Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'చీమ ఎంతో చిన్నది / తెలివి భలే వున్నది / పొదుపులోన ఎప్పుడూ / తానే ముందున్నది' అంటూ పిల్లలకు చిన్నారి చీమల పెద్ద పనిని పరిచయం చేసిన ఈ గేయకవయిత్రి శ్రీమతి వురిమళ్ల సునంద. సునంద వృత్తిరీత్యా ఉపాధ్యాయిని, ప్రవృత్తి రీత్యా బాల వికాసకార్యకర్త. కవయిత్రి, రచయిత్రి, సాహిత్య సాంస్కృతిక సంస్థల నిర్వాహకురాలు.
కవితలు, కథలు, పాటలు, సమీక్షలు, నానీలు, గజళ్ళు, రుబాలయీలు, బాలల కథలు, బాలల గేయాలను సునంద సృజించిన శ్రీమతి సునంద నేటి సూర్యాపేట జిల్లా (నిన్నటి నల్లగొండ) మోతె మండలం లోని సిరికొండలో పుట్టింది. తల్లితండ్రులు శ్రీమతి వురిమళ్ళ రామతారకమ్మ-శ్రీ సోమాచారి. ఉపాధ్యాయినిగా భద్రాద్రి కొత్త గూడెం జిల్లా, దమ్మపేట మండలంలోని నాగుపల్లిలో పనిచేస్తోంది.
సాహిత్య అద్యయనం, సమాజసేవలతో పాటు పిల్లల కోసం వురిమళ్ళ ఫౌండేషన్ ద్వారా వివిధ పోటీలు, ఉత్సవాలు నిర్వహించి తెలంగాణలో జరుగుతున్న బాల వికాసోద్యమంలో నేను సైతం అంటూ ముందు వరుసలో నడుస్తోంది. అధ్యయనంతో పాటు వృత్తిరీత్యా ఊలు, కొబ్బరి పీచు, కాగితాలవంటి వాటిని ఉపయోగించి తక్కువ ఖర్చుతో బోధనా సామగ్రి తయారు చేయడంలో సునంద దిట్ట. వివిధ సాహిత్య సాంస్కృతిక సంస్థలు నిర్వహించిన పలుపోటీల్లో పాల్గొని మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో బహుమతులు, ప్రశంసలు అందుకున్న సునంద ఉత్తమ ఉపాధ్యాయినిగా జిల్లా విద్యాధికారి మొదలు అనేక సంస్థల సత్కారాన్ని అందుకుంది. ఇవేకాక 'హరితావరణం' నిర్వహించిన 'నా పుస్తకం' రచనా పోటీలో ప్రథమ బహుమతి, 'విశ్వశాంతి సేవా సమితి' ఉత్తమ కవితా పురస్కారం, పిడుగురాళ్ళ 'రూరల్ డెవలప్ మెంట్ సంస్థ' నిర్వహించిన భ్రూణ హత్యల నిషేధౖ కవితల పోటీలో, 'నెల్లూరు సృజన సాహిత్య సాంస్కృతిక వేదిక' రాష్ట్ర స్థాయి కవితల పోటీలో, 'మల్లెతీగ పత్రిక', 'స్వాతి', 'సాహితీ కిరణం మాస పత్రిక' మొదలు అనేక సంస్థల పోటీలలో బహుమతులు గెలుచుకుంది. ప్రపంచ తెలుగు భాషా పాటల పోటీ, విశ్వశాంతి సేవా సమితి, ఐక్య ఉపాధ్యాయ పత్రిక రాష్ట్ర స్థాయి కవితల పోటీ, 'అమ్మ సేవా సదనం' నిర్వహించిన కవితలు, వ్యాసాల పోటీలో ప్రథమ నగదు బహుమతులు, బండారు బాలానంద సంఘం 'బాల సాహిత్య పురస్కారం' అందుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేసిన 'తెలంగాణ వైభవం పరిచయ దీపిక'లో రచయితగా, 2015-16 విద్యా సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర పుస్తకాల రూపకల్పనలో పాల్గొంది. తెలుగు ద్వితీయ భాష బాచకాల్లోనూ రచయిత్రిగా ఉన్నారు. రెండు దజన్లకుపైగా పురస్కారాలు అందుకున్న సునంద బాల సాహిత్య వికాసంలో విశేషంగా పనిచేస్తున్నారు.
