Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జడ్జిగారు నల్లకోట్లు కోర్టు పక్షులు వచ్చేస్తారు తొందరగా పని ముగించాలి అనుకున్న బంట్రోతు న్యాయదేవత బొమ్మ మీది దుమ్ము తుడుస్తూ కళ్ళకున్న గంతలు విప్పాడు. గంతలు విప్పినా కళ్లు మూసుకునే ఉందే అనుకున్నాడు. ఒరేరు పని కానీ నల్లగంతలు కట్టుకుని కట్టుకుని కళ్లు మూసు కోవడం అలవాటైంది. మాట్లాడకుండా గంతలు కట్టెయ్యి. జాగ్రత్తొరేరు ఈ మధ్య ఎక్కడో న్యాయదేవత చెవులూ నోరూ మూసేశేట్ట ఎవడో. ఆ పని మాత్రం చెయ్యకు అంది బొమ్మలో నుంచి కళ్ళు తెరవని న్యాయదేవత. బంట్రోతు పని ముగిసింది.
కోర్టు హాలులో హడావిడి నిద్ర లేచింది. నల్లకోట్ల వాళ్లు కూచోడంతో కుయ్యోమొర్రో మన్నవి పాత కుర్చీలు. జడ్జిగారు వచ్చేరు నిశ్శబ్దాన్ని వెంట పెట్టుకుని. ఒక్కసారిగా హాలులో సద్దు మణిగింది. సీనియర్ లాయర్ కోటు జేబులోంచి బయటక జారిపడ్డ ఏలుక్కాయ చప్పుడు కూడా వినిపించేంత నిశ్శబ్దం.
జడ్జిగారు కూచున్నారు. నల్లకోట్లు కూచున్నవి. కోర్టు బెంచి గుమాస్తా నుంచున్నాడు. కాగితాలు జడ్జి ముందుకు వెళ్ళి కూచున్నవి. తలుపు దగ్గర బంట్రోతు గొంతు చించుకున్నాడు.
బోనులో ఉన్నవాడి ఒంటిమీద గుడ్డ లతో పాటు యాభై దాటిన ఏళ్ళున్నయి. ఇది వరకు ఉంగరాలు ఉండేవని చెప్పే మరక లున్న వేళ్ళున్నయి. వాడి లోపల్కి ఉంటే నుదురుపైకి వుంది. ముఖాన్ని అక్కడక్కడా నూలు దారాలున్న నల్లగడ్డం కప్పేసింది. తల మీద ఇప్పుడిప్పుడే చదునౌతున్న మైదానం వున్నది.
జడ్జిగారు పెదవి విప్పలేదు. కళ్ళతో మాట్లాడారు. బోనులో ఉన్నవాడు నోరు విప్పాడు. అయ్యా! నేను మొన్న జరిగిన ఎన్నికల్లో అభ్యర్థిగా నిలబడ్డాను అన్నాడు గొంతు సవరించుకుంటూ.
ఈసారి జడ్జిగారు పెదవి విప్పారు. ఎవరైనా ఎన్నికల్లో నిలబడతారు కాని కూచుంటారా అని నవ్వారు. ఆ పంచ్‌కి హాలు మొత్తం నవ్వింది.
హాలు మొత్తం నవ్వడం జడ్జిగారికి నచ్చలేదు. కోర్టు సమయం దుర్వినియోగం చెయ్యకుండా చెప్పాల్సింది ఏమైనా ఉంటే చెప్పండి అన్నారు.
ఉందండి చాలా ఉందండి. ఎన్నికల్లో గెలుపు కోసం ఆస్తులు అమ్మేశానండి. వేళ్ళకు ఉంగరాలతో సహా అన్నీ అమ్మేశాను. చాలా ఖర్చయిందండి. అనుకున్నదానికి ఎక్కువేనండి.
అయితే కోర్టు వారిని ఏం చేయమ న్నావు. ఉంగరాలు చేయించమంటావా అన్నారు జడ్జి ఈ సారి నవ్వకుండా. తను నవ్వినా హాలు నవ్వరాదు కదా.
అయ్యా ఎంత మాట అన్నాడు బోనులో ఉన్న బాధితుడు.
ఎన్నికల్లో గెలవడానికి నీవు చేసిన పనులు పనికి రావాలి కాని డబ్బు ఖర్చుదేనికి అన్నారు జడ్జి.
పెట్టుబడి పెట్టాలి కదా. పదుల్లో పెడితే వందలు, వందల్లో పెడితే లక్షలు, లక్షల్లో పెడితే కోట్లల్లో. అయితే కోట్లకి కోట్లు. కంట్రాక్టర్స్ పెడతారు. సినిమా వాళ్లు పెడతారు. రాజకీయ నాయకులూ పెడతారు. పెట్టాలి కదా అన్నాడు పిటిషనర్.
అంటే రాజకీయం కూడా వ్యాపారమ నేనా తమరంటున్నది అన్నారు జడ్జి ఎకసెక్కంగా.
కాదా.... కద. అంతే కద. ముందస్తు పెట్టుబడి పెట్టేది లాభం కోసమే కదా. ఈ వ్యాపారానికి చదువూ వయసూ అక్కర్లేదు కదా. ఎంత పెట్టామో అంతా అయిదేళ్ళల్లో రాబట్టుకోలేమా అన్న ధీమాతోనే కదా ఎవరైనా ఈ బిజినెస్సులోకి దిగేది అన్నాడు కక్షిదారుడు.
అవునా. మేం దాన్ని ప్రజా సేవ అనుకుంటున్నామే అన్నారు జడ్జి.
