Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హాస్యాన్ని మన పూర్వులు నవరసాల్లో ఒకటిగా గుర్తించారు. అయినప్పటికీ, తెలుగు సాహిత్యంలో హాస్య రసానికి దక్కవలసినంత ప్రాముఖ్యత దక్కలేదు. ఇతర రసాలకు ప్రాధాన్యత ఇస్తూ అక్కడక్కడ పాయసంలో పలుకుల్లా హాస్యపు మెరుపుల్ని అద్దేవారు. రాజు వెంట విదూషకుడు ద్వారా, లేదా రాణి వెంట చెలికత్తెల ద్వారా హాస్యరసపోషణ గావించబడేది.
తెలుగుపై పాశ్చాత్య వాఙ్మయ ప్రభావం ఇంగ్లీషు వారికి పరిపాలనతో ప్రారంభం అయింది. బెంజమిన్ ఫ్రాంక్లిన్, మార్క్ ట్వంబన్, ఆస్కార్ వైల్డ్ జెరోం, కె.జెరోం, పి.జి.ఉడ్హవుజు లాంటి వారల రచనలు తెలుగు రచయితలపై గొప్ప ప్రభావం చూపాయి. ముని మాణిక్యం నరసింహారావు, చిలకమర్తి, మొక్కపాటి ప్రభృతులు, గణపతి, బారిష్టర్ పార్వతీశం లాంటి పాత్రలను సృష్టించి వారిని తెలుగు పాఠకులకు పరిచయం చేసి చిరంజీవులను చేసారు. అయినను, తెలుగు సాహిత్యంలో హాస్యరస ప్రధాన రచనలు తక్కువే అని చెప్పవచ్చును. ముళ్ళపూడి, యర్రంశెట్టి ప్రభృతులు తమ హాస్య రచనలతో తెలుగు సాహిత్యానికి నిండు'ధనం' చేకూర్చారు.
ప్రస్తుత పుస్తక రచయిత పోట్లూరి సుబ్రహ్మణ్యం తెలుగు సాహిత్యానికి సుపరిచితులే! లోగడ వీరు ఉదయగిరి దుర్గం, కొసమెరుపు కథలు, చింకి చాప లాంటి హాస్య ప్రధాన కథా సంపుటాలను అందించారు. 'కామెడీ కథలు' పోట్లూరి నాల్గవ సంపుటి.
పుస్తకానికి ఇచ్చిన శీర్షికతతోనే పాఠకుడు ఇవి హాస్యరస ప్రధాన కథలుగా తెలుసుకుంటాడు. 'కామెడీ' అన్న ఇంగ్లీషు పదానికి తెలుగు అర్థం నవ్వు పుట్టించేది లేదా హాస్యము అని చెప్పుకోవచ్చును. స్వర్గీయ మునిమాణిక్యం నరసింహారావు తన ''మనహాస్యం'' (ఆంధ్ర సార్వస్వత పరిషత్తు వారి ముద్రణ 1968) లో 'ఆనందం బహిరంగ రూపమే హాస్యము (నవ్వు)' అటారు. ఇంకాస్త లోతుకు వెళ్ళితే- ఈ సంపుటిలో 24 కామెడీ కథలున్నాయి. ఇవన్నియు, లోగడ పలు ప్రముఖ పత్రికలు / అంతర్జాతీయ సంచికలలో ప్రచురించబడి 'నాణ్యత' 'గీటు రాయి' మీద పరీక్షించబడి నిగ్గుతేలినవే అవటం విశేషం. రచయిత కథల్లోని పాత్రల ద్వారా వారి వారి జీవితాలకు అద్దం పడుతూ సంఘటనలకు, సంభాషణలకు, సన్నివేశ రూపకల్పనకు 'కామెడీ' అద్దారు. అందుకే ఈ కథలు పాఠకుడిని పడీపడీ నవ్వించవు, పగలబడి నవ్వించవు. తమిళ సినిమా సన్నివేశాలలాగా అనిపించవు. పాఠకుడి మనసుకు ఉల్లాసం కలుగజేస్తూ, వారి ముఖాల్లో చిరునవ్వులు విరబూయిస్తాయి. మందహాసాల మందారాలు విచ్చుకుంటాయి. 'పప్పులోకాలు - కప్పులో పాలు' 'జీతం - జీవితం' 'నరబలి కోరిన నారి' లాంటి శీర్షికలతో ఆదిలోనే హాస్యం, ఆసక్తి రేకెత్తించారు. 'సంగీతరావు సకల కళా వల్లభుడు, అంతమాత్రాన అతను చతుషష్టి కళలలో ఆరితేరిన వాడని అర్థం కాదు. అతని కళలేవేరు' (సకల కళా వల్లభుడు) అన్న ఎత్తుగడతోనే పాఠకులలో ఉత్కంఠ రేకెత్తిస్తారు. సామాన్యుల జీవితాల్లోంచి కథలు ఏరుకుని అసామాన్యమైన శైలితో పాఠకులతో విడవకుండా చదివిస్తారు. మెత్తని కత్తి లాంటి షుగర్ వ్యాధి, బాకుల్లాంటి జోకులు (పే.3) పాదరసంలా ప్రవహించటం, గారాలు పోతోన్న బస్సు గమనం (కప్పలు - కథ), వడదెబ్బలు కాదు వాళ్ళావిడ దెబ్బ (పే 106) గర్వం ఆంజనేయుడి తోకలా విజృంభించటం (పే 132) అంకెకు రాని ఆలి (పే 144) కాకామిజాన్ని కాక్టెయిల్లా కలపటం, అందరి కాళ్ళకు మొక్కినా, అత్తారింటికి పోకతప్పదు (పుట్టినరోజు కానుక) లాంటి పదాలు / వాక్యాల ప్రయోగంతో కథను రక్తి కట్టించారు. ప్రతిపాదించే సూత్రాలు కూడా నవ్వు పుట్టిస్తాయి. బట్టతల ఉన్న ప్రతి ఒక్కరి దగ్గరా తప్పక దువ్వెన ఉంటుందట! (కమల హాసన్ దువ్వెన) ట్రయిన్ ప్రయాణం, చిల్లర కొరత, బ్రహ్మచారికి అద్దె ఇల్లు / గది దొరకపోవటం, జీతం ఇచ్చిన మొదటి వారం, రెండు మూడు నాల్గవ వారం వచ్చేసరికి ఎలా దేబిరింపులకు ఉద్యోగులు దిగుతారో (జీతం - జీవితం) ప్రతీ సాధారణ సంఘటలని, అసాధారణం చేసి, హాస్యం అద్ది రుచి చూపిస్తున్నారు.
ఈ 24 కథలన్నీ ఒకేసారి చదవకండి. 2, 3 కథలు చదివాక కొంచెం 'గేపు' ఇచ్చి చదివిన కథలను పునశ్చరణ చేసుకుని మొలక నవ్వులు ఒలుకుతుండగా, తర్వాతి కథలకు రండి. మరిన్ని కథలు కావాలని పోట్లూరు వారితో మీరు తప్పక పోట్లాడతారు.
(కామెడీ కథలు, రచయిత : పోట్లూరు సుబ్రహ్మణ్యం,
వెల : రూ. 250/- (రచయిత ద్వారా రూ.150/- మాత్రమే)
ప్రతులకు : పోట్లూరు సుబ్రహ్మణ్యం, సెల్ : 9491128052;
విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌజ్, నవచేతన పబ్లిషింగ్ హౌజ్)
- కూర చిదంబరం, 8639338675