Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆ నెలలో అది మొదటి ఆదివారం. రాజధానిలోని వినూత్నవీధికి చెందిన జనం అందరికన్నా ముందు ఆన్లైన్లో పేరు నమోదు చేసుకొన్నారు. దాంతో ముందుగా ధర్మగంట కొట్టే అవకాశం వారికొచ్చింది.
మహామంత్రి దర్శన భాగ్యం దొరికింది.
''ఇంతకీ మీ సమస్య ఏమిటి?''
''మా వాడకట్టుల పెద్ద గుంత బడ్డది'' వినూత్న వీధి జెనమన్నారు.
''గుంట బడితే మీ కార్పొరేటర్ లేదా ఎమ్మెల్యే దగ్గరకెళ్లకుండా నా దగ్గరకెందుకొచ్చారు'' అంటూ లత్కోర్ విసుక్కొన్నాడు.
''గాల్ల తాన్కి బోయినా ఫాయిద లేకుంట బోయింది''
''గంట వల్ల మీకొచ్చిన కష్టమేమిటి?''
''ఒక్కటా రొండా శాన కష్టాలున్నయి. గుంతల గిన ఎవలన్న బడితే గాల్ల కాలన్న, చెయ్యన్న ఇర్గుతున్నది. గుంత జెయ్యబట్కె మోటరు సైకిల్లు, స్కూటీలు కరాబైతున్నయి. గంతేగాదు, గంతల నీల్లు జమైనయి. గా నీల్లల్ల పిల్ల పాపలతోని దోమలు సుకంగ బత్కుతున్నయి. గవ్వి కుట్టెబట్కె మాకు రోగాలొస్తున్నయి. ఎట్లన్న జేసి గా గుంతను పూడిపియ్యుండ్రి''
'గుంటలో ఎవరైనా పడి కాలు విరగడంతో ఏం చేస్తున్నారు? డాక్టరు దగ్గరకెళ్లి కట్టు కట్టించుకొంటున్నారు. కట్టు కట్టినందుకు డాక్టర్‌కు ఫీజు ఇస్తున్నరు. మీరు ఫీజు ఇవ్వడంతో డాక్టర్లు బతుకుతున్నారు. మోటార్ బైక్‌లు స్కూటర్లు గంటలో పడి పాడైతే మీరు ఏం చేస్తారు. మెకానిక్‌ల దగ్గరకెళ్లి బాగు చేయించుకొంటున్నారు. బాగు చేసినందుకు వారు ఛార్జి చేసినన్ని రూపాయలిస్తున్నారు. మీరు ఛార్జీలివ్వడంతో మెకానిక్‌లు బతుకుతున్నారు. గుంట ఉన్నప్పుడు దానిలో నీరు చేరడం, ఆ నీటిలో పిల్లాపాపలతో దోమలుండటం సహజం. అవి కుట్టడంతో రోగాలొస్తే మీరు డాక్టర్లకు చూబెట్టుకొంటున్నారు. వారు రాసిన మందుల్ని మెడికల్ షాపులో కొంటున్నారు. మందులమ్ముడుపోవడంతో మెడికల్ షాపు వాళ్లు మూడు విందులు, ఆరు చిందులుగా దర్జాగా బతుకుతున్నారు.
గుంతను పూడ్చి ఇంతమంది పొట్టగొట్టమంటారా? దానాలల్లో రక్తదానం గొప్పది. దోమెంత? దాని పానమెంత? అది పావుబొట్టు రక్తం తాగితే మీకొచ్చిన నష్టమేంది! ఇక ముందు అసలు సమస్యలేమైనా ఉంటే నా దగ్గరకు రండి. ఇప్పుడిక వెళ్లండి'' అని లత్కోర్ అన్నాడు.
దిక్కుమాలిన రాష్ట్రంలో 'సిటీ బస్సురాకడ - కరెండు పోకడ' ఎవ్వలికి అకర్కి దేవునిగ్గూడ ఎర్కలేదు. కరెంటు కోతల మూలంగా ట్రాన్స్ఫార్మర్లు పేలిపోయేవి. వ్యవసాయబావుల దగ్గర మోటర్లు కాలిపోయేవి. చిన్న తరహా పరిశ్రమలు జ్వరంతో మూల్గేవి.
ఆన్లైన్లో పేరు నమోదు చేసుకొన్న కుటుంబరావు ధర్మగంట కొట్టి మహామంత్రి ముందు నిలబడ్డాడు.
''మీకొచ్చిన కష్టమేంది?''
