Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాలల కోసం కథలు, కవితలు, గేయాలు, నాటికలు, పద్యాలు ఇలా ఒక్కటేమిటి అన్ని ప్రక్రియల్లో, రూపాల్లో రచనలు చేసి ఇటు పిల్లలను, అటు పెద్దలను మెప్పించిన బాల సాహిత్యకారులు గుర్రాల లక్ష్మారెడ్డి. 2002లో ఉద్యోగ విరమణ చేసిన ఈ విశ్రాంత ప్రధానోపాధ్యాయులు అన్ని ప్రధాన పత్రికల కోసం బాల సాహిత్య సృజన చేశారు. మూడున్నర దశాబ్దాల అపార అనుభవాన్ని, జాతీయభావ స్ఫూర్తిని రచనలుగా బాలబాలికల కోసం అందించారు.
గుర్రాల లక్ష్మారెడ్డి నిన్నటి ఉమ్మడి మహబూబ్ నగర్లోని (నేటి నాగర్ కర్నూల్ జిల్లా) కల్వకుర్తిలో జనవరి 16, 1946న పుట్టారు. తల్లిదండ్రులు చిన్నమ్మ, వెంకట్రామిరెడ్డి. బాల్యం విద్యాభ్యాసం స్వస్థలం కల్వకుర్తిలో జరిగింది. వృత్తిరీత్యా ఉపాధ్యాయులు, హిందీ, తెలుగు భాషలను అధ్యయనం చేయడమేకాక పట్టాలు పొందారు. బాల్యం నుండి బాల సాహిత్యం మీద పెంచుకున్న మక్కువ తరువాత ఆ దిశగా రచనలు చేసేలా చేసింది. 1994 నుండి 1981 వరకు కల్వకుర్తి రచయితల సంఘం అధ్యక్షులుగా ఉన్న లక్ష్మారెడ్డి కొంత కాలం 'ప్రతిభ' పేరుతో లిఖిత మాస పత్రికను నడిపారు. ఇదేకాక 'చేతన' పేరుతో మరో పత్రికను కూడా తెచ్చారు. విస్మృత తెలంగాణ కవులతో పాటు, ప్రసిద్ధ కవులు, రచయి తలనెందరినో ఈ పత్రికలో ఆయన పరిచయం చేశారు. వారిలో మోకురాల రామారెడ్డి, గుండూర్ హనుమచ్చర్మ వంటివారు ఉన్నారు. ఉపాధ్యాయునిగా, ప్రధానోపాధ్యాయునిగా పనిచేసి వేలాది మంది విద్యార్థులకు మార్గదర్శనం చేసిన లక్ష్మారెడ్డి మహబూబ్నగర్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయునిగా సత్కారం అందుకున్నారు. ఇదేకాక జలకవితోత్సవం మొదలుకుని ప్రపంచ తెలుగు మహాసభల వరకు అనేక సాహిత్యో త్సవాల్లో పాల్గొని విశేష సత్కారాలు అందుకున్నారు.
బాలల కోసం రాసిన గేయాలను 'వెన్నెల జల్లులు' పేరుతో ముద్రించారు. కథలను 'వెన్నెల కలువలు' పేరుతో అచ్చులోకి తెచ్చారు. వీరి వెన్నెల కలువలు ఇరవై ఎనమిది రేకుల కథల పువ్వు. ప్రతీ కథ బాలలను ఆకట్టు కునేదిగా ఉండడమే కాక దీనిని లక్ష్మారెడ్డి ''బుడుగులు, మొగ్గలు చిచ్చర పిడుగులు'' అయిన తెలంగాణ చిన్నారులకు ప్రేమతో అంకితం చేశాడు. ఈ కథల తాత తెలంగాణ పిల్లలకు అందిం చిన తాయిలమిది. ''....బాల సాహిత్యమే పిల్లలకు ప్రధాన గురువు'' అని నమ్మి లక్ష్మారెడ్డి రాసిన ఈ కథలు పిల్లలకు చక్కని దారి దీపంలా ఉపయోగపడడమేకాక నచ్చుతాయి కూడా. 'ప్రజ్ఞా పాటవాల', 'ప్రతిభ', 'మనసారా', 'త్యాగశీలం', 'తెలివి తేటలు', 'కుక్కబుద్ధి', 'ఉయ్యాల పాట' వంటి బాలల కథలు అనేక కథలు పిల్లలకే కాదు, పెద్దలకూ నచ్చుతాయి.