ఏ సేవకైనా సర్వీసు చార్జీలు ఉంటయి. దీనికీ ఉండాలి మరి.
ఓహో అయితే ప్రజాసేవను 'పెయిడ్ సర్వీసు' అంటావు. అందుకు పెట్టుబడి పెట్టానంటావు. సరే ఇప్పుడేమంటావు.
ఏమంటాను పేకాటలో, గుర్రప్పందాల్లో పోగొట్టుకున్నట్టు ఈ ఎన్నికల్లో డబ్బంతా పోగొట్టుకున్నాను. తమరు శాంతంగా వినాలి. ఎన్నికల ముందు సభలకు జనం రావడం లేదు. వచ్చినా మేం చెప్పేవి వినడం లేదు. విన్నా నమ్మడం లేదు. మీ వాగ్దానాలు, హామీలు ఉత్త గ్యాస్ అంటున్నారు. సబ్సిడీలు ఉచితాలు అంటే అవి ఏ పార్టీ వాడైనా ఇవ్వక చస్తాడా వాడి జేబులోంచి యిస్తాడా వడ్డీతో సహా తిరిగి యిచ్చేది మేమే కదా ఇవన్నీ కాదు ఒక్క పనికొచ్చే మాట చెప్పండి అంటున్నారు. అదేమిటంటే ఓటు కెంతిస్తావని డిమాండు చేస్తున్నారు.
ఓటు అమ్ముకుంటారా? ఎవరైనా ఓటు కొంటారా? కొంటే అది మీ తప్పే కదా అన్నారు జడ్జి సీరియస్‌గా.
వ్యాపారమన్నాక రిస్కు తీసుకోవాలి కదా. కాంపిటీషన్ ఉంటుంది కదా. అవతల పార్టీ వాళ్ళు ఓటు కొంటున్నప్పుడు మనమూ కొనాల్సిందే మరి. ఓటుకు అక్షరాలా నాలుగు వేల రూపాయలిచ్చాను. ఒక్కో ఇంటికి ఓట్ల సంఖ్యను బట్టి నలభై యాభై వేల దాకా యిచ్చి కొనుక్కున్నా. ఇవికాక మందుకీ కోళ్ళ కూతలు ఆపడానికీ చాలా ఖర్చయిపోయింది. పోయిందంతా తిరిగి సంపాదించుకుందామ నుకుంటే డిపాజిట్టు కూడా దక్కలేదు.
జడ్జిగారు నిమిషం సేపు న్యాయదేవతకు మల్లేనే చెవులు మూసుకున్నారు. తర్వాత నీ గోలంతా మేము వినాలా కోర్టు సమయం తినాలా అని అరిచారు. అసలు విషయానికి రండి అన్నాడు సీనియర్ లాయర్.
అవతలి పార్టీ వాడు ఐదు వేలకి ఒక్క ఓటు చొప్పున కొనేసి నన్ను దివాలా తీయిం చాడు. వ్యాపారమన్నాక అది న్యాయమే. ఎవరు ఎక్కువ డబ్బు ఇస్తే వారికి ఓటు అమ్ముకోవడం అముమకునే వాడి ఇష్టం. కాదన్ను. నా రేటు ఓటుకి తక్కువైందను కుంటాను. ఇప్పుడు కాకపోతే మరో ఎన్నికల సీజన్లో మళ్ళీ కొనుక్కోవచ్చు. బై ఎలక్షన్ ఏదైనా రావచ్చు. సంవత్సరాల తరబడి ఉద్యోగులు లేకున్నా ఆఫీసులు నడుస్తయి కాని ఆరు నెల్లకాలమయినా అసెంబ్లీ సీటు ఖాళీగా ఉంటే కొంపలు మునిగిపోవడమో అంటుకుపోవడమో జరుగుతయి. పాలన కుంటు పడుతుంది. ఎవడికో తిక్కరేగ వచ్చు రాజీనామా చెయ్యవచ్చు. బై ఎలక్షన్ తీసుకురావచ్చు. అందువల్ల, అందుచేత నేను మళ్ళీ ఓట్లు కొనడానికి డబ్బు కావాలి అన్నాడు పిటిషనర్.
కావాలి అంటే అర్థం అన్నాడు జడ్జి వత్తయిన కనుబొమ్మల మధ్య జాగా లేకుండా ముడివేసి.
నా దగ్గర నాలుగు వేలు తీసుకుని అవతల వాడికి అయిదు వేలకి ఓటేసిన వాళ్ళంతా చీటర్లు. నన్ను మోసం చేశారు. డబ్బు తీసుకుని సరుకు సప్లయి చెయ్యలేదు. కనుక నేను ఎవరెవరికి ఎంత డబ్బు యిచ్చానో అది మీరు వాళ్ళ దగ్గర్నించి నాకు తిరిగి యిప్పించాలి. ఏఏ సెగ్మెంట్లలో నాకు అసలు ఓటు పడలేదో ఆ జాబితా తమకు సమర్పించాను. వాళ్ళందరికీ నోటీసులు యిప్పించండి. నా డబ్బూ, నా మెళ్ళో పులి గోరు గొలుసు, ఎనిమిది వేళ్ళ ఉంగరాలు తిరిగి వస్తే ఈ సారి అవతలవాడి కంటే ఎక్కువిచ్చి ఓట్లు కొంటాను అన్నాడు బోనులో చిక్కిన వాడు.
జడ్జిగారు కేసు వాయిదా వేశారు.
- చింతపట్ల సుదర్శన్, 9299809212