Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మేరు పర్వతానికి దక్షిణ దిశలో కంగాళీ దేశముంది.
ఆ దేశంలో దిక్కుమాలిన రాష్ట్రముంది.
ఆ రాష్ట్రంలో పనికిమాలిన ప్రభుత్వముంది.
ఆ ప్రభుత్వంలో లత్కోర్ అనే మంత్రి ఉన్నాడు.
అతనే ఉన్నత పదవీ ప్రాప్తి యాగం చేసి అగ్ని దేవునికి అగ్నిపరీక్ష పెట్టాడు.
అమ్మో నగరం దిక్కు మాలిన రాష్ట్ర రాజధాని. ఆ నగరంలో అసెంబ్లీ ఉంది. సెక్రెటేరియట్ ఉంది.. హైకోర్టు కూడా ఉంది. మురికి వాడలున్నాయి. వాటిలో పిల్లాజెల్లాతో పందులు తిరుగుతుంటాయి.
దిక్కుమాలిన రాష్ట్రంలో అది దిక్కూమొక్కూ లేని ఊరు. ఆ ఊళ్లో పది వేల గడపుంది. బడి ఉంది. గుడి ఉంది. ఆ ఊరి చివర చెరువుంది. ఆ చెరువులో కలువ పూలున్నాయి. చేపలున్నాయి. తాబేళ్లూ ఉన్నాయి. ఆ చెరువు పక్కనే తమలపాకు తోటలున్నాయి.
ఆ ఊరిలో సినిమా హాలు లేదు. అప్పటికింకా టీవీలు రాలేదు. దాంతో వినోద కాలక్షేపానికి ఆ ఊరి జెనం వీధి బాగోతాల్నీ బుర్రకథల్ని, ఒగ్గు కథల్నీ, హరి కథల్నీ ఆశ్రయించేవారు.
వీధి బాగోతాలకు నారయ్య బృందానికి గట్టి పేరుంది, వారు రకరకాల భాగోతాలాడేవారు. ఆ ఊళ్లోనే కాకుండా చుట్టుపక్కల ఊళ్లలో ప్రదర్శనలిచ్చేవారు. దిక్కూ మొక్కూలేని ఊరి జెనాలకు కృష్ణుడంటే వీధి భాగోతంలోని కృష్ణుడే కృష్ణుడు. ఆ ఊరి దొరసాని కృష్ణ వేషధారి మీద మనసు పారేసుకొంది. ఆ రోజు భాగోతమయ్యాక అతణ్ని కలిసింది.
''నా మొగుడింట్లో లేడు. గీ నాత్రి కిష్నుడి యేసంలనే మా ఇంటికి నాత్రంత నాతోనే వుండు. నీకేం గావాలంటే గది ఇస్త'' అని అన్నది.
''గీ సంగతి దొరకెర్కైతె నా బొక్కలు చూరచూర జేస్తరు''
''నువ్వేం బుగులు బడకు. నేను గాల్లతోని గీల్లతోని బోతున్నదని గానికెర్కే''
''మీ ఇంట్ల పెద్ద కుక్కున్నది''
''మా కుక్కను కట్టేసి ఉంచుత. తప్పకుంటరా. యాది మర్వకు'' అని దొరసాని అన్నది.
బాగోతుల నారయ్య కొడుకే లక్ష్మీకాంత్. చిన్నారి పొన్నారి చిరుత కూకటినాడే చిన్ని కృష్ణుని వేషం కట్టాడు. నూనూగు మీసాల నూత్న యవ్వనంలో కృష్ణుడు లేదా రాముని వేషం కట్టడానికుబలాట పడ్డాడు. కానీ ఆ వేషాలకు పనికిరావన్నారు. లత్కోర్ వేషానికే సరిపోతావన్నారు. దాంతో అతనా వేషం కట్టాడు. అతని లత్కోర్ వేషానికి జెనం ఫిదా అయ్యారు. నారయ్య బృందం బాగోతాల్లో లత్కోర్ ప్రత్యేక ఆకర్షణయ్యాడు. అప్పటినుంచీ అతని అసలు పేరు మరుగునపడిపోయింది. లత్కోరే అతని పేరైపోయింది.