ప్రతిరోజూ బడిలో పిల్లలకు పాఠం చెప్పే ముందు ఆ పాఠ్యాంశాన్ని, లేదా సారాన్ని వీరి బాలగేయాల సంపుటి 'వెన్నెల జల్లులు' వీరికి బాల సాహితీవేత్తగా పేరు తెచ్చిన పుస్తకం. పద్య, గేయ రచనలో చేయి తిరిగిన లక్ష్మారెడ్డి తనకు తారసపడిన ప్రతి దానిని గేయంగా మలిచారు. అందుకు ప్రతిరోజు ఏదో ఒక పత్రికలో, ఆన్లైన్ మ్యాగజైన్లలో వస్తున్న ఆయన గేయాలు ప్రత్యక్ష ఉదాహరణ. గుర్రాల లక్ష్మారెడ్డి బాల గేయాల్లో ఒదగని వస్తువు, పొదగని విషయం లేదని చెప్పడం అతిశయోక్తి కాదు. గ్రామీణ పిల్లలకు అన్ని వృత్తులు, వృత్తి నేపథ్యపు సామాజిక జీవితం వంటివి బాల్యం నుండే వాళ్ళు చూస్తుంటారు. వాటిని కూడా ఆయన తన గేయాల్లో చెబుతారు. 'వస్త్రాలు నేసేటి పిల్లలం / శాస్త్రాలు చూసేటి మల్లెలం' అంటూ నేతన్నల గురించి చక్కగా చెబుతారు. ఇంకా ఇదే గేయంలో ప్రగతి పథంలో ముందుంటాం అంటారు. పిల్లలకు విషయాన్ని పూర్తిగా చెప్పాలన్నది ఈ ఉపాధ్యాయుని కోరిక. అందుకోసం కొన్ని సార్లు గేయాల నిడి కూడా పెంచుతారు. 'మా పసిపాప' గేయంలో '..ఏడవకు నీవు ఓ మా శివసాయి / ఏడిస్తె నిన్నెరు ఎత్తుకోరమ్మా' అంటూ వర్ణిస్తారు.
బాలలకు మనం బాల్యం నుండి ఏది నేర్పితే భవిష్యత్తులో వాళ్ళపైన దాని ప్రభావం ఉంటుందన్నది నిజం. మొక్కై వంగనిది మానై వంగేనా వంటి సామెతలు ఇలానే పుట్టాయి మరి. పిల్లలను బాల్యం నుండి ధైర్యంతో పెంచాలని, దయ్యాలు, భూతాల వంటివి కాక వీరుల, మహాపురుషుల గాథలు చెప్పాలన్నది వీరి అభిమతం. అది వీరి గేయాల్లో కూడా మనకు కనిపిస్తుంది. 'ధైర్యం ఉన్న పిల్లలం.../ సాహసమే మా ఊపిరి' అంటూ సాగే ఈ గేయంలో 'మేం భయాన్ని జయిస్తాం / మా అభయాన్ని కలిగిస్తాం'... 'ఆత్మస్థైర్యంతోనే ఉంటాం నిత్యం / ఆత్మారామున్ని కంటాం సత్యం' అని అనిపిస్తారు. 'దేవుడు ఒక్కడే ఒక్కడే ఒక్కడే', 'పిల్లలం పిల్లలం' వంటి అనేక గేయాలు వీరి గేయరచనా శక్తికి తార్కాణం. ఈ విశ్రాంత ఉపాధ్యాయుడు ఇప్పటికీ అవిశ్రాంతంగా బాలల కోసం బాల సాహిత్య సృజన చేస్తున్నారు. జయహో! గుర్రాల లక్ష్మారెడ్డి.
- డా|| పత్తిపాక మోహన్, 9966229548