Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమ్మో నగరంలో జరిగిన బొచ్చె పార్టీ ఎన్నికల ప్రచార సభలన్నిటికీ లత్కోర్ వెళ్లాడు. ఆ సభల్లో ఎవరు ఎలా మాట్లాడుతారో, ఎలాటి హావభావాలు వ్యక్తం చేసారో అతను నిశితంగా పరిశీలించాడు. ఆనందరావు సలహా మేరకు రోజూ వార్తాపత్రికల్ని చదివాడు. తన స్పీచ్‌కి పనికి వస్తాయనుకున్న అంశాల్ని డైరీలో నోట్ చేసుకొన్నాడ. ఏదైనా ప్రాంతానికి వెళ్లేముందు అక్కడి సమస్యల గురించి తెలుసుకొనేవాడు. తన ఫక్కీలో స్పీచ్ తయారు చేసుకొనేవాడు. బొచ్చెపార్టీ ఎన్నికల ప్రచార సభల్లో లత్కోర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. అసెంబ్లీ ఎన్నికల్లో బొచ్చెపార్టీ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
ఎన్నికలయ్యాయి. నాతో మీకేం పని. మా ఊరికి వెళతాను అని లత్కోర్ అంటే లేదు, లేదు, ఇక్కడే ఉండి ప్రభుత్వ పథకాల గురించి ప్రచారం చేయవలసిందిగా ముఖ్యమంత్రి కోరారు. దాంతో లత్కోర్ అమ్మో నగరంలోనే ఉండి పోయాడు. అతని మాట తీరులో మార్పు వచ్చింది. ఇంతకుముందు ఎవరిని బడితే వారిని నువ్వు అనేవాడు. కాని ఇప్పుడు మీరు అంటున్నాడు.
బొచ్చెపార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదైంది. కానీ దిక్కుమాలిన రాష్ట్ర పరిస్థితిలో ఏ మాత్రం మార్పులేదు. రోడ్డు ప్రమాదంలో చింతలపాడు ఎమ్మెల్యే సీతారామారావు మరణించాడు. ఆయన వారసులెవరూ లేరు. చింతలపాడు నియోజకవర్గం ప్రతిపక్షమైన చిప్ప పార్టీకి కంచుకోట వంటిది. ఈ నియోజక వర్గం నుంచి పోటీ చేయడానికి బొచ్చెపార్టీ నాయకులెవరూ ముందుకు రాలేదు. కానీ లత్కోర్ ఒక్కడే ముందుకు వచ్చాడు. కొత్త వాడైనప్పటికీ బొచ్చెపార్టీ అతనికి టికెట్ ఇచ్చింది. ఇపుడు కాకపోతే ఇంకెప్పుడూ కాదనుకొని లత్కోర్ ఇంటింటికీ తిరిగి ప్రచారం చేసాడు. విజయం సాధించి అసెంబ్లీలోకి అడుగెట్టాడు. లత్కోర్ భాష మారినా వేషం మాత్రం మారలేదు.
లత్కోర్; మంత్రులు, ఎమ్మెల్యేల మెడ మీద తలయ్యాడు. ప్రతిపక్ష ఎమ్మెల్యేల విమర్శలకు ప్రతివిమర్శ చెయ్యడంలో నెంబర్ వన్ అయ్యాడు. అతను చెయ్యి పెట్టే సందిస్తే కాలు పెట్టేరకం. అతని బుర్రని చూసి బొచ్చె పార్టీ అధ్యక్షుడు ఆనందరావు ముచ్చటపడ్డాడు.... పడి తన చిన్న కూతురితో అతనికి పెళ్లి చేసాడు. ఆనందరావు అల్లుడు కావడంతో అతని పలుకుబడి పెరిగింది.
పెళ్లైన ఆర్నెల్లకే మామగారి పైరవీలతో లత్కోర్‌కు మంత్రి పదవి జేబులో పడింది. మంత్రి కాగానే అతను వేషం మార్చలేదు. తన నియోజక వర్గాన్ని మరిచిపోలేదు. తనను కలవడానికి ఎవరు వచ్చినా ఆప్యాయంగా పలకరించేవాడు. కేవలం మాటలతో పంచదార చిలకల్ని పంచేవాడు. ఆరితేరిన రాజకీయ నాయకునిలా అసమ్మతి వాదులను తన వైపు తిప్పుకున్నాడు. కొద్దిపాటి రాజకీయ జీవితం అతనికి కలిసొచ్చింది.
సంతృప్తి అనే పదానికి లత్కోర్ డిక్షనరీలో చోటు లేదు. అతని వైకుంఠ పాళిలో నిచ్చెనలే ఉంటాయి. టార్చి పెట్టి వెతికినా మచ్చుకు ఒక్క పామైనా కనిపించదు. ప్రతి రాజకీయ నాయకుని పక్కన ఒక పీఠాధిపతో, మతగురువో, బాబానో ఉంటాడు. అతను రాజకీయ నాయకునికి వత్తాసు పలుకుతుంటాడు. లత్కోర్; బూటకానంద స్వాముల మధ్య సంబంధం మర్రిచెట్టులా నిలబడింది.
అది స్విచ్; బల్బులాంటిది
స్విచ్ లేకపోతే బల్బు వెలగదు
బల్బు లేకపోతే స్విచ్ ఉన్నా లాభం లేదు
అది నిప్పు నీరు లాంటిది
లత్కోర్‌కు నిప్పులాంటి సమస్యలెదురైతే
బూటకానంద స్వాముల వారు ప్రవచనాలనే
నీళ్లు జల్లి జెనాలను జోకొడతారు.