వేషం కట్టినప్పుడే కాకుండా ఉత్తప్పుడు కూడా అతను కాకీ ప్యాంటూ దాని మీద చిరుగుల కాకీ చొక్కా నెత్తిన టోపీ; చేతిలో కట్టె తుపాకీతో కనిపించేవాడు. ప్యాంటును ఒక కాలు మీద కొద్ది మడిచేవాడు. కర్ణుడికి కవచకుండలెలాటివో లత్కోర్కు కానీ ప్యాంటూ, కాకీ చొక్కా, టోపీ కట్టె తుపాకీ అలాంటివి.
రెణ్నెల్లలో దిక్కుమాలిన రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు... ఆ రాష్ట్రంలో బొచ్చెపార్టీ అధికారంలో ఉంది. అన్ని పార్టీలకన్నా ముందుగానే ఆ పార్టీ ఎన్నికల ప్రచారం మొదలెట్టింది. బొచ్చె పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆనందరావు. ఆ రాత్రి కారులో అతను దిక్కూ మొక్కూలేని ఊళ్లో నుంచి వెళుతుండగా సరిగ్గా బాగోతం ఆడుతున్న చోటే కారు కదలకుండా మొరాయించింది. ఈ ఊళ్లో మెకానిక్ లేడు. అక్కడికి పదిమైళ్ల దూరంలో తాలూకా కేంద్రముంది. అక్కడ మెకానిక్లున్నారు. కానీ అప్పటికే రాత్రి పదకొండైంది.
గత్యంతరం లేక ఆనందరావు కారు దిగాడు. గొంగళ్లూ, చాపలూ పరుచుకొనీ, అరుగుల మీద కూచునీ ఆ ఊరి జెనం బాగోతం చూస్తున్నారు. వారిలో కొందరు ఆనందరావును గుర్తు పట్టారు. కుర్చీ తెచ్చి వేసారు. అప్పుడే కట్టె తుపాకీ పట్టుకొని 'నాకేం తక్వ, నాకేం తక్వ' అంటూ బాగోతం మధ్యలో లత్కోరొచ్చాడు.
లత్కోర్ రాగానే నవ్వులు గుప్పుమన్నాయి.
అందరిలో ఉత్సాహం నిద్ర లేచింది.
ఆనంద సమీరం అలా అలా వీచింది.
కునికి పాట్లు పడుతున్న కొందరు కళ్లు నులుముకొని చూసారు.
లత్కోర్ను ఆనంద రావు పరీక్షగా చూసాడు.
ఎన్నికల ప్రచా రానికి వీడు పనికొస్తాడనుకొన్నాడు.
''లత్కోర్ వేషం వేసిన వాడి పేరేమిటి?'' అని పక్కనున్న వాణ్ని అడిగాడు.
''లత్కోర్'' అని చెప్పాడు.
''నేనడిగేది వేషం గురించి కాదు, వాడిపేరు''
''గాని పేరు గుడ్క లత్కోరే''
బొచ్చె పార్టీ కార్యకర్తలు ఆ ఊళ్లోనూ ఉన్నారు. ఆ రాత్రి తమ బొచ్చె పార్టీకి చెందిన చోటామోటా నాయకుని ఇంట్లో ఆనందరావు బస చేసాడు.
లిలిలి
అదొక చిన్న పెంకుటిల్లు. దాని చుట్టూ ఖాళీ స్థలం. ఖాళీ స్థలం ఖాళీగా లేదు. దానిలో పూల మొక్కలున్నాయి. పెరట్లో చేదబావి ఉంది. కొబ్బరి చెట్టుంది. మావిడి చెట్టుంది. ఆనప పాదుంది. ఇంటి ముందు వేపచెట్టుంది. మల్లె పందిరుంది. మొక్కల్ని పశువులు తినకుండా ఇంటి చుట్టూ పెన్సింగుంది.
వేపచెట్టు కింద నులక మంచంలో లత్కోర్ ఒళ్లెరగకుండా నిద్రపోతున్నాడు.
''వారీ లత్కోర్ ఇయ్యాల ఎన్మిది గొట్టినా లెవ్వకుంట పన్నవేందిరా. లెవ్వు. లెవ్వు.''