కుదరక, కుదరక మా అమ్మాయి పెండ్లి కుదిరింది. మ్యారేజ్ హాలు బుక్ చేసాను. క్యాటరింగ్‌కు ఇచ్చాను. శుభలేఖలు అచ్చు వేయించి నలుగురికీ పంచాను. చుట్టాలింటికి స్వయంగా వెళ్లి మా అమ్మాయి పెండ్లికి రమ్మని చెప్పాను. సన్నాయి మేళం మోగుతుండగా పూలజడతో మా అమ్మాయి పెండ్లి పీటల మీద కూర్చుంది.
పురోహితుడు మంత్రం చదువుతుండగా మాంగల్యం కట్టేందుకు పీటల మీద నుంచి లేచి పెండ్లికొడుకు నిలుచున్నాడు. వెనుక నిలుచున్న అమ్మాయి పెండ్లి కూతురి పూలజడ ఎత్తి పట్టుకొంది. పెండ్లి కొడుకు మాంగల్యం కట్టబోయాడు. సరిగ్గా అప్పుడే కరెంటు పోయింది.
పెండ్లి కొడుకు మాంగల్యం కట్టేసాడు. మాంగల్య ధారణ తరువాత కరెంటొచ్చింది. చూస్తే కొంపమునిగింది. పెండ్లి కూతురు పూలజడ ఎత్తిపట్టుకున్న అమ్మాయి మెడలో మాంగల్యముంది''
''జరిగిందేదో జరిగిపోయింది. విచారించకండి. పెండ్లి ఖర్చులు భరించి మా ప్రభుత్వమే ధూమ్‌ధామ్‌గా మీ అమ్మాయి పెండ్లి చేయిస్తుంది'' అని లత్కోర్ హామీ ఇచ్చాడు.
కేవలం హామీకే కృతజ్ఞతా భారంతో వంగిపోతూ కుటుంబరావు వెళ్లిపోయాడు.
రాజధాని అమ్మో నగరాన్ని ఆనుకుని అధ్వాన్నపు పల్లె ఉంది. ధర్మగంట మోగింది. మోగించింది ఆ పల్లె జనమే.
''మీ సమస్య ఏమిటి?'' మహామంత్రి అడిగాడు.
''మా ఊల్లె ఎవ్వలు సస్తలేరు''
''మీ ఊర్లో సంజీవిని గాని ఉందా?''
''లేదు. మా ఊరోల్లు పక్క ఊరికి బోయి సస్తున్నరు''
''పక్క ఊరికి బోయి చావడమెందుకు?''
''మా ఊల్లె బొందలగడ్డ లేదు''
''ఎందుకు లేదు''
''ఆర్నెల్ల కింద దాంక మా ఊల్లె బొందలగడ్డ ఉండె. గని ఒక లీడర్ గా దాన్ని కబ్జ జేసి బంగ్ల గట్టిండు''
''ఏ పార్టీ లీడర్''
''మీ పార్టీ లీడరే''
''నెల రోజుల్లో మళ్లీ స్మశానంతో మీ ఊరు కళకళ్లాడేలా చూస్తాను''
''దీపమున్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి. పదవిలో ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలి' ఇదే లత్కోర్ సిద్ధాంతం. దీని మీద ఎవరెంత రాద్ధాంతం చేసినా పత్రికలు పనిగట్టుకొని చాటింపు వేసినా డోంట్‌కేర్. తొలుత ఫైలు మీద ''నాట్ అప్రూవ్డ్'' అని రాసి సంతకం చేసేవాడు. ముడుపులు ముట్టేక ''నాట్''కు ''ఇ'' చేర్చి ''నోట్ అప్రూవ్డ్'' అని రాసేవాడు.
వినీత్ అనే అతను ధర్మగంట కొట్టి మహామంత్రి దగ్గరకు వెళ్లాడు.
''నీకొచ్చిన కష్టమేమిటి?''
''నాకు ఐదేండ్ల కొడ్కున్నడు. గాడు రూపాయి బిల్ల మింగిండు''
''రూపాయి బిళ్ల మింగితే వాడ్ని ఆస్పత్రికి తీసుకొని వెళ్లకుండా నా దగ్గరకెందుకొచ్చావు'' అని లత్కోర్ అడిగాడు.
''మా పోరన్ని సర్కార్ దవాకానకు దీస్కబోయిన. మా పోరడు రూపాయి బిల్ల మింగిండని డాక్టర్‌కు జెప్పిన. గాయిన నగుకుంట ఏమన్నడంటె...''
''ఏమన్నాడో జెల్ది చెప్పు''
''గిప్పటి సందే రూపాయిలు మింగుతుండంటే రేపొద్దుగాల తప్పకుంట మహామంత్రి అయితడని అన్నడు'' అని వినీత్ చెప్పగానే-
''నాకు పని ఉంది'' అంటూ మహామంత్రి ఆ రోజు ధర్మగంట కార్యక్రమానికి గంట కొట్టాడు.
