Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- (ఆధునిక వచన కావ్యం)
నేలకాన్వాసుపై ఆకుపచ్చ కవిత రచించే హాలి'క'వులకు ధాన్య స్రష్టలైన రైతు వీరులకు ఈ కవితా కావ్యం కవి అంకితం చేసారు. ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, శ్రీ మువ్వా శ్రీనివాసరావు గారలు చక్కటి ముందుమాటలు రాసారు.
భారతంలో పర్వాలు మాదిరిగానే ఈ రైతు మహాభారతంలో 18 పర్వాలున్నాయి. శీర్షికలు ఎంతో సందర్భోచితంగా పెట్టారు కవి. ఆదిపర్వం, అరణ్యపర్వం, పల్లెపర్వం, విశ్వాస పర్వం, వికాస పర్వం, విత్తన పర్వం, దళారీ పర్వం, దగా పర్వం, తాకట్టు పర్వం, విద్యుత్ పర్వం, విపత్తు పర్వం, సభా - శాసన - అశ్రుజలావాస - ధిక్కార - ఉద్యమ - యుద్ధ - విజయ ప్రస్థాన పర్వం అనే 18 పర్వాలుగా ఈ దీర్ఘ కవిత్వ కావ్యం 'రైతు' అంశాలపై రాసారు. 'ఆకలి పుట్టినప్పుడే పుట్టింది ఆహారం కోసం పోరు' అంటూ ఆరంభమై 'ఆకుపచ్చ రథాలు పొలం దారి పట్టాయి' అంటూ ఈ కావ్యం ముగుస్తుంది.
పై రెండు అంశాల నడుమ వేల ఏండ్ల పరిణామాలను అద్భుతంగా అక్షరీకరించారు కవి. 'తెలంగాణ' పేరుతో 1956లో కుందర్తి రైతాంగ పోరుపై రాసారు. శేషేంద్ర 'ఆధునిక మహాభారతం' రాసారు. చారిత్రక పరిణామ దృష్టి కోణంతో ఈ కవిత్వం సాగుతుంది. రైతు కథా నాయకుడుగా ఎన్నో కావ్యాలు గతంలో వచ్చాయి. దవూరి 'కృషీవలుడు' (1919) పింగళి - కాటూరి 'తొలకరి' కావ్యం, తుమ్మల 'పెద్దకాపు' గంగుల శాయిరెడ్డి (1937) రైతుబిడ్డ, ఏటూకవి నర్సయ్య 1938లో 'క్షేత్రలక్ష్మి', విశ్వనాథ 'ఋతుసంహారం' కొండవీటి వెంకటకవి 'కర్షకా' (1933), నుండి వాన మామలై జగన్నాథాచార్యులు 'రైతు రామాయణం', ఇటీవల కెపి లక్ష్మీ నరసింహ 'కుట్ర చేస్తున్న కాలం' (2014) దాకా రైతులపై వచ్చిన కవిత్వ సాహిత్యాల్లో కొన్ని ముఖ్యమైనవి.
ఈ సంపుటిలోని 18 పర్వాలు ముఖ్యాంశ పంక్తులు ఉటంకించాల్సినవే. స్థలా భావం వల్ల మచ్చుకు కొన్నింటిని చూద్దాం.
సహనం బరి చెరిగి పోయినప్పుడు / సాధు గోవులూ రంకెలేస్తాయి / ఉక్కు చట్రాల గది బందీ చేస్తే / బయటికి పోలేననుకుంటే / బతుకు బండలనుకుంటే / మర్యాదలకు మరణం పాడతాయి (పే. 99), అంటారు ధిక్కార పర్వంలో కవి.
''ఉచితం అంటే కరెంటు తీగలు / ఉయ్యాల సేరులౌతాయి / మోటు పాటల సంగీతం మోట చక్రం కిరకిరలే శ్రుతిగా సాగిన రైతు జలగీతం'' అంటారు కవి (పే. 75) విద్యుత్ పర్వంలో.
'రైతు అప్పు, ఎద్దు మాపు మీది పుండు, తాకట్టు కాకులకు చాలా చాలా ముద్దు, తరతరాల తాకట్టు చక్రం' అంటారు తాకట్టు పర్వంలో (పే. 68) అంటారు కవి.
పుట్టించే లింగాన్ని దేవుడన్నది, పుట్టుకనిచ్చే యోనిని దేవతనన్నది ఎవరు? తొలి మానవుడు అదే అతడే నేటికీ ఉన్న ఆదిమ రైతే! (పే. 39) అంటారు కవి. జీవన సత్యాల తాత్త్వికత చాలా చోట్ల అద్భుతంగా చెప్పారు సుబ్బాచారి గారు. ప్రపంచీకరణ యాంత్రీకరణపై ఒకచోట కవి ఇలా రాసారు (పే. 83) 'లక్ష అడుగుల లోతున / బోరు వేసే యంత్రం / తయారు చేయడానికి మా కంపెనీ డిజైన్లు తయారు చేస్తున్నది. పచ్చటి పొలంతో గ్రామీణ రైతు భారతం వర్థిల్లాలనే కవికాంక్ష - రైతు పక్షపాతం శ్లాఘనీయం.
రైతు మహా భారతం
కవి : పులికొండ సుబ్బాచారి,
పేజీలు : 112, వెల : రూ. 200/-,
ప్రతులకు : పులికొండ సుబ్బాచారి, ఫ్లాట్ నెం. 302, ఇ.నెం. 6-77, జేఆర్ ఆపార్ట్మెంట్స్, చందానగర్, హైదరాబాద్ - 500050;
సెల్ : 9440493604
- తంగిరాల చక్రవర్తి, 9393804472