Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సమ్మెట ఉమాదేవి.... తెలుగు కథలు, బాల సాహిత్యం చదువుతున్నవాళ్ళకు పరిచయం అవసరంలేని పేరు. తాను పనిచేసిన ప్రతి చోటును... అక్కడి పిల్లలను... వాళ్ళ కుటుంబాలను సాహిత్యం చేసిన పంతులమ్మ. గిరిజన పిల్లలకు అండగా నిలిచిన అమ్మ. వరంగల్‌కు చెందిన సమ్మెట ఉమాదేవి బందరులోని అమ్మమ్మ ఇంట్లో ఆగస్టు 17, 1961న పుట్టింది. వృత్తిరీత్యా ఉపాధ్యాయినిగా దాదాపు ఇరవైయేండ్లకు పైగా గిరిజన ప్రాంతాల్లోని తండాలు, పల్లెల్లో పనిచేసింది. పనిచేసింది అనడంకంటే కలిసి జీవించింది అనడం సబబు. నూటా ముప్పైకిపైగా కథలు రాసి ముప్పై బహుమతులు అందుకుంది. రచయిత్రిగా గిరిజన జీవితాలను కథలుగా చిత్రించి 'రేలపూలు', 'జమ్మిపూలు'గా తెచ్చిన ఉమాదేవి ఇతర రచనలు 'అమ్మ కథలు', 'సమ్మెట ఉమాదేవి కథానికలు'.
ఉపాధ్యాయినిగా, బాలికల విద్యాభివృద్ధి అధికారిగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పనిచేసిన ఉమాదేవికి అంగన్వాడీలతో, అక్కడి పిల్లలతో అనుబంధం ఉంది. వాళ్ళకోసం పనిచేసింది కూడా. వృత్తిరీత్యా డిపెప్‌లో పనిచేయడమేకాక, ఆసక్తి, అభిరుచితో ఉద్యోగ విరమణ తరువాత కూడా 'ప్యూర్' వంటి స్వచ్ఛంద సంస్థలతో కలిసి పాఠశాలల మౌలిక సధుపాయాల అభివృద్ది కోసం పనిచేస్తోంది. నాలుగు నెలల్లో దాదాపు డెబ్భై అయిదు బడులు తిరిగి ఆడపిల్లల కోసం ఆరోగ్య తరగతులను నిర్వహించిన స్ఫూర్తి సమ్మెట ఉమాదేవికి సొంతం. మైసూరు విశ్వవిద్యాలయం, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం వంటి పలు విశ్వవిద్యాలయాలు, సంస్థలు నిర్వహించిన సదస్సుల్లో బాల సాహిత్యంపై పత్రసమర్పణ చేశారు. వివిధ పత్రికలు, ఆకాశవాణి ద్వారా బాల సాహిత్యంపై ప్రసం గాలు, వ్యాసాలు వచ్చాయి. బాల సాహిత్య పరిషత్‌తో అనుబంధం ఉంది.
రచయిత్రిగా పలు పురస్కారాలు, రివార్డులు అందుకున్న ఉమాదేవికి 'పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ గ్రంథ పురస్కారం'తో పాటు 'నోముల సత్యనారాయణ కథా పురస్కారం', 'సాహితీ వారధి పురస్కారం', 'మాడభూషి రంగాచార్య స్మారక పురస్కారం', 'ఖమ్మం జిల్లా తెలంగాణ ఆవిర్బావ దినోత్సవ పురస్కారం', 'గోవిందరాజు సీతాదేవి సాహిత్య పురస్కారం', 'అపురూప విద్యా పురస్కారం', 'ప్యూర్ గురు పురస్కారం', 'రంజని-నందివాడ శ్యామల స్మారక పురస్కారం' వంటివి లభించాయి. బాల సాహిత్యానికి'తానా-మంచి పుస్తకం పురస్కార రచనగా వీరి రచన ఎంపికైంది.
