Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డా. దేవరాజు మహారాజు కవి, రచయిత, అనువాదకుడు, నాటకకర్త, కాలమిస్టు, శాస్త్రీయ అవగాహనను పెంచడానికి రచనలు చేశాడు. శాస్త్రవేత్తగా, జంతశాస్త్ర నిపుణుడుగా ప్రసిద్ధుడు. ఫిబ్రవరి 21, 1951లో వరంగల్ జిల్లా కోడూరులో పుట్టారు. తనదైన 'రాజముద్ర'తో సృజనాత్మక, వైజ్ఞానిక రచనలు చేస్తున్న ఈ డెబ్బైఒక్క యేండ్ల చైతన్యశీలి కవిత్వం, కథ, వ్యాసం, విమర్శ, అనువాదం, బాలసాహిత్యం, సినీ విమర్శ, జానపద సాహిత్య పరిశోధన, నాటకరచన వంటి వాటిల్లో ఎనభై అయిదు రచనలు చేశారు. విశ్వ సాహిత్యం, భారతీయ సాహిత్యంపై చేసిన రచనలు ఇంకా అచ్చుకావాల్సి వుంది.
వృత్తిరీత్యా జీవశాస్త్రవేత్త అయిన డా.మహారాజు తెలంగాణ ప్రజల భాషలో వచనరిల కవిత, కథ రాసిన తొలి తరం రచయిత. మౌళిక రచనలతోపాటు భారతీయ భాషల, ప్రపంచ భాషల కవిత్వాన్ని, కథలను తెలుగులోకి అనువదించి తెలుగు కళ్ళకు ఇరుగుపొరుగు దృశ్యాలను చూపించిన వీరు ''నేను అంటే ఎవరు?'' అన్న ప్రశ్నకు వీరు యిచ్చిన వైజ్ఞానిక విశ్లేషణకు 2021 సంవత్సర కేంద్ర సాహిత్య అకాడమి బాల సాహిత్య పురస్కారం లభించింది. 'మా'నవ'వాదం'పై తొలి గ్రంథ రచనతో పాటు 'భారతీయ సమాంతర సినిమా'పై గ్రంథ రచన చేశారు. 1974లో వచ్చిన తొలి రచన 'గుడిసె గుండె' నుండి నిన్నటి 'నేను అంటే ఎవరు?' వరకు వచ్చిన 85 పుస్తకాల్లో 'గాయపడ్డ ఉదయం', 'కవితా భారతి', 'మట్టిగుండె చప్పుళ్ళు', 'రాజముద్ర', 'నీకూ నాకూ మద్య ఓ రంగులనది', తెలంగాణ ప్రజల బాషలో వచ్చిన తొలి సంపుటిగా ప్రసిద్ధి పొందిన 'కడుపు కోత', 'పాలు ఎర్రబడ్డాయి', 'దేవరాజు మహారాజు కథలు', భారతీయ భాషల్లో స్త్రీవాద కథలు 'ఆరుబయట ఆకాశం కోసం', 'భారతీయ కథా ప్రతిబింబం', 'మనిషి'కత'లు'తో పాటు నోబెల్ అవార్డు గ్రహీత నవల 'మంచిముత్యం' వీరి రచనల్లో కొన్ని.