కర్మ సిద్ధాంతాన్ని ప్రబోధిస్తారు.
ఎ.సి. కుటీరంలో పట్టు పాన్పుపై పవళిస్తారు.
స్వామి వారి సలహాతో సింహగిరి పుణ్యక్షేత్రంలో లత్కోర్ లోక కళ్యాణ యాగం మొదలుపెట్టాడు. అది లోక కళ్యాణ యాగం పేర ఉన్నత పదవీప్రాప్తి యోగ యాగం!
సింహగిరిలో లత్కోర్ ఉన్నత పదవీ ప్రాప్తి యాగం అనే లోక కళ్యాణ యాగం మొదలుపెట్టగానే రాష్ట్ర రాజధానిలో అల్లర్లు మొదలయ్యాయి. పోలీసులు లాఠీ చార్జీలు; భాష్ప వాయు ప్రయోగాల ప్రభావం లేదు... కనిపిస్తే వినిపిస్తాం సెక్షన్ కింద కవుల్ని రంగంలోకి దింపారు. దాంతో అల్లర్లు తగ్గినట్లే తగ్గి ఎక్కువయ్యాయి. మొదటిసారిగా రాష్ట్ర రాజధానిలో కర్ఫ్యూ పెట్టేరు.
'మోకేకా ఫాయిదా ఉఠానా ఆద్మీకా ఫర్జ్హై' నిజాన్ని ఒంటబట్టించుకున్న అసమ్మతి వర్గం; అధినాయక వర్గాన్ని కలిసింది. దానికి తోడు లత్కోర్ మామగారు చక్రం తిప్పారు. రాజకీయ బేరం పెట్టారు. లత్కోర్ ఉన్నల పదవీ ప్రాప్తి యోగ యాగం ముగిసింది. అగ్నిదేవుని అజీర్తి తగ్గింది. దేనివల్లో ఖచ్చితంగా చెప్పలేం కానీ దిక్కు మాలిన రాష్ట్ర మహామంత్రి పదవి రారా ప్రియా సుందరా అంటూ లత్కోర్‌ను వరించింది. రాష్ట్ర రాజధానిలో అల్లర్లు తగ్గాయి.
లిలిలి
తెల్లవారు జాము ఐదుగంటల ప్రాంతం.
'అల్లారసూలుల్లా' మసీదు నుంచి అజా
'ఎందుకయ్యా ఉంచినావు బందిఖానాలో' గుడి నుంచి రామదాసు కీర్తన
'మిల్క్ బూత్‌ల వద్దా; ఛారు బండీల వద్దా జెనాలు
రోడ్డు మీద అప్పుడో ఆటో ఇప్పుడో బైక్
కసరత్తులతో కళ్లు తెరిచిన జిమ్‌లు..
మార్నింగ్ వాక్‌లూ, జాగింగ్‌లూ; పక్షుల కిలకిలలూ; అప్పుడప్పుడూ కోకిల కూతలూ; రోడ్డు ఊడుస్తున్న సఫాయి వాళ్ల చీపుళ్ల చప్పుళ్లూ..
వీటి మధ్య మహామంత్రి లత్కోర్ నిద్రలేచాడు.
'చిన్నప్పటి అలవాటు చితిలోనే పోతుందంటారు. మహా మంత్రి అయినప్పటికీ తెల్లవారుజామునే లేచే అలవాటు లత్కోర్‌కు పోలేదు.
ఆ సమయంలో అతని బుర్రలో కొత్త కొత్త పథకాలు పుడతాయి. అలా పుట్టిన పథకాలను బొచ్చె ప్రభుత్వం పెంచి పెద్ద చేస్తుంది. తెల్లవారు జామునే లేచే అలవాటుతో పాటు పడుకోబోయే ముందు కథలు చదివే అలవాటు లత్కోర్‌కు ఉంది.
క్రితం రాత్రి చదివిన కథలో ధర్మగంట ప్రస్తావన వచ్చింది. రాజుగారి కోట ముందు ధర్మగంట వేలాడదీసే వాళ్లు. కష్టాలొచ్చిన వాళ్లు ఆ గంట కొట్టేవాళ్లు. గంట చప్పుడు విన్న రాజు కోట నుంచి బయటకు వచ్చేవాడు. గంట కొట్టిన వాళ్ల సమస్యలేమిటో తెలుసుకోవడమే కాకుండా వాటిని పరిష్కరించేవాడు.
తన ఇంటి ముందు కూడా ధర్మగంట వేలాడదీస్తే బాగుంటుందని మహామంత్రి అనుకున్నాడు. అలా చేస్తే ఎవడు పడితే వాడొచ్చి గంట కొడతాడు. తనకు తలనొప్పి తెచ్చి పెడతాడు. ఏం చేస్తే బాగుంటుందని కళ్లు మూసుకుని అతను కొద్దిసేపు ఆలోచించాడు. ఆన్లైన్లో పేరు నమోదు చేసుకొన్న వారికే క్యూ పద్ధతిలో ధర్మగంట కొట్టే అవకాశముంటుందని ఇటు దినపత్రికల్లోనూ; అటు టీ.వీ. ఛానల్స్‌లోనూ ఏకబిగిన వారం రోజుల పాటు హోరెత్తించారు. నెలలో మొదటి, చివరి ఆదివారాల్లో ధర్మగంట కొట్టడానికి అవకాశమిచ్చారు.
తరువాయి వచ్చేవారం...
- తెలిదేవర భానుమూర్తి
99591 50491