లత్కోర్ బలవంతాన కళ్లు తెరిచాడు. కళ్లు నులుముకొని చూసాడు.
ఎదురుగ్గా వడ్ల బాలయ్య వాడికి కనిపించాడు.
''ఏందిరా! బాలిగా యాల పొద్దుగాలే వొచ్చి నా పానం దింటున్నవేంది?'' అని లత్కోర్ అడిగాడు.
''నిన్న రాత్రి మోటర్ల మనవూరికొచ్చిన బొచ్చె పార్టీ లీడర్ నిన్ను దీస్కోని రమ్మన్నడు''
''నాతోని గాయినకేం పని''
''ఏమో నాకేమెర్క''
''గిప్పుడు గాయిన యాడుండు''
''లక్ష్మయ్య శేఠ్ ఇంట్లున్నడు''
''తానం జేసినంకొస్త''
''జల్దిరారా!'' అని అంటూ బాలయ్య వెళ్లిపోయాడు. లత్కోర్ స్నానం చేసాక సల్ది బువ్వ తిన్నాడు. లక్ష్మయ్య శేఠ్ ఇంటికెళ్లి వరండాలో కూర్చున్నాడు.
అరగంటయ్యాక-
''గీడ లత్కోరెవ్వడు. సార్ రమ్మంటున్నడు'' అని ఇంట్లోపలి నుంచి వచ్చిన ఒకడు చెప్పాడు.
లత్కోర్ వాడి వెంట వెళ్లాడు. ఆనందరావుకు దండం పెట్టాడు.
''నువ్వు మా పార్టీ తరుపున ప్రచారం చెయ్యాలి'' లత్కోర్తో ఆనందరావు అన్నాడు.
''నాకు ప్రచారం చెయ్యరాదు''
''నీకు రాకపోతే మేము నేర్పిస్తాం. నువ్వెంత దాకా చదువుకున్నావు''
''ఇంటర్ దాన్క సద్వుకున్న సార్''
''రోజూ న్యూస్ పేపర్ చదువుతావా?''
''లే, ఎప్పుడన్న ఒకసారి సద్వుత''
''ఇవాల్టి నుంచి రోజూ న్యూస్పేపర్ చదువు, నీకో డైరీ ఇస్తాను. అందులో ఏ పార్టీ నాయకుడు ఏమన్నాడో నోట్ చేసుకో''
''పేపర్ సద్వుత గని డైరీల రాసుడెందుకు సార్''
''నువ్వు ఎక్కడున్నా ఎన్నికల ప్రచారం చేసేముందు డైరీలో రాసుకొన్ని పాయింట్లను చూస్తే నీకు ఎలా మాట్లాడితే బాగుంటుందో తెలుస్తుంది''
''నేను మీ యెంబడి ఎప్పుడు రావాలె''
''ఎప్పుడో ఏమిటి ఇప్పుడే రావాలి''
''మా ఇంట్ల చెప్పొస్త''
లిలిలి
ఆకసపు రంగస్థలం మీద వెలుగు తెరజారింది.
మేకప్ చేసుకొన్ని చుక్కకన్నెలు రంగప్రవేశం చేసాయి
వీధుల్లోని కరెంటు దీపాలు కళ్లు తెరిచాయి
అమ్మో నగరం. పెళ్లివారి ఇల్లులా సందడిగా ఉంది.
రిలీజైన సినిమా మొదటాట ప్రదర్శించబోయే థియేటర్లా ఉంది.
రైలు రావడంతో ఒళ్లు విరుచుకొని లేచిన ఫ్లాట్ఫాంలా ఉంది. మరో అరగంటలో మైసమ్మ మైదానంలో బొచ్చెపార్టీ బహిరంగ సభ. ఆ సభ తీసుకొచ్చిన జనసందోహం. ఎగురుతున్న పార్టీ జండాలూ, బొచ్చె గుర్తుతో ఉన్న బెలూన్లూ; కలగాపులగమైన జానపద గీతాలూ, బీరు సీసాలూ; బిర్యానీ పొట్లాలూ; నీళ్లప్యాకెట్లూ; బొచ్చెపార్టీ జాతీయ నాయకుల కటౌట్లూ; మైక్ టెస్టింగ్లూ; అరచేతిలో వైకుంఠం. అదొక ఎన్నికల జాతర.