ఇవేకాక 'ఆధునిక యుగంలో జానపద సాహిత్యం', 'స్మృతి సుగంధం', 'స్త్రీ దరహాసం దోచిన ఇతిహాసం', 'ఆత్మనుంచి అక్షరానికి', 'స్త్రీ అక్షరాలు శిలాక్షరాలు', భారతీయ రచయిత్రుల విజయకేతనం', 'కవిత్వంలో సమాంతర రేఖలు', 'కొన్ని కలాలు-కొన్ని సమయాలు', 'అవార్డుల వాపసీ' వంటివి వీరి ప్రసిద్ధ విశ్లేషణాత్మక రచనలు, 'మూడనమ్మకాల్ని వదిలిద్దాం', 'లైఫ్టానిక్', అకాడడి అవార్డు పొందిన నాటకం 'నేను అంటె ఎవరు?' మహారాజు రాసిన నాటకాలు. భారతీయ, సమాంతర సినిమాపై వీరు పలు రచనలు చేశారు.'పథేర్ పాంచాలి' తెలుగు స్క్రిప్టు, ప్రయో'జన' సినిమా' వాటిలోనివి. దేవరాజు మహారాజు అనగాగానే తెలుగు పాఠకులకు గుర్తొచ్చివి వైజ్ఞానిక రచనలు. 'మూడనమ్మకాలు-సైన్స్', 'ఎయిడ్స్', 'భారతీయ వైజ్ఞానిక వికాసం', 'విజ్ఞాన పథంలో విజయఘట్టాలు', 'జీవ పరిశ్రమలు', 'సామాజిక జీవనంలో వైజ్ఞానిక స్పృహ', 'నువ్వేమిటో నీ ఆహారం చెబుతుంది', 'విజ్ఞానశాస్త్రం-మన జీవన సిద్ధాంతం' వంటి అనేక రచనలు వీరి వైజ్ఞానిక, శాస్రీయ దృక్పథాన్ని తెలుపుతాయి. ఇవేకాక 'భారతీయ వారసత్వం-విజ్ఞానం' వంటి సంపాకత్వాలు వీరి కృషిలో భాగమే.
బాల సాహిత్యం: వైజ్ఞానిక, హేతువాద రచయితగానే కాక సరళభాషలో విజ్ఞానశాస్త్ర రచనలు చేసిన మహారాజు బాలల నాలుగు దశాబ్దాలుగా తన బాధ్యతగా రచనలు చేస్తున్న బాల సాహితీవేత. వీరి బాల సాహిత్యంలో 'బుడుంగు' 1984, 'గురువుకు ఎగనామం' 1984, 'చిన్నోడి ప్రయాణం', 'అనగనగా కథలు' 2006, 'అపూర్వ జానపద కథలు' 2013, 'దేవుడెవరు?' 2018, 'పొన్నపూల చెట్టు' 2019, 'బోడి గుండు', 'నవ్వు వాసన' వంటివి ప్రసిద్ధమైనవి. వీటి ప్రచురణల కాలన్ని చూసినప్పుడు బాల వీరి తొలి బాలల రచన 'బుడుంగు'ను సృష్టించిన నాటినుండి నేటి వరకు పైన చెప్పిన ప్రసిద్ధ వైజ్ఞానిక, సాహిత్య రచనలతో పాటు బాల సాహిత్య సృజన చేయడం బాలల పట్ల, బాల సాహిత్యంపట్ల డాక్టర్ దేవరాజు మహారాజుకు ఉన్న నిబద్ధతకు నిదర్శనం. ఇవే కాక పిల్లల కోసం వీరు రాసిన చైనా జానపథ కథలు నాలుగు సంపుటాలుగా వెలువడ్దాయి.
సమాజంలో శాస్త్రయ అవగాహనను పెంచడానికి వైజ్ఞానిక, వ్యంగ్య రచనలు చేసిన డా.మహారాజు బాల సాహిత్యంలోనూ అంతే కృషిచేశాడు. సారస్వత పరిషత్తు వారి 'డా.దేవులపల్లి రామానుజారావు పురస్కారం' మొదలుకుని 'మారసం జి.సురమౌళి కథా పురస్కారం', 'తెలుగు విశ్వవిద్యాలయం కవితా పురస్కారం', తొలి 'ఎక్స్రె' అవార్డు, 'ఫ్రీవర్ ఫ్రంట్ ప్రతిభా పురస్కారం' వంటి వివిధ పురస్కారాలు వీరు అందుకుకొన్నారు. ముప్పైయేళ్లు జువాలజీ అచార్యునిగా ఉంటూ 'పరాన్న జీవశాస్త్రంలోంచి సామాజిక పరాన్నజీవులపైకి దృష్టి సారించడం, ఒక తాత్త్విక భూమికను రూపొందికుని రెండింటి మధ్య ఒక వారధిలా నిలబడగలగడం' వీరి వీరి ప్రత్యేకత. ఈ నిత్య పరిశోధనా యాత్రికుడు, కవి, రచయిత, నిబద్ధత కలిగిన బాల సాహితీవేత్తకు జేజేలు.
- డా|| పత్తిపాక మోహన్, 9966229548