బాలలతో నిరంతరం ఉండే అవకాశం అందరికీ రాదు... కొద్దిమందికే ఆ అవకాశం వస్తుంది. అలా వచ్చినదానిని వాళ్ళ కోసం ఉపయోగించడం ఒక కళ.. ఆ కళ తెలిసిన ఉమాదేవి వాళ్ళతో ఉన్న క్షణాలను, వాళ్ళ లక్షణాలను, వాళ్ళ అనుభవాలను, అనుభూతులను, వాళ్ళతో తనకున్న రెండు దశాబ్ధాల సంబంధబాంధవ్యాలను అందరికోసం అక్షరర రూపంలో అందించిన రచన 'మా పిల్లల ముచ్చట్లు', ఇది ఒక టీచర్ అనుభవంగా కనిపించినా అనేక మంది బడిని ప్రేమించే పంతులమ్మలు, పంతుళ్ళ వ్యక్తిత్వాలకు ప్రతినిథిగా నిలిచే రచన.
రచయిత్రిగా ఎంతగా గిరిజన జీవితాలతో పాటు మానవ సంబంధాలు, మమతలు, ఆర్థిక సామాజిక స్థితి గతులను తన రచనల్లో చిత్రించారో బాల సాహితీవేత్తగా అదే విధంగా పిల్లల కోసం రచనలు చేశారు సమ్మెట ఉమాదేవి. 'అల్లరి కావ్య', 'పిల్లల దండు', 'నిజాయితి', 'పిల్లి ముసుగు' పుస్తకాలు పిల్లల కోసం విజయవాణి తెచ్చినవి. బాలల కోసం మహర్షి శ్రీ రామకృష్ణ పరమహంస జీవితాన్ని 'పిల్లల బొమ్మల రామకృష్ణ పరమహంస' పేరుతో రచించారు. ఇవేకాక 'చిలుక పలుకులు' పిల్లల కథలు పుస్తక రూపంలో వెలువడ్డాయి. ఇటీవల వచ్చిన పుస్తకం 'నిక్ అంటే ప్రేరణ.'
పిల్లల కోసం మౌళిక రచనలే కాక బడిపిల్లల కోసం పాటలు రాయడమేకాకుండా, కొన్ని ప్రసిద్ధ హిందీ గేయాలను తెలగులోకి అనువాదం చేశారు సమ్మెట ఉమాదేవి. వాటిలో 'సారే జహాసె అచ్చా... హిందుస్తా హమారా', 'హంద్ దేశ్కే నివాసీ సబీజన్ ఏక్‌హై', 'హం మోంగే కామియాబ్' వంటివి కొన్ని. ఇవి వీరికి చక్కని గుర్తింపును తెచ్చిపెట్టాయి కూడా. బాలల కథలు 'చిలుక పలుకులు కథల్లో పిల్లల మనస్తత్వానికి దగ్గరగా ఉండే అనేక విషయాలను వాళ్ళకు హత్తుకునేలా చిలకల నేపథ్యం గా చెబుతారు రచయిత్రి. ఇక నిక్ గురించి రాసిన పుస్తకం ఇటీవల వీరికి మంచి పేరును తెచ్చిపెట్టడమే కాక పూర్తిగా వైకల్యమున్నా దివ్యంగా వెలిగిన దివ్యాంగుడైన ఉయిచిచ్ నిక్ విజయగాథ యిది. రంగుల బొమ్మలతో వివరణాత్యకంగా ఉన్న ఈ పుస్తకంలోని హీరో నిక్ పిల్లలకే కాదు పెద్దలకు కూడా స్ఫూర్తి ప్రధాత. రచయిత్రిగా, కవయిత్రిగా, బాల వికాస కార్యకర్తగా అనేక కోణాల్లో పనిచేస్తున్న సమ్మెట ఉమాదేవి గిరి బాలల చదువుల సిరి, గిరి. ఉమ్మక్కకు అభినందనలు... జయహో! బాల సాహిత్యం!
- డా|| పత్తిపాక మోహన్, 9966229548