'వరిమళ్ళ వసంతం', 'మెలకువ చిగురించిన వేళ' సునంద కవితా సంపుటాలు. 'బహు'మతులు'కథల సంపుటి' వీరి ఇతర రచనలు. 'ఆసీఫా కోసం' కవితా సంకలనానికి సంపాదకత్వం వహించారు. బాల సాహిత్యంలో సునంద వెలువరించిన పుస్తకాలు 'వెన్నెల బాల' బాల గేయాల సంపుటి, 'బాలలకో బహుమతి' పేర ద్విత్వ, సంయుక్తాక్షరాలు లేకుండా రాసిన కథా సంపుటి ప్రధానంగా పేర్కొనవచ్చు. ఇవేకాక బాల వికాస కార్యక్రమాల్లో భాగంగా బాలబాలికలు రాసిన పలు కవితా, కథా సంపుటాలకు సునంద సంపాదకత్వం వహించి, ప్రచురించారు. వాటిలో 'చిరు ఆశల హరివిల్లు', 'ఆళ్ళపాడు అంకురాలు' బాలల కవితా సంకలనాలు, 'పూల సింగిడి', 'కలకోట కథా సుమాలు' మరియు జాతీయ స్థాయి బహుమతి పొందిన బాలల కథల సంకలనాన్ని 'తీరొక్కపూలు' పేరుతో స్వీయ సంపాదకత్వంలో ప్రచురించారు. నాలుగు సంవత్సరాలుగా వురిమళ్ల ఫౌండేషన్ ద్వారా నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన వారి కథలు కవితల సంకలనం కూడా ఈ సంస్థ నుండి సునంద ప్రకటించింది.
బాలల కోసం దిత్వాక్షరాలు, సంయుక్తాక్షరాలు లేని కథలను రాసిన సునంద తెలుగు పిల్లల కోసం చక్కని బాల గేయాలు ఎన్నో కూర్చి వారికి కానుకగా అందించారు. 'చిన్నారి పొన్నారి బాలలం / మిలమిల మెరిసే తారకలం / తొలకరి చినుకుల జల్లులం / పలుకుల పంచదార చిలకలం' అని గానం చేసిన సునంద పిల్లలు 'కల్లలూ కపటాలకు బహుదూరం / మమతానురాగాల నిలయం' అంటారు. ఇంకా చిన్నిచిన్ని బాలలు చిరునవ్వు దీపాలు అని వర్ణించిన ఈ పంతులమ్మ, అమ్మ, 'పసిబాలలు భగవంతుని రూపాలు/ ప్రేమిస్తే నవ్వుల వరాలిచ్చే దేవతలు' అని రాస్తారు. నిజం కదూ! పైన చెప్పినట్టు సునంద ఉపాధ్యాయిని, నిరంతరం పిల్లలతో గడిపే అవకాశం, అదృష్టం ఆమెది. అందుకేనేమో, 'చదువు విలువ తెలుసుకో చిన్నారి / విలువ తెలిసి ఎదగాలి చిన్నోడా' అని చదువు గురించి, 'బాపూజీ బాలల తాతా / గాంధీజీ మన పెద్దల నేత' అంటారు. ఇంకా గాంధీని గురించి గొప్పగా చెబుతూ 'పేదల చూసిన మన తాత / కొల్లాయి గట్టిన మహానేత' అంటూ గాంధీ కొల్లాయి తత్త్వాన్ని పిల్లలకు సులభంగా చెప్పారు. కథ, కవిత, గేయం, వ్యాసం వంటి అనేక రూపాల్లో బాలల కోసం చక్కని సాహిత్యాన్ని అందిస్తున్న వురిమళ్ళ సునందక్కకు జయహో!
- డా|| పత్తిపాక మోహన్, 9966229548