Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'నిరంతరం ఆమె ధ్యాసే, నిత్యం ఆమె ఊసే, ఆమెతోనే జీవితం, ఆమె లేనిదే బతుకు వ్యర్థం' ఇది నేటి యువతరం భావోద్వేగం. వాస్తవమే ప్రేమంటే ఒక ఆరాధన, హృదయంలోని ఆవేదన, అదొక ఆత్మ సంఘర్షణ. కానీ ప్రేమించినప్పుడు ఉండే సంతోషం, విడిపోయినప్పుడు ద్వేషంగా మారుతోంది. అది ఒక్కొక్కరికి ఒక్కో రకమైన అనుభావాన్ని ఇస్తుంది. ప్రేమ విఫలమైనప్పుడు వచ్చే నిరాశ నిస్పృహలకు జీవితాలను చేజార్చుకోకుండా, వారిని చైతన్యపరచడానికే కవి హరనాథ్ తన కవితా సంపుటి ద్వారా ఊహలకు ఊపిరి పోశాడు. ప్రేమ, వైఫల్యాల మధ్య చిక్కుకున్న యువతరం పెడదోవ పట్టకుండా, హింసా ప్రవృత్తిని విడనాడి క్షమాగుణం కలిగి ఉండాలని ఈ పుస్తకం ద్వారా చేసిన ప్రయత్నం అభినందనీయం.
ఈ సంపుటికి కవి, సాహితీవేత్త సుధామ ముందుమాట రాశారు. కవిని వలపుటూహల శిల్పిగా పోల్చాడు. హరనాథ్ ఈ పుస్తకంలో 92 కవితలు పొందుపరిచాడు. దీనికి సహకరించిన అర్థాంగి ప్రేమలతకు, కుటుంబ సభ్యులకు తన ప్రేమను అక్షర రూపంలో కురిపించాడు. బహుశా హరనాథ్ రాసిన ఈ సంపుటిలో పాలుపంచుకున్న తన ప్రియురాలు, భార్య 'ప్రేమ'లతను కూడా ప్రశంసించాల్సిందే. ఎందుకంటే ఆమె పేరు 'ప్రేమ'లతను కవితల్లో అక్షరీకరించాడు. ఇక పుస్తకాన్ని సమీక్షిస్తే కవి ఆత్మ సంఘర్షణయే ఈ 'ఊహలకు ఊపిరొస్తే'. స్నేహం, అభిమానం, అప్యాయత, అనురాగం ఒక కడవలో పోసి రంగరిస్తే వచ్చే 'ప్రేమ' అమృతాన్ని హరనాథ్ తన కలంతో మరింత మృదువుగా చిలికించాడు.
'మధురమే కదా స్నేహం
ఎదలు పొంగగా,సుధలు కురియగా
ప్రణవనాద గానమై, ప్రణయ హృదయ కుసుమమై
అద్భుతమైన స్నేహ మాధుర్యం
స్నేహానికే ప్రతిరూపం' అన్నారు (13వ పేజీ కవితలో).
స్నేహానికి ఉన్న మాధుర్యాన్ని ప్రణవనాద గానంగా అభివర్ణించాడు.
'ఈ రోజు స్వేచ్ఛా స్వాతంత్య్ర దినం
నా శ్వాసతో శ్వాసయై, నా అక్షరంలో అక్షరమై
నా సాహితీ గవాక్షానికి దారులు ఏర్పర్చిందెవరో తెలుసా?
నా మనసు పొరల్లో భావ కవితా ప్రేమాగ్ని
జ్వాలలు రగిలించింది ఎవరో తెలుసా?
నా గుండెలపై అనునిత్యం సవారి చేస్తూ నను నవ్విస్తూ
లాలిస్తున్నదెవరో తెలుసా?
నా కవిత్వ దాహాన్ని తీరుస్తూ ప్రతిక్షణం, ప్రతి నిమిషం, ప్రతి శుభోదయం
నా హృదిన మల్లెల సుమ కవితా సౌరభాల్ని చల్లుతున్నదెవరో తెలుసా?' అంటూ (32) హరనాథ్ తన ఊహా ప్రపంచంలో విహరిస్తూ, తన కవితలకు ఊపిరి పోస్తున్నది ఎవరిని 'చెప్పరా' అంటూ ప్రశ్నించాడు. రెండు హృదయాల మధ్య జనించే అనురాగమే ప్రేమ అని అది ఎక్కడ పుట్టి, ఎక్కడ ఆగుతుందో తెలియదని, అలాంటప్పుడు విద్వేషాలు వీడి మమకారాన్ని పంచుకుంటూ ముందుకెళ్లాలని యువతరాన్ని కోరుతాడు.
'ప్రేమించే మనసు లేనిదే ఆకర్షించే అందమెందుకు?
హృదయ సౌందర్యం లేని బాహ్య సౌందర్యమేల
ఓ ధీరుడా మగధీరుడా
తరుణితత్త్వమెరిగి పెంచుకో స్నేహాన్ని, పంచుకో ప్రేమను
పుటుక్కున తెంచుకుపోయే అబల నుంచి జాగ్రత్త పడు'
అని (87వపేజీ) బీకేర్ కవితలో తన హృదయ స్పందనను కొద్దిగా ఘాటెక్కించాడు.స్వచ్ఛమైన ప్రేమను గుర్తించాలని, స్నేహమా, ప్రేమనా తెలుసుకోవాలని, కరుణలేని కఠిన మనసుల పట్ల జాగ్త్రతగా ఉండాలని హితువు పలికారు.
నా చెలి చిరునవ్వు, తపన, చిన్న కోరిక, మనసున్న నారాణి, హృదయ మంజరి, కనుపా పను నేనై, హృదయ నేత్రి,నే మెచ్చిన చెలి, ఆ పూల వనంలో, ఊహాసుందరి, ఏమని వర్ణించను, ఎవరివో నీవెవరివో, నెచ్చెలి లాంటి కవితల్లో కవి చక్కని సరళమైన భాష,అర్థం చేసుకునే విధంగా తన ఊహా లోకాన్ని విపులికరించాడు. తన ఆవేదన, ఆలోచనంతా దారి తప్పుతున్న యువతరాన్ని చక్కదిద్దడమే. ఈ పుస్తకాన్ని అభినందిస్తూ సమాజంలో జరుగుతున్న పరిణామాలపై హరనాథ్ మరిన్ని కవితలు రాయాలని ఆశిద్దాం.!
ఊహలకే ఊపిరొస్తే..
రచయిత : కె.హరనాథ్
పేజీలు : 92, వెల : రూ.140/-
ప్రతులకు : కె. హరనాథ్, ధర్మపురి కాలనీ, లింగోజిగూడ, సరూర్‌నగర్, హైదరాబాద్.
ఫోన్ : 9703542598
- నమిలికొండ అజయ్‌కుమార్