Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వంశీ స్వర్ణోత్సవ ప్రచురణ - 7గా ఈ పుస్తకాన్ని వంశీ ఆర్ట్ థియేటర్స్ సంస్థ ప్రచురించింది. ఆచార్య ఎన్.గోపి, సినీ కవి భువనచంద్ర, గేయరచయిత సుద్దాల అశోక్ తేజ, డా|| తెన్నేటి సుధాదేవి చక్కటి ముందుమాటలు రాసారు.
ఇందులో పద్యాలు, గేయాలు, నానీలు, హైకూలు, మణిపూసలున్నాయి. కవితలు, షార్ట్ ఫిలిమ్స్‌కి కథ, మాటలు అందించే కథలు. వీరి కవిత్వంలో కుటుంబచ్ఛాయలు, మానవీయ సంబంధాలు, సామాజిక స్పృహ, అభ్యుదయ భావాలున్నాయి. ఇది రచయిత్రి రెండవ కవితా సంపుటి. ఇటీవల వచ్చిన కొత్త సాహిత్య ప్రక్రియ మణిపూస - మాత్రా ఛందస్సులో 4 పాదాలున్న ప్రక్రియ.
కారణాలు వెతుకబోకు / సమాధానమడుగబోకు / దైవ ఘటన తలదాల్చగ / నమ్మకాన్ని వదులుకోకు.... (పేజి. 79) అంటారు ఓ కవితలో.
ఇరవై ఐదేండ్ల కిందట ఆవిర్భవించిన 'నానీ' ప్రక్రియలోనూ రాధిక కొన్ని నానీలు రాసారు. 'ఆకుల చాటున / పిందెలు దాగాయి / నగవుల మాటున / చింతలు దాగాయి (పేజి. 73) అంటారు.
అలాగే జపానీ ప్రక్రియ హైకూలో 9 కవితలు ఈ సంపుటిలో ఉన్నాయి. మూడు పాదాలుంటాయి. దూరముంటేనేం / పెనవేయదారమై / మమత ఉంది - (పేజి. 72) అంటారు.
'ద్వేషము' అనే రెండు పాదాల కవితలో ఒక చోట గొప్ప తాత్త్వికతతో ఇలా అంటారు కవయిత్రి.
''గాయము నుండే పుట్టే ద్వేషము, క్షమయే దానిని మాపు ఔషధము- కక్షల కాంక్షల కట్లను తెంచిన ప్రేమబీజమే చివురించేను-'' (పేజి. 70) అంటారు.
'అన్నదమ్ములకభయమిచ్చే ధైర్యలక్ష్ముల సాక్షిగా
రాఖీపండుగ ఖాళీమాటున కొత్తశోభలుదిద్దెగా' అంటారు మహిళా పోలీసులపై రాసిన కవితలో. (పేజి. 61). అలాగే ఉగాది కవితలో చక్కటి భావోస్పోరక వాక్యాలు ఎంతో అలరిస్తాయి పాఠకుల్ని- ''పాతకొత్తల కలియు తరుణం / ఆశమొలకలు శిరసునెత్తె
స్మృతుల ఊయలలూగు నన్ను / కోయిలేదో నిదురలేపె (పేజి. 46)
ప్రతి కవితలో బలమైన అభివ్యక్తి- లోతైన భావ గాఢసాంద్రత - పరిపక్వత కనిపిస్తాయి. ''బంధాలు తెంచుకుని కొత్త గూటికి చేరు / అనాది జన్మల తుది మర్మమీవు!'' (పేజి. 41) అంటారు.
ఇంకా భారతీయత- కల(త) - హిమాలయాలు - దీపావళి - వజ్రోత్సవ భారతం - వివాహ బంధం - మధ్యవర్తి - భ్రమ - జీవనవాహిని - లాంటి కవితలు కవయిత్రి కలం వేగం తెల్పుతాయి. ఓ మంచి కవితా సంపుటి చదివాము అనే తృప్తి పాఠకులకు కలుగుతుంది. రాధిక గారి కలం మరిన్ని మంచి కవితలందించాలి.
నవ కవితా కదంబం
రచన : రాధిక మంగిపూడి
పేజీలు : 92, వెల : రూ. 100/-
ప్రతులకు : వంశీ ఆర్ట్ థియేటర్స్, 2 - 1 - 527 / 5, నల్లకుంట, హైదరాబాద్ - 044
సెల్ : 9849023852
- తంగిరాల చక్రవర్తి, 9393804472