***********
తెల్లవారుజాము లత్కోర్ ఆలోచనల్లో పాకుడు బండ అనే సినిమా కథ కూడా పురుడు పోసుకుంది. ఈ మధ్యనే దిక్కుమాలిన రాష్ట్రంలో ఈ సినిమా విడుదలైంది.. ఇది అలాంటి ఇలాంటి సినిమా కాదు. దీనికో ప్రత్యేకత ఉంది. ఊరూరుకీ ఈ సినిమా కథ మారుతూ ఉంటుంది. నటులు మారుతుంటారు. సీన్లూ, లొకేషన్లూ, పాటలూ మారుతుంటాయి. ప్రేక్షకులూ మారుతుంటారు. డైలాగులూ మారుతుంటాయి. అప్పుడప్పుడూ ఈ సినిమా ఫైటింగులుంటాయి.
ఏదైనా సినిమా చూడాలంటే టికెట్ తీసుకోవాలి. పాకుడుబండ సినిమా చూడ్డానికి టికెట్ అవసరం లేదు. ఈ సినిమా చూడ్డానికి వచ్చే జెనాలకు బిర్యానీ పొట్లంతో పాటు మందుబాటిల్ ఇస్తారు. ధర్మగంట కార్యక్రమంలో మహామంత్రి దగ్గరకు జెనం వెళితే పాకుడు బండతో మహామంత్రిగానీ, మంత్రులుగానీ, ఎమ్మెల్యేలుగానీ జెనం దగ్గరకు వెళతారు. సినిమాకు ముందు రేషన్ కార్డులూ, ఇళ్లూ కావలసిన వారి నుంచి దరఖాస్తులు తీసుకొంటారు. సినిమా అయ్యాక వాటిని చెత్తబుట్టలో వేస్తారు. మహామంత్రి నటించే సినిమాకు లారీల్లో జెనాలని తీసుకొస్తారు.
ఆ రోజు చీకటి పల్లెలో పాకుడు బండ సినిమా విడుదలైంది. ఆ సినిమాలో లత్కోరే కథానాయకుడు. అతని డైలాగులకు జెనం చప్పట్లు కొట్టలేదు. ఆ ఊళ్లోని ఎక్స్ట్రా నటులు ఎంత చెప్పినా ఎన్ని ప్రలోభాలు పెట్టినా వారు వినలేదు.
సినిమా అయి పోయింది. కానీ సినిమా చివర్లో శుభం కార్డు పడలేదు.
మహామంత్రి చిన్నబోయాడు. చింతలో మునిగాడు
స్క్రిప్ట్ రైటర్‌ను చెడామడా తిట్టాడు.
కెమేరా మన్పై కన్నెర్ర చేసాడు.
లొకేషనూ, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్కూ బాగు లేవన్నాడు.
సినిమా ఫ్లాపయినందుకు దిగాలు పడ్డాడు. దిగులు చెందాడు. లత్కోర్‌కు హోంమంత్రి సన్నిహితుడు.
''నేను డైలాగులు చెబుతుంటే జెనం చప్పట్లు కొట్టాలి. చప్పట్ల కోసం మనమేం చేస్తే బాగుంటుందంటావు'' అని హోంమంత్రి నడిగాడు.
''మన సినిమాను మురిక్కాలవ పక్కన చూబెట్టాలి. అలా చూబెడితే మీరు డైలాగులలు చెబుతుంటే జెనాలు చప్పట్లు కొడ్తారు'' అని హోంమంత్రి సలహా ఇచ్చాడు.
''అదెలా?''
''మురిక్కాలవ పక్కన దోమలుంటాయి. వాటిని చంపడానికి జెనాలు చప్పట్లు కొడతారు''
''ఇక ముందు అలానే చేద్దాం''
''మీరీ సంగతి విన్నారా?''
''ఏ సంగతి?''
''బి.సి. వర్కార్ రెండు నిమిషాల పాటు తాజ్‌మహల్‌ను మాయం చేసాడట''
''అదేమంత పెద్ద విషయం''
''అలా అంటారేమిటి?''
''బి.సి.వర్కార్ కన్నా మన సర్కారే గొప్పది''
''అదెలా?''
''బి.సి. వర్కార్ మాయం చేసిన తాజ్‌మహల్ రెండు నిమిషాల తరువాత కనబడింది. మన బొచ్చె సర్కార్ మాయం చేసిన సాల్విన్ కంపెనీ ఇప్పటికీ కనిపించడం లేదు'' అని మహామంత్రి అన్నాడు.
తరువాయి వచ్చేవారం...
- తెలిదేవర భానుమూర్తి
99591 50491