Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస' అంటూ మేము శేషప్ప కవి రాసిన పద్యాన్ని చదువుకున్నవాళ్ళం. నేటి తరం కూడా వాటిని చదువుకుంటుంది. గోదావరి తీరంలోని శేషప్ప స్తుతించిన శ్రీ నారసింహ క్షేత్రమైన ధర్మపురి నివాసి సంగన భట్ల చిన్న రామకిష్టయ్య. ఈ విశ్రాంత భాషోపాధ్యాయుని రచనాశక్తి, యుక్తి నాకే కాదు తెలుగు బాలలకు, బాల సాహిత్య కారులకు అంతుచిక్కని రహస్యం. కారణం ఈ కథల మాంత్రికుని మంత్రదండంలోని కథలు ఎంతకూ అయిపోవు. 'వేదంలా ఘోషించే గోదావరి'లా ఈ కథల గోదారి ప్రవహిస్తూనే ఉంటుంది. అందుకు ఒక్క ఉదాహరణ... 2021 సంవత్సరంలో వీరు రాసిన 215 కథలు అన్ని ప్రముఖ తెలుగు పత్రికల్లో వచ్చాయి.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన ధర్మపురిలో రామకిష్టయ్య జన్మించారు. వీరి తల్లిదండ్రులు దామోదర, పాపయ్య శాస్త్రి. ధర్మపురిలోని శ్రీ లక్ష్మి నరసింహా సంస్కృతాంధ్ర కళాశాలలో డిగ్రీ వరకు చదివి, ఆ తర్వాత బి.ఈడి. పూర్తిచేసి 1983లో ఉపాధ్యాయ వృత్తిలో చేరాడు. ఆకాశవాణి కళాకారుడైన సంగనభట్ల రంగస్థల నటులు. గయోపాఖ్యానం, శ్రీ కృష్ణరాయబారం, సతీ సావిత్రి, చాణక్య చంద్రగుప్త వంటి పౌరాణిక, చారిత్రక నాటకాలలో నారదుడు, అక్రూరుడు, కర్ణుడు, యశోవర్మ వంటి పాత్రలు ధరించి ప్రేక్షకుల్ని తన గాన మాధుర్యంతో ముగ్ధులను చేశారు. రేడియోలో గానం చేసిన లలిత,ప్రభాత, దేశభక్తి బృంద గీతాలు కూడా వీరికి మంచి పేరును తెచ్చిపెట్టాయి.
బాలల కథలంటే ఇష్టపడే రామకిష్టయ్య పాఠశాల స్థాయిలో చదివేటప్పుడు చందమామ, బాలమిత్ర పత్రికల స్ఫూర్తితో కథలు చదివి, ఆ తర్వాత తాను కూడా పిల్లల కొరకు కథలు రాశారు. సంగనభట్ల తొలుత వ్యాసకర్త. మను చరిత్ర వర్ణనా చమత్కారం, ప్రబంధాలలో చంద్రోదయ వర్ణన, తెలుగులో క్షేత్ర మాహాత్మ్య కావ్యాలు మొదలైన అనేక సాహిత్య వ్యాసాలు స్రవంతి మాస పత్రికలో ప్రచురింపబడ్డాయి.
మార్చి, 2002లో తెలుగు విద్యార్థిలో రామకిష్టయ్య మొదటి కథ 'గురుదక్షిణ' ప్రచురింపబడింది. దానితో ప్రోత్సాహం కలిగి పిల్లల కథలు రాయడం ప్రారంభించారు. బాలల పత్రిక బుజ్జాయిలో 2003లో మరో కథ 'గొప్ప పని' ప్రచురింపబడింది. అప్పుడే వచ్చిన మరొక ఆటవిడుపు బాలల పత్రికలో రామకిష్టయ్య కథలు ప్రచురింపబడ్డాయి. వీళ్ళు నిర్వహించిన కథల పోటీలో 'సైగలతో పోటీ' కథకు ప్రత్యేక బహుమతి కూడా వచ్చింది. అప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపు 20 ఏండ్లకు పైగా 650 వరకు కథలు వ్రాశారు. వీటిలో నాలుగు వందల పైన కథలు 31 ప్రసిద్ధ దిన, వార, మాస పత్రికలలో ప్రచురింపబడ్డాయి.
