Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాల సాహిత్య రచన కేవలం పుస్తకాలు అచ్చు వేసుకోవడం కోసమో లేక పేరు కోసమో కాక తమ బాధ్యతగా, అత్యంత ప్రేమగా రాస్తున్న ఎందరో కవులు, రచయితలు ఇవ్వాళ్ళ తెలుగునాట ఉన్నారు. గతంలో వచ్చిన మూస కథల్లా కాక నిన్న మొన్నటి కథల పాత్రలున్నప్పటికీ ఆధునిక దృక్పథంతో, వైజ్ఞానిక స్పృహ, హేతువు వంటివి ప్రధానంగా చేసుకుని ఇవ్వాళ్ళ రచనలు ఎక్కువగా వస్తున్నాయి. అలా రాస్తున్నవారిలో కథా రచయిత, బాలల కథా, నవలాకారులు పుప్పాల కృష్ణమూర్తి మొదటి వరుసలో ఉంటారు.
పుప్పాల కృష్ణమూరి 10 అగస్టు, 1961 లో నల్లగొండ జిల్లాలో పుట్టారు. పుల్లమ్మ- సుబ్బయ్యలు తల్లిదండ్రులు. పంచాయత్‌రాజ్ శాఖలో సూపరింటెండెంట్‌గా పదవీ విరమణ చేశారు. 1981లో కళాశాల విద్యార్థిగా తన తొలి రచనతో కళ్ళు తెరిచిన పుప్పాల, కథా రచయితగా వివిధ సామాజిక అంశాలపై తనదైన దృష్టితో దాదాపు నూటా యాభైకి పైగా కథలు రాశారు. వివిధ సమస్యలపై నలభైకి పైగా వ్యాసాలు రచించారు. ఇవేకాక యాభై గల్పికలు, నాటికలు రాశారు. 'జీవిత చిత్రం', 'స్వేచ్ఛ, సౌందర్యం' వీరి కథా సంపుటాలు. 'విషవలయం' గల్పికల పుస్తకం. వివిధ సంస్థలు, పత్రికలు నిర్వహించిన కథల పోటీల్లో అనేక బహుమతులు అందుకున్నారు. వాటిలో, సాక్షి, జాగృతి, నవ్య వార పత్రికలు ఉన్నాయి. నవ తెలంగాణ నిర్వహించిన పోటీల్లో ముచ్చటగా మూడుసార్లు 2017, 2018, 2019లో వరుసగా బహుమతులు అందుకున్నారు పుప్పాల.
వ్యాసకర్తగా, కథకులుగా ప్రసిద్ధులైన పుప్పాల బాలల కోసం రాసిన రచనల లిస్టు చాంతాడంత పెద్దది. బాధ్యత తెలిసిన ఈ బాలల రచయిత వద్ద ఏ మంత్ర దండం ఉందో... ఇప్పటికీ పిల్లల కోసం ఎనమిది వందల కథలు రాశారు. ఒక నవల రాశారు. వీరి కథలన్నీ సంపుటాలుగా, పుస్తకాలుగా వచ్చాయి. ఎక్కువగా నవ తెలంగాణ ప్రచురణ సంస్థ రంగుల్లో వీరి కథా సంపుటాలు ప్రచురించడం విశేషం. తొలి బాలల కథా సంపుటి 2004లో 'బుడి బుడి నడకలు' పేరుతో వచ్చింది. అటు తరువాత, 'మోసం', 'పాలపిట్ట' సంపుటాలు రాగా, జానపద కథలు 'పిట్టగూడు'గా తెచ్చారు. 'ముల్లా నసీరోద్దీన్ కథలు' పునఃకథనం చేసి అదే పేరుతో ప్రచురించారు.
