలోచనలను కలిగించవచ్చో చేసి చూపించారు ఈయన.
మరో గమనించవలసిన అంశం, ఇందులో పాత్రలన్నీ బలహీనమైనవి. గార్గి ఓ సాధారణ స్కూల్ టీచర్, వాచ్మెన్ కూతురు, నేరస్తులు చిన్న చిన్న పనులు చేసుకునే వ్యక్తులు. బ్రహ్మానందం తరుపున వాదించే లాయర్ నత్తితో సతమతమవుతూ నలుగురి ఎదుట మాట్లాడలేని ఓ భయస్తుడు. ఎవరూ అసాధారణమైన వ్యక్తిత్వం ఉన్న వారు కాదు. కాని పరిస్థితులకు వారు స్పందించే విధానంలో ఓ అసాధారణత్వం కనిపిస్తుంది. మనషి వ్యక్తిత్వంలో గమనించవలసిన లక్షణం ఇదే. దీన్నే స్క్రీన్ పై చాలా బాగా చూపించగలిగారు దర్శకులు. అత్యాచార భాధిత కుటుంబంతో పాటు నేరస్తుల కుటుంబంలోని వ్యక్తులు కూడా ఎటువంటి శిక్షను జీవితాంతం అనుభవించవలసి వస్తుందో సున్నితంగా చూపించిన చిత్రం ఇది. అత్యాచారం అనే ఘటన ఎన్ని జీవితాలను అతలాకుతలం చేస్తుందో చెప్పే ప్రయత్నం ఈ సినిమాలో ప్రతి ప్రేంలో కనిపిస్తుంది.
సినిమా మాధ్యమంతో సమాజంలోని ఎన్నో సమస్యలను, కోణాలను ఒకే సందర్భంలో చర్చకు తీసుకు రావచ్చు. ఇంత శక్తివంతమైన సామాజిక ప్రయోజనాన్ని మరో మాధ్యమం ఇంత విజయవంతంగా నెరవేర్చలేదు. దీన్ని అర్ధం చేసుకున్న దర్శకులే ఇటువంటి సినిమాను తీయగలరు. ఏమైనా భారతీయ సినిమా గౌతం రామచంద్రన్ ను గొప్ప దర్శకుల జాబితాలో చేర్చడానికి దోహదపడే సినిమా ''గార్గి''. భారతీయ సినిమాలోని గొప్ప స్త్రీ పాత్రలలో ఒకటిగా మిగిలిపోయే ఈ సినిమాను చేసినందుకు సాయి పల్లవి చాలా మంది సినీ ప్రేమికుల మనసులలో గౌరవప్రదమైన స్థానాన్ని పొందారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ సినిమాలో కథతో పాటు కథనం, పాత్రల పేర్ల ద్వారా కూడా దర్శకుడు చాలా లోతైన చర్చకు తెరతీసారు. ఎన్నో సామాజిక అంశాలను, న్యాయం అందని బాధితుల మనోభావాలను స్పశించారు. కొన్ని సార్లు ఓటమిని ఒప్పుకుని నిజాన్ని గెలిపించడమే మనిషి కర్త్యవ్యం అనే గొప్ప సందేశాన్ని 'గార్గి' పాత్ర ద్వారా సమాజంలోకి చొప్పించే ప్రయత్నం చేసిన గౌతం రామచంద్రాన్ని, ఈ సినిమాను ఒప్పుకుని చేసి ఆ పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేసిన సాయి పల్లవిని మంచి సినిమాను ఆశించే ప్రతి ఒక్కరు అభినందించి తీరవలసిందే.
- పి.జ్యోతి, 9885384740