సరిగ్గా రాత్రి ఏడు గంటలకు బొచ్చె పార్టీ బహిరంగ సభ మొదలైంది. మొదట మహామంత్రి మాట్లాడాడు. బొచ్చెపార్టీ జాతీయ అధ్యక్షుడూ; ఇతర నాయకులూ ప్రసంగించారు. అది నాయకుడు ముచ్చటగా మూడు ముక్కలు మాట్లాడాడు. ఆఖరున లత్కోర్ రంగప్రవేశం చేసాడు.
''చిప్పపార్టీ సర్కారు గినొస్తే ఇండ్లు గట్టిపిచ్చి ఇస్తవని అందరు అంటుండె. అవునేమో అనుకున్న. గా పార్టీ లీడర్లు ఊరూరు దిర్గుతున్నరు. ఉత్తుత్త మాటలు జెప్తున్నరు. మమ్ములేవంగ థూట్ పొమ్మంటున్నరు. మీ బత్కులు గింతే అంటున్నరు. గిదే మీ రాతంటున్నరు. మన్నంటున్నరు. మశానమంటున్నరు. మారాజ్! గాల్లు ఇచ్చేటి ఇండ్లు, గుడ్డోని కండ్లు మారాజ్. గద్విట్ల పగటీల సూర్యుడుంటడు. నాత్రీల చెంద్రుడుంటడు. గా ఇండ్లల్ల దోమలు పాటలు బాడ్తయి. నల్లులు ఆటలాడ్తయి. వానొస్తే పట పట. గాలిగొడ్తె లొటలొట. గా ఇండ్ల ముంగట మోరీలుంటయి. ఇండ్లెన్క గోరీలుంటయి. పందులు పహారా గాస్తయి. కుక్కలు కావలుంటయి. గా ఇండ్ల సుట్టూత తుమ్మచెట్లుంటయి. పాముల పుట్టలుంటయి మా రాజ్!
గీడ్కి నేను రాకిట్ల రాలే. గాలిమోటర్ల రాలే. హెలికాప్లర్ల రాలే. రేల్ గాడిల రాలే. మోటార్ల రాలే. గ్యారా నంబర్ బస్సుల వొచ్చిన మారాజ్. నాకేం తక్వ. నాకేం తక్వ. రెండు నూర్ల ఎక్రాల పొలమున్నది. రొండంత్రాల బంగ్లున్నది. రొండు కిలల బంగారమున్నది. అన్ని ఉన్నయి గని బువ్వ వొండుకుందామంటె బియ్యం లెవ్వు మారాజ్!
చిప్ప పార్టీ లీడర్లు యందు బంద్ జేపిస్తమంటున్నరు. బువ్వ లేకున్నా బత్కొచ్చు, నీల్లు లేకున్నా బత్కొచ్చు. మందు లేకుంటె ఎట్ల బత్కొస్తది మారాజ్. మహా మంత్రితోని సర్కార్ నడుస్తలేదు. మంత్రులతోని నడుస్తలేదు. ఎమ్మెల్యేలతోని నడుస్తలేదు. పోలీసోల్ల తోని నడుస్తలేదు. నాతోనే నడుస్తున్నది మారాజ్. బొచ్చె పార్టీకే ఓట్లు ఎయ్యుండ్రి. అన్నం బెడ్తె అర్గిపోతది. బట్టలు ఇస్తె చిన్గిపోతయి. బొచ్చె ఇచ్చేటి ప్రేమ అర్గేది గాదు. కర్గేది గాదు'' అంటూ లత్కోర్ మాట్లాడాడు.
వాడి ప్రతి మాటకూ జెనం చప్పట్లు కొట్టారు.
సభలలో ఎలా మాట్లాడాలో లత్కోర్కు ఎవరూ నేర్పలేదు.
తరువాయి వచ్చేవారం...
- తొలిదేవర భానుమూర్తి
99591 50491