Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉపాధ్యాయ వృత్తి నుంచి వామపక్ష విప్లవ కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమంలో ఆవిరళ కృషి చేసి కమ్యూనిస్ట్లచే పి.వి. గా పిలువబడిన పొన్నతోట వెంకటరెడ్డి జీవిత చరిత్రను వారి కుమారుడు గంగాధర్ రెడ్డి చక్కటి ఫొటోలు, లేఖలతో ఈ పుస్తకం అందించారు.
సుందరయ్య 'విప్లవపథంలో నా పయనం' అనే గ్రంథంలో వెంకటరెడ్డి గూర్చి రాసారు. మహావ్యక్తుల త్యాగమయ ఆదర్శ కమ్యూనిస్ట్ నిబద్ధ జీవితం - భావి తరాలకు ఎప్పటికీ స్ఫూర్తినిస్తాయి. ఫ్యాక్షనిస్ట్‌ల సీమలో అంకాలమ్మ గూడూరును 'మాస్కో ఆఫ్ ఇండియా' అనే స్థాయికి తెచ్చిన ఘనుడు పొన్నతోట వెంకటరెడ్డి. క్రూర నిర్బంధాలను ఎదుర్కొంటూ ఉపాధ్యాయ వృత్తిని త్యజించి కమ్యూనిస్టుగా చివరి నిమిషందాకా పనిచేయడం స్వాతంత్య్ర సమరయోధుల పెన్షన్ త్యజించిన ఆరద్శ కమ్యూనిస్ట్ వెంకటరెడ్డి. పార్లమెంట్లో ప్రతిపక్షనేతగా పనిచేసిన ఎ.కె.గోపాలన్ లాంటి నాయకులకు (కడలూరు జైలులో) హిందీ పాఠం చెప్పి వారికి హిందీ నేర్పాడు.
తరిమెల నాగిరెడ్డి, చండ్రపుల్లారెడ్డి, సదాశివన్, వి.కె.ఆదినారాయణరెడ్డి, రపూఫ్లతోను, చిత్తూరు - కడప జిల్లాల నాయకత్వంలో పొన్నతోట వెంకటరెడ్డి కలియ దిరిగి ఉద్యమ నిర్మాణంలో భాగమైనాడు. రైతు కూలీ - ఉద్యమాలు - ప్రాజెక్టులకై పోరాటం - సాంస్కృతిక దళాలు ఏర్పాటు, తుంగభద్ర ఎగువ కాలువ సాధనా కమిటీ ఏర్పాటు, జిల్లా మార్కెటింగ్ సొసైటి కృషి, ఆనాటి మద్రాస్ రాష్ట్ర ముఖ్యమంత్రి రాజగోపాలాచారి నుంచి 1988 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు దాకా ప్రజా సమస్యలపై పొన్నతోట పోరాటాలు, విన్నపాలు చేసిన ఘటనలు ఓ చరిత్రే... 1955లో పులివెందుల అసెంబ్లీ సీటుకు గజ్జెల మల్లారెడ్డి పోటీ చేయడం, ఆయనకు అండగా వెంకటరెడ్డి నిలబడి కృషి చేయడం, 1964 లో పార్టీ చీలిక సందర్భంలో పొన్నతోట సి.పి.ఐ(ఎం) వైపు రావడం, జిల్లా కార్యదర్శిగా పని చేయడం, పొన్నతోట డైరీలు విలువైన సమాచారం కలవి. రాజకీయ కార్యకర్తల నిరంతర పోరాటాలకు, ఆదర్శమయ కమ్యూనిస్ట్ జీవితం, పార్లమెంటరీ, పార్లమెంటేతర రంగాల్లో కృషి ఎలా చేయాలో వెంకటరెడ్డి చరిత్ర స్ఫూర్తిగా నిలుస్తుంది. 'అలుపెరుగని పోరాట యోధుడు - కామ్రేడ్ పొన్నతోట వెంకటరెడ్డి' అంటూ విప్లవ కవి నిఖిలేశ్వర్ అభిప్రాయం చివరలో ప్రచురించారు.
పొన్నతోటను కమ్యూనిస్ట్ గా మార్చడంలో తరిమెల నాగిరెడ్డి విద్వాన్ విశ్వంగారల కీలకపాత్ర వుంది. తన పొలం అమ్మి పార్టీ అభ్యర్థికి విరాళంగా ఇచ్చిన త్యాగశీలి పొన్నతోట వెంటకరెడ్డి. 1967లో సి.పి.ఐ(ఎం) అభ్యర్థిగా పులివెందులలో పోటీ, 1969లో విప్లవ పార్టీలోకి చేరడం (ఎం.ఎల్) ఇలా విప్లవ పోరాటమయ జీవితాన్ని తేదీలు, సంవత్సరాల వారీగా డైరీ ద్వారా అందించిన గంగాధర్‌రెడ్డి అక్షరకృషి అభినందనీయం.
- తంగిరాల చక్రవర్తి , 9393804472
రచయిత : పొన్నతోట గంగాధర్‌రెడ్డి
పేజీలు : 118, వెల : రూ.100/-,
ప్రతులకు : పొన్నతోట గంగాధర్‌రెడ్డి, ఇ.నెం. 8/125, ప్రశాంతి నిలయం, మమవారి వారి శాలవీధి, వేంపల్లి, కడపజిల్లా, ఆం.ప్ర.;
సెల్ : 9441002965