ఇటీవల 'బుడ్డోల్ల కథలు' శీర్షికన రంగుల్లో వచ్చిన పుప్పాల కథా సంపుటాలు వీరికి ఎక్కువగా పేరుతెచ్చి పెట్టాయి. అవి 'తన కోపమే తన శత్రువు', 'జాతకం తెలిసినవాడు', 'దోసకాయలు-సొరకాయలు', 'వంతెన', 'జంతువుల స్నేహం', 'అల్లరి హద్దు మీరరాదు'. నిరంతరం పిల్లల కోసం తపించిరాసే పుప్పాల రాసిన ఇతర బాలల కథా సంపుటాలు 'వెన్నెల వాకిలి', 'రాజహంస' మొదలగు పదమూడు సంపుటాలు తెచ్చారు. పిల్లల కోసం రాసిన నవల 'ఇద్దరు మాంత్రికులు'. ఇవేకాదు, ఈ కథల మాంత్రికుని జోలెలో అచ్చుకోసం మరో పది సంపుటాలకు సరిపడా కథలు ఉన్నాయి.
వివిధ సాహిత్య సాంస్కృతిక సంస్థలతో సన్నిహిత సంబంధమున్న పుప్పాల కృష్ణమూర్తి తన మిత్రులతో కలిసి హుజూర్ నగర్లో 'స్పందన' సామాజిక అధ్యయన వేదికను నిర్వహించారు. 2020 నుండి కోదాడ రచయితల సంఘం అధ్యక్షులుగా ఉన్నారు. బాల సాహితీవేత్తగా రాజీవ్ విద్యా మిషన్ నిర్వహించిన 'జాబిలి' పత్రిక సంపాదకవర్గ సభ్యులుగా ఉన్నారు. అపారమైన సాహిత్య సృజనచేసిన వీరి రచనలపై వివిధ విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు జరిగాయి. 'జాబిల్లి'. 'జీవిత చిత్రం' కథా సంపుటాలపై తెలుగు విశ్వవిద్యాలయంలో ఎం.ఫిల్ పరిశోధనలు జరగగా, 'పుప్పాల కృష్ణమూర్తి జీవితం-సాహిత్యం' అంశంపై కాకతీయ విశ్వవిద్యాలయంలో పిహెచ్.డి పరిశోధన జరుగుతోంది.
తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం మొదలుకుని వివిధ ప్రతిష్టాత్మక పురస్కారాలు అందుకున్న పుప్పాల కథలను రాయడంలో తనదైన ఒక విలక్షణ పద్ధతిని ఏర్పరచుకున్నారు. పాత్రలు సంప్రదాయ కథల్లోనివి, నేటి బాలబాలికలు, సమకాలీన పెద్దలు అయినా విషయాన్ని నేరుగా, పిల్లలకు హత్తుకునేలా చెప్పడం ఈయన కథల్లో చూస్తాం. అన్నింటికి మించి బాలల కోసం రాయాల్సిన భాష, వస్తువు, విషయం వంటివాటిపట్ల వీరికి చక్కని అవగాహన ఉంది. అది వీరి మెజారిటీ రచనల్లో చూడొచ్చు. ముఖ్యంగా ఇటీవల వచ్చిన 'బుడ్డోల్ల కథలు' బాలల కథకునిగా పుప్పాల కృష్ణమూర్తిని గొప్పగా చూపెడతాయి. కేవలం వస్తువు, కథల వంటివే కాక ముద్రణ విషయంలో కూడా ఇవి ప్రత్యేకమే. అందమైన ఆర్ట్ పేపర్‌తో, నాలుగు రంగుల్లో, అందమైన చక్కని బొమ్మలతో వచ్చిన ఈ కథల పుస్తకాలు పిల్లలకు కాదు పెద్దలకు నచ్చుతాయి. ఇందులోని కథలు కూడా అలాంటివే. ఉద్యోగ విశ్రాంత జీవితం గడుపుతూనే అవిశ్రాంతంగా పిల్లల కోసం రాస్తున్న పుప్పాల కథల పుట్టలోంచి మరిన్ని మేలిమి కథల కోసం చూస్తూ.... జయహో! బాల సాహిత్యం.
- డా|| పత్తిపాక మోహన్, 9966229548