వచనం. పద్యం, గేయం, కథ రాసి మెప్పించగలిగిన వీరు 'రామకృష్ణ శతకం' అనే బాలల నీతి శతకం, 'నృహరి శతకం' రాశారు. అచ్చయిన తొలి బాలల కథల సంపుటి 'పక్షిసాక్ష్యం'. అటు తరువాత విజయవాడ నుండి 'బాలల నీతి కథలు 9, 10' భాగాలు ప్రచురించబడ్డాయి. వీరి 'మారిన కాలం' రేడియో నాటిక ఆకాశవాణి, ఆదిలాబాద్ కేంద్రం ద్వారా మూడు దశాబ్దాల క్రితమే రావడం విశేషం. ఇప్పటికీ ప్రతిరోజూ ఏదో ఒక పత్రికలో వీరి కథ అచ్చవుతూనే ఉంటుంది.
బాలల్లో మార్పు తీసుకు రావడానికి కథను అత్యంత శక్తివంతమైన సాధనంగా భావిం చిన ఈ విశ్రాంత ఉపాధ్యాయుడు అందుకు తగినట్టుగా కథలను రాశారు. పిల్లలతో పాటు పెద్దలను కూడా తన కథలతో ఆకట్టు కున్నారు. ఇటీవల వచ్చిన వీరి తాజా కథల సంపుటి 'చేప నవ్వింది' సంగనభట్ల కథన శక్తికి, బాలల మీదున్న ప్రేమకు నిదర్శనం. తాను రాయడమే కాకా పిల్లలతో కథలు, కవితలు రాయించడం ఈ కథల తాతకు బాగా నచ్చిన పని. ఇవేకాక నవ తెలంగాణ వీరి తాజా కథల సంపుటిని అచ్చువేస్తోంది. మరో రెండు సంపుటాలు అచ్చులో ఉన్నాయి. పది సంపుటాలకు సరిపడా కథలు ఈ కథల మాంత్రికుని 'కథల జోలె'లో ఉన్నాయి.
ప్రధానంగా వీరి కథలు జంతువుల నేపథ్యంగా సాగుతాయి. పిల్లలకు ఇష్టమైన రీతిలో రాయడం సంనభట్లకు వెన్నతో పెట్టిన విద్య. వీరి కథలన్నీ వాస్తవాలను ప్రతిబింబించే విధంగా ఉంటాయి. వీరి ''కథలతో పిల్లల ఆలోచనా దృక్పథంలో మార్పు వస్తుంది. వీరి కథల ద్వారా పిల్లల్లో పఠనాసక్తి పెరుగుతుంది. చదువుకోవాలనే కోరిక కలుగుతుంది. విద్యార్థులలో సృజనాత్మక పరిజ్ఞానం పెరిగి ఉత్తమ బావి భారత పౌరులుగా ఎదిగే అవకాశం ఉంది'' అంటాడు కందుకూరి భాస్కర్. అక్షరాస్యతా ఉద్యమం, వయోజన విద్య మొదలుకుని అనేక కార్యక్రమాలకు తన గళాన్ని, సాహిత్యాన్ని అందించిన సంగనభట్ల 2019లో రంగినేని ట్రస్ట్, సిరిసిల్ల వారి పురస్కార సత్కారం మొదలుకుని నేటి వరకు అనేక సాహిత్య, సాంస్కృతి సంస్థలు,స్వచ్చంధ సంస్థలు వీరిని గౌరవించాయి. 2011లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డ్‌ను కూడా పొందారు. జయహో! సంగనభట్ల.
- డా|| పత్తిపాక మోహన్, 9966229548